కోరుకున్న భార్య  (Author: ఓట్ర ప్రకాష్ రావు)

         "మీరు మన పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించారా?’’ అడిగాను.

          మా పెళ్లి జరిగిన వారంరోజులకంతా ఇలా అడగటంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడటం గమనించాను.

         “నీకెందుకు అలాంటి అనుమానం కలిగింది?" అడిగారు.

         “ మీ ఇంటివైపు వారు ఒకరు చెప్పారు. మీకు నన్ను చేసుకోవడం ఇష్టంలేదని“ అన్నాను.

          ఆ సంగతి చెప్పింది మావారి దగ్గరి బంధువైనా, చెప్పినవారి పేరు చెప్పడం సభ్యత కాదనిపించి చెప్పలేదు.

          "అన్నీ చెప్పినవారు ‘ఎందుకు ఇష్టంలేదని చెప్పానని’ చెప్పలేదా?.” అడిగారు.

         “సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో పనిచేస్తున్న మీరు పట్టభద్రురాలైన అమ్మాయిని భార్యగా కోరుకున్నట్లు చెప్పినా, మీ తల్లితండ్రులు మీ మాటను వినకుండా పల్లెటూరిలో పెరిగి, పదవ తరగతి పరీక్షలో తప్పిపోయిన నాతో పెళ్లి చేస్తున్నందుకు బాధపడినట్లు చెప్పారు. నేను ఆ ఆమాటలు నమ్మలేదు. ఒక వేళ మీరు ఎవరినైనా ప్రేమించివుంటారేమోనని..” అన్నాను.

         “నా పెళ్లికోసం మా అమ్మానాన్నా ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. అంత పెద్ద జీతంతో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు దొరకడం కష్టమని తెలుసుకున్నాము, ఒక పరిస్థితిలో నీ మనసులో ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పరా అంటూ అడిగారు"

          "మీరేమి చెప్పారు?"

         “నా మనసులో ఎవరైనా ఉంటే మీకు చెప్పి ఉండేవాడిని. నాకు ఇంతవరకు ప్రేమ లాంటివి లేదని చెప్పాను."

          ఆ మాటలు నా మనసుకు ఊరటనిచ్చింది.

         “మీరు కోరుకున్న భార్యపట్టభద్రురాలై వుండాలని కోరుకున్నారంటే, ఉద్యోగం చేయించాలని అనుకున్నారా?” అడిగాను.

         “నేను కోరుకున్న భార్య పట్టభద్రురాలై వుండాలని కోరుకున్నాను. నా భార్య ఉద్యోగం చెయ్యాలన్న ఆశ నాలో ఎప్పటికీ లేదు. పట్టభద్రురాలై వుంటే, పట్టణంలో మోసపోవడానికి అవకాశం ఉండదు. అంతేకాదు, పిల్లల చదువు విషయాలలో కాస్త సులభంగా చూడగలరు. పట్టణజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనే మానసిక ధైర్యం చదువుకొన్నఅమ్మాయిలో ఉంటుందన్న భావన."

         “నేను పదవ తరగతి పరీక్షలో తప్పిపోవడానికి కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా అమ్మ కాన్సర్ తో బాధపడుతుండటం వలన ఇంటిపనులతో పాటు అమ్మ బాగోగులు చూడవలసిన బాధ్యతలు కలిగింది, మా అమ్మ ఆరోగ్యం బాగుపడటం నేను చేసుకొన్న అదృష్టం. నేను పల్లెటూరి అమ్మాయి అయినా నాకూ లోకం పోకడ, కుటుంబ బాధ్యతలు తెలుసండీ.” అన్నాను.

          *** *** ***

          ఉదయం మూడు వరకు ఆఫీసు పని కోసం లాప్ టాప్ నందు పని చేస్తూ ఉంటారు. ఎప్పటిలా ఆరుగంటలకే లేచి నా పనులన్నీ ముగించి మావారిని లేపడానికి వెళ్ళాను, అప్పడు సమయం తొమ్మిది గంటలయింది.

          అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంటే ఆయన లేచి ఫోన్ తీసుకొనడం చూసాను. సెల్ ఫోనుకు వున్న హెడ్ ఫోన్ వైర్ చెవులకు తగిలించుకొన్నారు.

         “హలో"అన్నారు మావారు.

          "....”

         “ పార్సెల్ రిటర్న్ అయిందా…. ఎందుకూ? “ ఆంగ్లంలో అన్నారు

          "....."

