సాహిత్యం సామాజిక ప్రయోజనం  (Author: కర్లపాలెం హనుమంతరావు)

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఆలోచనలను, అనుభూతులను పంచుకోవడానికి పుట్టిన అత్యున్నత సాధనం భాష, ఆ భాషకు సంస్కారాన్ని, సౌందర్యాన్ని అందించి, సామాజిక దిశను నిర్దేశించిన మహత్తర ప్రక్రియ 'సాహిత్యం'.

సాహిత్యం శూన్యంలోంచి పుట్టుకురాదు. ఆయా కాలాల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల పునాదులపైనే నిర్మితమవుతుంది. అయితే, శతాబ్దాలుగా సాహిత్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, అతిపెద్ద ప్రశ్న: "సాహిత్యం కేవలం అక్షర విన్యాసమా? సామాజిక పరివర్తనా సాధనమా?"

అసలు సాహిత్యం అంటే ఏమిటి?

"సహితస్య భావః సాహిత్యం" అని ప్రాచీనుల నిర్వచనం. హితాన్ని చేకూర్చేది సాహిత్యం. కేవలం అక్షరాల కూర్పు సాహిత్యం కాదు. మానవ హృదయగత భావాలకు, సమాజ గమనానికి నిర్మితమయే అక్షర వారధి సాహిత్యం.

సాహిత్యానికి ప్రాణం సృజనాత్మకత, విశ్వజనీనత. వ్యక్తి అనుభూతిని విశ్వజనీన అనుభవంగా మార్చగల శక్తి సాహిత్యానికి ఉంటుంది. విక్టోరియన్ కాలం నాటి ప్రముఖ విమర్శకుడు మాథ్యూ ఆర్నాల్డ్ (Matthew Arnold) "సాహిత్యం అంటే జీవిత విమర్శ (Literature is a criticism of life)."అన్నాడు.

అయితే సమాజం అంటే ఏమిటి? పరస్పర సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువలు, ఒక నిర్దిష్ట భౌగోళిక పరిధిలో జీవించే ప్రజల సమిష్టి చేతన 'సమాజం'.

మనిషి సంఘ జీవి. సమాజం వినా మనిషి విలువ సున్నా. సమాజం నిరంతరం పరిణామం చెందుతూ వివిధ వర్గాల మధ్య గల అనుబంధాలను ప్రభావితం చేస్తుంటుంది. సాహిత్యానికి కావలసిన వస్తువును (Content) నిరామయంగా సాగే ఈ పరిణామ క్రమమే అందిస్తుంది.

చతుష్షష్ఠి కళలలో సాహిత్యమూ ఒక భాగమే. కాబట్టి, కళ కళ కోసమా? జనం కోసమా? అనే చర్చ సాహిత్యానికీ వర్తిస్తుంది.

కళ కళ కోసమే (Art for Art's Sake / Aestheticism) అనే వాదన ప్రకారం సాహిత్యం పరమార్థం కేవలం ఆనందాన్ని, రసానుభూతిని కలిగించడమే. సామాజిక బాధ్యతలతోనో నైతిక ప్రబోధాలతోనో దీనికి సంబంధం లేదు.

కళ సమాజం కోసమే (Art for Society's Sake / Realism) అనే వాదన ప్రకారం, సాహిత్యం సమాజంలో భాగం. సామాజిక ప్రయోజనం దీని తప్పనిసరి ధర్మం.

సాహిత్యానికి సమాజంతో సంబంధం ఉండాలా? వద్దా? అనే చర్చ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవటం గమనార్హం. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి వెలువడే సాహిత్యానికి సమాంతరంగా కేవలం ప్రచారం కోసం మాత్రమే సృష్టించే సాహిత్యమూ కొనసాగడమే ఇందుకు కారణం. సమాజంతో నిమిత్తం లేని సాహిత్యానికి ప్రజాదరణ తాత్కాలికమే అయినా "శుద్ధ సాహిత్యవాదులు" వెనక్కు తగ్గటంలేదు! అదీ విచిత్రం!

ప్రముఖ పాశ్చాత్య సౌందర్యవాది ఆస్కార్ వైల్డ్డ్ దృష్టిలో "There is no such thing as a moral or an immoral book. Books are well written, or badly written. That is all."

