అమ్మ నవ్వింది
అమ్మ నవ్వింది (Author: లింగా గౌతమ్)
నా పేరు దుర్గ, అమ్మవారి పేరు. రూపం కూడా అలాంటిదే అని అందరూ అంటుంటే మా నాన్న మురిసిపోయేవారు. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. అమ్మ మా ఇద్దరినీ చూసుకుంటుంటే నాన్న మా ఊర్లోనే మాకున్న ఇటుకబట్టీలు పొలాలు చూసుకునే వారు. సరిపోయినంత ఆస్తి దానితో పాటు స్వతహాగా నాకున్న అల్లరి కారణంగా అల్లారుముద్దుగా పెరిగాను. పెళ్లయ్యేదాకా కనీసం వంటగదికి వెళ్లాల్సిన అవసరమైనా రాలేదు. మా ఇంట్లో నా మాటకి అడ్డుగోడలుండవు. ఎక్కువసార్లు నవ్వడం కొన్నిసార్లు నవ్వించడం అన్నిసార్లూ అల్లరిపనులు చేయడంతో నా బడి చదువు మా ఊర్లోనే పూర్తయింది. కాలేజీ చదువుకి బస్సులో వెళ్లేదాన్ని. మొదటి ఆర్నెల్లు చాలా సరదాగా గడిచాయి. కొత్త స్నేహితులు, రెక్కలొచ్చిన వయసు కొత్త ఉత్సాహాన్ని మోసుకొచ్చింది. నాకెందుకో ఆ రోజులు చాలా నచ్చాయి. పెద్దగా చదవకపోయినా మంచి మార్కులే వచ్చేవి. నా కొచ్చే గొప్ప మార్కులకోసం మా ఊర్లోనో, మా ఇంట్లోనో ఎదురుచూసే వాళ్ళెవ్వరూ లేరు కాబట్టి నేను కూడా వాటికోసం ప్రయత్నించలేదు.
ఒకరోజు బస్సులో కిటికీ పక్కన కూర్చొని చిన్నగా నిద్ర ఒళ్ళోకి వెళ్ళబోతున్నాను, పక్కనే ఉన్న అనిత నన్ను సున్నితంగా లేపి, "దుర్గమ్మా, రోజూ నీ కిటికీ పక్కనే బండి మీద వచ్చే వాడెవడమ్మా?" అనడిగింది. నాకేమీ అర్ధం కాలేదు. "ఏంటీ??" అన్నాను
"నువ్వు కిటికీ పక్కనే కూర్చోవడం, నీ పక్కనే ఎవడో రోజూ బండిమీద నిన్నే చూసుకుంటూ రావడం నేను రోజూ చూస్తున్నా" అని అనిత అనగానే ముందు భయమేసింది. తరువాత అబద్దం అనిపించి బయటకు చూస్తే నిజంగానే ఎవరో బండిమీద నా పక్కనే వస్తున్నాడు. ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే కిటికీ మూసేసి వేరే సీట్లోకి మారిపోయాను. కానీ ఏదో ఉత్సుకత నన్ను వెంటాడుతూనే ఉండేది. నిజంగానే నాకోసం వస్తున్నాడా? నేనే తప్పుగా అర్ధం చేసుకుంటున్నానా? అనే సందేహం కొంత వచ్చినా మళ్ళీ అటువైపు చూసే దైర్యం చేయలేదు.
వారం రోజులు గడిసే దాకా మళ్ళీ ఎప్పుడూ కిటికీ పక్కన కూర్చోలేదు. కానీ ఒకరోజు 'నేనేమీ తప్పుచేయలేదు, నాకు నచ్చిన చోట నేను ఎందుకు కూర్చోకూడదు' అనిపించి. అదే కిటికీ సీటులోకెళ్ళి కూర్చున్నా. ఓ అరగంటకి నా పక్కన ముదురు నీలంరంగు బైక్ ప్రత్యక్షమైంది. అతని ముఖం చూసే దైర్యం చేయలేదు కానీ పొడుగుగా పెరిగిన నల్లని జుట్టు, వీపుకి తగిలించుకున్న ముదురు ఖాఖీ రంగు బ్యాగు, గేర్లు వేయడానికి ముందుకీ వెనక్కీ ఆడిస్తున్న కాళ్ళు, వాటికి తగిలించిన నలుపు తెలుపు కాన్వాస్ షూస్, మణికట్టుకు ఏవో పూసలదండ ఇవన్నీ కనిపించాయి. నాకోసమే వస్తున్నాడు అని నేను అనుకోవడం వల్లనే నాకు భయం భయంగా ఉంది కానీ నేను అలా అనుకోకపోతే ఏ సమస్యా ఉండదని అటువైపు చూడడం మానేశాను.
