ఆర్య భారతీయం  (Author: కోరుకొండ వెంకటేశ్వర రావు)

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, న్యూ ఢిల్లీ వెయిటింగ్ లాంజ్ చైర్ లో అసహనంగా అటూ, ఇటూ కదులుతున్నాను. నేను ఎక్కాల్సిన వైజాగ్ ఫ్లయిట్ సాంకేతిక కారణాల వల్ల గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుందని ఎనౌన్స్ చేశారు.

          ‘పాపం... భారతి అక్కడ నా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది! ’ అనుకుంటూ సెల్ ఫోన్ అందుకున్నాను.

         ” హాయ్ భారూ... ఫ్లయిట్ లేట్ అవుతుంది. నా కోసం జాగారం చేస్తూ కూర్చోకు... పొద్దున్న కలుద్దాం... బాయ్... సీ యూ!” అంటూ వాయిస్ మెసేజ్ పంపి ఊపిరి పీల్చుకున్నాను.

          మరి కాసేపట్లో తను వైజాగ్ చేరుకోబోతున్నాడు. ఆ ఊహే ఎంతో అపురూపంగా అనిపిస్తోంది. నా అణువణువునా కమ్ముకున్న నోస్టాల్జియా వల్లనేమో, ఏదో అనిర్వచనీయమైన ఉద్వేగం నన్ను ఉక్కిరి బిక్కిరి చెయ్య సాగింది. మెదడు నిండా ఏవేవో జ్ఞాపకాలు మెదలి మనసుని ఆహ్లాద పరచ సాగాయి.

          నేను పుట్టి పెరిగిన వైజాగ్ సిటీతో పెనవేసుకున్న అనుబంధాలు, అనుభవాలు మదిలో కదలాడగా సన్నని చిరునవ్వు నా పెదవులపై నాట్యం చేసింది. చిన్ననాటి సంగతులన్నీ ఒక్కొక్కటిగా మనసును స్పృశిస్తూ సాగిపోతుంటే ఆ హాయిని తీయగా ఆస్వాదించ సాగాను.

          *********** **********

          అవి నేను చినవాల్తేరు జెడ్పి హైస్కూల్ లో చదివే రోజులు... చక్రవర్తి, నర్సింహం, మూర్తి, నేను… అంతా ప్రతి సబ్జక్ట్ లోనూ ఫస్ట్ రాంక్ కోసం పోటీ పడేవాళ్ళం. హాఫ్ ఇయర్లీ లో మూర్తిగాడికి మ్యాథ్స్ లో నా కన్నా ఒక్క మార్కు ఎక్కువ రావడంతో నాకు బాగా ఉక్రోషం వచ్చింది. డ్రిల్లు పీరియడ్ అయ్యాక స్కూల్ గ్రౌండ్ లో ఒంటరిగా కూర్చొని కుమిలి పోతున్నాను.

          ఇంతలో, నన్ను గమనించినట్లుంది భారతి. తను నా కన్నా జూనియర్. నేను ఎయిత్ క్లాస్… తనేమో సెవెంత్. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నా ప్రక్కన కూర్చుంది. నన్ను ఆత్మీయంగా పరామర్శించి తన కర్చీఫ్ తో నా కన్నీరు తుడిచింది. ఆమె మా స్కూల్ హెడ్ మాస్టర్ విశ్వనాధ శాస్త్రిగారి అమ్మాయి.

          నాన్నగారు టెలీఫోన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేసేవారు. చదువులో నా ప్రోగ్రెస్ ఎలా ఉందో వాకబు చెయ్యడానికి తరచూ శాస్త్రి గారింటికి వెళ్తూ ఉండేవారు. తనతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్లేవారు. శాస్త్రి గారిల్లు కూడా మేముండే వీధి లోనే ఉండేది. అచిరకాలంలోనే వారి కుటుంబం తో మా ఇంట్లో అందరికీ సన్నిహిత సంబంధాలు కుదిరాయి.