          "ఏంటండీ, మీరు చెప్పేది? నేను పార్సెల్ కోసం ఎదురుచూస్తున్నాను. దాని గురించి చెబుతారనుకొంటే. నేను ముంబై నుండి తైవానుకు పార్సెల్ పంపానని చెబుతున్నారు. ఇంతవరకు నేను ముంబై లో అడుగు పెట్టలేదు. ఇంతకూ మీరెవరు?” కోపంగా ఆంగ్లంలో అడగడం గమనించాను.

          నాకెందుకో అనుమానం కలిగి, ఆయన వైపు చూస్తూ “నాతో మాట్లాడొద్దండి” అంటూ సైగ చేసి ఆయన రెండు చెవులలో వున్న స్పీకర్ వైర్ల లో ఒకటి తీసి నా చెవుకు పెట్టుకొన్నాను.

         “సార్, మీరు టెన్షన్ పడకుండా వినండి, ముంబైనుండి మీ చిరునామా మీద మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబర్ ఉపయోగించి ఎవడో తైవానుకు ఒక పార్సెల్ పంపాడు. ఆ పార్సెల్ నందు మూడు ఫేక్ పాస్ పోర్టులు, ఒక లాప్ టాప్, వీటితో పాటు డ్రగ్స్ కూడా పంపుతున్నట్లు తెలుసుకొని మీ పార్సెల్ బ్లాక్ చేశాము. మా కొరియర్ సర్వీస్ నియమం ప్రకారం చట్టవిరుద్ధంగా పంపిన వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాము.” అతను ఆంగ్లంలో చెప్పినా అర్థం చేసుకొన్నాను.

          సంభాషణ అంతా ఆంగ్లంలో జరుగుతోంది. మా వారు అడిగిన ప్రశ్నలకు వాడెవడో సమాధానాలు చెబుతూనే మావారిని మెల్లగా భయపెట్టేలా కొన్ని ప్రశ్నలు వేస్తూ సమాచారం లాగటానికి ప్రయత్నిస్తున్నాడు.

         “మీ పేరు మీద ఈ చిరునామా…..” అంటూ ఒక చిరునామా చెప్పాడు.

          "నేనింతవరకు ముంబై చూడలేదు“ అన్నారు.

          "తైవాన్ కు మీ పేరుమీద బుక్ చేసిన పార్సెల్ చిరునామా చెప్తాను"అంటూ తైవాన్ చిరునామా ఒకటి చెప్పాడు.

          "నాకేమీ తెలీదంటుంటే మీరు నాకు ఆ వివరాలు ఎందుకు చెబుతున్నారు” అన్నారు

         “ చూడండి మీ పేరుమీద చట్టవిరుద్ధమైన సంఘటన జరిగింది. మీరు ముందు జాగ్రత్తగా ముంబై పోలీసు స్టేషనుకు ఫిర్యాదు చెయ్యండి, మీరు ముంబై కు వెంటనే బయలు దేరి రండి.“

         “సార్ నేనున్నది హైద్రాబాదులో.. ముంబై కి రావాలంటే.. ఎలాగండీ.” అని చెప్పగానే అవతల ఫోనులో వున్న వ్యక్తి ‘తప్పకుండా రావాలంటూ’ ఏదేదో కారణాలు చెబుతున్నాడు.

          నేను అక్కడ వున్న పేపర్ తీసుకొని 'ఈ వారం నాకు కస్టమర్ మీటింగ్ వుంది. ఎట్టి పరిస్థితిలోనూ రావడానికి కుదరదు' అని చెప్పండి అంటూ వ్రాసి చూపించాను

          అలా వ్రాస్తున్నప్పుడు“సార్, ఇది మీ జీవితానికి సంబంధించిన సమస్య. మీరు రాక తప్పదు"అంటూ చెబుతున్నాడు.

          నేను వ్రాసింది చదివిన మావారు అలాగే చెప్పిన తరువాత, నా వైపు చూస్తూ ‘శబాష్’ అన్నట్లుగా భుజం తట్టారు.

          "ఓకే సార్, మీరు ఆన్ లైన్లో ఫిర్యాదు చెయ్యండి. ముంబైలోని... పోలీసు స్టేషనుకు కనెక్ట్ చేస్తాను. అలాగే వుండండి."

          మరికొన్ని నిమిషాలలో "... ముంబై పోలీసు స్టేషనునుండి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను" అన్న గొంతు వినపడింది.

          మా వారు జరిగిందంతా వివరించి చెప్పారు. 

          అతనూ ముంబైకి రమ్మని చెబితే మా వారు ఇప్పడు రావడానికి కుదరదు అని చెప్పారు.

