గుర్తొచ్చిన అసలు విషయం  (Author: నల్లబాటి రాఘవేంద్రరావు)

''చిన్నారావు.. టాక్సీ ఇంకా స్పీడ్. బాగా స్పీడ్ గా పోనై. ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది.''

''మాక్సిమం స్పీడ్ సార్.''

''ఒరేయ్ వెంకటేశ్వరం.. నువ్వు కంగారుపడకు  మమ్మ లనందరినీ కంగారు పెట్టకు. ఓ అరగంటలో మనం కాలేజీ చేరుకుంటాం.''

''గోపాలం బాబాయ్ గారు.. నాకు పిచ్చెక్కి పోతుంది అసలు అక్కడ ఏం జరిగిందో'.''

''వెంకటేశ్వరంగారు ఆత్రుత పడకండి. టాక్సీ గమ్యం చేరేకా వివరాలు తెలుస్తాయి కదా.''

''శ్రీహరిగారు, అనంతంగారు అక్కడ ఏం జరిగినా మీరం దరూ నాకు సపోర్టుగా ఉండాలి. నేను ఆ  కాలేజీ యాజ మాన్యం అంతు తేలుస్తాను. అవసరాన్ని బట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పిల్లల జీవితాలతో ఆటలాడు కుంటారా. నా బాబ్జి నా బాబ్జి ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా ఉన్నా డో. నేను కళ్ళారా చూసేవరకు వాడితో మాట్లాడే వరకు తమాయించుకోలేకపోతున్నాను. బాబయ్యగారు నా బాబ్జికి ఏం జరిగిఉండదు కదా.''

''భగవంతుని దయవల్ల నీకే అన్యాయం జరగదురా. టెన్షన్ పడొద్దు. మీ బాబ్జి అంత పిరికివాడు కాదు. వాడే అఘాయి త్యం చేసుకోడు. తెలివైన వాడే. అందుకనే తెలివిగా లెటర్ రాసి నీకు పంపించాడు.''  అన్నాడు అతని బాబాయ్ గోపాలం.

''వద్దు ఈ మాయదారి చదువులు వద్దు. లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు జీవితాలతో జూదమాడే లాంటి ఈ చదువులు అసలు వద్దు. నా బాబ్జిని తీసుకొచ్చేస్తాను. ఆ కాలేజీకి ఒక నమస్కారం పెట్టి నా బిడ్డను ఇంటికి తీసుకొచ్చేస్తాను. కూలిపని చేసుకుంటూ గంజి తాగినా పర్వాలేదు కానీ విషసర్పాల నోటిలో తలకాయ పెట్టుకునేలాంటి ఇలాంటి చదువులు చదివి కోటీశ్వరులు కానవసరం లేదు. నాకున్న డబ్బు చాలు ప్రాణాలు ముఖ్యం.''

''వెంకటేశ్వరం నువ్వు కొడుకు ప్రాణం మీద తీపితో అలా అంటున్నావు.   పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు.   మీ బాబాయి మాట విని ఇంకొంచెం సేపు ప్రశాంతంగా ఉండు. బాబ్జికి ఏం జరగదు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలు సుకోకుండా నువ్వు ఎందుకు ఇంతలా  బెంబేలు పడిపో తున్నావు.'' అన్నాడు అతను స్నేహితుడు  శ్రీహరి.

'' బాబాయ్ దయచేసి మా చిన్నారావుతో టాక్సీ ఇంకా స్పీడ్ గా పోనివ్వమని చెప్పండి ప్లీజ్.''

''వాడు స్పీడుగానే తోలుతున్నాడురా బండి.   టాక్సీ చాలా స్పీడ్ గా పోతుంది. ఇంకా స్పీడ్ గా వెళితే ముందు మనకు యాక్సిడెంట్ అవుతుంది కళ్ళు మూసుకొని అలా వెనక్కి వాలి పడుకో.''

వెంకటేశ్వరం కాసేపు వెనక్కి వాలి పడుకుని మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా  కళ్ళు తెరచి ఆత్రుతగా జేబులో నుంచి తన కొడుకు తనకు రాసి పంపిన తెల్లకాగితంపై ఎర్రని అక్షరాలు ఉన్న లెటర్ తీసి  విషయం చదవ నారంభించాడు మరొక్కసారి.

****

''హలో మీ పేరేమిటి.''

'' బాబ్జి సార్.''

''ఏ ఊరు  మీది''

''రామకృష్ణపురం సార్.''

