ఇకనైనా కళ్ళెత్తి చూస్తావా
ఇకనైనా కళ్ళెత్తి చూస్తావా (Author: మళ్ళ. కారుణ్య కుమార్)
ఆ తడైన ఝడి స్పర్శ కౌగిట్లో ఒదిగి పరిమళించిన నేల
దప్పిక తో పిడచ కట్టి చిక్కి పీనుగైన తన శరీరం తడుముకుంటూ
నిస్సత్తువ చూపులు చూస్తుంది! మాయని గాయల్లా సగం కరిగి
సగం మిగిలిన పాలిథిన్ సంచులు ఆమెను విసుగు పుట్టిస్తున్నాయి
తన అణువణువునా నిండి పోయి విషం నింపుతున్నాయి!
అదుగో అక్కడే దప్పిక తీర్చుకొని సేద తీరేవి
అడివి జీవులు, నేడు చుక్క నీటి కోసం మైళ్ళు పోతున్నాయి
అదుగో ఒకప్పటి సెలయేటి వూట! ఇప్పటి జీవచ్ఛవంలా మిగిలిన
రసాయనాల కలుషిత వూట అని వాపోతోంది ఆ నేల తల్లి
అవిగో సమాధులపై నిలిపిన రాతి స్తంభాల్లా అగుపించే
మొండెం మిగిలిన తరువులు ఒకప్పటి ఉమ్మడి
కుటుంబంలా పలు జాతి పక్షులు సేద తీరేవి
నేడు ఏమయ్యాయో అని విలపిస్తుంది ఆ ధరిత్రి
కనుచూపు మెరల్లో కానవస్తుందా... ఆ అదే....
కాంక్రీట్ కంచె లో బోసిగా వున్న నెలలు.
అవే ఒకప్పటి దేశానికి వెన్నెముక గ్రామాలు
నేడు ఉనికి కోల్పోయి అనాథల్లా మిగిలిన శిథిలాలు..
అని అంటూ ఆ పల్లె అనుభూతుల్ని నెమరు వేసుకుంటుంది.
ఇకనైనా కళ్ళెత్తి చూస్తావా... ఇప్పటికైనా బాధ్యత వహిస్తావా!
కార్బన్ ఉద్గారాల దెబ్బకు పీక్కు పోయిన పర్యావరణాన్ని చూడు,
ఆదమరిచి నువ్వు వేసిన తప్పటడుగులకు పలు జాతులు అనుభవిస్తున్న
నరకాన్ని చూడు హరించిన అడవి సంపద కారణంగా గతితప్పిన
వాతావరణ చక్రాన్ని చూడు... ఆదమరిచితే అల్పాయుస్కుడు
అయ్యేది నువ్వే... అంటూ హెచ్చరిస్తుంది...