మనసు తలుపు గడియ పడితే ...  (Author: గుడిమెళ్ళ వాత్సల్య రావు)

ఉదయం తొమ్మిదింటికల్లా క్లినిక్కుకి వచ్చిన లావణ్య ఆరోజు చూడాల్సిన పేషెంట్ల వివరాలని లాప్టాపులో చూస్తోంది. యాభై రెండు, నలభై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఓ జంట దగ్గర ఆమె కళ్ళు ఆగిపోయాయి.

ఈ మధ్య తన దగ్గర కౌన్సెలింగుకి వచ్చే వాళ్ళల్లో కొత్తగా పెళ్ళైనవాళ్ళు లేదా షష్టిపూర్తి చేసుకున్న జంటలే ఎక్కువగా వస్తున్నాయి. అలాంటిది ఈరోజు నడివయసు వారిని చూసి వారు అప్లికేషనులో నింపిన వివరాలు పరిశీలించసాగింది.

ఇద్దరూ ఉన్నతోద్యోగులే. వారికి దాదాపు పాతికేళ్ళ వయసున్న ఉద్యోగస్తుడైన పిల్లాడున్నాడు. చూస్తే ఏ చీకూచింతా లేని కుటుంబంలాగే ఉంది కానీ నాలుగ్గోడల మధ్య ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉండే బయటకి కనపడని గోడలని కూల్చడమే తన వృత్తి కాబట్టి వారి వివరాలు మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించింది.

తన భార్యని ఒప్పించాకే ఈ సెషనుకి వస్తున్నామనీ, ఎంతో చలాకీగా ఉండే భార్య ఈ మధ్య మూగనోము పట్టిందనీ అలా అని ఫలానాదేదో కావాలని పట్టు కూడా కాదు కాబట్టి ఆ మౌనానికి కారణం కనుక్కోవాలని ఇక్కడకి వస్తున్నానని భర్త వ్రాసినది చదివి లావణ్యకి నవ్వొచ్చింది.

చాలామంది మగవారు తమ భార్య మనసు గాయపడ్డానికి తాము కూడా కారణం అవుతారని అనుకోరెందుకో అనుకుంటుండగా రిసెప్షనిస్టు లోపలికొచ్చింది.

"మేడం! మొదటి పేషెంట్ రాలేదు కాబట్టి రెండవ వారిని పంపనా?" అని అడగ్గానే లావణ్య సరే అంది.

రెణ్ణిమిషాల్లో లావణ్య ముందు నడివయసు దంపతులిద్దరూ కూర్చుని తమని అరుణ, సాగర్‌లుగా పరిచయం చేసుకున్నారు.

లావణ్య ఇద్దరినీ పరిశీలించి చూసింది. అరుణ ముఖంలో ఏ భావాలూ కనిపించడం లేదు కానీ సాగర్ మాత్రం చాలా టెన్షనుగా ఉన్నాడు.

"మిస్టర్ సాగర్! మీరు అప్లికేషనులో వ్రాసిన వివరాలు చదివాను. మీరు ఏమీ దాచకుండా మరిన్ని వివరాలు చెప్తే సమస్య పరిష్కారానికి అవకాశాలెక్కువ ఉంటాయి. అరుణగారు ఉంటే మీకు ఇబ్బందనుకుంటే ఇద్దరితో విడివిడిగా మాట్లాడతాను" అని లావణ్య అనగానే, "నా గురించి ఏమి చెప్పినా నేనేమీ కోపం తెచ్చుకోను మేడం" అంది అరుణ.

"తనని ఇక్కడే ఉండనీండి, నా బాధ తనకి ఎన్ని సార్లు చెప్పినా అర్థంకావట్లేదు. కనీసం మీరు చెప్తే అయినా వింటుందేమో!" ఉక్రోషంతో అన్నాడు సాగర్.