'' మేము చదివే కాలేజీలోనే సీటు సంపాదించినందుకు ముందుగా మీకు వెల్కం.   మీకు సీనియర్స్ మైన  మమ్మ ల్ని చూసి మీరు భయపడకండి. ఇదిగో ఈ గులాబీ పువ్వు తీసుకోండి. ఇది తప్పించి సీనియర్స్ గా మీకు మేము ఏమి ఇవ్వగలం బాబ్జిగారు.   ఇదే మనందరి స్నేహానికి అపు రూపమైన గుర్తు. టేక్ ఇట్.. తీసుకోండి పర్వాలేదు. బాబ్జి గారు డోంట్ థింక్ అదర్ వైస్. సార్ సార్.. అని మీరు మమ్మల్ని పిలవనక్కర్లేదు.   నా పేరు ధర్మకుమార్. నేను వీళ్ళందరికీ బాసులాంటోడిని. ఈ వైట్ హెయిర్ గాడు రాజు, ఆ గడ్డంగాడు వెంకట్, ఈ పొడుగు కాళ్ళోడు మణి కంఠ, ఆ దొండపండు ముక్కుగాడు శ్రీను, ఈ డిప్పకటింగ్ గాడు చలపతి. నేనెంత యాక్ట్ చేసి చెబుతున్నా కనీసం మీరు నవ్వరేమిటి బాబ్జిగారు. ర్యాగింగ్ చేయడం అన్ని కాలేజీల్లో ఉంటుందండి బాబు. కానీ ఇక్కడ మీకు ఆ  బాధ ఉండదు.   ప్లీజ్ ఒక్కసారి మా రూమ్ చూద్దురుగాని రండి బాబ్జిగారు. ధర్మకుమార్ అభ్య ర్థనతో అనుమానిస్తూనే వాళ్ళవెంట నడిచాడు బాబ్జి.

బాబ్జి ని తమ హాస్టల్ రూమ్ కి తీసుకెళ్లిన వెంటనే ధర్మ కుమార్  కూడా ఉన్న అల్లరిమూక వెంటనే తలుపులు వేసేసారు.

''బాబ్జి ఇప్పుడు మొదలవుతుందిరా నీ ర్యాగింగ్. మాకు సహకరించావనుకో సింపుల్  అలా సహకరించలేదు అనుకో.. ఏ లెవెల్ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు.'' అంటూ ధర్మకుమార్ ప్లేటు మార్చినట్లు మాట్లాడేసరికి భయపడిపోయాడు బాబ్జి.

''నన్నేం చేయకండి ప్లీజ్ మీకందరికీ వెయ్యి నమస్కా  రాలు.'' అంటూ  బ్రతిమలాడాడు.

వాళ్ళందరూ పిచ్చిగా నవ్వారు. మాటిమాటికి మమ్మల్ని అందరినీ.. సార్ సార్.. అని పిలవాలిరా పిచ్చివెధవ.

స్టార్ట్ చేయమంటావా ఇదిగో మా  అందరి బట్టలు ఈ 

టబ్ లో ఉన్నాయి. అదిగో సర్ఫ్ ప్యాకెట్ శుభ్రంగా ఉతికి ఆరబెట్టు నాయనా.''  అంటూ ఆర్డర్ వేశారు.

ఇక తప్పదన్నట్టు  వాళ్లు చెప్పిన పని ఏడుస్తూనే పూర్తి చేశాడు బాబ్జి.

''గుడ్ వెరీ గుడ్.. నీ దగ్గర క్యాష్ ఎంత ఉందిరా బాబ్జి.''

అంటూ జేబులన్నీ బలవంతంగా వెతికి  2000  పైకి  తీసి..'' చాలురా మన చలపతిగాడు హాస్టల్  పీజ్ సరిపోతుంది'' అంటూ  తమ జేబులో పెట్టుకున్నారు.

భయంతో బాబ్జి నిస్సహాయుడిగా ఉండిపోయాడు.   భయంకరగృహం లాంటి ఆ బందిఖానా నుండి త్వరగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు కానీ కుదరటం లేదు.

''ఒరేయ్  బజ్జీ.. నీ బట్టలు  అన్ని తీసేయరా.'' శాసించాడు ఆ అల్లరి మూకలో ఒకడు.

బాబ్జి అలా వినకపోవడంతో  బండతిట్లు తిడుతూ తమ బెల్టులు తీశారు. వాళ్లలో ఒకడు బాబ్జిని బలంగా కొట్టాడు. బాబ్జి ఎక్కిఎక్కి ఏడ్చాడు. వాళ్ళందరూ బకెట్లుతో నీళ్లు బాబ్జి ముఖం మీద ఊపిరాడకుండా  పోశారు.

బాబ్జి గట్టిగా పొలికాకలు పెట్టి ఏడుస్తూ తప్పదన్నట్లు వాళ్లు చెప్పినట్లు చేశాడు. దాంతో వాళ్లంతా  ఈలలు, చప్పట్లుతో బాబ్జి చుట్టూ తిరుగుతూ గంతులు వేశారు.

''ఏది రెండు సినిమాపాటలు పాడుతూ డాన్స్ కట్టమ్మ.''

