పచ్చని కన్నీళ్లు
పచ్చని కన్నీళ్లు (Author: భమిడిపాటి విజయలక్ష్మి)
నీవు అలసి సేద తీరుతున్న చెక్క బల్లను
ప్రేమతో ఎప్పుడైనా తడిమావా?
తడిమితే నీకు తగిలేవి తరువు తల్లి కన్నీళ్లు
నీకు, విపత్తులకి అడ్డుగా ఉన్న పచ్చని చీరని
దుస్సాసన హస్తంతో లాగకు
నేల తల్లి తల్లడిల్లిందా
విపత్తుల కురుక్షేత్రంలో
వంటరి దుర్యోధనుడిలా దాక్కోడానికి
నీకు నీటి మడుగు కాదు కదా
మురికి చుక్క కూడా దొరకదు
సప్తవర్ణాల హరివిల్లు హారంతో
కళకళలాడే ఆకాశానికి
కాలుష్యపు కాటుకను పూస్తున్నావెందుకు?
అభివృద్ధి అంటూ
ఆకాశానికి కాంక్రీట్ నిచ్చెన వేస్తూ
రవికి నీకు నడుమ ఉన్న
సన్నని ఓజోన్ గీతను చెరిపేస్తూ
నీ బతుకును
బొగ్గు పాలు చేసుకుంటున్నావెందుకు?
కర్బన రేణువులను వడపోసే
యంత్రాల తయారీ ఆపేస్తున్నావు
పక్షుల నీడను
కర్కశంగా కూల్చేస్తున్నావు
నిజానికి
నీ ఆయువు గొట్టాలని
నువ్వే నిలువునా నరుకుంటున్నావని
మర్చిపోతున్నావు
పుట్టుకకు చావుకి మధ్యలో ఇల్లు కట్టుకో
కానీ చితి పేర్చుకోకు
పచ్చని చిగురే
చినుకై చేరుతున్న చరిత్రను చించేయకు
భూగోళంను భగభగ మండే అగ్నిగోళం చేయకు
నువ్వు గమనించావో లేదో
అక్కడ అడవిలో ఒక ఆకును కూల్చావు
ఇక్కడ నీ ఆయువు తూకం తేలిపోయింది
నువ్వు వెళ్తూ వెళ్తూ
పుడమి తల్లి ఒడిలో
కొత్త విత్తుల ఒడిబియ్యాన్ని వేసి వెళ్ళు
అది ఎన్నో తరాలకు ఊపిరి భరోసా
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)