ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును  (Author: డా. ఎం. కోటేశ్వరరావు)

24. 04. 1994. సాయంత్రం 5. 00 గంటలు. చిత్తూరు. ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉన్న వీధి. నేను, నా ఫ్రెండ్స్ శంకర్, చంద్రమోహన్, రఘునాథ్ బాల్కనీలో కూర్చొని వీధిలోకి చూస్తున్నాం. ఆ పైవాడు ఆడించే జగన్నాటకం అనే ముగింపు లేని డైలీ సీరియల్ లో, మా కర్థం కాని వింత పాత్రల్ని పోషిస్తున్న, ఆ వీధికి చెందిన ముగ్గురు కథానాయికల గురించి, తళుక్కు మని మెరిసి మాయమై పోయే ఎక్స్ ట్రా ఆర్టిస్ట్స్ లాంటి కొత్త తారల గురించి... కులాసాగా చర్చించుకుంటూ, వాళ్ళ రాక కోసం ఎదురు చూసే నిత్య ప్రేక్షకులం మేము.  

               మేము అద్దెకు ఉంటున్న ఇల్లు టైటానిక్ ఓడ టైపు. అందువలన దానికి ఎదురు "ఇల్లు" ఉండదు. ఎదురు "ఇళ్ళు" ఉంటాయి. అలా మూడు ఉన్నాయి.  ఎడమ వైపు ఇంట్లో మాస్టర్ గాడ్జిల్లా, మధ్య ఇంట్లో రోజీ, కుడివైపు ఇంట్లో శైలాభాను ఉంటున్నారు. వయసులో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిలను మా నలుగురికీ పరిచయం చేయాల్సిన అవసరం కానీ, అవకాశం కానీ ఆ వీధిలో ఎవరికీ లేదు. కాబట్టి, ఆకార వికారాలను బట్టి మేమే ఆ పేర్లు పెట్టుకున్నాం.  

               మాస్టర్ గాడ్జిల్లాను చూస్తే, కలల స్టాపింగ్ లో, "పెళ్ళి" బస్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. మేమేదో పెళ్ళి చూపుల కొచ్చినట్టు, మమ్మల్ని చూసి, మోతాదు మించి సిగ్గు పడుతూ హైరానా అవుతూ ఉంటుంది.   రోజీ జూనియర్ ఇంటర్. ఆమెను బలవంతంగా పరీక్షల్లో గట్టెక్కించిన కోచింగ్ సెంటర్ వాళ్ళు, ఆమె ఫోటోను పేపర్ లో వేయించటం వలన ఆ విషయం మాకు తెలిసింది. రోజీ చుడీ దార్లు వేస్తుంది. పరాగ్గా ఉంటే ఉరి బిగిసి ప్రాణాల పైకి వచ్చేటంతగా, గొంతుపై వరకు టైట్ గా జిప్ వేసుకుంటుంది. ఇంత పకడ్బందీ రక్షా కవచాలు ధరించి కూడా, మమ్మల్ని చూసిన ప్రతిసారి ఒకటికి పదిసార్లు కాదు కాదు వందసార్లు జిప్ సరిగా ఉందో లేదో సరి చూసుకుంటూ ఓర చూపులు విసురుతూ ఉంటుంది. అలా అని ఏ రోజూ చున్నీ వేసుకున్న పాపాన పోలేదు.  ఇంట్లో కెళ్ళి, కిటికీ లోంచి మమ్మల్ని చూడటం, మాకు వినపడేలా మాట్లాడటం, కావాలనే మాకు కనిపించటం రోజీ ప్రధాన లక్షణాలు. ఇంత హంగామా చేసి కూడా, మేము ఎప్పుడైనా సూటిగా చూస్తే, ఆమె కళ్ళల్లో ప్రోత్సాహం కానీ, తిరస్కారం కానీ కనిపించవు. డైలాగ్ మర్చిపోయిన తారలా అర్థంకాని లుక్కేస్తుంది.  

              చివరి ఇంట్లోని శైలాభానుకి  పద్ధెనిమిది ఏళ్ళు ఉంటాయి. నానమ్మ చెప్పే కథల్లోని ఒంటి స్థంభం మేడలో ఉండే రాజకుమారి టైపు. గడప దాటి సారీ గేటు దాటి బయటకు వెళ్ళ నివ్వరు ఆమెను. శైలుకి మేమంటే అదేదో తెలీని “ఇది” మిగిలిన ఇద్దరు అమ్మాయిల కంటే చాలా ఎక్కువ.  వాకిలి ఊడ్చే పని, కళ్ళాపి చల్లేపని కల్పించుకొని, మా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తుంది ఎంత సేపైనా. మేము మా టైటానిక్ దిగి, క్లినిక్స్ కో, మెస్ కో వెళ్ళే టప్పుడు, శైల మాకు క్లోజ్ అప్ లో తటస్థ పడితే, మేము ఐలవ్యూ చెప్పి, ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తుంటే, ఏం చెప్పాలో అర్థం కానట్టు, తడబడి పోతూ, సిగ్గు పడుతూ, ముసి ముసిగా నవ్వు కుంటూ, రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి మమ్మల్ని మొహమాట పెట్టే స్తుంది.  

