వసుధైక కుటుంబం  (Author: పి. లక్ష్మీ ప్రసన్న)

“ఒరేయ్ ప్రమోద్, లేవరా... టైం అవుతుంది. నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఈరోజు. రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాలి మర్చిపోయావా?” అని కిచెన్ లోంచి అరుస్తున్న అమ్మ అరుపుకి నిద్రమత్తు వదిలిపోయింది నాకు. గడియారం వంక చూశాను. ఏడయింది. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఈదుకుంటూ వెళ్లేసరికి ట్రైన్ వచ్చేస్తుందేమో అనుకుంటూ చటుక్కున లేచి రెడీ అయ్యి హాల్ లోకి వచ్చాను. “ఆదివారం వస్తే 11 గంటల వరకు మంచం దిగడు. ఈ రోజు చూడండి, మనల్ని కూడా రావొద్దని గెంతులేసుకుంటూ వెళ్తున్నాడు.” అని నాన్నకు చెబుతూ, “టిఫిన్ చేసి వెళ్ళరా” అని నన్ను పిలుస్తోంది. “వచ్చాకా ఇద్దరం కలిసి తింటాంలే” అంటూ బయటకు నడిచాను.

రైల్వే స్టేషన్కి చేరుకున్న పది నిమిషాలకి ట్రైన్ వచ్చింది. ఆతృతగా వెతుకుతున్నాను. చూసి సంవత్సరం అయ్యింది. తను కూడా నాకోసం అలాగే చూస్తోంది కాబోలు ట్రైన్ దిగగానే “ప్రమూ!” అంటూ వచ్చి బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంది. తన వెనకే దిగిన నలుగురు కుర్రాళ్ళు తన లగేజ్ ని మోసుకొచ్చి మాదగ్గర పెట్టి “బై” చెప్పి వెళ్లిపోతుంటే, “మా ఊరు వస్తే మా ఇంటికి తప్పకుండా రండి” అని గట్టిగా అరిచింది.

“ఎవరే వాళ్ళు?” అడిగాను కోపంగా.

“ట్రైన్లో పరిచయమయ్యారులే. పులిహోర, ఆవడలు రుచి చూపించాను. నా ఫ్యాన్స్ అయిపోయారు.” అంది నవ్వుతూ.

“నీ చుట్టూ అందరినీ భలే తిప్పించుకుంటావే అమ్మమ్మ! కాంతం కాదు, నీ పేరు అయస్కాంతం అని పెట్టాల్సింది. తాతయ్య గనుక బతికుంటే కుళ్ళుకునేవాడేమో!” అన్నాను.

“రామ! రామ! ఏం మాటలురా సన్నాసీ, వాళ్ళూ నీలాగే మనవళ్ళు” అన్నది బుగ్గలు నొక్కుకుంటూ.

“సరే పద వెళ్దాం” అన్నాను భుజం మీద చెయ్యి వేసి.

“మీ ఊరు వస్తే బండిమీద ఊరంతా తిప్పి చూపిస్తానన్నావుగా” అన్నది.

“ఫ్రెండుని కార్ తెమ్మన్నాను నీకోసం.”

“కార్ ఎందుకురా ట్రైన్లో మార్నింగ్ వాక్ చేసేశాను కానీ, లేకపోతే ఊరు చూసుకుంటూ ఇంటిదాకా నడిచేసేదాన్ని”.

“ఏంటి?... ట్రైన్ లో వాకింగ్ చేశావా?”  ‘ఎంతమంది కాళ్ళు పచ్చడి అయ్యాయో పాపం!’ అనుకున్నాను మనసులో .

“రాత్రి నిద్రపట్టలేదు. ఏవో పద్యాలు, పాటలు పాడుకుంటూ కూర్చున్నాను. ఉదయాన్నే 6గంటలకి సుప్రభాతం కూడా పాడాన్రా”

“ఇంకేం వాళ్ళ ప్రశాంతమైన నిద్రతో పాటు, పదికాలాలు పనిచెయ్యాల్సిన చెవులు కూడా గోవింద అన్నమాట. ఇంత చేసినా, నిన్ను ట్రైన్లోంచి ఎవరు, ఎందుకు తోసెయ్యలేదంటావ్?” అన్నాను.