బాబ్జి వాళ్లు చెప్పినట్లే చేశాడు. బాబ్జి కళ్ల వెంట కన్నీళ్ళతో పాటు ఎర్రని  జీర దిగుతున్నట్లు ఆ అల్లరి మూక గ్రహిం చుకోలేకపోతుంది.

''నువ్వు  మా అందరి చెప్పులు మొత్తం అన్ని ఈ తాటితో కట్టు. ఆ  దండను నీ మెడలో వేసుకో.'' అంటూ  ఆజ్ఞాపించి అందరూ చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.

బాబ్జి తటపటాయించేసరికి ధర్మకుమార్ కత్తి చూపి బెదిరించాడు.

బాబ్జి భరించలేక వాళ్ళు చెప్పినట్లు చేశాడు. వాళ్ళంద రూ ఆనందించి బాబ్జికి బట్టలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నారు.''

*****

'నాన్న.. ఇది జరిగింది.' ర్యాగింగ్ విషయం  వివరంగా నీతో ఫోన్లో చెప్పలేక నీకు జరిగిందంతా  ఇలా తెల్ల కాగితం మీద ఎర్రని అక్షరాలతో రాసి  నాకు తెలిసిన వాళ్ళుచేత రహ స్యంగా పంపించాను. నీకు ఈ లెటర్ అంది నువ్వు వచ్చే సరికి నా నిర్ణయం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. మానసికబాధ భరించలేక నేనేం చేసుకున్నా నన్ను క్షమించు. అమ్మకునమస్కారం........ నీ కొడుకు బాబ్జి.

అలా తెల్ల కాగితంపై ఎర్రని అక్షరాలు ఉన్న లెటర్ పూర్తిగా చదివాక..

''బాబ్జి ఒరేయ్ బాబ్.. నా చిట్టి  కన్నా. బాబ్జి బుజ్జి బాబ్జి.''  అని అంటూ  కారులో కూర్చున్న వెంకటేశ్వరం చాలా కంగారు పడి దడదడలాడుతూ టాక్సీ ఆపమని కేకలు పెట్టాడు... కంగారుగా టాక్సీ దిగి రోడ్డంతా తిరిగి తిరిగి ఏదో వెతుకుతున్నాడు. కూడా వచ్చిన ఎవరికీ  విషయం అర్థంకాక అతని వెంటపడ్డారు. చివరికి వెంకటేశ్వరం తుప్పల్లో దూరి తన చేతుల్లోంచి జారీ గాలిలో ఎగిరిపోయి తుప్పల్లో పడిన  బాబ్జి రాసిన లెటర్ తీసి మడత పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు.

''నా కొడుకు.. నా కొడుకు.'' అంటూ గుండెలు బాదుకుని ఏడ్చాడు. అందరూ అతడిని ఓదార్చి మళ్ళి టాక్సీ లో కూర్చోబెట్టారు నెమ్మదిగా. టాక్సీ స్పీడ్ అందుకుని కొద్ది సేపటికి కాలేజీ ఆవరణలోకి దూసుకుపోయి  ప్రిన్సి పాల్ రూమ్ ముందు ఆగింది.

కోపంతో వస్తున్న వాళ్ళందరిని చూసి ప్రిన్సిపాల్ ముందు కంగారు పడ్డాడు. కారులోంచి దిగిన వాళ్లు అందరూ బాబ్జి రాసిన లెటర్ ప్రిన్సిపాల్ కి చూపించగా ప్రిన్సిపాల్.. కంగారు పడొద్దు. అని వాళ్ళందరిని వారించాడు. మొత్తం విషయం నిన్ననే తన దృష్టికి వచ్చిందని.. ఈ మధ్య తమ కాలేజీలో అసలు ర్యాగింగ్ జరగటంలేదని.. ధర్మకుమార్ తండ్రికి ఈరోజు ఫోన్ చేశామని ఆయన వస్తే తండ్రి ఎదురుగా కొడుకుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పరిస్థితి పునరావృత్తమైతే ఆ ధర్మకుమార్ పై పోలీస్ కేసు పెట్టి కాలేజీ నుంచి పంపించివేస్తామని..' చెప్పి బాబ్జిని పిలిపించి వాళ్ళందరితో మాట్లాడించడం  తో వాళ్ళందరూ కొంచెం కూల్ అయ్యారు.

