శోకంలో శ్లోకం  (Author: ములుగు లక్ష్మీమైథిలి)

     బిడ్డ తప్పి పోయినప్పుడు... ఆ తల్లి జీవితంలో ఉండే చీకటిలా ఆ గది అంతా గాఢాంధకారం అలుముకుంది. రోడ్డుపై ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురు సన్నగా కిటికీ సందులో నుంచి పడుతోంది. అక్కడ విషాదం ఘనీభవించింది. గుండె తడి చెమ్మగిల్లింది.

          అక్కడ ఒక ఐదేళ్ల పిల్లవాడు రెండు గంటల నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. ఆ అబ్బాయికి ఓ వైపు ఆకలి వేస్తుంది. మరోవైపు అమ్మా నాన్న గుర్తుకు వస్తున్నారు. ఆ చిన్ని మనసులో సాయంత్రం జరిగిన సంఘటనే మెదులుతోంది. 'తమ్ముడితోనూ, అమ్మతోనూ ఆడుకుంటూ ఉండగానే... ''పార్కులో ఉన్న ఉయ్యాలలో ఊపుతాను, ఐస్ క్రీమ్ కొనిపెడతా రా '' అంటూ ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పాడు. తాను అతని దగ్గరకు రాగానే... ఒక్కసారిగా తనను భుజంపై వేసుకుని పరిగెత్తాడు. అమ్మ తమ్ముణ్ణి ఎత్తుకుని తన కోసం కేకలు వేస్తూ, తనను తీసుకుని వెళుతున్న వాడి వెంట పరుగెత్తింది.'

       "రక్షించండి... హెల్ప్... హెల్ప్... వాడు మా బాబును కిడ్నాప్ చేసి ఎత్తుకెళుతున్నాడు" అంటూ గట్టిగా అరుస్తోంది. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొందరు మా వెనకాల పరిగెత్తినా... అతను నన్ను స్కూటర్ పై కూర్చోబెట్టుకుని స్పీడ్ గా వెళ్ళటంతో పట్టుకోలేక పోయారు' అనుకుంటూ అమ్మ గురించి ఆలోచిస్తూ ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉంటే... ఈ పాటికి అమ్మ అన్నం పెట్టేది. అమ్మ కావాలి... అమ్మ కావాలి' అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు బాబు.

      మరో గంట తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. అతను ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చాడు. అతని చేతిలో చిన్న బాక్స్ ఉంది. ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి "ఏడవకు బాబు! రేపు మీ అమ్మ నాన్న వాళ్ళింటికి తీసుకెళతాను. ఇదిగో అన్నం తిను" అంటూ తాను తెచ్చిన బాక్స్ లో ఉన్న అన్నం పెట్టబోయాడు. 

         "నాకేం వద్దు... అమ్మ కావాలి, అమ్మ పెడితేనే తింటాను." అంటూ ఏడవటం మొదలు పెట్టాడు.

           "చూడు బాబు! నువ్వు అన్నం తింటే అమ్మ దగ్గరికి తీసికెళతాను." అని చెప్పగానే ఆ అబ్బాయి గబగబా తినేసాడు. 

  ‌‌ *******  

     "ఏరా చింటూ! అప్పుడే నాన్న రాగానే అన్నీ చెప్పడం మొదలు పెట్టావా?" అంటూ ఇంటికి వచ్చిన తండ్రితో చెపుతున్న కొడుకును అడుగుతూ, భర్త వైపు తిరిగి "అది కాదండీ! ఇందాక బజారుకు వెళితే షాపులో ఉన్న ఫ్లైట్ బొమ్మ కావాలన్నాడు. అది చాలా కాస్ట్. అంత ఖర్చుపెట్టి కొనలేక మళ్ళీ కొందాం అని చెప్పాను. దానికి బదులుగా వేరే బొమ్మ తీసుకో అన్నాను కూడా. అయినా వినలేదు. రెండు తగిలించి ఇంటికి తీసుకుని వచ్చాను."