“పులిహోర మహిమ” అన్నది పళ్ళికిలిస్తూ. “నీ ప్లాన్ అదిరింది అమ్మమ్మ!” అని లగేజ్ ఫ్రెండ్ కార్లో ఇంటికి పంపించేసి, బైక్ మీద బయలేదేరాం.

కాస్త దూరం వెళ్ళాక “ఎలా ఉంది మా ఊరు?” అడిగాను. “టీవీలో చూసినట్టే ఉంది” అంది పెదవి విరుస్తూ. “ఏంటి?” అన్నాను అర్ధం కాక. “టీవీలో వచ్చే సీరియల్లో చూపిస్తారు. ఇలాంటి కొంకనక్కల్లాంటి పొడుగాటి అపాయింట్మెంట్లు.”అన్నది.

“అపాయింట్మెంట్లా...” నవ్వొచ్చింది అమ్మమ్మ ఇంగ్లీషుకి. సిగ్నల్ పడటంతో హఠాత్తుగా బ్రేక్ వేశాను. నా మీదకి కాస్త వాలి, “ఎందుకురా బండాపావు?” అంటూ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది. చుట్టూ చూశాను. ‘ఎవరూ చూడలేదు కదా’ అనుకుంటూ. కానీ అందరూ నన్నే చూస్తున్నారు. పరువు మొత్తం హుసేన్ సాగర్లో కలిపేసింది ముసల్ది.

నా మనోభావాలు పట్టించుకోకుండా చుట్టూ పరికించి చూసి, “పాపం.. మీ ఊర్లో ఈ ట్రాఫిక్ గోలకేమో చాలామందికి చెవుడు వచ్చేసినట్టు ఉంది” అంది. ఏమంటుందో అర్థం కాక వెనక్కి చూశాను. “అందరూ చెవిటిమిషన్లు పెట్టుకుని తిరుగుతున్నారు చూడు” అంది బ్లూటూత్ లు చూసి. నవ్వొచ్చింది నాకు.

       ఇంతలో మా పక్కగా బైక్ వచ్చి ఆగింది. వెనకున్న అమ్మాయి, అబ్బాయి వీపు మీద పడుకుని కళ్ళు మూసుకుని ఉంది. అమ్మమ్మ వెంటనే కంగారు పడిపోయి “అయ్యో.. అలా వాలిపోయింది ఏమిటి? మైకం వచ్చి పడిపోయినట్టుంది పిల్ల” అంటూ గోల చేసింది.

వాళ్లకి తెలుగు రాదు. నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోలేదంటూ అమ్మమ్మకు నచ్చచెప్పే సమయంలో పెద్ద సౌండ్ వినిపించింది. ‘ఏంటా?’ అని చూస్తే, బైక్ మీద ఒకడు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. ఎవరికీ ఏం కాలేదు కానీ ఆటో పాడయ్యిందని గొడవ చేస్తున్నాడు ఆటోవాడు.

“అబ్బా...  ఇంకో అరగంట వరకు తేలేలా లేదు ఈ గొడవ” అంటున్నారు ఎవరో. “అడ్డదారి ఏమీ లేదా?” అడుగింది అమ్మమ్మ. “అడ్డదారీ, నిలువుదారీ ఏమీ లేవు. మన ఇంటికి ఇది ఒకటే దారి. వర్షం గాని వస్తే ఇదే గోదారి” అన్నాను.

ఇంతలో మా వెనక ఉన్న ఆటోలో ఎవరో ఏడుస్తున్నారు. బైక్ దూకి అక్కడికి పరిగెత్తింది అమ్మమ్మ. వెనకే నేను వెళ్ళాను. కూతురికి నొప్పులు మొదలవటంతో ప్రసవం కోసం హాస్పిటల్ కి తీసుకుని వెళ్తోంది ఒక తల్లి.