''పిల్లల్ని కాలేజీకి పంపేటప్పుడు వెనుకనున్న పెద్దవాళ్లు 'జాగ్రత్తగా చదువుకొని  బుద్ధిగా ఉండకండి రా. అల్లరి చేయకండిరా..' అని పదిసార్లు చెప్పి మరీ పంపించాలి. పెద్దవాళ్ళకి బుద్ధిలేనప్పుడు పిల్లలు ఇలాంటి గడ్డి తినే పనే చేస్తారు. పిల్లలకు జ్ఞానబోధ చేయకుండా ఇలా అడ్డగాడి దల్లా కాలేజీకి తోసేసిన ఆ తల్లిదండ్రులు సమాజానికి చీడపురుగులు. తమ కొడుకులు కాలేజీ సీనియర్స్ అయి తే గత అను భవాల దృష్ట్యా..'జూనియర్స్ ని ర్యాగింగ్ చేయకండి.. ఈటీచింగ్ అసలే వద్దు.' అని చెప్పి పంపిం చాలి. అలా చెప్పని తల్లిదండ్రులు పశువుల కన్నా  హీనా తిహీనం. ఆ ధర్మకుమార్ తల్లిదండ్రులు కనిపిస్తే ముఖం మీద  ఉమ్మివేయాలని ఉంది.'' అన్నాడు వెంకటేశ్వరం ఊగిపోతూ. వచ్చిన వాళ్ళందరూ  అతడిని వారించారు.

ప్రిన్సిపల్ సవినయంగా చేతులు జోడించి చెప్పడంతో వచ్చిన వాళ్ళు పూర్తిగా ప్రశాంతపడి బాబ్జికి రకరకాలు గా ధైర్యం చెప్పి ప్రిన్సిపాల్ దగ్గర సెలవు తీసుకున్నారు. ఆనం దంతో  తిరిగి టాక్సీ మీద వస్తున్న వాళ్లంతా కొంత దూరం వచ్చేసరికి ఆకాశం  మేఘాలు  పట్టి పెద్దగా గాలి వచ్చి అక్కడ ఉన్న చెట్లన్ని ఊగిపోవడంతో  టాక్సీ పెద్ద గానుగ చెట్టు కింద ఆపేసాడు డ్రైవర్.   అంతకుముందే అక్కడ మరో ముదురు నీలిరంగు టాక్సీ ఆగి ఉంది. దాని కింద  దూరి ఎవరో రిపేర్ చేసుకుంటున్నారు. ఆ గానుగ చెట్టు చాలా విస్తీర్ణం ఆవరించి ఉంది దూరంగా అక్కడ సిమెంట్ బల్ల కూడా కట్టించారు ఎవరో.

ఆ టాక్స్ రిపేరు చేసుకుంటున్నతను నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.   మెడలో రెండు బంగారపు చైన్లు పులిగోర్లతో. అన్ని వేళ్లకు నవరత్నాల ఉంగరాలు, ఖరీదైన డ్రెస్, ఒక చేతికి బంగార పు పూర్తి గా వజ్రాలు పొదిగిన వాచిచైను, మరో చేతికి లేటెస్ట్ మోడల్ ముత్యాలు పగడాల  చేతి కడియపు బంగారు ఆభరణం.

''సార్ ఏమైంది సార్ బండికి.''  కొంచెం దూరంగా ఆగి పోయిన బండి దగ్గరకు వచ్చి అడిగాడు  వెంకటేశ్వరం.

''చిన్న రిపేర్ సార్ క్లియర్ కాలేదు. ఇది కొత్త బండి కదా అని నేను మెకానిక్ కిట్టు కూడా తీసుకురాలేదు. మీ దగ్గర ఉంటే ఒకసారి ఇస్తారా.''  అడిగాడు ఆ ధనవంతుడు.

''సరే కానీ ఆ క్రిందకు దూరి మీరు ఏం చేస్తారు సార్. మా డ్రైవర్ కం టాక్సీ ఓనర్ ఈ చిన్నారావు మంచి మెకానిక్ ఒక్క నిమిషంలో రిపేరు చేసేస్తాడు.'' అంటూ చిన్నారావుకి బండి రిపేరు అప్పచెప్పి ఆ గొప్ప ఆయనతో  కొంచెం దూరం వెళ్లి సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు వెంకటేశ్వ రం. మిగిలిన వాళ్ళు అంతా ఇంకాస్త దూరంగా ఏదో మాటల్లో పడిపోయారు.

''మాకు ఇంకా పది ట్యాక్సీలు ఉన్నాయి. అయినా కొత్త బండి కదాని ఏ ప్రాబ్లం ఉండదని దీన్ని తీసుకొచ్చాను.''

''అంతే సార్ ఒక్కొక్కసారి సమస్య నుండి మనం తప్పిం చుకోలేము.   సరే మీది ఏ ఊరు సార్.''

''మాది కమలాపురం. 'ఫైనాన్స్' బిజినెస్ నాది.

''సార్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ డ్రైవర్ లేకుండా..''

''నా పనులు నేనే చేసుకోవడం నాకు అలవాటు. మీరు

 కూడా మంచి మనసుతో  నాకు హెల్ప్ చేస్తూన్నారు కదా. నాకు చాలా ఆనందంగా ఉంది. మా కమలాపురం మీరు ఎప్పుడైనా వస్తే మా ఇంటికి తప్పకరండి. ధర్మారావు.. అని అడిగితే ఎవరైనా చెబుతారు ఇదిగో విజిటింగ్  కార్డు.''