             అలా అని ఆ ముగ్గురు అమ్మాయిలు, మా నలుగురినీ పోటీపడి కేజీల లెక్కన ప్రేమించేస్తున్నారని మేము ఆశ కానీ, అపోహ కానీ పడటం లేదు. అదంతా టీనేజ్ తాలూకు సహజమైన ఆకర్షణో, వ్యక్తిగత కారణాలో, సమస్యలో అయి ఉంటాయని మాకు తెలుసు. మేము ఇంత గొప్ప విశ్లేషణ చేయటం వెనుక మాగొప్ప తనమేమీ లేదు. వద్దన్నా వచ్చి పడ్డ పాతికేళ్ళు ఫ్రీగా తెచ్చి పెట్టిన మానసిక పరిపక్వతా ప్రభావం అది. ఆ మాత్రం పరిపక్వత ఉన్న మేము కూడా, అమ్మాయిల వెైపు గుడ్లప్పగించి చూడటానికి కారణం“ఎంత వారలైనా కాంత దాసులే" సూత్రం వర్తించటం మాత్రం కాదు. మూడు నెలల“ఇంటర్న్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం" అనబడే గొడ్డు చాకిరీ చేయటానికి చిత్తూరుకి వచ్చాం మేము. ఈ చాకిరీ పూర్తి అవ్వగానే ఒక భుజం పైన పెళ్ళి బరువుని, మరో భుజం పైన ఉద్యోగ భారాన్ని ఎత్తుకొని, జీవితాంతం వెయిట్ లిఫ్టింగ్ చెయ్యక తప్పదు.  

              ఈ బరువులు, బాధ్యతలు, భార్య, పిల్లలు, కుటుంబం, సమాజం... వీటి మధ్య హుందాతనం, గౌరవం పెనవేసి కట్టేశాక, ఆ కొత్త జీవితంలో, కుర్ర తనానికి సంబంధించిన సరదాలకి ఏమాత్రం తావుండదు కదా. అందుకే... కళ్ళ ముందు వచ్చి వాలుతున్న పెద్దరికాన్ని బలవంతంగా తోలేస్తూ, చెయ్యి జారిపోతున్న కుర్ర తనాన్ని ఒడిసి పట్టుకొని, ఆఖరి మూడు నెలలు ఆనందంగా గడపటానికి, మంచి రోమియోలుగా మారక తప్పలేదు మాకు.  

              కూర రుచిగా ఉండటానికి ఉప్పు, కారం, పులుపు అవసరమైనట్టే... సృష్ఠి, అందులోని సమాజం అందంగా, ఆసక్తిగా, ఉత్సాహంగా ఉండాలంటే, కొంపలు ముంచని అల్లరి, చిలిపి చేష్టలు ఉండాలేమో. మరీ స్వీట్ సిక్స్ టీన్ లోనే ముక్కు మూసుకోని మునీశ్వరులు, యుద్ధం చేసిన అశోకుడు, బిడ్డను కన్న గౌతముడుగా మారితే, ఈ దేశం మానవ ధ్వజ స్థంభాల పై రెపరెప లాడే కాషాయాలతో, భరించలేనంత ప్రశాంతతను అలుముకుంటుంది. అలాంటి ప్రశాంతత రాకుండా, మా వంతు ప్రయత్నం చేస్తూ, ఎప్పటిలాగే పైవాడు ఆడిస్తున్న జగన్నాటకం లోని కథానాయికలు మాస్టర్ గాడ్జిల్లా, రోజీ, శైలాభానుల వెైపు చూస్తున్నాం మేము. రొమాంటిక్ గా సాగిపోతున్న ఈ డైలీ సీరియల్ కొత్త మలుపు తిరగ బోతున్నట్టు, ఆ రోజు ఎపిసోడ్ లో, ఆ వీధి వేదిక పైకి రెండు కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి.  

              వేడి తుపాకులు ఎక్కుపెట్టి, నూట నలభై నాలుగో సెక్షన్ అమలు చేస్తున్న సూర్యుడు కూడా, గుంపుగా వచ్చిన మబ్బు కన్యలను చూసి, చప్పున జావగారి పోయి, ఓ మేఘ సుందరి చెంగు చాటుకు చెంగున దూకటంతో వాతావరణం చల్లబడింది.  