          నేను, భారతి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తనకు మేథ్స్ లో వచ్చే డౌట్స్ నేను తీర్చేవాణ్ణి. స్కూల్ గ్రౌండ్ లో కూర్చుని మేమిద్దరం ఏవేవో కబుర్లు చెప్పుకొనే వాళ్ళం. ఆమె గొంతు శ్రావ్యంగా ఉండేది. తను పాడుతుంటే నాకు మరీ మరీ వినాలనిపించేది. నేనూ తనలా పాడాలని ప్రయత్నిస్తుంటే నన్ను ఉడికించేది. మా ఫ్రెండ్స్ అందరం సాయంత్రాలు ఎక్కువగా బీచ్ లో గడిపే వాళ్ళం. నేను, భారతి ఓ మూలగా కూర్చొని ఇసుకతో ఎన్నో పిచ్చుక గూళ్ళు కట్టేవ్వాళ్ళం.

          భారతి తరచూ తన భార్గవ్ మావయ్య గురించి ఎంతో గర్వంగా చెప్తుండేది. అతనంటే ఆమెకు వల్లమాలిన అభిమానం, ఒక రకమైన హీరో వర్షిప్. అతనే ఆమె రోల్ మోడల్. ‘మగాడంటే మావయ్యలా ఉండాలి’ అంటుండేది.

          మా కుటుంబం గురించి అన్ని సంగతులూ పూస గుచ్చినట్లుగా భారతితో ముచ్చటించేవాణ్ణి. మాటల్లో పడితే మా ఇద్దరికీ సమయం గుర్తుండేదే కాదు.

         ************ ***********

          మా స్కూల్ లో స్వతంత్ర దినోత్సవం నాటి పాటల పోటీల్లో భారతి పాడిన“ నీ ధర్మం నువ్వు మరవద్దు“ పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫంక్షన్ అయిపోయాక, నేను,

         భారతి గ్రౌండ్ లో కూర్చున్నాం. నేను అభినందనలు చెబితే, తను ముక్తసరిగా“థాంక్స్!” అంది.

         “అది సరే గానీ, ఆర్యా … ఇంతకీ పెద్దయ్యాక నువ్వు ఏమవ్వాలని అనుకుంటున్నావ్?” సీరియస్ గా అడిగింది.

          సాయంకాలపు శీతల గాలులు మమ్మల్ని పలకరించుతూ ముందుకు సాగిపోతున్నాయి. నేను చిన్నగా నవ్వి,“ఏముంది, అమెరికాలో ఎమ్మెస్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవుతాను. బోలెడు జీతం వస్తుంది. లైఫ్ హ్యాపీ గా గడిచి పోతుంది. ఇంతకీ, నువ్వేం అవుదామనుకుంటున్నావ్?” క్యాజువల్ గా అడిగాను.

          క్షణంలో ఆమె మొహం వివర్ణ మయింది.“ చూడు ఆర్యా! లోకంలో అందరు చేసేదే నువ్వూ చేస్తే నీ గొప్పేం ఉంది చెప్పు? అయినా నీకు సంపాదనే ముఖ్యమా? నీకంటూ జీవితంలో ఆశయాలేమీ లేవా? ఆవేశంగా అడిగింది. ఆమె కళ్ళలో కోపం ప్రస్ఫుటంగా కనిపించ సాగింది.

          నేను చిరంజీవి లాగా భుజాలు ఎగరేస్తూ …“ఏమో నాకవన్నీ తెలీదు గానీ ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటో సూటిగా చెప్పరాదూ?” మొహం మీదే అడిగేసాను.

         “ఒకే... అలా అడిగావు బాగుంది. చూడు…నువ్వే గనుక నా నిజమైన ఫ్రెండ్ వయితే ఈ దేశం కోసం ఏదైనా సాధించి నీ సత్తా చూపించు… మా భార్గవ్ మావయ్య లాగా... నీ వల్ల అవుతుందా? చెప్పు?” అంది కళ్ళెగరేస్తూ.

         “తప్పదంటావా?” తను ఎక్కడ కటీఫ్ అంటుందేమోనని భయం భయంగా అడిగాను.“ముమ్మాటికీ తప్పదంతే! అలా అని నాకు ప్రామిస్ చెయ్యి ఇప్పుడే!” అంది నా కళ్ళలోకి దీక్షగా చూస్తూ.“ ఓకే.. భారూ... ఇట్స్ ఏ ప్రామిస్!“ అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసాను.

