అతనొక శాపగ్రస్తుడు  (Author: చిత్రాడ కిషోర్ కుమార్)

కలల్ని కాగితంపై ఆవిష్కరించలేడు

ఆలోచనల్ని అక్షరాలుగా మలచలేడు

అందరిలా మాట్లాడలేడు, పోట్లాడలేడు

తెల్ల కాగితానికి రంగు నోట్లకు తేడా తెలియదు

ప్రపంచం అతని దృష్టిలో సుందరం, సుమధురం !

 

అతను చేసినది ఏదీ గుర్తుండదు

అతను ఆశించినది ఏమీ ఉండదు

అందఱూ అతని వల్ల ఆనందాన్ని పొందేవాళ్లే

అతని చేష్టలు కొంతమందికి వినోదం

మరికొంతమందికి వేళాకోళం

ఆకారం ఉన్నా, అహంకారం తెలియని

జ్ఞానం లేని విచిత్ర స్వభావి అతడు !

 

నీడను చూసి చీకటని భయపడే అతనికి

రక్షించుకునే విధానం తెలియదు

నోటిలో గండుచీమలు కుడుతున్నా

గాయమై ఒంట్లోంచి రక్తం కారుతున్నా

ఆ గాయాల బాధ అందరిలా ఎవరికీ అరిచి చెప్పుకోలేడు

నొప్పి, ఆకలిబాధ తెలిసినా చెప్పలేని అమాయకుడతడు !

 

ఒక అందమైన కల ఉండదు, స్వచ్ఛమైన నిద్ర ఉండదు

భయంతో నిండిన కేకలు పెడుతున్నాడో

దు:ఖంతో కూడిన అరుపులు అరుస్తున్నాడో

అతని మనసులోని గుండెపాటు ఎవరికి తెలుస్తుంది?

అతనికైనా తెలిస్తేనే కదా ! ఎవరితోనైనా చెప్పుకోగలడు ?

ప్రకృతి బీభత్సానికి బలికాబడ్డ శాపగ్రస్తుడు అతడు !

 

"నేను - నాది" అనే భావం లేకుండా

తనలో తనే ఎప్పుడూ నవ్వుకుంటూ గొణుగుకుంటూ

అస్పష్టమైన మాటలతో చిరదీక్ష సాగించాడు

ఇప్పుడు అతని సుదీర్ఘమైన నడక ఆగిపోయింది

అతను తిరిగిన రోడ్లు

అతనితో మాట్లాడిన మనుషులు

అతని అమాయకపు చూపుల కోసం ఎదురుచూస్తున్నాయి

వాళ్లకు తెలియదు, ఇన్నేళ్లు ఒంటరిగా తపస్సు చేస్తూ

మౌనంగా దీర్ఘ నిద్రలోకి జారుకొని

మట్టిముద్దగా మారిపోయాడని !!

Kommentare hinzufügen