             అమ్మలక్కలందరూ చిన్న పిల్లలతో వరండాల్లోకి చేరారు. వీధిలో జన సంచారం పెరిగి, సందడి మొదలయ్యింది. గాడ్జిల్లా, రోజీ, శైలాభాను మాపైన ఓర చూపుల శర పరంపరలను సంధిస్తున్నారు. బదులుగా మేము నలుగురం కించిత్ ధైర్యం లోపించిన జీవం లేని నవ్వుల శూలాలు విసురు తున్నాం. రామాంజనేయ యుద్ధం నాటకంలోలా... వాళ్ళ బాణాలు, మా శూలాలు వీధి మధ్యలో ఢీ కొని కుప్ప కూలి పోతున్నాయి... మా హాస వీక్షణాల రణం అలా సాగుతూనే ఉంది.  

              అప్పుడు... సరిగ్గా అప్పుడు వినిపించిందా కేక. ఆ స్వరంతో పరిపక్వత లేదు. శక్తి అసలే లేదు. జీవం మాత్రం పుష్కలంగా ఉంది. ఎందుకంటే... ఆ పిలుపు కడుపులో పుట్టి, గుండెల్ని చీల్చుకొని, బయటకు దూకి జీవం పోసుకుంది కాబట్టి. జీవం కోసమే పుట్టింది కాబట్టి. ఆడ, మగ ఆకర్షణని సైతం చిన్నా భిన్నం చేసి, గుండెను పిండేసేలా వినిపించిన ఆ కేకకి ఉలిక్కి పడింది మేము నలుగురం మాత్రమే. వీధిలో ఉన్న అందరికీ ఒకేసారి సామూహికంగా చెవుడు ఏర్పడినట్టు, ఎవరూ పట్టించుకోలేదు. ఆకలి, అలసట కలిసి యుగళ గీతం పాడుతున్నట్టుగా మరోసారి వినిపించింది ఆ కేక –“అమ్మా!   ఒక్క ముద్ద పెట్టు అమ్మా...! తెల్ల వారి నుంచి ఏమీ తినలేదు. కండ్లు తిరుగు తున్నాయి. ఒక్క ముద్ద ఉంటే పెట్టు అమ్మా!” అటు వైపుకి చూశాం మేము. ఓ పదేళ్ళ కుర్రాడు, ఎనిమిదేళ్ళ పాప అడుక్కుంటున్నారు. రంగు వెలిసి పోయి, రంధ్రాలు పడి, దారపు పోగులు వేలాడుతున్న గౌను ఉంది పాప ఒంటి మీద. ఆ లేత చేతుల్లో ఖాళీ విస్తరాకు. కుర్రాడు నిక్కర్ వేసుకున్నాడు. గుండీలు లేని ఒదులు చొక్కా మోకాళ్ళ వరకు వేలాడు తోoది. వాడి చేతిలోని ఆకులో కొద్దిగా అన్నం ఉంది. ఇద్దరి కాళ్ళకీ చెప్పులు లేక మట్టి కొట్టుకు పోయాయి. పోలికలను బట్టి అన్నా చెల్లెలు అని తెలుస్తోంది. దారిద్ర్యం, దురదృష్టం పట్టలేని మొహావేశంతో సంగ మించినప్పుడు ఉద్భవించిన కవల పిల్లల్లా ఉన్నారు వాళ్ళిద్దరూ.  

              ప్రతి ఇంటి ముందు నిలబడి అన్నం పెట్టమని దీనంగా బ్రతిమిలాడుతున్నారు ఆ పిల్లలు. మెతుకులే కాదు, మాటలు కూడా దానం చెయ్యలేనట్టు, అవతలికి పొమ్మని కొందరు సైగలు చేస్తుంటే, ఇంకొందరు కాస్త ఉదారంగా "రేయ్... పోరా" అని సమాధానం ఇస్తున్నారు.  