అమ్మమ్మ వాళ్ళతో ఏదో మాట్లాడుతోంది. “అంబులెన్సుకి ఫోన్ చెయ్యనా?” అని అడిగాను. నాకూ కాస్త కంగారు అనిపించింది. “ఏమీ అక్కర్లేదు. నేనున్నానుగా!” అంది తాపీగా. ‘అంటే ఏం చేస్తుంది ఇప్పుడు? ఆటోలో డెలివరీ చేసి కేర్ కేర్ మనే బిడ్డని తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుందా? “అమలాపురం కాంతం బామ్మ, అమీర్ పేట ఆటోలో ప్రసవం చేసి ప్రాణం నిలిపింది” అంటూ న్యూస్ చానల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ చరిత్ర సృష్టిస్తుందేమో!’ ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.

ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. అమ్మమ్మ వచ్చి “పద వెళ్దాం.” అంది.  “పాపా, బాబా ఎవరు పుట్టారు?” అన్నాను. “నీ మొహం ఆ అమ్మాయికి ఎనిమిదో నెలట. ఇంకా 2నెలలు టైం ఉంది. కడుపుతో ఉన్న పిల్ల కదా, అని రాత్రి వాళ్ళ పక్కింటి ఆవిడ, బిరియాని ఇస్తే తిన్నదట. కాస్త వేడి చేసి, గేసునొప్పి వస్తే పురిటి నొప్పులు అనుకుంటున్నారు తింగర మొహాలు. నా చేతిసంచిలో ఉన్న వాము, జీలకర్ర్ర, శొంఠి, పాతబెల్లం కలిపి నేను తయారు చేసిన అజీర్తి గుళికలు రెండు తినిపించాను. దెబ్బకి తగ్గిపోయింది నొప్పి. ఇంటికి వెళ్లిపోతున్నారు” అంది.

“నేనింకా ఆమెకి అమ్మాయి పుడితే కాంతమ్మ అని, అబ్బాయి పుడితే కాంతారావు అని నీ పేరు పెడతారేమో అనుకున్నాను” అన్నా. “నీ పిల్లలకి పెడుదువుగానిలే” అంది నవ్వుతూ.

       అమ్మమ్మని చూసి అమ్మ చాలా సంతోషించింది. దాదాపు 15 సంవత్సరాలు తర్వాత మా ఇంటికి వచ్చింది. ప్రతీ సెలవులకి మమ్మల్నే రమ్మనేది. ఈసారి నేను పట్టుబడితే, కార్తీక మాసం వెళ్ళాకా వస్తానని, నా కోసమే వచ్చింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మమ్మ ఇక్కడ ఎలా ఉంటుందో? ఊరు మీద బెంగ పెట్టుకుంటుందేమో అనుకున్న మాకు రోజుకో షాక్ ఇస్తుంది ఈ కాంతమ్మ.

        ఓ ఆదివారం డోర్ బెల్ మోగితే తలుపు తీశాను. ఎవరో చిన్న అమ్మాయి. “ఎవరు?” అని అడిగాను. “ప్రమోద్ అన్నయ్యా, నేను స్వీటీని” అంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. పక్క ఫ్లాట్లో నేను రోజూ చూసే స్వీటీ ఏనా?’ నవ్వాగలేదు నాకు.

“నీ జుట్టుకి ఏమయ్యింది?” అడిగాను నవ్వుతూనే.

“నా పీచు జుట్టులో నలుగురు దొంగా పోలీస్ ఆట ఆడుకోవచ్చు అంటూ, నన్ను ఏడిపించేవాడివి కదా! చూడు అమ్మమ్మ నా హెయిర్ స్టైల్ ఎలా మార్చేసిందో!” అన్నది. నూనె డబ్బాలో ముంచి తీసినట్టుంది స్వీటీ మొహం. “అమ్మమ్మ ఏదీ?” అని అడిగాను. “మెట్ల దగ్గర ఉంది నిన్ను రమ్మంటుంది” అని చెప్పింది.     