   "అదేంటి చింటూ గొడవ చేసావా? నేను కొని పెడతాలే." చెప్పాడతను కొడుకు తలపై చేయి వేసి. 

 "డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు? ఏదైనా ఉద్యోగం చేయమంటే చేయరు. మీరు ఎవరి కింద పని చేయటానికి ఇష్టపడరు. మీ దగ్గరే పది మంది పని చేయాలంటారు. ఎవరెవరికో ఉద్యోగాలు ఇప్పించానని, ఆఫీసులు పెట్టానని, కంప్యూటర్లు పెట్టానని ఎక్కడెక్కడో అప్పులు చేసి, తీర్చలేక దివాలా తీసి, అన్నీ మూసేసి రోడ్డున పడ్డారు. నేను సంపాదించిన జీతం మీ అప్పులు తీర్చటానికి సరిపోతుంది. ఇలాంటి సమయంలో పిల్లవాడి కోరికలు ఎలా తీర్చాలో తెలియటం లేదు" చెప్పింది బాధగా నీలిమ. 

      "నేను ఎలాగో డబ్బులు తెస్తాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నాకు కొంత టైం పడుతుంది నీలిమ." చెప్పాడు కిశోర్ అసహనంగా.

      "ఇంటికి సరిగా రావటం లేదు. పొద్దున వెళ్లి ఏ రాత్రికో వస్తారు. ఎందుకో ఈ మధ్య రెండురోజుల నుంచి మీరు అదోలా ఉంటున్నారు. చింటూ మీ కోసం ఎదురుచూస్తూ అన్నం కూడా తినటం లేదు" చెప్పింది నీలిమ.

       "చెప్పాను కదా! ఉద్యోగం కోసం వెతుకుతున్నా" చెప్పాడు కిశోర్ తడబడుతూ.

       "జాబ్ కోసమైతే... ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీలో ఏదో మార్పు కనిపిస్తోంది." అతని ముఖంలోని కంగారును గమనిస్తూ అడిగింది నీలిమ. 

      "ఏం లేదు నీలిమా! అలిసి పోయి వచ్చాను కదా. నీకు అలా కనిపిస్తున్నా. ముందు ఆకలేస్తోంది అన్నం పెట్టు. చింటూను కూడా పిలు అన్నం తింటాడు." చెప్పాడు కిశోర్ ముఖంలోని తొట్రుపాటును కనబడనీయకుండా.

              ******

        ఆ గది అసలే ఇరుకు. అది కూడా ఒక మురికి వాడ మధ్యలో ఉంది. ఆ గదిలో ఆ బాబు ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ మీద దిగులుతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో అతని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒక టాబ్లెట్ తెచ్చి ఇచ్చాడు. అతడే కిశోర్. 

         'వాళ్ళు పది లక్షలు తెచ్చి ఇవ్వగానే వీడిని వదిలేయాలి. రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా కూడా... డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంత అమౌంట్ అంటే కష్టమే, ఎలాగైనా సరే తంటాలు పడి తీసుకొస్తాం. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి ఏ హానీ తలపెట్టకండి' అంటూ తల్లిదండ్రులు వేడుకున్నారు. 

    'సరే... ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది' అంటూ తాను బెదిరించాడు కూడా.

              కానీ... మనసులో ఏదో భయం. వాళ్ళు పోలీసులకు తన ఫోన్ నెంబర్ ఇస్తే ట్రేస్ అవుట్ చేస్తే, తను దొరికిపోతాడు. అందుకే తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. ఫోన్ చేసినప్పుడల్లా సిమ్ కార్డు మారుస్తున్నాడు.

  అలా మరో రెండు రోజులు గడిచాక, ఒకరోజు ఇంటికి వచ్చిన కిశోర్ కి భార్య ఏడుస్తూ కనబడింది.