              బాల్కనీలో కూర్చోవటం వలన వీధి అంతా కనిపిస్తోంది మాకు. పిల్లలు ఇద్దరూ ప్రతి ఇంటి ముందు ఆకలి పాట పాడుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎంగిలి చేత్తో కాకిని కాదు కదా, ఒంటి మీద వాలిన ఈగల్ని కూడా తోలని యాజమానుల అలవాట్లని ఆసాంతం ఒంట పట్టించుకున్నట్టు... కొన్ని ఇళ్ళల్లోని బొచ్చు కుక్కలు“భొయ్" మంటూ ఆ పిల్లల్ని బెదర గొడుతున్నాయి.   తమతో జీతంలేని వాచ్ మన్ పని చేయించుకునేది చాలక, పిల్లలు పుట్టాక ఒక్కో దాన్ని వేలల్లో అమ్ముకొని, నోరు లేని తమతో వ్యాపారం చేసుకునే ప్రబుద్ధులు తమ యజమానులు అనే విషయం తెలియని ఆ మూగ జీవులు, తమకి పడేసిన బిస్కెట్ ముక్కలకి, బోన్ ముక్కలకు న్యాయం చేయాలన్నట్టు, విశ్వాసంగా మొరుగుతుంటే, భయంతో ఏడుస్తున్న చెల్లిని దగ్గరకు తీసుకొని, కుక్కల్ని అదిలిస్తున్నాడు ఆకుర్రాడు. వీధి మొత్తం అయిపోయింది. ఒక్కరూ ఆ పిల్లలకి భిక్ష వెయ్య లేదు. వీధి ఆ చివరి నుంచి మళ్ళీ ఈచివరికి వచ్చారు వాళ్ళు. మెతుకు రాలక పోయినా, అరిచి అరిచి మరింత ఆకలి పెరిగింది పిల్లలకి. శైలాభాను ఇంటి ప్రహరీకి బయట ఉన్న సన్నని అరుగు మీద కూర్చొని, వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది పాటి అన్నం తినటానికి ఉపక్రమించారు వాళ్ళు.“ ఏయ్...! ఛండాలపు యదవల్లారా.... తిన్నె అంతా కబ్బు సెయ్ బాకండి.

        “లేసి పొండ్రా" గేట్ బయట పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తున్న ఓ తల్లి కసురు కుంది. అరుగు పొమ్మంది, ఆకలి రమ్మంది అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి.   చెల్లెలి వెైపు ఓ సారి చూశాడు ఆ కుర్రాడు. లోతుకు వెళ్లిపోయిన కళ్ళు. ఎండి పోయిన పెదవులు. అంటుకు పోయిన పొట్ట. వాడి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. కానీ వాడు అది గుర్తించ లేదు. చెల్లెలి రూపం ఆ పసి మనసుని ఎక్కడ కదిలించిందో  కానీ, క్షణం ఆలస్యం చెయ్యకుండా, నడి వీధిలో బస్కీ వేసుకొని కూర్చున్నాడు. ఎదురుగా చెల్లెల్ని కూర్చో పెట్టుకొని, వాడి ఆకులో ఉన్న అన్నాన్ని కొద్ది కొద్దిగా తినిపించాడు. ఆకలిగా ఉన్న పాప ఆత్రంగా ముద్దలు అందుకుంటూ ఉంటే పొర మారింది. చెల్లెలి తల పై మెల్లగా తట్టి, మంచి నీళ్ళ కోసం చుట్టూ చూశాడు కుర్రాడు.“ ఇంద. కొంచెం. ఇంకొంచెం తాగమ్మా. మా బుజ్జి కదూ" వద్దని మారాం చేస్తూ, ఊసేస్తున్న మూడేళ్ళ పిల్లాడిని బుజ్జ గిస్తూ, బ్రతిమాలుతూ, వెండి గ్లాసు లోని నీళ్ళు తాగిస్తున్న ఆ వీధిలోని ఒకావిడ వెైపు ఆశగా చూశాడు కుర్రాడు. వాడి చూపుల్లోని భావం అర్ధమయ్యి, వాడి వైపు అసహ్యంగా చూసి, "హు..." అంటూ పిల్లాణ్ణి చంకలో వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిందామె. తనకి అక్కడ ఆదరణ లేదని అర్థమయ్యినట్టు పాప దగ్గు ఠక్కున ఆగిపోయింది. కుర్రాడు మళ్ళీ అన్నం తినిపించటం మొదలు పెట్టాడు. చిట్టి చెల్లెలి ఆకలి తీర్చాలనే ఆరాటం వాడిలో. ఆరగించాలనే ఆకలి పాపలో. ఆ ఆకలి, ఆరాటాల పోరాటంలో, నాలుగు మెతుకులు నోట్లోకి వెళుతుంటే, రెండు మెతుకులు నేల రాలుతున్నాయి. కింద పడ్డ అన్నం మెతుకుల్ని ఏరి చొక్కాతో తుడిచాడు. ఆ కింద పడ్డ అన్నం మెతుకులు తింటే చెల్లికి ఏమైనా అవుతుంది అనుకున్నాడో ఏమో... ఆ మెతుకుల్ని తన నోట్లోనే వేసుకున్నాడు. "ఛీ... కింద పడింది ఒద్దు అమ్మా. జబ్బు లొస్తాయి. నీకు ఇంకొకటి ఇస్తాగా"  రేఫర్ కూడా విప్పని చాక్లెట్ కింద పడితేనే, దానిని తీసుకో వద్దని కూతుర్ని వారిస్తున్న మరో తల్లి మాటలు విని, అన్నం తినిపించడం ఆపి, అటు వైపు చూశాడు కుర్రాడు. వేదాంతిలా కొన్ని క్షణాలు అలా చూసి, తనవైపు తాను చూసు కున్నాడు. మళ్ళీ అన్నం తినిపించటంలో నిమగ్నం అయ్యాడు. రెండు నిమిషాలు గడిచాయి.  