''మీ పేరు ధర్మారావా.. అరే ఈ పేరు ఎక్కడో ఇప్పుడే  విన్నట్టుంది. ఆ.. అవును ఎమ్మెల్యే సుందరకేశవ్ గారు కాలేజీలో ప్రిన్సిపాల్  గారు.. ధర్మకుమార్ అనే ఒక పేరు చెప్పారు. ఇప్పుడే విన్నాను అలాగే ఉంది సార్ మీ పేరు.''

''ధర్మకుమార్ మా అబ్బాయి అదే కాలేజీలో చదువుతున్నాడు. మీ అబ్బాయి కూడా అక్కడే చదువుతున్నాడా. మీరు అక్కడి నుంచే వస్తున్నారా. నేను అక్క డికే వెళ్తు న్నాను. ఆ ప్రిన్సిపాల్ గారు నన్ను అర్జెంట్గా రమ్మని మధ్యాహ్నం ఫోన్  చేశారు. మా అబ్బాయి  సీనియర్ బ్యాచ్. మీవాడు.''

''మావాడు జూనియర్ బ్యాచ్లండి.'' వెంకటేశ్వరం కసిగా సిమెంట్  బల్ల మీద నుండి పైకి లేచి బండి రిపేర్ చేసి  అప్పుడే బయటికి వచ్చిన డ్రైవర్ చిన్నరావుని కొంచెం దూరం తీసుకెళ్లాడు.

''ఆయన బండి కండిషన్ లోకి వచ్చింది సార్.'' అన్నాడు చిన్నారావు.''

''రాకూడదు.''

''అదేమిటి సార్.''

''అదంతే. నువ్వు ప్రశ్న అడగద్దు. ఈ ₹1000 జేబులో పెట్టు. అతను మన శత్రువు. నువ్వు  నేను చెప్పినట్టు చెయ్.'' అంటూ చెవిలో ఏదో చెప్పాడు వెంకటేశ్వరం.  

''సార్.. మీరు.. తప్పుకదా సార్. అన్ని తెలిసుండి  తప్పుడు పని  చేయమని చెబుతున్నారేమిటి. సార్ నేను బ్రేక్స్  ఫెయిల్ చేస్తే ఆయన కొంచెం దూరం వెళ్లి స్పీడు లో బ్రేక్ వేద్దామంటే పడదు. యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు సార్.   పాపం మంచిమనిషి లాగా కని పిస్తున్నాడు.''

''అదంతా నీకనవసరం. ఇదిగో మరో 2 వేల రూపాయలు. నీ జేబులో పెట్టుకో.''

అంతే.. చిన్నారావు ఇంకా కొంచెం రిపేర్ ఉంది అని బండి కిందకు మళ్లీ వెళ్లి బ్రేక్స్ ఫెయిల్ చేసి బయటకు వచ్చి.. 'బండి రెడీ సార్'.. అని ఆ పెద్దాయనతో  చెప్పేశాడు.

ఆయన ఓ 500 రూపాయలు చిన్నారావుకు ఇవ్వబోగా చిన్నారావు తీసుకోలేదు.   ధర్మారావు అందరికీ టాటా చెప్పి టాక్సీ మీద స్పీడుగా వెళ్ళిపోయాడు.

****

సంవత్సరం గడిచింది. బాబ్జి మొదటి సంవత్సరం పూర్తి చేయటం ఇంటికి వచ్చి సెలవులు గడపటం మళ్లీ రెండవ సంవత్సరం చదువుకు వెళ్లడానికి  వారం ముందు నుండి అన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు తల్లిదండ్రుల తో సహా రైల్వే స్టేషన్ కి వచ్చి రైలు ఎక్కి కూర్చున్నాడు.

''ఒరేయ్ బాబ్జి మొత్తం ఎన్ని బ్యాగులు ఉన్నాయో చూసుకున్నావా.''

''ఆ.. మీరేమిటి.. ఆరు బ్యాగులు ఉన్నాయండి. వాడేం చిన్న పిల్లవాడు కాదు కదా. మీరు వాడిన విసిగించకండి రైలు కదులుతుంది. ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. తర్వాత గుర్తుకు వచ్చిందని పరిగెడతారు.''

''నిజమే రత్నవేణి..   నేను వాడికి  ఇలా వెళ్లే ముందు  ఏదో విషయం చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను రెండు రోజుల క్రితం. కానీ అదిప్పుడు గుర్తురావటం లేదు. అరే బాబ్జి..   విండో దగ్గర కూర్చున్నావు చేతులు బయ టపెట్టకు. ట్రైన్ స్పీడ్ గా వెళుతున్నప్పుడు డోర్ దగ్గరకు వచ్చి రాడ్ పట్టు కుని నిలబడకు.''