"మేడం! మా పెళ్ళయ్యి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పెళ్ళైన కొత్తలో తను ఎంతో చలాకీగా ఉండేది, ఇల్లు, ఆఫీసుని చక్కగా బ్యాలెన్స్ చేస్తుందని అందరూ అంటోంటే నాకు చాలా గర్వంగా ఉండేది. ఉద్యోగం చేస్తున్నా కూడా మా అబ్బాయికి తనే ట్యూషన్ చెప్పి మంచి కాలేజీలో సీటు వచ్చేట్టు చేసింది. వాడు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగంలో చేరేముందు తనలో మార్పు మొదలయ్యింది. మాటలే కరువయ్యాయి. ఇదివరకట్లాగే అన్నీ చేస్తోంది కానీ ఒక మాటామంతీ ఉండదు. తన లోకంలో తనుంటోంది.  ఏమన్నా కావాలా అని అడిగితే నాకేమీ వద్దంటుంది. మా అమ్మనాన్నల దగ్గరా అంతే. గలగలా మాట్లాడుతూ పనంతా చక్కబెట్టిన కోడలు ఇప్పుడు అవసరమైతే తప్ప మాట్లాడట్లేదని వాళ్ళ బాధ. అమ్మ ఇదివరకులా ఉత్సాహంగా లేదని మా అబ్బాయి బాధపడుతున్నాడు. తన ప్రవర్తన నన్ను బాధపెడుతోందని చెప్పినా మార్పు లేదు. మీరే తన మౌనానికి కారణమేంటో కనుక్కోవాలి" అంటూ ఆగిన సాగర్‌కి మంచినీళ్ళ గ్లాసు అందించి అరుణవైపు చూసిన లావణ్యకి ఆమె ముఖం ఇప్పటికీ అభావంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. "మీరేమైనా చెబుతారా?" అంటూ అరుణని అడిగింది.

ఐదునిమిషాల పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. తను అడగ్గానే వెంటనే అందరూ నోరు విప్పరని లావణ్యకి తెలుసు కాబట్టి సహనంతో కూర్చుంది. కానీ సాగర్‌లో మాత్రం నిమిషనిమిషానికీ అసహనం పెరిగిపోతోందని అతడి కాళ్ళూ చేతుల కదలికలే చెప్తున్నాయి.

"ఏమో మేడం! నాకు మాట్లాడాలని లేదంతే. ఇదివరకులా ఉండట్లేదనేది నిజమే కానీ నాకు ఇలాగే బాగుంది" ఆరోనిమిషంలో మెల్లిగా అన్న అరుణ వైపు కొరకొరా చూసాడు సాగర్.

"మిస్టర్ సాగర్! మీరు కోపం తెచ్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే నా దాకా రావక్కర్లేదు". లావణ్య కంఠంలో కదలాడిన కరకుదనంవల్ల సాగర్ కాస్త మెత్తబడ్డాడు.

"మీకు తోబుట్టువులెంతమంది? మీ తల్లిదండ్రులనీ, తోబుట్టువులనీ, మీ అబ్బాయిని కూడా ఓ సారి నా దగ్గరకి తీసుకురాగలరా?" సాగర్‌ని ప్రశ్నించింది లావణ్య.

"నాకు ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళని తీసుకురావడం కష్టం మేడం. వాళ్ళ వదినకి పిచ్చి అని తెలిస్తే అత్తారింట్లో వాళ్ళ పరువేమి కావాలి? మా తల్లిదండ్రులని, అబ్బాయిని మాత్రం తీసుకురాగలను"

"మానసిక సమస్యలన్నీ పిచ్చి కాదని గుర్తించండి. అసలు సమస్యకి మూలకారణం వెతకాలని నేను అనుకుంటోంటే మీరే సమస్యని గుర్తించి దానికి ఒక పేరు కూడా పెట్టెస్తే ఇంక మేమెందుకు?"

"మేడం... అదీ... సైకాలజిస్టు దగ్గరకి వస్తున్నామంటేనే అమ్మానాన్న, చెల్లెళ్ళు గొడవ చేసారు" మెల్లిగా నసిగాడు సాగర్.

కనీసం మీ తల్లిందండ్రులని, అబ్బాయినైనా తీసుకునిరండని చెప్పి వాళ్ళని పంపించేసి తన పనిలో పడి ఓ వారం పాటు వీళ్ళ సంగతే మర్చిపోయింది లావణ్య.

ఒకరోజు తను క్లినిక్‌లోంచి బయటకి రాబోతుండగా కారు దిగుతున్న అరుణని చూసి ఆశ్చర్యపడింది.