             పూర్వ జన్మలో ఆ కుర్రాడు హరిశ్చంద్రుడుగా పుట్టాడేమో, అప్పటి నక్షత్రకుడు యిప్పుడు కాకిలా మారి వేధించటం మొదలు పెట్టాడు. అసలే చిరిగి పోయిన విస్తరాకులో చాలీ చాలని మెతుకులు. ఒక చేత్తో ఆకు పట్టుకొని, మరో చేత్తో మీదికి దూసుకు వస్తున్న కాకిని తోలలేక అవస్థ పడుతున్నాడు. ఆ ప్రయత్నంలో అన్నం మెతుకులు నేల రాలిపోతున్నాయి. కాకి వేధింపు, కుర్రాడి ఎదిరింపు... చుట్టూ ఉన్న వాళ్ళు వేడుకగా చూస్తున్నారు. వాడికి సహాయం చేసే ఉద్దేశం లేదు ఎవరిలో. సరిగ్గా అదే సమయంలో... ఒక వీధి కుక్క భయంకరంగా అరుస్తూ... కుర్రాడి వెైపు దూసుకు వస్తోంది. ఏం జరగ బోతుందో ఊహించిన నేను అప్రయత్నంగా పైకి లేచాను. స్ప్రింగ్ లా మా బాల్కనీపై నుండి, మెట్ల వెైపు పరిగెత్తి, అమాంతం గేటు తెరుచుకొని వీధిలోకి వచ్చాను. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం వెైపు నిశ్చేష్టుడిగా చూస్తూ ఉండిపోయాను.

        అక్కడ... అక్కడ ఆకలి విప్లవం పరాకాష్టను అందుకుంది. ఆకలి అలుపెరుగని భీకర సమరం సాగిస్తోంది. జాతి, కుల, మత, లింగ, వయో భేదాలు లేని ఆకలి రక్కసి విశ్వరూపం దాల్చి, ఏక కాలంలో, మూడు విభిన్న శరీరాలను ఆవహించి, తన కబళం కోసం ఆశగా, ఆవేదనగా, ఆక్రోశంగా కోరలు చాచి విలయ తాండవం చేస్తోంది.“ముష్టి" యుధ్ధం చేస్తోంది. అన్నం ఉన్న విస్తరాకు నేల పైన పడిపోయింది. దాన్ని దక్కించుకోటానికి కాకి, కుక్క, కుర్రాడు కలబడి దొర్లుతూ హోరా హోరీ పోరాడుతున్నారు. కాకి అరుపులు, కుక్క మొరుగుడు, కుర్రాడి కేకలు, పాప ఏడుపు... దరిద్ర దేవత ఉచ్ఛ స్వరంతో, శోక సంగీతాన్ని ఆలపిస్తున్నట్టు, హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. కానీ ఆ వీధిలోని మిగిలిన వాళ్లందరికీ అదో ఉచిత వినోదంగా ఉంది. యువకులు ఈలలు, చప్పట్లతో ఆనందిస్తుంటే, పెద్ద వాళ్ళు ఆడా మగా తేడా లేకుండా విరగబడి నవ్వుతున్నారు.  

              దగ్గరకు వెళ్ళి కుర్రాడిని పైకి లేపాను. ఏడుస్తున్న పాపని దగ్గరికి తీసుకున్నాను. వీధి అంతా ఒక్కసారి మూగబోయింది. వాళ్ళు షాక్ లో ఉండగానే ఆ ఇద్దరు పిల్లలతో బాల్కనీకి చేరుకున్నాను నేను. బాత్ రూమ్ కి తీసుకువెళ్ళి, కుర్రాడి ఒంటికి అయిన మట్టి శుభ్రం చేశాను. ఇద్దరికీ కాళ్ళూ, చేతులు, ముఖం కడిగించి, మా రూమ్ లోకి తీసుకు వచ్చాను. ఆ అన్నా చెల్లెలు మా వైపు అయోమయంగా చూశారు. మేము నలుగురం మా జేబులు చూసుకున్నాం. అయిదు నిమిషాల్లో మా ముగ్గురు మిత్రుల జేబుల్లోని కొన్ని నోట్లు నా జేబులోకి చేరాయి. ఆరో నిమిషంలో నేను టౌన్ మధ్యలో ఉన్నాను.  