          ************ **********

          నేను టెన్త్ పాసయ్యే సమయానికి నాన్నగారికి రాజమండ్రి ట్రాన్స్ ఫర్ అయ్యింది. వైజాగ్ ని, నా స్నేహితులని, ముఖ్యంగా భారతిని విడిచి వెళ్లాల్సి రావడం... ఆ ఊహే తట్టుకోడానికి కష్టంగా ఉంది. ఎంతో అనుబంధాన్ని పెంచుకున్న మా స్నేహానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

          మా మధ్య దూరం పెరిగినా మా మనసులెప్పుడూ సామీప్యంగానే ఉండేవి. తరచూ ఫోన్ కాల్స్, చాటింగ్స్ తో టచ్ లో ఉండేవాళ్ళం. చైతన్య కాలేజ్ లో నా ఇంటర్ పూర్తయ్యాక మా నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ ఫర్ అవడంతో మా ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయిపోయింది.

          భారతి గీతమ్ లో బీటెక్ మెకానికల్ లో జాయిన్ అయింది. నేను ఎలక్ట్రానిక్స్ ఎంచుకున్నాను. వీడియో చాట్స్ పుణ్యమా అని మా ఇద్దరి మధ్య దూరం అంతగా బాధించేది కాదు.

          భారతి పట్ల నా స్నేహ భావం ఎప్పుడు ప్రేమగా మారిందో చెప్పలేను. ఏ రోజైనా భారతి నుంచి ఫోన్ రాకపోయినా నా మనసు విలవిల లాడేది. అనుక్షణం తన ఆలోచనలే నన్ను వెంటాడేవి... ఉత్సాహపరిచేవి. మా అభిప్రాయాలూ, అభిరుచులు ఏనాడో కలిసాయి. ఇక ఆశలు, ఆశయాలు, సిద్ధాంతాలు సరే సరి! ఏది ఏమైనా, ఆమె మనసులో ఏముందో బయట పడే వరకూ తను తొందర పడకూడదు. దేనికైనా సమయం రావాలిగా!.

          మాతృదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భార్గవ్ మావయ్య గొప్పతనం గురించి, మిలిటరీలో అతను చేసే వీరోచిత విన్యాసాల గురించి ఆమె తరచూ కథలుగా చెప్తూ ఉండేది. ఎప్పుడు భార్గవ్ ప్రస్తావన వచ్చినా భారతి చాలా ఎమోషనల్ గా మారిపోయేది.

          ఒక రోజు రాత్రి మూర్తి గాడు ఫోన్ చేసి పెద్ద బాంబు పేల్చాడు. అదేమంటే, భారతికి, వాళ్ళ మావయ్య భార్గవ్ కి వచ్చే వేసవిలో పెళ్లి ఫిక్స్ అయిందట.

         “బహుశా నీకు తెలిసే ఉంటుందిగా... ఇది చిన్నప్పటి నుంచీ అనుకున్న సంబంధం…అదీకాక, భారతికి అతనంటే ఆరాధ్య భావం. ఇద్దరూ ఈడూ, జోడూ కూడా బాగుంటారుగా … ఏమంటావు?“ అని ఒక్కసారిగా అడిగే సరిగి...

         “అవునవును... దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్!” అన్నాను తడబడుతూ... నా గుండెను ఎవరో పిండేస్తున్న భావన ఒక్క క్షణం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.

         “ ఒకేరా... విషయం తెలియగానే ముందు నీకే చేసేను... భారతి నీకు బహుశా రేపు చెబుతుందేమో! ఉంటానురా... గుడ్ నైట్“ అంటూ పెట్టేసాడు.

          నా ట్యూబ్ లైట్ అప్పుడు వెలిగింది. ‘నయం.. ఇంకా తొందర పడి తన దగ్గర ఏమీ వాగలేదు. థాంక్ గాడ్! ‘ అంటూ నిట్టూర్చాను.

         భారతి పెళ్ళి వేసవిలో జరిగి పోయింది. పెళ్లి కి హాజరై ఆ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను.