          "ఏమైంది నీలిమా? ఎందుకు ఏడుస్తున్నావు?" అడిగాడు గాబరాగా.

         "మన చింటూ కనిపించటంలేదు. నీకు చాలా సార్లు ఫోన్ చేసాను. స్విచ్ ఆఫ్ వస్తుంది." 

     "అదేమిటి... ఉంటే ఇంట్లో ఉంటాడు. లేదా స్కూల్ కి వెళ్తాడు. అంతేకదా నిదానంగా చూడు. ఏదైనా బొమ్మ కొనలేదని ఎక్కడైనా అలిగి పడుకున్నాడేమో!?"

           "ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనబడలేదు.

స్కూల్ కి కూడా వెళ్ళలేదు. నేను టీచర్ కి ఫోన్ చేసి కనుక్కున్నా." 

          "అయితే, వీడు ఇంట్లో లేక స్కూల్ కి వెళ్ళక ఎక్కడికి వెళ్ళినట్లు? కొంపదీసి ఫ్రెండ్స్ కోసం వెళ్లి వచ్చేటప్పుడు దారి తప్పాడేమో. వాడి ఫ్రెండ్స్ కి ఫోన్ చేయి" అంటూ చెప్పాడు ఆదుర్దాగా.

         వెంటనే చింటూ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడిగింది నీలిమ. అందరూ తమ ఇంటికి రాలేదనే సమాధానం చెప్పారు. 

          "పోనీ... పోలీసు కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళు త్వరగా వెతికి పెడతారు. తెల్లారేసరికి చింటూని తీసుకుని వస్తారు" చెప్పింది నీలిమ. 

            పోలీసు కంప్లైంట్ అనగానే కిశోర్ కి చెమటలు పట్టాయి. 'పోలీసు స్టేషన్ కి వెళితే ఇంకేమైనా ఉందా! నేను కిడ్నాప్ చేసిన పిల్లవాడి తల్లిదండ్రులు ఒకవేళ తన పైన కంప్లైంట్ చేయటానికి స్టేషన్ లోనే ఉంటే... తనను గుర్తు పడితే... మొదటికే మోసం వస్తుంది' అని మనసులో అనుకుంటూ "అబ్బే వద్దు నీలిమా! ఈ పూట నేను చింటూ కోసం వెతికి వస్తాను. అప్పటికీ కనిపించకపోతే... అపుడు పోలీసులకు చెబుదాం" చెప్పాడు కిశోర్. 

            "సరే నీ ఇష్టం... నేను ఈలోగా చింటూ ఫోటో, వివరాలు వాట్సాప్ లోనూ, ఫేస్ బుక్ లోనూ షేర్ చేస్తాను."

       "అప్పుడే వద్దు. రేపటి వరకు ఆగు. ఈ విషయం తెలిసీ ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి అడుగుతారు. మనం వెతకటం ఆపేసి, వారి ఫోన్లకు జవాబు చెపుతూ కూర్చోవాలి". చెప్పాడు కిశోర్

          నీలిమకు ఆలోచించే కొద్ది గుండెల్లో దడ మొదలైంది. కిశోర్ తల పట్టుకుని కూర్చుండి పోయాడు. 

         'స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు... ఎవరైనా కిడ్నాప్ చేసారేమో? 'కిడ్నాప్' అనే పదం గుర్తుకు రాగానే మొదటిసారి వణికిపోయాడు కిశోర్. తన బిడ్డకు ఎవరైనా ఆపద తలపెట్టలేదు కదా.' అనుకుంటూ... 

           "నీలిమా! నేను అన్ని చోట్లా వెతికి వస్తాను నువ్వు తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండు." అని చెపుతూ పరుగులాంటి నడకతో బయటికి వెళ్లి పోయాడు కిశోర్.

           చింటూ గురించి ఏదైనా సమాచారం తెలుస్తుందేమోనని... టి.వి. ఆన్ చేసి సోఫాలో కూర్చుంది నీలిమ.