మేడం! మళ్ళీ ఓ వారం పాటు నేను ఆఫీసులో బిజీ. మీరు నాకు ఒక గంట సమయం ఇస్తే మీతో కొంచెం మాట్లాడాలి అని అరుణ అనగానే ఇద్దరూ ప్రక్కనే ఉన్న కాఫీషాపులోకి దారి తీసారు.

కాఫీ ఆర్డర్ చేసాకా తనంత తానే నోరు విప్పిన అరుణ తన పెళ్ళైనప్పటినుండీ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది.

మొదట్లో తను సాగర్‌తో ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పినప్పుడు ఆమె కళ్ళు మెరిసాయి. పెళ్ళైనప్పటినుండీ ఆడపడచులు, అత్తగారు అన్న మాటలు, వారి ప్రవర్తన తన మనసుని ఎలా తూట్లు పొడిచాయో చెప్పేటప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్ళల్లోంచి నీళ్ళు కారాయి. తనకి ఏ విషయంలోనూ అడ్డు చెప్పకపోయినా ఇంట్లో ఏ మాత్రం సాయం చెయ్యని, తోబుట్టువుల ప్రవర్తనకి అడ్డుకట్ట వెయ్యని సాగర్‌ని తలచుకున్నప్పుడు ఆమె గొంతు తడబడింది, తండ్రిని చూసి అలాగే ప్రవర్తిస్తున్న కొడుకు గురించి చెప్పేటప్పుడు తన చేతకానితనాన్ని నిందించుకుంది.

మొదట్లో సర్దుకుపోవడం వల్లే ఆడపడచులు, అత్తగారు వాళ్ళకి తనంటే లెక్కలేకుండా పోయిందనీ, ఆ ఇంట్లో తన మనసు తెలుసుకునేవాళ్ళెవరూ లేరని, అక్కడ తాను సంపాదించే యంత్రాన్ని మాత్రమేనని చెప్పినప్పుడు అరుణ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సాగర్‌తో చెప్పుకుంటే తనవాళ్ళ మాట కరకుగా ఉన్నా మనసు వెన్న అంటూ తననే సర్దుకుపోమనడంతో ఇక చెప్పడమే మానేసానని చెప్పింది. తమ మధ్య సానిహిత్యం తగ్గుతోందని గమనించి సాగర్‌తో మాట్లాడి పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించినా సానుకూల స్పందన రాకపోవడంతో మరో మార్గం లేక మౌనాన్ని ఆశ్రయించానని చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నిరాశ కదలాడింది. అరుణ మాట్లాడుతున్నంతసేపూ లావణ్య మధ్యలో ఆటంకం కల్పించలేదు.

గంట అని చెప్పి గంటన్నర సమయం తీసుకున్నట్టున్నాను. సారీ మేడం. మీ ఇల్లెక్కడ అని అడిగి తను అటే వెళ్తున్నానని చెప్పి లావణ్యని కారులో ఎక్కించుకున్నాకా ఇందాకా మాట్లాడినది ఈవిడేనా అనిపించేట్టు ఇతర విషయాలు మాట్లాడుతున్న అరుణ వైపు పరిశీలనగా చూసి ఒక అంచనాకి వచ్చింది లావణ్య.

మరో నాల్రోజుల తరువాత సాగర్ తన తల్లిదండ్రులతో, కొడుకు అభితో కలిసి సెషనుకి వచ్చాడు. ముందర అతడి తల్లిదండ్రులని లోపలికి పిలిచింది లావణ్య. ఏడవ దశకంలో ఉన్నా ఇద్దరిలోనూ అనారోగ్యపు ఛాయలు లేవు. వయసు వల్ల సడలిన శరీరం తప్ప శారీరకంగా ఇద్దరూ ధృడంగానే ఉన్నారు.

"నమస్కారమండీ! నా పేరు లావణ్య. మీ కుటుంబసమస్య గురించి సాగర్ చెప్పారు. మీ కోడలిలో వచ్చిన మార్పు వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఆమెలో ఈ మార్పుకి కారణమేమై ఉండచ్చని మీరు అనుకుంటున్నారు?"