         ************ ***********

          ఆ తర్వాత నేను చెన్నై ఐఐటీలో ఎంటెక్ జాయిన్ అయ్యాను. సెకండ్ సెమ్ పరీక్షలు పూర్తయిన నాటి రాత్రి మూర్తి గాడి ఫోనొచ్చింది. వాడి ఫోనంటే నాకు చచ్చేంత భయం... ఎప్పుడూ అప్రియమైన సందేశాలను బట్వాడా చేస్తుంటాడు. నా అనుమానమే నిజమైంది.

         “భార్గవ్ రెండు రోజుల క్రితం బోర్డర్ లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందాడట.“ పార్థివ దేహం ఈ రోజు రావొచ్చును అంటున్నారురా. పాపం భార్గవిని చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందిరా! నువ్వూ వస్తే తనకి ధైర్యం చెప్పవచ్చు. ఎంతయినా మనమంతా చిన్ననాటి స్నేహితులం కదరా! మరి నే ఉంటానురా... బాయ్!” అంటూ ఫోన్ కట్ చేసేడు.

          భారతిని ఆ దయనీయమైన స్థితిలో ఊహించుకోలేని నేను సెలవులకి మా ఊరు వెళ్లకూడదనే నిర్ణయించుకున్నాను. మర్నాడు ఫోన్ చేసి భారతికి, శాస్త్రి గారికి నా సంతాపాన్ని తెలియ జేసాను.

          ఆ తర్వాత సెకండ్ ఇయర్ లో చదువులో బిజీ అయిపోయాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు నేను వైజాగ్ వెళ్లే సమయం ఆసన్నమయింది అనిపించింది. అందుకు ఒక ప్రత్యేకమైన కారణం లేకపోలేదు.

         *********** ***********

          వేసవి సెలవుల్లో నేను వైజాగ్ వెళ్లేసరికి నాన్నగారు కూడా రిటైర్ అయ్యి అక్కడ

         సీతమ్మధారలో ఫ్లాట్ కొని సెటిల్ అయ్యారు. నా చెల్లెలు శ్రీజ ఇంజనీరింగ్ ఫైనల్ లో ఉంది. ఆ రోజు సాయంత్రం నేను శాస్త్రి గారింటికి వెళ్ళాను.

          మా కాలేజీ విశేషాలు ఆయన వాకబు చేస్తుండగా భారతి మా ఇద్దరికీ కాఫీ అందించింది. తనను అలా తెల్ల చీరలో చూడడం నాకు చాలా బాధనిపించింది. ఎప్పుడూ హుషారుగా తుళ్ళి పడుతూ ఉండే భారతి అలా గంభీరంగా ఉదాసీనంగా ఉండడం చూసి నా మనసు చివుక్కు మన్నది. అయినా, విధి రాతను ఎవరు ఎదిరించ గలరు?

          శాస్త్రి గారింట్లో భోజనం అయ్యాక, పెరట్లో నంది వర్ధనం చెట్టు కింద కుర్చీల్లో భారతీ, నేనూ కూర్చున్నాం. నా చదువు గురించి వివరాలు అడిగింది. తనకి సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చినా, చెన్నై పోస్టింగ్ ఇవ్వడంతో జాయిన్ కాలేదని చెప్పింది.

         “ఇంతకీ, నీ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించావు భారతీ?” ఉన్నట్టుండి నేనే అడిగాను.

         “ఏముంది? మావయ్య జ్ఞాపకాలతో, నాకు పుట్టబోయే బుల్లి భార్గవ్ తో శేష జీవితాన్ని గడిపేయడమే!” అంటూ శుష్కంగా నవ్వేసింది. అప్పుడే తెలిసింది భారతి ప్రేగ్నన్ట్ అని.

         “ చూడు భారతీ! భార్గవ్ అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు. దేశ రక్షణ కోసం తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి కీర్తి శేషుడయ్యాడు. అతని సిద్ధాంతాలను గౌరవించే నువ్వు ఇలా చాందసంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది.

          పెళ్లయి ఏడాది తిరక్కుండానే తెల్ల చీర కట్టావు… అఫ్ కోర్స్ … అది డెస్టినీ!... మన చేతిలో లేనిది. కానీ... భవిష్యత్తులో మనమెలా ఉండాలి అన్నది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన జీవితాన్ని నిస్సారంగా, నిష్ఫలంగా గడపాలి అనుకోవడం మాత్రం అమానుషం. ఆలోచించు!“ అన్నాను ఆవేశంగా.

