నాకొక మనిషి కావాలి
నాకొక మనిషి కావాలి (Author: చొక్కర తాతారావు)
నిన్న ఒక మనిషిని చూశాను
మనిషి మనిషిగా లేడు
నిన్న మొన్న అటు మొన్న
ఎవర్ని చూసినా అలాగే కనిపించారు
ఏమైంది ఈ మనుషులకు?
తలకు కేలిక్యులేటర్లు కట్టుకుని
చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని
హడావుడిగా తిరుగుతున్నారు
పక్కవాడిని పట్టించుకోలేనంత
ఒకటే బిజీగా ఉన్నారు
మాటలు లేవు
మౌనమే వాళ్ళ భాష
బంధాలు బాధ్యతలు వదిలేసి
బయట బలాదూర్ తిరుగుతున్నారు
నిద్రకు దూరమైన దేహం
నిశీథిలో ఆనందం వెతుక్కుంటోంది
ఆనందంలో ఓ చిరునవ్వు
వేదనలో ఓ కన్నీటి చుక్క
కష్టంలో ఓ చేయూత
ఇవన్నీ మనిషి ఎప్పుడో మర్చిపోయాడు
రెప్పల మధ్య స్వప్నాల్ని చేతుల్లోకి తీసుకుని
కంటి పొరలను కాపలా పెట్టి
విలాసాల అగాధాల్లోకి మనిషి కూరుకుపోతున్నాడు
దేహం నిండా నిరాశా నీడలు పేర్చుకుని
ఆశల ఒయాసిస్సుల వెంట పరుగెత్తుతున్నాడు
మనిషి మనిషిగా బతకడం
మనిషిని కలుపుకుని మసలడం
మనిషి ఎప్పుడో మర్చిపోయాడు
నాకొక మనిషి కావాలి
మంచితనం మనిషితనం కలిసిన
మానవత్వమున్న మనిషి కావాలి
నాకొక మనిషి కావాలి
ప్రేమ ఆప్యాయత నిండిన
స్వచ్ఛమైన మనిషి కావాలి
----