గడప తల్లి  (Author: దొండపాటి నాగజ్యోతిశేఖర్)

ఎన్నోసార్లు మనస్సుని ఆవలికి విసిరేసి

తనని దాటిపోవాలని 

అలసిన కళ్ళు

కాళ్లకు ఆఙ్ఞాపించినప్పుడల్లా....

 

పరిగెత్తే కన్నీటి పాదాలకు అమ్మై అడ్డం పడి 

కాస్త ఆలోచించమని వేడుకోంటూ

ఇంటి గుట్టుని తలుపుల వెనుకే దాచేస్తుంది!

నాన్నై లోలోపలి జీవితానికీ...

 

లోతైన లోకానికి మధ్య బేధాన్ని వివరిస్తుంది!

గీత దాటిన దహన క్షణాల గూర్చి గీతోపదేశం చేస్తూ...

భద్రత చేతుల్ని చాచి

బతుకుని హత్తుకొంటుంది!

 

మూసుకున్న మూడు గోడలకు

తెరుచుకున్న ఒకే హృదయమై

లోలోపలి సంతోషాలకు ...

మూలనున్న విషాదాలకూ

సరిహద్దు సైనికుడై పహారా కాస్తుంది!

 

పండుగొస్తే తనే ఇంటి మొదటి ముత్తదువై 

పూల దారాల వెంట నవ్వుల్ని 

ద్వారాలకు పూస్తుంది!

పసుపు పచ్చని చీర కట్టుకొని ఆడపడుచయి

సంబరాన్ని ఇంట్లోకి స్వాగతిస్తుంది!

 

ఊపిరాడని పని గదుల మధ్య నలిగే అమ్మను పిలిచి

నడి మధ్యాహ్నంలో నిద్ర ఒడిలో పెట్టుకు లాలిస్తుంది!

అమ్మ కు పుట్టింటి స్పర్శను 

గుర్తుకు తెచ్చే తలగడవుతుంది!

 

అలిగి వెళ్లిపోయిన బంధాలు తిరిగి తన

గుండె లోపల అడుగిడాలని ఆరాట పడుతుంది!

మిగిలిపోయిన జ్ఞాపకాలను పదే పదే జ్ఞప్తికి తెస్తూ

తెగిపోయిన స్మృతుల్ని అతకాలని చూస్తుంది....

అనురాగాలు బతకాలని తపిస్తుంది!

 

వీధిలోని విచారపు చెప్పుల్ని తన ముందే వదిలి

నట్టింట్లో నవ్వుల నగ్న పాదాలతో అడుగిడమని

పసుపు కుంకుమలతో ఆహ్వానిస్తోంది!

 

ఆమె ఎదురుచూపుల్ని

తోరణంగ వేలాడేసినప్పుడు...

అతని అడుగుల చప్పుడు

చిరుగాలై చుట్టుకున్నప్పుడు

తనో మాలగా మారి ఇరు హృదయాలనూ ఆలింగనం చేసుకుంటుంది!

కొత్త జీవితం తనలోకి అడుగుడినా....

కొత్త జీవి తనను అనుమతడిగినా....

పులకింతల హారతి పళ్ళెమై

స్వాగత గీతాలు పాడుతుంది!

 

మంచం దించిన బహుకాలపు

బంధం తనని దాటేళ్ళిపోతున్నప్పుడు

కూడా నాలుగడుగులు వేయలేని నిస్సహాయతతో

ఏడ్చే శిలౌతుంది!

 

ఇంటిదేహాన్ని వదిలెళ్లిన 

ఆత్మ మరో రూపంలో తనపై 

పారాడే క్షణాల కోసం

ఎదురుచూస్తూ ఉంటుంది...!

 

గడపతల్లికి

విలువిచ్చిన జీవితాలెన్నో పరువుదీపాల వెలుగులో కాంతులీనాయి...!

గడపకు కొట్టుకున్న 

బతుకులెన్నో ఎదురుదెబ్బల

గుణపాఠాల్ని రుచి చూసి

రేపటిని దిద్దుకున్నాయి!

 

ఏ తలుపులు ఏ చరితను తమలో దాచుకున్నాయో

తనను దాటాకే తెలిసేది!

తను పచ్చగ నవ్విన ప్రతిక్షణం

కొన్ని తరాలకు నందన వనం!

వాడిన నిమిషం కుటుంబమో శిథిల భవనం!

 

పైకి వాడినా లోలోపల చిగిర్చే

తల్లి కొమ్మ తను!

నిత్యం ఆ కొమ్మకు అటూ ఇటూ

శిశిర వసంతాలు పెనవేసుకు

కొత్త ఋతువుని ప్రసవిస్తాయి!

0 comentaris