          సూరీడి కిరణాలు చెట్ల ఆకుల సందుల్లోంచి చొరబడి ఆమె మొహం మీద జీరాడు తున్నాయి. కొంగుని తన భుజాల చుట్టూ కప్పుకొని...“మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా... వాటికి తలవంచక తప్పదుగా! వాటిని కాదని నేనిప్పుడు ఏమి చేయాలంటావు ఇంతకీ?” అంటూ నన్ను నిలదీసింది.

         “ చూడు భారూ! సాంప్రదాయాలు మన జీవితాలని ఆనందమయం చేయాలి.

         అంతే కానీ జటిలతరం కాదు. నేను చెప్పేది ఏమిటంటే... ఇప్పుడు నీ వయసెంత అనీ... ఆఫ్ట్రాల్ పాతిక కూడా దాట లేదు. నా మాట విని ముందు నువ్వా తెల్ల చీర మార్చుకొని రా బాబూ... చూడలేక చస్తున్నా! అయామ్ సారీ!” నా మాటకు ఆమె పెదవులపై చిరు దరహాసం మెరిసింది.

         “ సరే ఇప్పుడే వస్తానుండు“ అంటూ మరుక్షణం కలర్ ఫుల్ శారీలో వచ్చి మెస్మెరైజ్ చేసింది

         “ దట్స్ లైకె గుడ్ లేడీ!“ అంటూ నేను థంబ్ చూపగా ఆమె కళ్ళలో కొత్త కాంతి మెరిసింది.

          భారతి చేతిని నా చేతిలోకి తీసుకొని...“ చూడు భారూ!... మన స్నేహం ఈ నాటిది కాదు. చిన్నప్పటి నుంచీ ఒకే తరహా ఆలోచనల తోనే మనిద్దరం పెరిగాము. నా జీవితం లో నీ పాత్ర విడదీయ రానిది. ఆ చనువుతోనే ఒక ప్రస్తావన తెస్తున్నాను. నువ్వు కాదనవనే నమ్మకంతో. నా మాటను మన్నిస్తావు కదూ!“ అన్నాను అభ్యర్ధనగా.

         “ ఇంతకీ ఏమిటి ఆర్యా... నీ ప్రొపోజల్?“ అనడంతో...“ నిజానికి ఈ సంగతి నీకు చెప్పే అదృష్టం, అవకాశం నాకు రాదనే అనుకున్నాను. బహుశా నీకీ విషయం ఆశ్చర్యాన్ని కలిగించ వచ్చు... చిన్నప్పటి నుంచీ నేను నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను. కానీ, ఎప్పుడైతే నువ్వు భార్గవ్ ని ప్రేమిస్తున్నావని తెలిసిందో అప్పుడే నా ప్రేమను నాలోనే దాచేసుకున్నాను. నీ అభిలాష మేరకు నన్ను నేను మలచుకున్నాను.

          అదృష్ట వశాత్తు జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను. ఏమంటావు?“ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగేసాను. ఆమెలో ఏదో కలవరపాటుని గమనించాను.

         “ అదీ... అదెలా కుదురుతుంది ఆర్యా... నాలో మరో జీవి ఊపిరి పోసుకుంటున్న

         ఈ తరుణంలో …?“ ఆమె కంఠంలో ఒక విషాదపు జీర కదలాడింది.

         “ ఓహ్... అదా నీ భయం? ఆ జూనియర్ గాడిని మనిద్దరం కలిసి అపురూపంగా చూసుకుంటే సరి... మరింకేం మాట్లాడకు!“ అంటూ ఆమె నోటికి తాళం వేసేసాను. శాస్త్రి దంపతులను ఒప్పించడం ఏమంత కష్టం కాలేదు.

         ************ ***********

          ఆ సాయంత్రం ఆర్కే బీచ్ లో భారతి, నేను కలుసుకున్నాం. మా ఇద్దరి సంతోషానికి

         అవధులు లేకుండా పోయాయి. పల్లీలు నములుతూ భారతి నాతో...“ఆర్యా, ఇంతకీ మన పెళ్ళికి నువ్వు నాకు ఏం కానుక ఇవ్వాలనుకుంటున్నావ్?” అడిగింది హఠాత్తుగా.