''మీ నాన్నగారు 15 రోజుల్లో వస్తారులే. ఇప్పుడు అర్జెంటు పనులు ఉన్నాయట.''

''ఒరే బాబు ఏదో చెప్పాలనుకుంటున్నాను రా కానీ గుర్తుకు రావటం లేదా విషయం.''

''అంత గుర్తుకు రాని విషయం చెప్పకపోయినా పర్వా లేదు  లెండి.''అన్నది అతని భార్య.

''బాబు కాష్  ఉన్న పర్సు సూట్ కేసులో బట్టలు ఆడుగున పెట్టావు కదా.. జాగ్రత్త. స్వీట్లు, హాట్లు చీమలు పట్టకుండా హాస్టల్ కి వెళ్ళిన వెంటనే స్టీల్ బాక్స్ లో దాచుకో.   రైన్ డ్రెస్ వేసుకున్నావు కదా.. ఎందుకన్నా మంచిది. వచ్చేది చలి కాలం మఫ్లర్. చలికోటు, జండు బాము, బ్రష్ పేస్టు, బూట్ పాలిష్, నైట్ డ్రెస్.''

''అబ్బబ్బ ఇంటి దగ్గర మూడు రోజుల నుండి చదువు తున్న దండకమే కదా వాడికి చిరాకు వస్తుంది..''

''రత్నవేణి.. మరిచిపోయిన 'ఆ విషయం' అసలు గుర్తుకు రావటం లేదు ఏమిటో.   బాబ్జి.. బలానికి టానిక్కు, టాబ్లెట్స్ ఎక్కడ  పెట్టుకున్నావు.''

''నల్ల బ్యాగులో ఉన్నాయి నాన్న. నా గురించి నువ్వు అమ్మ కంగారు పడకండి..''

''ఏదో చెప్పాలనుకున్నది గుర్తురావటం లేదురా.   వ్యాప కాలు ఎక్కువైపోయాయికదా పేపర్ మీద పెన్ తో రాసి జేబులో పెట్టుకోవాల్సింది నేను. సరే బాబ్జి నేను 15 రోజులు పోయాక వస్తాను. వచ్చినప్పుడు విషయం గుర్తుకు వస్తే అక్కడ చెప్తాలే.''

''అలాగే అమ్మా, నాన్న.. బండితో పాటు మీరు స్పీడ్ గా నడకండి. బండి స్పీడ్ అందుకుంది. మీరు ఆగిపోండి.''

****

వారం గడిచింది

ఆరోజు ఉదయం ఏదో గుర్తొచ్చిన  వాడిలా గబగబా పైకి లేచి కూర్చున్నాడు మంచం మీద వెంకటేశ్వరం.

''రత్నవేణి మన చిన్నారావు టాక్సీమీద అర్జెంటుగా మన అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను రాత్రికి వచ్చేస్తాను'''

'' ఏదో 'ముఖ్య విషయం' చెప్పాలి.. అన్నారు అది గుర్తు వచ్చిందా. ఇప్పుడే వెళ్ళాలా అసలు ఏమిటది.''

''నీకు చెప్పేది కాదులే. వెళ్లక తప్పదు.'' అంటూ భార్య ఏం చెబుతున్నా వినకుండా ముఖం కడుక్కొని పక్క ఇంటిలోనే ఉంటున్న చిన్నారావుని పిలిచాడు..''

''సార్ మీ అబ్బాయి వెళ్లి వారమే కదా అయింది హాస్టల్ కి ఫోన్ చేయండి లేదా లెటర్ వేయండి.'' అన్నాడు  చిన్నా రావు.

''ఇది లెటర్ వేసి తీరిగ్గా చెప్పే విషయం కాదు చిన్నారావు. ఫోన్ చేస్తున్నాను కానీ  లైన్లు సరిగ్గా కలవడం లేదు. వాడి తో.. నేనే నేరుగా చెప్పాలి. మా అబ్బాయి వారం క్రితం ట్రైన్ ఎక్కేట ప్పుడు ఈ విషయం ఎంత చెబుదామని గుర్తుకు తెచ్చు కున్న గుర్తుకు రాలేదు. ఇదిగో.. నేనుఒక్కడినే కదా కిరాయి వేస్ట్ అని బాధపడుతున్నావేమో. ఇదిగో రాను పోను తీసుకో. నువ్వు వస్తావా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోమం టావా.''

వెంకటేశ్వరం కంగారుతో  టాక్సీ సిద్ధం చేసి వెంకటేశ్వరంనీ ఎక్కించుకున్నాడు డ్రైవర్.   టాక్సీ చాలా స్పీడ్ గా ముందు కు దూసుకుపోతుంది కాలేజీ వైపు. చాలా దూరం వెళ్లాక..'' టాబ్లెట్ వేసుకోవడం  గురించి  ఒక చిన్న బడ్డీకొట్టు దగ్గర దిగి కంగారుగా టీ తాగి వెంటనే మళ్ళీ ట్యాక్సీ  ఎక్కేశాడు చిన్నారావు.