సమాజ పరిణామాలకు అతీతంగా సాహిత్యానికి స్వయంప్రతిపత్తి ఉండాలని, పాఠకుడికి ఆత్మానందం, రసానుభూతి కలిగించడమే రచయిత లక్ష్యంగా ఉండాలనే వాదనకు ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుడు వాల్టర్ పేటర్ కూడా వత్తాసు పలుకుతాడు.

కాని, సోవియట్ రచయిత ఇల్యా ఎహ్రెన్బర్గ్ (Ilya Ehrenburg) ఇందుకు విరుద్ధంగా "తన పరిసరాలకు, తన సమాజానికి దూరమయితే, రచయిత సృజనాత్మక కళ విషయంలో శుష్కించి జీవం కోల్పోతాడు. వాస్తవిక సాహిత్యం ఎప్పుడూ సమాజ జీవితంతో సంబంధం కలిగి ఉంటుంది." అంటాడు.

సరే, సాహిత్యం సమాజం కోసమే అయితే... రచయిత ఎటువంటి సమాజం కోసం పని చేయాలి? ఎటువంటి సమాజం కోసం పని చేయకూడదు? అనే ప్రశ్న రానే వస్తుంది.   రచయిత స్పష్టంగా ప్రజల పక్షం నిలబడాలి. అతని ప్రతి అక్షరంలోనూ ఆ నిబద్ధత కనిపించాలి. శ్రమని దోచుకోవడాన్ని, వర్గ అసమానతలనీ సమర్థించే సమాజాల వైభవాన్ని కీర్తించడానికి రచయిత పనిముట్టు కాకూడదు. కుల వివక్షను, స్త్రీ అణచివేతను, మతాధిపత్యాన్ని కాపాడే వ్యవస్థల కోసం తన కలాన్ని వాడకూడదు. ప్రగతిశీల సమాజ స్థాపన కోసం కృషి చేయటమే రచయిత ప్రధాన కర్తవ్యం. శ్రీశ్రీ పరితపించిన “మరో ప్రపంచం" నిర్మాణానికి 'ఉడుత సాయం' చేయాలి రచయిత.

"If literature is not a force to change the world, it is nothing అని తేల్చి చెప్పిన ఆఫ్రికన్ విప్లవ రచయిత న్గూగీ వా థియాంగో (Ngũgĩ wa Thiongo) మాటను కూడా గుర్తుంచుకోవాలి.

భారతీయ సనాతన వాజ్మయ సంప్రదాయం కూడా "విశ్వ శ్రేయస్సు" కే ప్రాధాన్యత ఇచ్చింది. కవులు పాలకుల ప్రయోజనాలకు దాసోహం అన్న వేళ "ఇమ్మనుజేశ్వరాధములకు" ఊడిగం చేయని పోతన వంటి కవులు లేకపోలేదు.

వేదాలు కవిని "క్రాంతదర్శి" గా గౌరవించాయి. సమాజానికి మార్గదర్శనం చేయడమే కవి విధి అనే భావన నేడే వచ్చింది కాదు. "వసుధైవ కుటుంబకం" అనే విశ్వజనీన భావన సాహిత్య పరమార్థంగా వేదయుగమే ప్రతిపాదించింది.

వాల్మీకి రామాయణానికి నాంది 'సమాజ ఆర్తి'. ఒక అల్పజీవి జీవించే హక్కును నిర్దాక్షిణ్యంగా కోల్పోవడం ఆ కవిని కలచివేసింది. ఆ వేదనే రామాయణ నిర్మాణానికి అంకురార్పణ చేసింది. పాలకులు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో సందర్భం వచ్చినప్పుడల్లా మహాభారతం చెబుతూనే వచ్చింది.

జనం ఊసు మరిచి రాజుల కొలువులో విలాసాలు మరిగిన ప్రబంధకర్తలకు విరుగుడుగా వేమన వంటి ప్రజాకవులు ప్రభవించారు. వర్ణవ్యవస్థను, ఆర్థిక అసమానతలను తీవ్రంగా నిరసించిన శతక కర్తలకు తెలుగు సాహిత్యంలో కొదవ లేదు. శేషప్ప కవి తన నరసింహ శతకంలో "అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి..." అంటూ నాటి సామాజిక వైపరీత్యాన్ని దునుమాడాడు.

ఆధునిక యుగ తెలుగు సాహిత్యం పూర్తిస్థాయిలో సామాజిక ప్రయోజనం వైపు మొగ్గు చూపింది. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణలకు పూనుకుంటే, గురజాడ అప్పారావు "దేశమంటే మనుషులోయ్" అని నొక్కి చెప్పాడు. గిడుగువారు సాహిత్యాన్ని పుస్తకాల భాష నుంచి ప్రజల పలుకుబడి వైపు మళ్ళించాడు. యుగకవి శ్రీశ్రీ ప్రభువెక్కిన పల్లకీని కాదని అది మోసిన కూలీల పక్షాన గొంతెత్తాడు.