       ఎప్పుడూ నిశ్శబ్దంగా, పగలు కూడా అలికిడి ఉండని ఆ మెట్లమీద ఒకటే కిలకిలలు. ‘ఏమిటా?’ అని చూద్దును కదా, అపార్ట్మెంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ పోగేసి, ఊరి నుంచి ఆవిడ తీసుకొచ్చిన మందార నూనెని వాళ్ళ తలలకి పట్టించి, రిబ్బన్లు బదులుగా షూ లేసులను కట్టేస్తూ, రకరకాలుగా జడలు వేస్తోంది.

స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు, ఆంటీలు అమ్మమ్మ చుట్టూ ఉన్నారు. పీచు మిఠాయి లాంటి జుట్టుతో ఎప్పుడు చూసినా పోలేరమ్మ గుడిలో పూనకం వచ్చిన పెద్ద ముత్తయిదువ జుట్టులా విరబుసుకుని తిరిగే ఈ అమ్మలక్కలంతా గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు. నూనెలో నుండి అప్పుడే తీసిన వడియాల్లా ఉన్నాయి వాళ్ళ మొహాలు. స్కూలుకెళ్లే పిల్లలందరూ చిట్టి చిట్టి పెసర వడియాల్లా, కాలేజ్ అమ్మాయిలు అందరూ పిండి వడియాల్లా, ఇక ఆంటీలందరూ అప్పడాల్లా.  వాళ్ళ అందమైన మేకప్ మొహాలు మందార నూనెతో మెరిసిపోతున్నాయి. వాళ్ళందరినీ చూసి నవ్వు ఆపుకుంటున్నాను. “రారా ప్రమూ! నీకు కూడా నూనె పట్టించి చిన్నప్పుడేసినట్లు రెండు పిలకలేస్తాను” అంటూ పిలిచింది. అక్కడే ఉంటే నా బుర్ర కూడా రామ కీర్తన పాడేస్తుందని భయమేసి గబగబా ఇంట్లోకి పారిపోయాను.

ఆ సాయంత్రం బయటికి తీసుకెళ్లి అమ్మమ్మకి పిజ్జా, బర్గర్ రుచి చూపించాను. పిజ్జా లోంచి చిన్న ముక్క తుంచి, పక్కన పెట్టి, నీళ్లు జల్లి మూడు సార్లు చెయ్యి ఊపి దేవుడికి దణ్ణం పెట్టుకుని అప్పుడు తిన్నది. చూసినవాళ్లు ముసి ముసిగా నవ్వుకుంటున్నారు. దేవుడికి పిజ్జా ప్రసాదం పెడుతోందని నవ్వొచ్చింది నాకు కూడా. “ఎలావుంది?” అని అడిగాను. “ఛ ఛ.. ఏమిట్రా ఇది? బన్ను ముక్క. దీనికంటే మనం వేసుకునే దిబ్బరొట్టె కాస్త కరకరలాడుతూ కమ్మగా ఉంటుంది” అనేసింది. “చిరుతిళ్ళు అంటే ఇలా చడీచప్పుడూ లేకుండా ఉంటే ఎలా? కరకరలాడిస్తూ మనం తింటున్న సౌండ్ కి పక్కనున్న వారి చెవులు మెదిలి నోట్లో నోరూరాలి.” అని మరుసటి రోజు వాచ్మెన్ రూమ్ పక్కన వంట మొదలెట్టి అపార్ట్మెంట్లో వాళ్లందరికీ కరకరలాడే జంతికలు, చెగోడీలు, గులాబీ గుత్తులు అంటూ రకరకాల పిండివంటలు చేయటం మొదలెట్టేసింది. ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని అందరినీ భాగస్తులను చేసేది.