              భోజనాల టైమ్ కి డబ్బులు పట్టుకొని, వీధి వీధి తిరిగినా, పట్టెడు మెతుకులు దొరకటం గగనం అయిపోయేది మాకు చిత్తూరులో. అలాంటిది వేళ కాని వేళ. ఎక్కడా ఏమీ కనిపించ లేదు. గంట సేపు నేను కూడా అన్నం పాట పాడిన తర్వాత ఓ ఫాస్ట్ ఫుడ్ షాప్ కనిపించింది. ఏమున్నాయని అడిగాను. నాకు నోరు తిరగని, అర్థం కాని ఓ లిస్ట్ చదివాడు షాప్ అతను. అలా కాదని, డేగిషాలో కనిపిస్తున్న వేడి వేడి చికెన్ బిర్యానీ రెండు పొట్లాలు కట్టించి రూమ్ కి తిరిగి వచ్చాను నేను.  

              పిల్లలు ఇద్దరినీ కూర్చో పెట్టి, చెరో బిర్యానీ పొట్లం విప్పి వాళ్ళ ముందు పెట్టాను. ఆనందమో... ఆశ్చర్యమో... అభిమానమో... అనుమానమో...? పిల్లలిద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా బిర్యానీ వెైపు చూస్తూ ఉండి పోయారు. అభిమానందాశ్చర్యాల పైన ఆకలి విజయం సాధించినట్టు, అంతలోనే ఆరగించటం మొదలు పెట్టారు. తిని కడుపు నిండా నీళ్ళు తాగారు. తడి చెయ్యి నిక్కర్ కి తుడుచుకుని, బాల్కనీ చివర నిలబడి, వీధి అంతా చూశాడు కుర్రాడు.   అయిదు నిముషాల తరవాత వాణ్ణి చూసి ఆశ్చర్య పోయాను. వాడి చేతులు బిగుసు కున్నాయి. కళ్ళు ఎర్ర బడ్డాయి. ముక్కు పుటాలు అదురు తున్నాయి. వాడి భుజం పైన చెయ్యి వేసి, రూమ్ లోకి తీసుకు వచ్చాను.  

           

        “చెప్పు. ఎవరి మీద కోపంగా ఉన్నావ్?" నెమ్మదిగా అడిగాను. వాడు తల దించుకున్నాడు. మళ్ళీ రెట్టించాను. "ఈ ఈది లోని మనుసుల మింద అన్న. ఈ ఊళ్లోని అందరి మింద అన్"  వాడి శ్వాస వేగంగా ఉంది. "ఎందుకు"  "నన్ను నా సెల్లిని అడుక్కునేలా సేసినందుకు. సరేలే అని అడుక్కుంటుంటే, ఒక్క ముద్ద కూడా పెట్టనందుకు. మమ్మల్ని సూసి నవ్వు కొని, దొంగలని తిట్టి, అగుమానం సేసి నందుకు" మరోసారి వాడి చేతులు ఉక్కు కడ్డీల్లా బిగుసుకున్నాయి. “అయితే? ఇప్పుడు ఏం చెయ్యాలని అనుకుంటున్నావ్?" నా ప్రశ్నకి మరోసారి మౌనం వహించాడు వాడు. నేను రెట్టించటం మానలేదు.“సంపేత్తాను అన్న. నేను పెద్ద అయ్యినంక, ఈ ఎదవ నాయాల్లందర్నీ ముక్కలు ముక్కలుగా నరికి సంపేత్తాను. ఈ నా కొడుకుల డబ్బు దోసుకొని మరీ సంపేత్తాను అన్న... సంపేత్తాను.” ఆవేశం తో వాడి ఛాతీ వేగంగా కదులుతోంది. మాటల్లో కసి, కరకుదనం. ఈసారి షాకవ్వటం నా వంతు అయ్యింది.  