''మీ అబ్బాయి చదివే కాలేజీలో ఏదో గలాటా జరిగింది ప్రజలు చాలామంది కాలేజీ ముందు గుమ్ముకూడారట. పోలీసులు రంగప్రవేశం చేశారట. వివరాలు కాసేపట్లో తెలుస్తాయని టీవీ న్యూస్ స్క్రోలింగ్ చూసాను సారు  ఆ బడ్డీ కొట్టు దగ్గర.'' అంటూ కంగారుగా చెప్పాడు  చిన్నా రావు. వెంకటేశ్వరానికి ఎందుకో దడ  ప్రారంభమైంది. టాక్సీ బాగా స్పీడు పెట్టు చిన్నరావు. కాలేజీ గేటు దగ్గర ఆపాలి. నాకేమిటో రకరకాల ఆలోచనలు. భయంగా ఉంది..'' ఆత్రుతగా చెప్పాడు వెంకటేశ్వరం.

వేగంగా వెళుతున్న ట్యాక్స్ ని చూసి భయపడి పక్కకు తప్పుకుంటున్నారు జనం. చాలా దూరం వెళ్ళాక సడన్ గా పెట్రోల్ బంకు దగ్గర ఆపేసాడు చిన్నారావు టాక్సీని.

''రాత్రి పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాను సార్. ఇప్పుడు కొట్టించకపోతే మన బండి ముందుకు వెళ్ళదు.''

గబగబా బంకు దగ్గర పెట్రోల్  పోయించుకున్నాడు.

''అక్కడ అందరూ విచిత్రంగా చెప్పుకుంటున్నారు సార్. ఆ కాలేజీలో అంటే మీ అబ్బాయి  చదివే కాలేజీలో ఎవరో అమ్మాయి ఆత్మహత్య  చేసుకుందట. ఇది మనకు సంబం ధించింది కాదు కనుక మనం కంగారు పడవలసింది ఏమీ లేదు.. టెన్షన్ పడకండి.'' అంటూ చిన్నారావు టాక్సీని కొంచెం  స్పీడుగా పోనిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ట్యాక్సీని ఆపేశాడు చిన్నారావు.

''అదిగో సార్.. గానుగచెట్టు, సిమెంట్ బల్ల.. ఇవి చూస్తుం టే  నేనెవరికో ద్రోహం చేసిన ఫీలింగ్ కలుగుతుంది సార్. ఆరోజు ఆ గొప్పింటాయనని మనం ర్యాగింగ్ చేసినట్టు అయింది కదా సార్. పెద్దవాళ్లమై ఉండి తప్పుడు పని చేశాం. అతను బ్రతికున్నాడో చచ్చిపోయాడో.. పాపం.''

''అది పాపం కాదు.   మా అబ్బాయిని ర్యాగింగ్ చేసిన వాడి తండ్రిని నేను ర్యాగింగ్ చేసి నా కసి తీర్చుకున్నాను. దాని పాపం ఏదైనా ఉంటే నేను అనుభవిస్తాను నువ్వు టాక్సీ స్పీడుగా పోనియ్యి.. నీకు అందులో సంబంధం లేదు.''

మళ్లీ చాలా వేగం అందుకొని దూసుకుపోతుంది టాక్సీ. కొద్దిసేపట్లో కాలేజీ సమీపించింది. బయట జనం తండో పతండాలుగా నిలబడి ఉన్నారు. ఎవరూ లోపలకు ప్రవే శించకుండా అల్లరి జనం ప్రవేశించకుండా  గేటు మూసే శారు. లోపల పేరెంట్స్, ప్రిన్సిపాల్, స్టూడెంట్స్.. చాలా హడావిడిగా ఉంది వాతావరణం. వెంకటేశ్వరం గేటు తలుపు తీసుకుని లోపలికి వెళ్లాలని ప్రయత్ని స్తుండగా అంతకుముందే వచ్చిన  ముదురు నీలిరంగు టాక్సీ బయటకు వస్తూ వెంకటేశ్వరం ని  చూసి ఆగింది.

తనను చూసి అందులోంచి ఒక వ్యక్తి దిగడం గ్రహించాడు వెంకటేశ్వరం.''నమస్తే నన్ను గుర్తుపట్టారా. వారం క్రితమే..

గానుగ చెట్టు, సిమెంట్ వల్ల, రిపేరు.. ఆ ధర్మారావు నేనే.''

ధర్మారావు పలకరించినప్పటికి సమాధానం చెప్పలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు వెంకటేశ్వరం.

''ముఖం పక్కకు తిప్పుకోకండి సార్. ఇప్పుడు మీకు జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను.''