         ఒకరోజు ఎదురు ఫ్లాటు సుజాతక్క కొడుకుని ఎత్తుకుని వాడి మూతిని చీరచెంగుతో తుడుస్తూ వస్తోంది అమ్మమ్మ. వస్తూనే, “ఒరేయ్ ప్రమూ! వీడు చూడు మాయాబజార్ సినిమాలో ఎస్వీ రంగారావులా ఎంత ముద్దుగా ఉన్నాడో! వెధవ, చేతికి ఏది అందినా, నోట్లో పెట్టేసుకుని చప్పరించేస్తున్నాడు. వాడి గుప్పిట్లు నోట్లో ఎలా కుక్కేసు కుంటున్నాడో!” అంటూ వాడిని నాచేతికిచ్చి మెటికలు విరిచి దిష్టి తీసింది. వాడు ఈ అపార్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చాక, ఈ ఫ్లోర్ వాళ్లెవ్వరమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. రాత్రంతా బేర్ బేర్ మంటూ ఒకటే ఏడుపు. అమ్మమ్మ వచ్చినప్పటి నుండి వీడి ఏడుపు వినిపించటం లేదు. సన్నగా ఉండేవాడు కాస్త బొద్దుగా తయారయ్యాడు. 

సుజాతక్క కూడా ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా కనిపిస్తోంది. కారణం అమ్మమ్మ అని తెలుసు. ఏ ఆయుర్వేద చిట్కాలు చెప్పిందో కానీ, ఈ బుల్లి ఘటత్కచుడితో పాటు మేమంతా కూడా కంటి నిండా నిద్రపోతున్నాము అనుకుని, కాసేపు వాడితో ఆడుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాను.

       ఈవెనింగ్ ఇంటికి వచ్చేసరికి నాన్న సైలెంట్ గా సోఫాలో కూర్చొని ఉన్నారు. అమ్మ మాత్రం పకపకా నవ్వుతుంది. అమ్మమ్మ కళ్ళజోడు ముక్కు మీదకు లాగి వాళ్ళిద్దరిని మార్చి మార్చి  చూస్తోంది.

“నాన్నా ఏమిటి విషయం? ముఖం ఎందుకు అలా పెట్టారు?” అడిగాను. “విషయం తెలిస్తే నా ముఖంలా అవుతుంది నీ ముఖం కూడా” అన్నారు. అమ్మ మళ్ళీ నవ్వటం మొదలెట్టింది.

“అబ్బా! చెప్పమ్మా ఏం జరిగింది?” నవ్వుతూనే చెప్పింది అమ్మ.

“పొద్దున్నే మీ అమ్మమ్మ సూది కావాలంటే ఇచ్చానురా. పని అయ్యాక సూదిని క్యాలెండర్ గుచ్చటం అలవాటు కదా. మన ఇంటిలో క్యాలెండర్ కనబడకపోయేసరికి నాన్నగారు ఫైల్స్ లో ఒక పేపర్ కి గుచ్చిందంట” అని చెప్పడం ఆపేసి పెద్దగా నవ్వడం మొదలెట్టింది.

“తర్వాత ఏమయిందో చెప్పు” అన్నాను. “నేను చెబుతాను” అన్నారు నాన్న. “ఫైల్ లో సంతకం చేసేటప్పుడు ఆ సూది మా బాస్ చూపుడువేలులో దిగబడి అటు నుండి ఇటొచ్చేసింది . ఏదో గునపం దిగబడినట్లు పెద్ద రాద్ధాంతం చేసి, మీరు కాబట్టి ఊరుకుంటున్నాను. ఎవరైనా అయితే అటెంప్ట్ టు మర్డర్  కేసు పెట్టేవాడిని అని నాకు క్లాస్ పీకాడు” అన్నారు నాన్న. నేను కూడా పెద్దగా నవ్వటం మొదలెట్టాను.

నాన్న ఉడుక్కుని “అసలు ఆ సూదితో మీ అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా?” అన్నారు. “ఏం చేసింది?” అన్నాను. “నీ కొత్త జీన్ ఫాంటుల చిరుగులన్నీ కుట్టేసింది. మొన్నే నాలుగు వేలు పోసి కొన్న కొత్త ప్యాంటు కూడా” ఈసారి నాన్న నవ్వటం మొదలు పెట్టారు.

నా నవ్వు ఎగిరిపోయింది. “ఒసేయ్ అమ్మమ్మ అవి చిరుగులు కాదు ఫ్యాషన్.” అన్నాను. “నాకు తెలుసు”అంది నింపాదిగా. “తెలిసే కుట్టేశావా!” అన్నాను. “అవున్రా! రాజా లాంటి నా మనవడు అలా చెరిగి పోయిన బట్టలు వేసుకోవడం నాకు నచ్చలేదు. ఎంత ఫ్యాషన్ అయినా సరే” అన్నది. ఇంకేం అంటాం, ఆ ఒక్క మాటతో నోరు మూయించేసిందిగా.