          "మీరు ఆన్లైన్ లో ఇలాగే ఫిర్యాదు చేయడం కుదరదు. స్కైబ్ లో వీడియో కాల్ ద్వారా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు.” అన్నారు

          నేను నా చెవిలోని వైర్ తీసి మా వారికిచ్చి ‘నేనిప్పుడే వస్తాను’ అన్నట్టుగా సైగ చేసి వేగంగా వెళ్లాను

          ఇంటి తలుపు లాక్ చేసి బయటకు వెళ్లి ఆటోలో వెళ్ళాను. మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరుగా ఎస్.ఐ. గదికి వెళ్ళాను

          "మేడం మీరు అర్జెంటుగా బయలు దేరాలి ఓక పెద్ద సైబర్ క్రైమ్ పార్టీ మా వారిని ముంబై పోలీసులమంటూ బెదిరిస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఇంకా ఫోనులో మాట్లాడుతూనే వున్నాడు. సైబర్ క్రైమ్ వారికి చెప్పండి. ప్లీజ్ వెంటనే రండి. మా ఇల్లు రెండు వీధుల అవతల వున్నది.” అన్నాను.

          ఎస్.ఐ. మరో ఇద్దరిని తీసుకొని వచ్చారు. నలుగురం ఆటోలో వెళ్ళాము. ఆటోలో వెళ్తున్నప్పుడు జరిగింది క్లుప్తంగా చెప్పాను.

          ఇంటిలోపల నాతోపాటు వస్తున్న పోలీసు వారిని చాలా ఆశ్చర్యం తో చూశారు.

          ‘మీరు ఫోన్ లో మాట్లాడండి’ అన్నట్టుగా సైగ చేసింది ఎస్.ఐ.

         “సార్, మీరు చెప్పిన బ్యాంకు నందు నాకు అకౌంట్ లేదు అంటే నాకు ఆ అకౌంట్ ద్వారా చాలా పెద్ద మొత్తాలలో ట్రాన్సక్షన్ జరిగిందంటున్నారు.” కాస్త గట్టిగా మాకు వినబడేలా చెప్పినారనుకొన్నాను.

          నేను పేపర్లు పెన్ వారికి అందించి జరిగింది వ్రాయమని సైగ చేశాను.

          పోలీసువారు వీడియోలో మాట్లాడారు. ఇలాంటి కేసులు సి.బి.ఐ. విచారించాలట. అలాగే లైన్లో ఉండమన్నారు అంటూ వ్రాసి అందించిన పేపరును ఎస్.ఐ. కి చూపించాను.

          ఎస్.ఐ. బయట గదికి వెళ్లి ఎరితోనో ఫోనులో మాట్లాడటం గమనించాను. నేనూ ఎస్.ఐ. దగ్గరకు వెళ్లాను.

          ఆమె మాట్లాడటం ముగించాక నా వైపు చూస్తూ "ఇదొక సైబర్ క్రైమ్ గ్రూప్. పై అధికారులకు చెప్పాను. మీ వారి నంబర్ చెప్పండి." అంది.

          నేను మా వారు మాట్లాడుతున్న నంబరు చెప్పాను. ఆ నంబరు ఫోనులో టైపు చేసి ఎవరికో పంపారు ఇన్స్పెక్టర్.

          మేము లోపలకు వచ్చాము.

         “సార్ మీరు సి.బీ.ఐ. అంటున్నారు. ఏమీ చేయని నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క మూలనుండి టార్చర్ చేస్తున్నారు.” అన్నారు మావారు.

         ““

          "సరే సార్ కంప్లైంట్ ఫారం పంపండి పూర్తి చేస్తాను.” అన్నారు.

          మరికొన్ని నిమిషాల తరువాత 'వాళ్ళు పంపిన ఫారం నందు పోలీసు శాఖ వారి చిహ్నం వుంది. అసలైన దరఖాస్తు లాగుంది పూర్తి చేసి పంపుతాను.' ఒక పేపరులో వ్రాసి నాకు ఇచ్చారు. కొన్ని నిమిషాలు గడిచింది.

          "........"

          "ఏంటి సర్, మీరు చెప్పిన విధంగా ఫిర్యాదు దరఖాస్తు పూర్తి చేసి పంపితే, ఇప్పుడేమో ఈ గదిదాటి నేను వెళ్ళకూడదు, ఈ గదిలోనికి ఎవరూ రాకూడదని అంటున్నారు.” కోపాన్ని నటిస్తూ గట్టిగా అన్నారు.

         “మేడం, ఆయన భార్యగా నేను వెళ్లి మాట్లాడమంటారా?” మెల్లగా ఎస్.ఐ. ని అడిగాను. సరేనన్నట్లు సైగ చేసింది.

