సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్)

దీపావళి అనగానే గుర్తొచ్చేది చిన్నప్పుడు అన్నయ్య కూరిన మతాబులూ, దీపావళి బజార్లో కొన్న శివకాశీ 'ఏటం' బాంబులూ. దీపావళంటే చీకటి మీద వెలుగు సాధించే విజయం, అజ్ఞానం మీద జ్ఞానం సాధించే విజయం, చెడు మీద మంచి సాధించే విజయం అని ఏమేమో చెప్పుకుని, ఎన్ని టపాకాయలు కాలుస్తే అంత గొప్పా, పుణ్యమూనూ అనుకునేవాళ్ళం. 'వాతావరణ కాలుష్యం' అనే మాటే వినలేదప్పుడు. ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయి, కళ్ళూ ముక్కులూ మండి పోతూంటే ఇప్పుడు తెలిసొస్తున్నది, కాలుష్యమంటే ఏమిటో. అంతే కాక, ఖరీదులొకటి.

పెద్ద పెద్ద పట్టణాల్లో టపాకాయలు కాల్చకూడదూ అని ఒక శాసనం చేశేసి మా పనైపోయిందన్నారు, అధికారవర్గం. అసలలా ఓ శాసనం ఉన్నదనే తెలియదు చాలా మందికీ, తెలిసిన వాళ్ళేమో దీపావళి టపాకాయల మీద శాసనమా, భలే భలే అని నవ్వుకుంటూ కాల్చేస్తారు. ఆ టపాకాయలు కాల్చడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన వాయువులూ, అనేక రకాల లోహాలూ, గంధకం లాంటి పదార్ధాలు, ఊపిరి తిత్తులని పాడు చేసే కణాలూ, ఎన్నో రకాల ప్రమాద కరమైన వస్తువులు గాలిలోకి వెళ్తాయి. అంతే కాక వాటి మీద అచ్చు వేసే బొమ్మల రంగులు కూడా హాని చేస్తాయట. వీటిలో చాలా వాటి వలన పెరిగే కాలుష్యం ఆ రాత్రే కాదు, వారాల తరబడి గాలిలో ఉండి పోతుంది, వాసన కొడ్తూంటుంది, శ్వాస సంబంధమైన వ్యాధులున్న వాళ్ళకి ఊపిరి పీల్చుకోడమే దుర్భరంగా ఉంటుంది.

ఇలా అని ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ నాకు చిన్నప్పుడు ఎవరైనా చెప్తే నేనేం చేశే వాడినో అనిపిస్తుంది. టపాకాయల సరదా వదులుకోవడం కుదిరేదా??

ఇక ఈ సంచికలో కొన్ని.

మన సమాజంలో సైనికులు ఆట్టే కనిపించరు, సైనికుల గురించి మనకి అంతగా తెలియదిఊ. 'ఆర్య భారతీయం' లో కోరుకొండ వెంకటేశ్వర రావు గారు ఆ లోటు కొంత భర్తీ చేశారు.

'తెలుగు సామేతలు', ఇది ఆఖరి విడత. ఓపికగా వాటిని కూర్చిన అప్పారావు గారికి అభినందనలు.

వృధ్ధాశ్రమం అన్నది అమెరికాలో మామూలే, కానీ భారత దేశంలో ఒక కొత్త అనుభవం. దానిలో మంచి చెడ్డల గురించి రాశారు, కిటికీతో పనేముందిలో, శ్రీనివాసరావు గారు.

కట్టుకున్న ఇల్లాలిని కించ పరచడం, ఆవిడ ఒక మనిషే కాదన్నట్లు ప్రవర్తించడం, ఇంకా కొంత మందికి అలవాటు. అదేదో గొప్పగా ఫీలౌతారు కొంత మంది. కుసుమ విలాపంలో విజయ లక్ష్మి గారు ఆ బాధలు పడ్తున్న ఒక అభాగిని గురించి రాశారు.

'అత్తా లేని కోడలుత్తము రాలూ......', అత్తా కోడళ్ళ సిగపట్లే కానీ, 'మంచి' అత్తల గురించి ఎప్పుడూ చెప్పుకోము. ఆ లోటు తీర్చారు, వెంకటరమణ శాస్త్రి గారు, 'మార్గ దర్శి' కథలో.

0 Comments