"చూడమ్మా! అది పిచ్చి తప్ప మరోటి కాదు. హాయిగా పిల్లలందరూ సెటిల్ అయ్యారు, ఏ సమస్యాలు లేవనుకుంటున్న మాకు దిష్టి తగిలిందమ్మా! లేకపోతే మా కోడలికి ఇప్పుడు పిచ్చి పట్టడమేమిటి?" కోపంగా ఆన్నారు సాగర్ తండ్రి భూషణం గారు.

"అన్నీ ఎక్కువైన బాపతు కాకపోతే ఇప్పుడు అలా ముంగిలా ఎవ్వరితోనూ మాట్టాడకుండా కూర్చోవడమేమిటమ్మా? ఏమన్నా మందులవీ వాడితే ఆ పిచ్చి తగ్గుతుందంటారా?" ముందుకి వంగి రహస్యం చెప్తున్నట్లుగా అడుగుతున్న సాగర్ తల్లి గిరిజని చూసి లావణ్యకి నవ్వొచ్చింది.

"మా కోడలి ప్రవర్తన వల్ల వైరాగ్యం వచ్చేసిందమ్మా! అసలు ఈ జీవితం ఎందుకూ అనిపిస్తోంది. లేకపోతే ఈ వయసులో నా కొడుక్కి ఈ కష్టమేమిటి?". భూషణం గారి మాటలు విని లావణ్య గట్టిగా నవ్వేసరికి ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంతయ్యింది. "మా సమస్య మీకు నవ్వులాటగా ఉందా డాక్టర్?" విసురుగా అడిగారు భూషణం గారు.

"సమస్య నవ్వు తెప్పించట్లేదండీ. మీకు లేనివాటిని మీరు ఆపాదించుకుంటోంటే నవ్వొచ్చింది. ఒకసారి ఫీజు కట్టాకా వారం లోపు వస్తేనే ఫ్రీ కన్సల్టేషన్ అని రశీదు మీద స్పష్టంగా వ్రాసి ఉంది. ఈరోజు నర్సు ఫీజు కట్టమంటే మీరు రుసరుసలాడటం నేను సీసీటీవీలో చూసాను. వెయ్యి రూపాయల ఫీజుకే గింజుకుంటున్న మీకు వైరాగ్యం అంటే నవ్వురాదా చెప్పెండి?". మృదువుగా అడుగుతున్న లావణ్యకి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు సాగర్ తండ్రికి.

"మీ కోడలు గొడవ పెట్టుకునే రకం కాదనీ, మొదటినుండీ మీతో సఖ్యతగా ఉండేదనీ సాగర్ చెప్పారు. మరి అలాంటి ఆవిడ ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తోందంటే ఆమెకి పిచ్చి అని తీర్మానించేముందు మీ వల్ల ఏమైనా ఆమె మనసుకి గాయం అయ్యిందేమో ఆలోచించారా?"

"అసలు మేము ఎంత బాగా చూసుకున్నామో ఆమెనే అడగండి. మా ఆడపిల్లలకి కొన్నవన్నీ ఆమెకీ కొన్నాము. ప్రతీ పండక్కీ చీర కొంటాము. అయినా మా వల్ల ఆ అమ్మాయి మనసు గాయపడే ఆస్కారం ఉందంటారా?" విసురుగా అడిగింది గిరిజ.

"మీ అమ్మాయిలకి కొనే వంకతో కోడలికి కొన్నారే తప్ప ఆమెతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడారా? కనీసం ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అడిగారా? మీ అమ్మాయిలతో కలిపి ఆ అమ్మాయికి కొన్నవన్నీ తన సంపాదనతో కొన్నవే! ప్రతీసారీ మీకు నచ్చినవి కొనడం, ఆ అమ్మాయి మారుమాట్లాడకుండా ధరించడం, ఎపుడైనా ఫలానాది కావాలంటే లేదు ఇదే బాగుంటుందని మీకు నచ్చినదే తీసుకోవడం అబద్ధమంటారా? తన సంపాదన మీద ఆమెకి కొంచెం కూడా హక్కుండదా?"