''ధర్మరావు గారు నా గురించి మీరు బాధ పడటం.. అసలు ఏ విషయం గురించి. సార్.. ధర్మారావు గారు అసలు మీరే మంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నా మీద జాలి చూపిస్తున్నారు. నేను ఇప్పుడే వచ్చాను. లోపల ఏమైంద సలు  మా అబ్బాయి బాబ్జి కి ఈ గొడవలకు ఏమైనా సంబంధం ఉందా.''ఆత్రుతగా అడిగాడు వెంకటేశ్వరం   ధర్మారావు వైపు చూస్తూ.

''అయ్యో అన్ని తెలిసుండి వచ్చారనుకున్నాను. అసలు విషయం మీకు తెలియదా. కళ్యాణి అనే అమ్మాయిని  నిన్న మీ అబ్బాయి బాబ్జి ఇవ్టీజింగ్ చేయడం ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే వార్నింగ్  ఇవ్వటం మళ్లీ అతను ఇవ్టీజింగ్ మానకపోవటం..   డి. ఎస్. పి, ఎస్పీల ద్వారా..

ఇవ్టీజింగ్ నేరం అని కౌన్సిలింగ్ నిర్వహించడం కూడా జరిగిందట. దాంతో మీ అబ్బాయి రెచ్చిపోయి ఆ అమ్మా యిని వందలాది స్టూడెంట్స్ ముందు.. ఛి ఛి.. అదండీ జరిగింది.   ఇదంతా నిన్న ఒక్కరోజులోనే మీకు కబురు అంది ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి అవమానం భరించ లేక ఈరోజు ఉదయమే హాస్టల్ రూమ్ లో తన చావుకి మీ అబ్బాయి బాబ్జి కారణం అని లెటర్ రాసిపెట్టి ఉరివేసుకుని చచ్చిపోయిందటండి పాపం. అదిగో అదిగో మీ అబ్బాయికి సంకెళ్లు వేసి జీపుమీద నిలబెట్టి పోలీసులు తీసుకెళ్లిపోతు న్నారు. చూడండి.''  చూపిస్తూ చెప్పాడు ధర్మారావు. వాచ్మెన్ కాలేజీ గేటు పూర్తిగా తెరిచాడు పోలీస్ జీప్ బయ టికి వెళ్లడానికి.

బయట జనం చేతిలో చెప్పులు రాళ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు బాబ్జి మీద విసరడానికి. గేటు నుండి బయటకు వస్తుంది పోలీస్ జీప్ తనను దాటుకుంటూ....

''ఒరేయ్.. ఒరేయ్ బాబ్జి..'' ప్రపంచమంతా వినబడే టంత గట్టిగా అరిచాడు వెంకటేశ్వరం. ఏడుపులాంటి  అతని అరుపు వినపడి పోలీసులతో వెళుతున్న బాబ్జి తండ్రి వైపు చూసి వెంటనే  చేతులు ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు.

విలేకరులు రకరకాల యాంగిల్స్ లో బాబ్జి ని  కెమెరాలలో బంధించడానికి పోటీపడుతున్నారు. జనం కసిగా బాబ్జి మీద రాళ్లు విసురుతూ బండగా తిడుతున్నారు. అతన్ని కన్నతల్లిదండ్రులను కూడా నానా దుర్భాష లాడుతున్నా రు.

''తప్పుచేశానురా బాబ్జి..'' అంటూ వెంకటేశ్వరం స్పృహ కోల్పోతున్నవాడులా నేల మీద పడబోగా ధర్మారావు,

చిన్నారావు పట్టుకున్నారు.

''ఒక ప్రాణం బలిగొన్నావు.. నీ జీవితం సర్వనాశనం చేసు కున్నావు. అయినా తప్పు నీది కాదు. నాది. పూర్తిగా తప్పు నాదే..

'సీనియర్ అయ్యావు రా.. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయ కురా.. ఇవ్టీజింగ్ చెయ్యకురా అని ఆరోజు రైలు ప్లాట్ ఫామ్ మీద చెప్పాలనుకున్న అసలు విషయం గుర్తుకు రాక పనికి రాని  విషయాలన్ని చెప్పి నిన్ను కాలేజీకి పంపించాను. చాలా ఆలస్యంగా అసలు విషయం ఇప్పుడు చెప్ప డానికి కాలేజీకి పరిగెట్టుకు వచ్చిన మూర్ఖపు తండ్రినిరా నేను.

''తప్పు నాదే బాబ్జి.. తప్పు నాదే.''

''ఆలస్యం అయింది.. కొంచెం ఆలస్యం అయింది నేను రావడం... చెప్పడం.. కొంచెం ఆలస్యం అయింది...''

మూలుగుతూ పూర్తిగా స్పృహ కోల్పోయి ఒక పక్కకు ఒరిగిపోయాడు  వెంకటేశ్వరం.

0 comentaris