        టి.విలో వార్తల వస్తున్నాయి. ' ఒక ఐదేళ్ల బాలుడు కనిపించలేదని, తమ పిల్లవాడి కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారని, ఈ ఫోటో లో కనిపించే అబ్బాయి పేరు బబ్లూ అని, ఎక్కడైనా కనిపిస్తే, ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు తెలియచేయండి' అని చెపుతున్నాడు

 న్యూస్ రీడర్. 

    టి.విలో చూపిస్తున్న ఫోటో చూస్తూ 'ఎంత ముద్దుగా ఉన్నాడో... ఇలాంటి పసివాడిని ఎత్తుకెళ్ళటానికి... ఆ రాక్షసులకు చేతులెలా వచ్చాయో, పాపం ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, తినడానికి ఏమైనా పెడుతున్నారో లేదో, వాడి అమ్మ నాన్న ఎంత బాధ పడుతున్నారో కదా? ఉదయం నుంచి తన చింటూ కనబడకపోతేనే ఇంత బాధగా ఉంది. నాలుగు రోజులు నుంచి ఆ తల్లి ఎలా ఉందో? ఆ చిట్టి తండ్రిని కిరాతకులు ఎన్ని కష్టాలు పెడుతున్నారో?' అనుకుంటూ చింటూ గురించి ఆలోచిస్తూ దిగులు పడసాగింది నీలిమ.

    ఎక్కడైనా కనబడతాడేమోనని వీధులు, గుడి ముందు, పార్క్ లో, రైల్వే స్టేషన్లో, ఎక్కడైనా సొమ్మసిల్లి పడిపోయాడేమోనని ఫుట్ పాత్ ల పై వెతుకుతూ తెల్లవారేదాకా ఊరంతా పిచ్చిపట్టినవాడిలా తిరుగుతున్నాడు కిశోర్.

        సూర్యుడు వెలుగుతో ప్రపంచమంతా మేల్కొంది. కానీ, తన కంటి వెలుగైన చింటూ మాత్రం కనబడలేదు. మధ్యాహ్నం దాకా తిరిగి తిరిగి బాగా నీరసించి పోయాడు. ఆకలి కూడా వేయటంతో తాను కిడ్నాప్ చేసిన అబ్బాయికి నిన్నటి నుంచి ఆహారం కూడా ఇవ్వలేదనే సంగతి గుర్తుకు వచ్చింది. 'ఇంటి దగ్గర నీలిమ ఎలా ఉందో? అపుడపుడూ ఫోన్ చేసి మాట్లాడినా, భోజనం చేసిందో లేదో, అసలే ఉట్టి మనిషి కూడా కాదు. ముందు నీలిమని ఓదార్చి అన్నం పెట్టిన తర్వాత , తన దగ్గర బందీ అయిన పిల్లవాడి దగ్గరకు వెళ్ళాలి' అనుకుంటూ ఇంటి దారి పట్టాడు కిశోర్.

              ఇంట్లోకి అడుగు పెడుతున్న కిశోర్ కి నీలిమ మాటలు వినిపిస్తున్నాయి. 'ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుందేమో' అనుకుంటూ తలుపు తీసిన కిశోర్ ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది.  

    హాల్లో సోఫాలో నీలిమ కూర్చుని ఉంది. ఆమె ఒళ్ళో తన బంగారు తండ్రి చింటూ కూర్చుని ఉన్నాడు. ఇక కనిపించడేమో అనుకున్న కొడుకును చూసేసరికి... కిశోర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నీరసం అంతా ఎగిరిపోయి ఒక్క ఉదుటున పరుగులాంటి నడకతో చింటూ దగ్గరకు వచ్చి, వాడిని ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ "నా బంగారు కొండా! ఎక్కడికి వెళ్ళావురా? నీ కోసం ఎంతో వెతికాను. ఎన్నో చోట్ల తిరిగాను. అమ్మ కూడా అంతే నీకోసం తిండి నిద్ర మానేసి, రాత్రి, పగలు నీకోసం ఎదురు చూసింది. ఇంతకూ ఎక్కడికి వెళ్ళావు? ఎలా వచ్చావు? నిన్ను ఎవరైనా తీసికెళితే తప్పించుకుని వచ్చావా " అంటూ ఆత్రంగా అడిగాడు తాను చేసిన పనే ఎవరైనా చేసారేమోనని తడబడుతూ.