"పెళ్ళై పాతికేళ్ళైనా వదిన మీద ఆడపడచులు పెత్తనం చెలాయించడం లేదంటారా? ఎప్పుడైనా భార్య గోడు విని తన చెల్లెళ్ళు ఇలా చెయ్యడం సరికాదని సాగర్ చెప్పబోతే మన ఇంటి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళేమి చేసినా సహించాలని మీరు కొడుక్కి బుద్ధిచెప్పలేదని అనగలరా? వాళ్ళు ఆడపిల్లలైనప్పుడు మీ ఇంటికి వచ్చినది మగపిల్లవాడా? ఈ అమ్మాయికి మనసు గాయపడదా?"

లావణ్య ప్రశ్నలకి పెద్దవారిద్దరూ మౌనం వహించారు.

"బాగుందమ్మా! అయితే అవన్నీ మనసులో పెట్టుకుని ఈ వయసులో మా మీద కక్ష తీర్చుకుంటోందన్నమాట. మేమేమి పాపం చేసామో ఇలా బాధపడుతున్నాము" అంటూ ముక్కు చీదింది గిరిజ.

"బాధపడేది మీరు కాదు, మీ కోడలు. గలగల పారే సెలయేరులా ఉన్న పిల్ల గడ్డకట్టుకుపోయి తనకు తానే శిక్ష వేసుకుని బాధపడుతోంది. మీ అబ్బాయి, మనవడు బాధపడుతున్నారు. ఆ అమ్మాయి మీకు చేసే సేవల్లో లోపం ఉంటోందా? లేదు కదా! ఇంతకుముందు మీకు చెయ్యడం తన కర్తవ్యంగా భావించి ప్రేమతో చేసింది, ఇప్పుడు తప్పదన్నట్టు యాంత్రికంగా చేస్తోందంతే! ఆ గౌరవాన్ని, ప్రేమని మీ ప్రవర్తన వల్ల మీరే పోగొట్టుకున్నారు. ఇకపై దానిని ఎలా తిరిగిపొందుతారో మీ ఇష్టం. అరుణగారికి మందుల కంటే కూడా మానసిక ప్రశాంతత ముఖ్యం. దానిని అందించే బాధ్యత మీదే!"

ఇంటర్‌కాంలో సాగర్‌ని, అభిని లోపలకి పంపించమనడంతో పెద్దవాళ్ళిద్దరూ లేచి బయటకి వెళ్ళారు. లోపలకి వచ్చిన అభిని పరిశీలనగా చూసింది లావణ్య. అసలు తన చుట్టూ జరుగుతున్న దానిపట్ల తనకి సంబంధమే లేనట్టు ఫోనులో తలదూర్చి కూర్చున్నాడు.

"హాయ్ అభీ! అమ్మ ఈ మధ్య ముభావంగా ఉండటంవల్ల మీ కుటుంబంలో సంతోషం ఉండట్లేదని నాన్న చెప్పారు. నువ్వేమంటావు?". "యెస్ డాక్టర్! అమ్మకి మెనోపాజ్ అనుకుంటా. ఠక్కున కోపం తెచ్చుకుని నా మీద అరిచేస్తుంది. ఈ మధ్య అయితే అరవడం కూడా మానేసి ఓసారి కోపంగా నా వైపు చూసి వెళ్ళిపోతోందంతే!"

"అమ్మకి ఏ విషయంలో కోపం వస్తోంది?"

"ఆదివారం తనకి హెల్ప్ చెయ్యమంటుంది. తనతో మాట్లాడుతూ కూరలు తరగమంటుంది లేకపోతే ఇల్లు సర్దమంటుంది. నాకు ఖాళీ దొరికేదే ఆరోజు. ఆరోజు కూడా పనిచెయ్యమంటే ఎలా? పైగా ఇవన్నీ నా మంచి కోసమే నేర్పిస్తున్నానని కవరింగ్ ఒకటి" తన తప్పేమీ లేనట్టు మాట్లాడుతున్న అభి వైపు ఒకసారి చూసి సాగర్ వంక దృష్టి సారించింది లావణ్య. సాగర్ తలదించుకున్నాడు.

"నీకు ఆదివారం తప్ప తీరిక దొరకదంటున్నావు, మరి అమ్మకి వారం అంతా తీరిక అనుకుంటున్నావా? అయినా అవన్నీ నీకోసమే నేర్పిస్తోందని నువ్వు నమ్మవా? మెనోపాజ్ వల్ల అలా ఉంటోంది తప్ప నీ తప్పు, నాన్న తప్పు ఏమీ లేదన్నమాట!". "మా తప్పేముంది డాక్టర్? అయినా ఇప్పటినుండే అన్నీ ఎందుకు నేర్చుకోవడం? ఇంటర్నెట్ తెరిస్తే అన్నీ ఉంటాయిగా" విసుగ్గా అన్నాడు అభి.