              కొంచెం తేరుకున్నాక అడిగాను.“మీ అమ్మా నాన్నల గురించి చెప్పు."“మాది నాయుడు పేట అన్న. మా నాయన, అమ్మ కూలీ సేసే దానికి ఈడికి వచ్చినారు. ఇసక టాట్టర్ మింద పని సేత్తా ఉంటే, టాట్టర్ తిరగబడి, అమ్మ, నాయన సచ్చి పూడ్సినారు. నేను, సెల్లి ఇట్టా మిగిలి పోయినాం" “తర్వాత?"  "నేను సిన్నోన్ని. ఏం సెయ్య గలను అన్నా? ఆడికీ అందరినీ పని అడిగినాను. సివరికి వొటల్లో కప్పులు కడుగుతాను అని బతిమాలినాను. ఎవరూ ఈయలే అన్న. సిన్నబ్బ ఆడితో రమ్మని పిల్సినాడు. ఆడికీ పోలా"  "చిన్నబ్బ ఎవరు? ఎక్కడికి రమ్మన్నాడు?" నాలో కొంచెం కుతూహలం కలిగింది. "సిన్నబ్బ కూడా నాలాగ అనాద. గుంతకల్లు రైల్లో సెత్త  ఊడ్సి, సిల్లర సంపాయిత్తాడు. ఈ అడుక్కునే కంటే, ఆ పనే మేలు అన్న”.“మేలు అన్నావు కదా. మరి అతను పిల్చినప్పుడు ఎందుకు వెళ్ళ లేదు?" "నేను ఒక్కన్నే అయితే నా సావు నేను ఎట్టాగో సావొచ్చు. మరి సెల్లెలో? ఎక్కే రైలు దిగే రైలు, ఆ పసి బిడ్డతో ఎట్టా కుదురుద్ది అన్నా? అందుకే. ఇంకే దారీ లేక అడుక్కంటా ఉండాను"  కన్నీళ్ళతో వాడి చెంపలు తడిచి పోయాయి. "నీ పేరు ఏంటి?"  "సీను. సెల్లి పేరు సీత"  "చూడు శ్రీను. నీ పరిస్థితికి బాధగానే ఉంది. అందరూ నిన్ను అసహ్యించు కోవటం తప్పే. అలా అని వాళ్ళందర్నీ నువ్వు దోచుకోవాలి అనుకోవటం, చంపాలి అనుకోవటం చాలా పొరపాటు.". "పొరపాటు ఏందన్నా? పని సేత్తా నంటే ఎవరూ ఈయలే. అడుక్కుంటే అన్నం పెట్టలే. పైగా గజ్జి కుక్కని సూసినట్టు అసియ్యంగా సూసి, నవ్వి అగుమానం సేత్తా ఉండారు. మరి మాలాంటి అనాదలు ఎట్టా బతకాలన్నా? మాకు బతికే అక్కు లేదా? మమ్మల్ని ఆకలితో, అగుమానంతో సంపాలని సూసే జనాన్ని నేను సంపాలను కోవటం పొరపాటు ఎట్టా అవుద్ద న్నా?”   శ్రీను ఉన్న పరిస్థితిలో, వాడి వాదన తప్పు అని ఎలా ఒప్పించాలో నాకు అర్ధం కాలేదు. "నీ లాంటి అనాథల కోసం గవర్నమెంట్ హాస్టల్స్ నడుపు తోoది. నువ్వు, సీత అందులో చేరొచ్చు కదా?"  " ఆ సంబడం కూడా తీరింది అన్నా. నాలుగ్గోడల మద్య బర్రెల్లా పెట్టినారు. ఆడ మేము సచ్చినామో బతికినామో పట్టించుకునే సర్కారోడు లేడు. ఆపీసర్లు లేరు.

        పొద్దంతా ఆడుంటే పెద్దోళ్ల గోసీలు ఉతకటం, లెట్రిన్ లు కడగటం, ఆళ్ళు పెట్టే పురుగులు పడ్డ నూకల జావ గ్లాసుడు తాగటం. లైట్లు ఉండవు. పాములు, దోమలు, రొచ్చు కంపు. ఆ నరకం కంటే ఈ నరకమే మేలని తప్పించుకొని వచ్చేసినం.   "శ్రీను...! నిన్ను, సీతను నేను చదివిస్తాను. నా దగ్గర ఉండి పోతారా?"  వాణ్ణి మార్చటానికి నా దగ్గర ఉన్న ఆఖరి అస్త్రం ప్రయోగించాను.   "నువ్వు యిప్పుడు ఏం సేత్తా ఉండావు అన్న?"  అది నేను ఉహించని ఎదురు ప్రశ్న. నా ఇంటర్న్ షిప్ ట్రైనింగ్ గురించి వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాను. "అన్నా! నీకు నేను కనిపించినాను కాబట్టి జాలితో నువ్వు ఇట్టా అంటా ఉండావు.   నీకు కనిపియ్ కుండా, నాకంటే ఎక్కువ కట్టపడే కుంటోల్లు, గుడ్డోల్లు ఎందరో ఉన్నారన్నా. ఆల్లు అడుక్కునే ఈలు కూడా లేని అనాదలన్న. మరి ఆల్లని గూడా మాతో పాటు సదివించి, అన్నం పెడతావా అన్నా?".  శ్రీను ప్రశ్నకి మరోసారి నా దగ్గర సమాధానం కరువయ్యింది. నా పరిస్థితి అర్ధమయ్యినట్టు వాడే మొదలు పెట్టాడు. " అన్నా! ఇది నీ ఒక్కని వల్ల అయ్యే పనికాదు. ఈ లోకంలో నీ లాంటి సదువు కున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు లచ్చల్లో ఉంటే, మాలాంటోల్లు వేలల్లో ఉంటారు.