రోజూ నేను ఇంటికి వచ్చేసరికి పిల్లలందరికీ పాత కాలం నాటి ఆటలు నేర్పిస్తూనో, వేమన పద్యాలు, శ్లోకాలు వల్లే వేయిస్తూనో కనబడేది. ఆ పిల్లల్లో నన్ను నేను చూసుకుంటూ, తిరిగిరాని నా బాల్యాన్ని తియ్యగా తలుచుకునేవాడిని.

ఆ రోజు సాయంత్రం అమ్మమ్మ కనబడలేదు. “అమ్మా, మీ మమ్మీ గుడికి వెళ్ళిందా?” అని అడిగాను. “గుడికెళ్లి, కృష్ణా! రామా! అంటూ కాలం గడిపే టైప్ కాదు మీ అమ్మమ్మ” అన్నది అమ్మ. అంతలో ఏదో అలికిడి. ఎలకలు, చుంచులు యుద్ధం చేసుకుంటున్నట్టు వెరైటీ సౌండ్స్ వస్తున్నాయి. “అమ్మా...ఏంటి ఈ శబ్దాలు? ఎలకలు చేరాయా?” అన్నాను. అమ్మ నవ్వుతూ “ఎలకలన్నీ టెర్రస్ మీద ఉన్నాయి. వెళ్లి చూడు” అన్నది. ఎందుకయినా మంచిదని పెద్ద కర్ర తీసుకుని వెళ్లి చూస్తే, అపార్ట్మెంట్లో ఉన్న సగం జనం అక్కడే ఉన్నారు.  అమ్మమ్మలా పెద్దగా సౌండ్ చేస్తూ టీ తాగుతున్నారు అందరూ. పకపకా నవ్వేస్తూ, నన్ను చూసి నాకూ ఒక కప్పు అందించింది అమ్మమ్మ.  ఇంకేముంది ఆ ఎలకల గుంపులో నేను ఒక ఎలకను అయిపోయాను.

చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉంది అక్కడంతా. వేరుశనక్కాయలు, తేగలు, కొబ్బరి పువ్వులు, మరమరాలు, కారపు అటుకులు వరసగా ఉన్నాయి. ఎవరికి కావలసినవి వారు తింటున్నారు.

        అసలు అమ్మమ్మ ఆ పల్లెటూరు వదిలి ఇక్కడ ఎలా ఉంటుందో అని అనుమానపడ్డాను. కానీ నా ఆలోచనలకు భిన్నంగా ఈ అపార్ట్మెంట్ ని పల్లెటూరిగా మార్చేసింది అమ్మమ్మ. ఎప్పుడు చూసినా ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపే మా అందరినీ ఒక కుటుంబంగా మార్చేసింది. అందరికీ సహాయపడుతూనే, పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చేసుకుంది. కాకులు దూరని కారడవిలో వదిలేసినా సంతోషంగా బ్రతికేయగలదు. ‘నువ్వు కాంతానివి కాదు అందరినీ ఆకర్షించే పెద్ద అయస్కాంతానివి’ అని మనసులో అనుకుంటూ దగ్గరగా వెళ్లి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాను.

“ఏరా మనవడా, పెళ్లి సంబంధాలు చూడమంటావా?  నీ పెళ్లికి సందడి చెయ్యటానికి వీళ్లంతా రెడీగా ఉన్నారు.” అంది గుసగుసగా.

“జీవితాంతం ఇలాంటి సందడి నా చుట్టూ ఉండాలమ్మమ్మా! నీ లాంటి అమ్మాయినే చూడు. తప్పకుండా చేసుకుంటాను.” అన్నాను నా ఎదురుగా కనిపిస్తున్న వసుధైక కుటుంబాన్ని చూస్తూ.

*****

أضف تعليقات

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)