ప్రముఖ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి దృష్టిలో సాహిత్యం సమాజ గమనాన్ని మార్చేలా ఉండాలి. కాకపోతే సాహిత్యంలో కళాత్మకత - సామాజికత రెంటికీ సమతూకం ఉండాలన్నారు ఆయన.

రావిశాస్త్రి తన రచనలలో దోపిడీ వ్యవస్థలను తూర్పార పడుతూనే సాహిత్య లక్ష్యాన్ని నిర్దేశిస్తూ "ప్రతి రచయిత తను రాస్తున్నది రావణుణ్ణి సమర్థించి రాముణ్ణి ఓడించడానికా, లేక సీతని విడిపించి న్యాయాన్ని గెలిపించడానికా అనేవిషయం తేల్చుకోవాల్సుంటుంది." అన్నాడు.

కేవలం సామాజిక ప్రయోజనం పేరిట సాహిత్య విలువలను బలిచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పాలగుమ్మి పద్మరాజు 1969 అభ్యుదయ సాహిత్య సదస్సులో మాట్లాడుతూ "సాహిత్యం ద్వారా సామాజిక ప్రయోజనం అనేది ఒకవేళ జరిగితే నా అంత సంతోషించేవాడుండడు" అంటూనే, "అలాంటి ప్రయోజనం జరగడం అనేది అనుమానాస్పదమే" అని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఆయన ఆవేదనకు వత్తాసుగా ఓ సందర్భంలో ప్రసిద్ధ రచయిత, విమర్శకుడు కొడవటిగంటి కుటుంబరావు కూడా "చింతామణి నాటకం చూసి భోగంవాళ్లు తమ వృత్తి మానుకున్నట్లు ఒక్క నిదర్శనమూ లేదు" అంటూ పెదవి విరిచాడు ఆశ్చర్యంగా. సాహిత్యం సమాజం కోసం పని చేయని పక్షంలో జరిగే దుష్పరిణామాలపై ఈ ప్రజా రచయితలకు అవగాహన లేక కాదు, కానీ సాహిత్యానికి సమాజంతో సత్సంబంధాలు కొరవడ్డ గడ్డుకాలంలో వెలువడ్డ వేదన అది.

నిజంగానే సామాజిక బాధ్యత, నైతిక అంకుశం లేని పక్షంలో సాహిత్యం వల్ల కలిగే కీడు అంతా ఇంతా కాదు. అశ్లీల సాహిత్యం మనిషిలోని పశుప్రవృత్తిని రెచ్చగొడితే, విద్వేష సాహిత్యం మొత్తం సమాజాన్నే ఉన్మాదానికి బలిపెడుతుంది. మూఢ సాహిత్యం మనిషి శాస్త్రీయ దృక్పథాన్ని చంపి, సమాజాన్ని వెనక్కు నడిపిస్తుంది. 1850లలో ఫ్రాన్స్‌లో అధివాస్తవికత పేరుతో మనిషి నడిచే దిశను వెనక్కి మళ్లించిన దాఖలాలే ఇందుకు ఉదాహరణ.

ప్రజాసాహిత్యం సామాజిక చైతన్యాన్ని రగిలించి అన్యాయాన్ని ప్రశ్నించే వివేకాన్నికలిగిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలు ప్రదర్శించిన ధైర్యసాహసాలే ఇందుకు నిదర్శనం.

ఆటో మొబైల్స్ వంటి భౌతిక భోగోపకరణాల తయారీకి ఉన్నట్లు సాహిత్యానికి ప్రతి ఏడూ కొత్త మోడల్స్ మార్చే సాంకేతిక లక్ష్యం ఉండకపోవచ్చు. కానీ "కార్లలాగా కాకుండా, మనిషి అంతరంగాన్ని అంతకంతకూ ఉన్నతంగా తీర్చిదిద్దటమే సత్సాహిత్యం అంతిమ లక్ష్యం కావాలి.

కర్లపాటి హనుమంత రావు గారి స్వపరిచయం

రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి  రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల  ద్వారా  కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ  కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు,  నాటక రచనలకు  వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.


Kommentare hinzufügen