        నీలాంటోల్లు పదిమంది సేరి, నా లాంటి ఒక్కన్ని సేర దీసినా, ఈ లోకంలో పేదోళ్ళు, అనాదలు కనిపీయరన్న. మీరు సేరదీసి అన్నం పెట్టక పోయినా పర్లేదన్న. సెయ్యని తప్పుకి దొంగల్ని సేసి, అసయ్యించి, ఎగతాళిగా అగుమానం సెయ్యకుండా ఉంటే సాలు. ఉజ్జోగం లేకపోయినా పెద్ద మనసుతో మమ్మల్ని సదివిత్తా నన్నందుకు దండాలన్న. ఎల్లొత్తా అన్న. ఎల్లే ముందు ఒక్క మాట అన్న. దేవుడు సిన్న సూపు సూసినందుకు, మమ్మల్ని ఆకలితో సంపాలని సూసే జనాన్ని మేము సంపటం తప్పదన్న. తప్పదు."  సీత చెయ్యి పట్టుకొని శ్రీను మెట్లు దిగి వెళుతుంటే బొమ్మలా చూస్తూ ఉండిపోయాను నేను.  

             శ్రీను మాటలు యింకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నలభై ముగ్గుర్ని నిర్దాక్షిణ్యంగా చంపిన నర హంతకులు పత్రికలకి చెప్పిన మాటలకి, శ్రీను మాటలకి పెద్దగా తేడా కనిపించలేదు నాకు.  

               ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదని ప్రజలు విమర్శించటం, నిరసించటం, సమ్మెలు చేయటం నిత్యం జరిగేదే. మరి సమాజం లోని ఆ  ప్రజలు,   మనుషులుగా, సాటి ప్రజల పట్ల తమ బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారని అడిగే దెవరు? నిరసించి విప్లవం తెచ్చే దెవరు? శ్రీను లాంటి ప్రజా బాధితులా? మనమైతే, మన సంఖ్య ఎక్కువ కాబట్టి, మనల్ని బాధించింది బస్సులు, రైళ్ళు కాకపోయినా, మూర్ఖంగా వాటిని తగల బెట్టి మన కోపాన్ని ప్రదర్శిస్తున్నాం. తక్కువ సంఖ్యలో ఉండే శ్రీను లాంటి వాళ్ళకి ఆ అవకాశమూ లేదు. అవసరమూ లేదు. వాళ్ళని ఎవరైతే బాధించారో, సూటిగా వాళ్ళనే దోచుకోవటం, అంతం చేయటం అలవాటైన గురి తెలిసిన విలుకాళ్ళు వాళ్ళు. అద్దంలో మన ప్రతి బింబమే కనిపిస్తుంది. సమాజంలో మన ప్రతి రూపాలే ఉంటాయి.

        మన ప్రతి ఫలాలే ఉంటాయి. మన చుట్టూ జరిగే మంచికి, చెడుకి మన బాధ్యత ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుందనేది అంగీకరించటానికి యిబ్బంది కలిగించే చేదు నిజం. మనసా, వాచా, కర్మణా మనిషి తనను తాను“మనిషి" గా నిరూపించుకోక పోతే, మహా విశ్వంలో మన సమాజం“ఇచ్చట నేరస్థులు తయారు చేయు బడును" అనే బోర్డు లేని నేరస్థుల కార్ఖానాగా మారక తప్పదు. శ్రీను లాంటి శక్తివంతంమైన, ప్రమాద కరమైన సజీవ మారణాయుధాలు ఉత్పత్తి కాక తప్పదు. ఎందరో చెప్పినట్టు నేరస్థులు పుట్టరు. తయారు చేయబడతారు. ఆ తయారీలో అసమర్థ ప్రభుత్వాలు, స్వార్థ పూరిత నాయకులు ముడి పదార్థాలు, ఇంధనాలు అయితే, మానవత్వం మర్చిపోయిన ప్రతి మనిషి, నేరస్థుల తయారీలో శ్రమించే ఒక్కో కార్మికుడు అవుతాడు.  జరిగిన దానిని నాలో నేనే సమీక్షించుకున్నాను.

              శ్రీను మాటలు అతిశయోక్తిగానో, వాడి వయసుకి మించినట్టు గానో అనిపించలేదు నాకు. ఎందుకంటే, వయసు కంటే అనుభవం గొప్పది. వయసుకి మించిన అనుభవాలను శ్రీను ఎదుర్కున్నాడు. ఆ అనుభవాల బడి నేర్పిన పాఠాలే వాడి మాటలు. సీత ఇంకా పసిపాప. తను మాట్లాడ లేక పోయినా, తన చూపుల్లో అన్నయ్య మాటలే కనిపిస్తున్నాయి.  

              నా కళ్ళ ముందు నుండి కదిలి వెళ్ళింది శ్రీను, సీతలే కాదు. వందల మంది ఉన్మాదుల ప్రతినిధులు. వేల మంది దోపిడీ దొంగల అనుచరులు. కోట్ల మంది నరహంతకుల వారసులు. వాళ్ళందర్నీ మన సమాజ సింహ ద్వారాలు తెరిచి స్వాగతం పలుకు తున్నది మనమే. అవును. ముమ్మాటికీ మనమే.  

        ***

1 تعليق

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)