‘‘తృతీయం, అద్వితీయం!’’
‘‘తృతీయం, అద్వితీయం!’’ (Author: పాణ్యం దత్త శర్మ)
బంధుప్రీతీ, అవినీతీ, ఆశ్రిత పక్షపాతమూ
లాంటి అవగుణాలకతీతంగా పనిచేస్తుంది
మన భారతీయ న్యాయవ్యవస్థ!
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఆ మూడవదే
ఇంతవరకూ సొంత నిజాయితీని నిల్పుకుంటూ వస్తూంది!
కానీ, ఎందుకోమరి, పైకి లేస్తున్నాయి
కొందరి కనుబొమలు అనుమానంతో
నిప్పూ పొగ సామెతకు ఆస్కారం కలిగిస్తున్నాయి
బహిరంగంగానే ఆ కొందరు ఆరోపిస్తున్నారు
నిస్పక్షపాత న్యాయం సామాన్యుని కందనిపండని
‘కాదేదీ కోర్టుకేసు కనర్హం’ అన్నది కూర్చుంది నిజమై
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రాజకీయానికయ్యాయి ఆజ్యాలు
లైంగిక హింస, మానభంగ నేరస్తులను ఎన్‌కౌంటర్ చేస్తే
ఆ పోలీసులకు నీరాజనాలు పట్టే జనం!
ఆలస్యమైతే న్యాయం, అందనట్లే అనా జనాభిప్రాయం?
తల్లీ, న్యాయదేవతా! నీవొక్కదానివే
కల్లోలాలను నివారించావు సమాజంలో
నీ విశ్వసనీయతనే శంకిస్తే, నీ గౌరవాన్ని ఇంకిస్తే
పరిబృఢీకృతమవుతుందా అమ్మా ప్రజాస్వామ్యం?
నిర్దయగా, నిర్భీతిగా, వెలువరించుజననీ సమన్యాయం!