ఆదర్శప్రాయం  (Author: పి. లక్ష్మీ ప్రసన్న)

రామాయణం....

 

ఆదికవి వాల్మీకి విరచిత కమనీయ కావ్యం మాత్రమే కాదు

కలుషితమైన ఈ కలికాలానికి కనువిప్పును కలిగించే దిశానిర్దేశం

 

పితృ వాక్య పాలన ఆనాటి త్రేతా యుగం

వృద్ధాశ్రమాల పోషణ నేటి కలియుగం

 

ఏకపత్నీవ్రతం అలనాటి ఆదర్శం

విడాకుల తెగింపు నేటి బంధాల అకృత్యం

 

దిక్కులు చూసే నేటి జల్సారాయుళ్లకు దిక్సూచి..

ఏకపత్నీవ్రతుడైన రాముడు

రావణ దుశ్చర్యతో అవమానింపబడిన సీతకు.. అగ్నిపరీక్షతో ఆత్మాభిమానాన్ని అందించాడు

 

సకలగుణ సంపన్నుడు అతడు

సర్వజన హితకారుడు అతడు అందుకే...

రఘురామునికి బంటుగా మారి దాసుడు అయ్యాడు..

అతి బలవంతుడు

అసామాన్య వీరుడూ అయిన హనుమంతుడు

 

స్వార్థంతో కాసులు కూడబెట్టే నేటి అధర్మ పాలకులకు..

ప్రజా సంరక్షణే ధ్యేయంగా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప రాజైన రాముడు ఆదర్శం

ఆస్తి పంపకాలతో అనురాగం మసిబారి,

తోడుగా లేని ఈతరం తోబుట్టువులకు..

అన్న కోసం ఇష్టంగా వారి కష్టాల్లో వెన్నంటి ఉన్న

ప్రియ సోదరుడు లక్ష్మణుడు ఆదర్శం

 

బహుమతులూ, బంగారాలంటూ భర్తలను వేధించే గడసరి భార్యలకు..

భర్త వెంట అరణ్యం పాలై, అపహరణకు లోనై, ఆవేదనను అనుభవించిన సాద్వీమణి సీతమ్మ తల్లి ఆదర్శం

 

ఆకలన్న జీవులకు పట్టెడన్నం పెట్టలేని మనసులేని మనుషులకు..

ఎంగిలి అన్న స్పృహ లేకుండా కొరికిన పళ్ళను కొసరి కొసరి తినిపించి

మధుర భక్తితో మైమరిచిపోయిన శబరి ఆదర్శం

 

నమ్మించి మోసగిస్తూ కపట స్నేహం నటించే మిత్రులందరికీ..

ఆపదలో చేయూతనిచ్చి ఆదుకున్న సుగ్రీవుని స్నేహం ఆదర్శం

 

నేను నాది అన్న స్వార్థంతో మానవసేవని మరిచిన వారందరికీ..

సీతను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలను సైతం అర్పించిన జటాయువు ఆదర్శం

 

కూలుతున్న కుంటి నిర్మాణాలు కట్టే ఈనాటి నకిలీ ఇంజనీర్లకి..

సముద్రంలో వారధి కట్టించిన విశ్వకర్మ సుపుత్రుడైన నీలుడి ప్రతిభ ఆదర్శం

 

స్వాభిమానంతో తన వాళ్ళ తప్పులను సైతం సమర్ధించే అసమర్థులందరికీ..

పర స్త్రీని చేపట్టుట చేటన్న సత్యాన్ని తెలియజేసి,

రావణుడి అధర్మాన్ని విభేదించిన విభీషణుడు మనకు ఆదర్శం

 

కలిపురుషుని కుట్రతో

చెవులు నింపే మందరలు..

అసూయ నిండిన శూర్పణఖలు..

ఆడదాన్ని అవమానించే రావణాసురులు..

పుట్టుకొస్తున్న ఈ యుగంలో

 

మనుషుల్లో అంతరించిపోతున్న మానవత్వంతో పాటు..

తండ్రి మాటను గౌరవించే పుత్రులు..

వివాహ బంధానికి విలువిచ్చే జంటలు..

పరస్త్రీని సోదరి సమంగా భావించే పురుషోత్తములు..

మానవసేవే మాధవసేవ అని గ్రహించే నిస్వార్ధపరులు..

ప్రజానికానికి మంచి చేసే నిబద్దతగల నాయకులు..

మున్ముందు మచ్చుకయినా కనబడాలంటే

 

త్రేతాయుగపు భారతీయ ఇతిహాసమైన మార్గదర్శి వంటి మహిమన్విత రామాయణం...

కాగలదు భావితరాల బంగారు భవితకు ఆదర్శప్రాయం.

0 Comments