ఒరేయి నాన్నా!  (Author: కోరాడ అప్పలరాజు)

ఒరేయ్ నాన్నా..!

ఒకసారి మీ అమ్మని చూసి వెళ్ళరా

నీ కోసం నట్టింట్లో కూర్చుని

చంద్రుని కోసం చూసే కలవల్లా..

గుమ్మానికి రెండు కళ్లు తగిలించి..

గుండెల్లో భారంతో..

ఎదురు చూస్తుంది రా..!

ఒరేయ్ నాన్నా..!

ఒక సారి నా భుజాలు ఎక్కి కూర్చోరా

ఏనుగు మీద రాకుమారుడు ఊరేగినట్లు

నిన్ను ఊరు వాడా

తిప్పి తీసుకొస్తాను.!

ఒరేయ్ నాన్నా..!

నీకు గుర్తుందా.. కన్నా..?

నీకు ఆటలంటే ఇష్టమని

నీ మనసు కష్టపెట్టకూడదని

ఆరుబయట ఆటలాడి

ఎప్పుడో గోధూళి వేళకి వచ్చినా నిన్ను ఏమీ అనేవాళ్ళం కాదు.

నువ్వొచ్చే వరకూ  మా మనసులు

అత్తి పత్తి పువ్వల్లా ముడుసుకుపోయేవి.

నిన్ను చూశాకే కదరా

మా మనుసులు..

మల్లెల్లా పరిమళిoచేవి.

ఒరేయ్ నాన్నా..!

ఈ  మధ్య  నువ్వు l

నీలా ఉండడమే మానేశావు.

ఆరుబయట ఆటలకు

ఆనవాళ్లు చెరిపేసి..

చరవాణి వలలో చిక్కుకుపోయావ్.

ఆ సెల్ మన పాలిట

హెల్ అవుతుందనుకోలేదురా..!

ఒరేయ్ నాన్నా..!

నువ్వు మా వంశాంకురానివి కదరా!

అందుకే కాబోలు..

నీకు ఇంటిల్లిపాదీ ఫిదా..

కానీ నీ జ్ఞాపకాలే మమ్మల్ని

వెంటాడుతున్నాయి  సదా!

ఒరేయ్ నాన్నా..!

ముగ్గు బుట్ట వంటి తలతో

నీ నాయనమ్మ..

కళ్ళల్లో వత్తులేసుకుని కూర్చుందిరా..!

మీ తాతయ్య..

నిన్ను కథల వనంలో తిప్పి

చెప్పిన సుద్దులు, బుద్దులు..

అలా చెరిపేసి వెళ్లిపోయావేం రా..!?

ఒరేయ్ నాన్నా..!

పద్మ వ్యూహంలోకి వెళ్లడమే కానీ

బయట పడడం

తెలియని అభిమన్యుడిలా..

ఆన్లైన్ ఆటలనే వ్యూహంలో చిక్కి

అప్పుల ఊబిలో  కూరుకుపోయి

ఆయువుని అనంత

వాయువులో కలిపేసుకుని,

నందనవనం లాంటి ఇంటికి

నిశీధిని నేస్తం చేసావ్ కదరా!

ఒరేయ్ నాన్నా..!

నిన్ను లోకానికి

పరిచయం చేసిన అమ్మని

లోకాన్ని నీకు పరిచయం

చేసిన ఈ నాన్నని

ఇలా వదిలి అలా ఎలా వెళ్లాలనిపించింది రా..!?

ఒరేయ్ నాన్నా..!

నీ కాలిలో ముల్లు గుచ్చుకుంటే

మా కళ్లు కడవలయ్యేవి.

మరి ఆ లేత చివురు వంటి మెడకి

ఉరి ఎలా బిగించుకున్నావ్ రా..!?

ఆన్లైన్ ఆటలనే అసురత్వానికి

నిండు జీవితాన్ని..

ఎలా అర్పించావ్ రా..!?

ఒరేయ్ నాన్నా..! ఓసారి రారా..!!

నీ తలపుల్లో తడిసి ముద్దవుతున్న మేము..

నీ కోసం మన ఇంటి తలుపులు

తెరిచే ఉంచాం రా..!

ఆ మాయదారి ఆటలు..

మనిషిని మాయం చేస్తాయని

మహికి తెలియజేయాలి రా..!

ఒరేయ్ నాన్నా ఒకసారి రారా..!!

أضف تعليقات