         "అవును చింటూ... టి.వి లో ఎవరో అబ్బాయిని కిడ్నాప్ చేసారనే వార్త చూసిన తర్వాత, నిన్ను కూడా అలాగే కిడ్నాప్ చేసారనుకున్నాం. నిన్నేం చేస్తారేమోనని భయపడ్డాను. ఆ దేవుని దయవల్ల క్షేమంగా వచ్చావు. ఇంకెప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను" అంటూ కొడుకును అక్కున చేర్చుకుంది నీలిమ.

          "నాన్నా! నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎక్కడికి పోలేదు. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నిన్న పొద్దున నీతో పాటే నేను వచ్చాను. ఎందుకో తెలుసా? మొన్న నీ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నపుడు, అనుకోకుండా బబ్లూ ఫోటో చూసాను. ఆ ఫోటో ఎందుకు ఉందో అర్థం కాలేదు. అంతకు ముందు రెండు రోజుల క్రితం నుంచి స్కూల్ కి బబ్లూ రాలేదని తెలిసి... వాడికి ఏమైనా బాగాలేదేమోనని అనుకున్న. నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్. టీచర్ ని అడిగితే, బబ్లూని ఎవరో కిడ్నాప్ చేసారని, వాడిని పోలీసులు వెతుకుతున్నారని చెప్పింది. వాడు లేకపోయేసరికి వాడి మీద దిగులుతో నేను స్కూలు కి వెళ్ళలేక పోయాను. నీ ఫోన్ లో వాడి ఫోటో చూసి నీ వెనకే వచ్చాను. నువు వెళ్ళేదాక పక్క రూంలో ఉండి, నువు వెళ్లిపోయాక గదిలోకి వెళ్ళగానే... అక్కడ ఏడుస్తున్న బబ్లూని చూడగానే నాకు సంతోషం వేసింది. వాడికి నన్ను చూడగానే ఆనందం వేసింది.‌ కొద్ది సేపటి తరువాత వెనక తలుపు తాళం పగుల గొట్టి వాడిని తీసుకొని రోడ్డు మీదకు వచ్చాను. చాలా సేపు ఏ ఆటో రాలేదు. సాయంత్రం మా స్కూల్ బస్ అటుగా వెళుతుంటే చూసి ఆపాను. డ్రైవర్ మమ్మల్ని చూసి, బస్ లో ఎక్కించుకుని బబ్లూ వాళ్ళింటి దగ్గర దించాడు. నైట్ అవటంతో నేను డ్రైవర్ వాళ్ళింట్లో ఉన్నాను. ఈరోజు పిల్లలను స్కూల్లో వదిలి పెట్టాక, నన్ను ఇక్కడ వదిలి పెట్టాడు. నేను కనబడకపోతేనే నువ్వు ఇంత దిగులు పడ్డావు కదా... మరి వాడి అమ్మ నాన్న కూడా అంతే కదా నాన్నా" అంటూ అసలు విషయం చెప్పాడు చింటూ.

        నీలిమ మౌనంగా వింటోంది. కిశోర్ కి పరిస్థితి అర్థం అయింది. భార్య కళ్ళలోకి చూడలేక తలదించుకున్నాడు. అతని కళ్ళ వెంట నీరు వరదలై పారింది.

      ఒక శోకం... శ్లోకమై రామాయణం నడిపితే ఒక శోకం... ఒక జీవితాన్ని మార్చేసింది.

              *******

0 comentaris