         “ దేవి గారు ఏమి సెలవిచ్చిననూ ఈ దీనుడు శిరసావహించును“. అన్నాను నాటక ఫక్కీలో. నా జోక్ కి భారతి ఏ మాత్రం నవ్వ లేదు. ఆమె మొహం ఉన్నట్లుండి సీరియస్ గా మారింది. దూరంగా ఎగిసెగిసి పడుతున్న కెరటాల వైపు తదేకంగా చూస్తూ...

         “ఆర్యా! నీకు గుర్తుందా... మనం స్కూల్ లో చదువుకునేటప్పుడు నువ్వు నాకో మాటిచ్చావు. అదే... ఆ రోజు ఇండిపెండెన్స్ డే... స్కూల్ గ్రౌండ్ లో... జ్ఞాపకం వచ్చిందా?” అంది ఆత్రంగా.

          ఆమె ప్రశ్నకు జవాబుగా ఆమె కళ్ళలోకి చూస్తూ కొంటెగా నవ్వాను.

         నా చేతిలో ఉన్న తన చేతిని సున్నితంగా నిమురుతూ“ అసలు నేను మర్చిపోతే కదా, గుర్తుండడానికి!“ అనేసరికి ఆమెలో ఎక్కడలేని రిలీఫ్ కనిపించింది.

          ఇసుకతో పిచ్చిక గూళ్ళు కడుతూ …“ నీకో విషయం చెప్పనా ఆర్యా! స్వర్గస్థుడైన మా మావయ్య మళ్ళా నీ రూపంలో రావాలని ఎంతో ఆశ పడ్డాను. నా ఆశ అడియాసగా మిగిలి పోతుందేమోనని చాలా భయపడ్డాను. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు!“ అంది ఉత్సాహంగా.

         “ చూడు భారతీ! నాకు నీకన్నా విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. నీ కళ్ళల్లో కాంతులు చూడడం కన్నా అపురూపమైన దృశ్యం నాకు ఇంకేమి ఉంటుంది చెప్పు?“

         అని మౌనంగా జేబు లోంచి ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి..“ ఇదేంటో తెలుసా?“ అన్నాను.

          అయోమయంగా చూస్తున్న తనతో …“SSB క్యాంపస్ సెలక్షన్ లో యూనివర్సిటీ ఎంట్రీ స్కీం లో నాకిచ్చిన ఆఫర్ లెటర్ ఇది. ఇక మిలిటరీ అకాడమీ లో జాయినవడమే ఆలస్యం! ఇప్పటికైనా కాస్త నవ్వండి మేడమ్!” అంటూ ఆమె భుజాలను రెండూ కుదిపాను.

          భారతి భావోద్వేగంతో కంట తడి పెడుతూనే నన్ను హత్తుకుంది. అసంకల్పితంగా, ఆమె నా నుదిటిపై ముద్దు పెట్టుకుని...“ఐ ఆమ్ ప్రౌడాఫ్ యూ ఆర్యా!” అంది.

         “ఇట్స్ ఓకే... కూల్ కూల్..!” అంటూ ఆమెను వారించాను. ఆమె సంతోషంతో తబ్బిబ్బు అవుతూ….

         “ ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా! ఓ అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రాబోతున్నాడు. అయ్ ఫీల్ సో వెరీ లక్కీ“ అంది చిరునవ్వులు చిందిస్తూ.

         ************ ***********

          గత జ్ఞాపకాల నుంచి విడి వడి ఈ లోకంలోకి వచ్చేసరికి ఫ్లయిట్ వైజాగ్ లో ల్యాండ్ అయింది. నాన్నగారు, శ్రీజ ఇద్దరూ నన్ను రిసీవ్ చేసుకోడానికి వచ్చారు. ఇంటికి చేరుకునేసరికి అక్కడంతా ఒకటే హడావుడి... అవును మరి!... భారతితో నా పెళ్లికి వారం రోజులే ఉంది. చిన్నప్పటి మిత్రులతో ఆ కాసిన్ని రోజులు హాయిగా గడిపేశాను.