"అవును, నేర్చుకోవచ్చు కానీ అవసరం పడ్డప్పుడు కూడా నేర్చుకోకపోతేనే ఇంకో అభి వాళ్ళ కుటుంబం తయారవుతుంది" అంటున్న లావణ్య వంక ఆశ్చర్యంగా చూసాడు అభి. "లేని అలవాటు ఒక్కరోజులో వస్తుందని అనుకోకు అభీ! అవసరమైనప్పుడు నేర్చుకోవచ్చులే అని జిమ్ముకి వెళ్ళడం మానుతున్నావా? కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం ఆపేస్తున్నావా? అసలంటూ ఏదైనా అలవాటు ఉంటేనే దానిని అభివృద్ధి చేసుకోగలం. అయినా ఇన్నేళ్ళుగా ఇల్లు, ఉద్యోగం చక్కగా బ్యాలెన్స్ చేసిన అమ్మకి ఇప్పుడు కొంచెం సహాయం చేస్తే తన పని కూడా త్వరగా అవుతుంది. అమ్మ కూడా పెద్దదై తనకీ ఓపిక తగ్గుతుంది కదా!"

"నేను ఇది ఆలోచించలేదు డాక్టర్" మెల్లిగా అన్నాడు అభి.

"మిస్టర్ సాగర్! మీరు అరుణగారిని ట్రీట్ చేసిన విధానం చూసి అభి కూడా అలాగే చేస్తున్నాడు. తనని మనిషిగా గుర్తించకపోవడం వల్ల ఆమె మనసు తలుపుకి గడియ పడిపోయింది, మౌనమునిలా మారిపోయింది. ఆ గడియ తెరవడం మీ చేతుల్లోనే ఉంది. ఈ వయసులో మీ తల్లిదండ్రులు మారలేకపోవచ్చు కానీ మీరు, అభి మారితే అదే మీ భార్యకి కొండంత సంతోషాన్నిచ్చి మీ అమ్మ, నాన్నగారి ప్రవర్తనని చూసీ చూడనట్టు వదిలేయగలదు. మీ చెల్లెళ్ళ ప్రవర్తనకి ఒక హద్దు గీయడం మీ చేతుల్లోనే ఉంది. ఇకపై కూడా ఆవిడని నొప్పిస్తే అరుణగారు ప్రతిస్పందించడం మానేసే స్థాయికి వెళ్ళిపోతారు. ఇక మీ ఇష్టం. ముఖ్యంగా అభి మీలాగే తయారవుతున్నాడనే వాస్తవం తెలిసీ కళ్ళుమూసుకుంటే ఇంకో ఆడపిల్లకి ద్రోహం చేసినవారవుతారు. గడియపడ్డ ఆమె మనసుని మెల్లిగా తట్టి ఆ మనసు తలుపు తెరుస్తారో, ఆ గడియ ఇంకా బిగుసుకుపోయేట్టు చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఫలానాది కావాలని హఠం చేసేవాళ్ళని, దాని కోసం ముభావంగా ఉండేవాళ్ళని మన దారికి తెచ్చుకోవడం సులభమే కానీ మనసుకి తగిలిన గాయాల వల్ల అభావంగా ఉండేవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి"

"వద్దు డాక్టర్! గలగలా మాట్లాడుతూ కబుర్లు చెప్పే నా అరుణ నాకు కావాలి. మనసారా నవ్వినప్పుడు ఆ కళ్ళల్లో కనపడే కాంతి, తళుక్కుమనే ఆ పన్ను మీద పన్ను మళ్ళీ చూడాలి. అన్నీ ఈజీగా తీసుకుంటుంది అనుకున్నానే కానీ మనసులో ఇంత బాధ పెట్టుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు"

చిన్నపిల్లాడిలా కళ్ళనీరు కారుస్తున్న తండ్రిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభి.

0 comentaris

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)