         “నమస్తే అన్నా, నేను నీ చెల్లెలు లాంటి దాన్ని. దయచేసి ఆయనను వదిలేయండి. ఆయన అలాంటివారు కాదు. జరుగుతున్న సంఘటననుండి నేను ఇక్కడే వున్నాను.” వీడియో ముందు కూర్చొని నాకు తెలిసిన ఆంగ్లములో మాట్లాడాను.

         “చూడమ్మా నాకూ చెల్లెల్ళున్నారు. నువ్వేమీ భయపడవద్దు. మీ వారి మీద అనుమానం మాత్రమే. అనుమానం తొలగాలంటే కాస్త కష్టమైనా మాకు సహకరించాలి."

         “ మీరేమి చెబుతారో చెప్పండి. నేను వారి చేత చేయిస్తాను. ఆయన చాలా ఒత్తిడికి గురయ్యారు“

         “మీ బ్యాంకు ఖాతాలన్నీ అన్నీ మా ఆధీనంలో వస్తాయి. వెంటనే మీ డబ్బు అంతా మా ఖాతాకు పంపండి. విచారణలో మీరు దోషి అని నిర్ణయిస్తే మూడుగంటలలో హైదరాబాద్ పోలీసులు మిమ్మల్ని ఖైదు చేస్తారు. మీరు నిర్దోషి అని తేలిందంటే మీ డబ్బు అంతా మీ బ్యాంకు ఖాతాకు పంపిస్తాము."

          "అన్నా, సి.బీ.ఐ. అంటే మీకు అన్ని అధికారాలు వుంటుందిగా. మీరు అనుకొంటే మా వారికి ఖాతా ఉన్న బ్యాంకులకు ఫోన్ చేసి ఎటువంటి లావాదేవీలు లేకుండా నిలుపవచ్చుగా?“ అన్నాను.

         “ సి.బి.ఐ. నీవా? నేనా? నన్నే ప్రశ్నలు వేస్తున్నావు“ కోపంగా ప్రశ్నించాడు.

          "ప్రశ్న అడిగితే కోపంగా సమాధానం ఇస్తున్నారు. అలాగైతే మీరు ఎస్.ఐ. తో మాట్లాడండి” అన్నాను

          ఎస్.ఐ. నా దగ్గరకు వచ్చి నిలబడి వీడియో వైపు చూస్తూ "మీ ఐడెంటిటీ చెప్పండి. ఆ తరువాత నేను వీళ్ళను అరెస్ట్ చేసి మా పోలీసు స్టేషనులో ఉంచుకొంటాము. మీరు ఇక ఏం చెయ్యాలన్నా మా పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి....” అంటూ చెబుతుండగానే వీడియో కాల్ కట్ అయింది

         “నన్ను యూనిఫామ్ లో చూడగానే వెంటనే జారుకున్నాడు. మూడు రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుమారు రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు” అంది ఎస్.ఐ.

         “సాఫ్ట్ వేర్ ఉద్యోగి అంటే డిగ్రీ చదువుకొన్న వ్యక్తి. ఆమాత్రం ఆలోచించకుండా ఎలా మోసపోయాడు? మరివాళ్ళను పట్టుకొనడానికి ప్రయత్నిస్తారా?” అడిగాను.

         “తెలివితేటలకు, చదువుకు సంబంధం లేదు. లోకం పోకడ తెలిసివుండాలి. ఆ సైబర్ దొంగలు ఏ దేశంలో వుంటారో చెప్పలేము. వాళ్ళను పట్టుకోవడం కష్టం. లోకల్ వాళ్లయితే సులభంగా పట్టుకొంటాము. ఏమైనా మనమే జాగ్రత్తలో ఉండాలి. ఏమైతేనేం ఆ సైబర్ క్రైమ్ వారు మీవారిని మెల్ల మెల్లగా బలహీనుడిగా మారుస్తున్న సమయాన సమయస్ఫూర్తితో నడచుకొన్నావు” నన్ను మెచ్చుకొంటున్నట్టుగా అంది ఎస్.ఐ.

          మావారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

          వాళ్ళందరూ వెళ్ళాక మావారు నన్ను గట్టిగా కౌగలించుకొంటూ "నేను కోరుకున్న భార్య రాలేదని బాధపడ్డాను. కానీ నేననుకొన్న భార్య వచ్చిందని ఈ రోజు తెలుసుకున్నాను.” అన్నారు.

          ఆ కౌగిలిలో చెప్పలేనంత కొత్త హాయి, ఆనందం కలిగింది.

         --------------------------------------------------------------------------------------------------

添加评论