          బంధు మిత్రుల ఆశీర్వచనాలతో మా వివాహవేడుక చూడ ముచ్చటగా జరిగిపోయింది. వెను వెంటనే శోభనం ఏర్పాట్లు కూడా...! పురోహితుడు పూజా కార్యక్రమాలు ముగించాక మమ్మల్ని ఇద్దర్నీ ఆ గది లోకి నెట్టేశారు.

          ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా శ్రీజ, నేను, నా ఫ్రెండ్స్... అంతా ప్రక్క గదిలో... భారతికి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించు కున్నాం.

          భారతి గదిలోకి వచ్చి నా గురించి వెదుకుతూ ఉండగా... నేను ఒక మిలిటరీ లెఫ్టినెంట్ ఆఫీసర్ గెటప్ లో ఆమెకు ఎదురుగా ప్రత్యక్షం అయ్యాను.

          కాసేపు దిగ్భ్రమగా దీక్షగా నన్నే చూస్తూ ఉండి పోయింది భారతి. వెంటనే ఫక్కున

         నవ్వేసింది.“నీ శోభనం డ్రెస్ చాలా బాగుందిరా ఆర్యా!” అంది ఎక్సిటెడ్ గా. ఆమె కళ్ళలో ఆరాధన తొణికిస లాడింది.

          ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడలా నన్నలా ఒరే అంటూ పిలిచే భారతిని చూస్తే ముచ్చటేసింది. ఇక ఆగలేనట్లుగా ఆమెను సమీపించి గుండెలకు హత్తుకొని మంచం మీద కూర్చో బెట్టాను.

          భారతి నా ఛాతీపై నున్న యూనిఫార్మ్ ని పదేపదే తాకుతూ తన్మయత్వం చెంద సాగింది. నా కళ్ళలోకి గర్వంగా చూస్తూ...“ ఆర్యా! … నీ పేరుకసలు అర్ధం ఏవిటో తెలుసా?“ అడిగింది.

          ‘ఉహు..! ’ అని నేను తలూపడంతో …“ ఆర్యన్ అంటే వారియర్ అని అర్ధం.. నిజంగా ఈ రోజు నువ్వు సార్ధక నామధేయుడవయ్యావు. తెలుసా! నా ఆశలకు, ఆశయాలకు నువ్వు ఇంత అందమైన రూపాన్ని ఇస్తావని నేను ఊహించనే

         లేదు సుమా!

          ఈ రోజు నా మనసు పురి విప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. పెళ్లి కానుకగా నువ్వు బహూకరించిన ఈ యూనిఫామ్ ని నా ప్రాణ దైవం నాకిచ్చిన ఒక అపురూపమైన వరంగా భావిస్తాను. అండ్ అయ్ రియల్లీ మీన్ ఇట్!” అంది. ఆమె గొంతులోని సిన్సియారిటీకి నేను చలించిపోయాను.

         “ చూడు భారూ! నీకో విషయం చెప్పనా!... దేశభక్తి భావన అణువణువునా నింపుకున్న ఒక మహిళగా నువ్వంటే నాకెంతో ఆరాధన. భారత మాత గర్వించే భారతిగా నువ్వూ సార్ధక నామ ధేయురాలవే సుమా!“ అంటూ ఆమె చెక్కిలి చిదిమాను. ఆ చిరు స్పర్శకు నును సిగ్గు కమ్మేయగా ఆమె కనులు అర మోడ్పులయ్యాయి.

         “ భారతీ … యూ ఆర్ మై లవ్... యూ ఆర్ మై లైఫ్.. నువ్వే నా ప్రాణం.. నువ్వే

         నా సర్వస్వం... ఐ కాంట్ లివ్ వితౌట్ యూ“ అంటూ బలంగా ఆమెను నా గుండెలకు హత్తుకున్నాను.

          ఆ అపురూపమైన క్షణాలు ఎక్కడ చేజారి పోతాయో అన్నట్లుగా భారతి నా చుట్టూ తన చేతులను బిగించి నా పెదవులను తన అధరాలతో తమకంగా కప్పేసి నా గుండెలో గువ్వలా ఒదిగి పోయింది.

         *********** ************

Kommentare hinzufügen