నేను బస్సు దిగే సమయానికి ఆ బండి అక్కడే ఉండేది. నన్నే చూస్తుంటే ఇబ్బందిగా కూడా అనిపించేది కానీ నిజంగా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఆతను ప్రయత్నించలేదు కాబట్టి నాకే సమస్యా కనబడలేదు. రోజులు ఎన్ని గడుస్తున్నా ఇదే జరుగుతూ వస్తుంది. నా పక్కనే నాకు తెలియని వాడొకడు నన్నే గమనిస్తూ ఉండడం ఒక్కోసారి విచిత్రంగా ఆశ్యర్యంగా కూడా అనిపించేది. ఎప్పుడైనా అతను లేడు అనిపిస్తే ఏదో కోల్పోయినట్టు అనిపించేది. ఒకరోజు బస్సుదిగి త్వరత్వరగా నడుచుకుంటూ మా ఇంటికి వెళ్లి పైన అంతస్తులో నా గది కిటికీ లోంచి బయటకు చూస్తే మా ఇంటినే చూస్తున్న బండి వాడు కనిపించాడు. అందమైన ముఖం, చురుకైన కళ్ళు అలా రెండుమూడు నిముషాలు అతన్నే చూస్తుండిపోయాను. కొంతసేపటి తరువాత ఇంకెప్పుడైనా బయట కనిపిస్తే గట్టిగా అడిగెయ్యాలనిపించింది. నాకు కూడా భయమే కానీ ఇలానే ఉండడం మరీ కష్టం. గట్టిగా కడిగిపారేద్దామని నిశ్చయించుకుని పొద్దున్నే కాలేజీ బస్సెక్కాను. బస్సు దిగగానే ఆ బండి నా పక్కనుంచి వెళ్తుంది. నేనే అతన్ని "ఆగు" అన్నాను.
"ఎందుకు మీరు నా వెంట వస్తున్నారు, చాలా రోజులనుంచీ చూస్తున్నా.. నాతో ఏమైనా పనా? నేను మీకు తెలుసా?" ఇలా పదుల సంఖ్యలో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నా. ఏ సమాధానం లేదు అడిగీ అడిగీ నేనే వెళ్ళిపోయా. నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా అని భయమేసింది. ఇంతకుముందు ఎవరిమీదా అలా చనువుగా అరచినట్టు నాకు గుర్తులేదు ఒక్క మా నాన్నతో తప్ప. అతనితో మాట్లాడేటప్పుడు బయటకి ధైర్యంగా ఉన్నా లోపల నా ఒళ్ళంతా చమటలు పట్టి ఒణికినట్టు అనిపించింది. కానీ ఎలానో అడిగేశా. అతను బాధపడి ఉంటే మళ్ళీ రాడు అనుకుని నా దారిలో నేను వెళ్ళిపోయా.
కానీ సాయంత్రం మళ్ళీ అదే తంతు. మాటలురాని ఆ బండి, మాట్లాడని ఆ నడిపేవాడు నన్నే అనుసరిస్తున్నారు. నాకెందుకో ఒక్క నిముషం జాలేసింది. పాపం నేనే లోకమైనట్టు నన్నే చూస్తూ ఒకమనిషి ఉండడం ఇదే మొదటి సారి. ఈ సారి వీలయితే మంచిగా మాట్లాడాలి అనిపించింది. కొన్నిరోజుల తరువాత ఒకరోజు సాయంత్రం అంతపనీ చేశాను. ఈ విషయంలో నాకు దైర్యం ఎక్కువేనేమో? నాకు కూడా తెలియదు. అతని మాటల్లో "నేనంటే తనకు ఇష్టమనీ. అందుకే నా వెంట పడుతున్నాడనీ, అతని భాషలో ఆ వెంటబడడాన్ని'ప్రేమ'అంటారనీ" చెప్పాడు. నేను ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయా. మంచివాడిలాగానే అనిపిస్తున్నాడు. ఏం చేయాలో అర్థంకాలేదు.
ఒకరోజు నాకు పెళ్లి చేయాలని మా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు నన్ను చూసి వెళ్లారు కూడా ఏవో కారణాల వల్ల అవి ముందుకు జరగలేదు. కానీ మొదటిసారి మళ్ళీ నన్ను చూడడానికి ఎవరో వస్తున్నారని ఆరోజు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉండమనగానే కంగారుగా అనిపించింది. వాళ్లెవరో వచ్చారు. చూసి వెళ్లారు. ఏ కారణం లేకుండానే నాకు నచ్చలేదు. సాయంత్రం నా గదిలోంచి చూస్తే బయట ఆతను ఉన్నాడు. ఏవో ఆలోచనల్లో ఎప్పటికో నిద్రపోయాను. పొద్దున్నే లేచి మా నాన్నకి నేను పెళ్లి చేసుకోను అన్నాను. ఎందుకన్నారు? ఇష్టంలేదన్నాను. మంచిసంబంధమని ఏవేవో చెప్పారు. ఒక్కసారిగా ఎందుకో నేను ఒకతన్ని ప్రేమించాను సాయంత్రం ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. మా అమ్మా నాన్న ఒక్కమాటకూడా మాట్లాడలేదు. మాట్లాడలేకపోయారేమో? నేను నిజంగా ప్రేమిస్తున్నానా లేదా కూడా నాకు తెలియదు.
ఆ క్షణం ఎందుకు అలా అన్నానో కూడా ఇప్పుడు అర్ధం అవ్వట్లేదు కానీ ఆ దైర్యం, చనువు మాత్రం మా నాన్న ఇచ్చిందే. చిన్నప్పటినుంచీ నా మీద ప్రేమే మానాన్నని నడిపిస్తుంది. నేనే మా నాన్న లోకం. నేను ఏం చేసినా మా నాన్న నన్నే సమర్ధించేవాడు. బహుశా ఇప్పుడు కూడానేమో? ఆ రోజు సాయంత్రం అతన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఎన్నో మాటలు ఏడ్పులూ అలగడాలూ తరువాత మా నాన్న అతనితో నా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. నా చదువుని విసిరి పారేసి పెళ్లి పీటలెక్కాను. అంతకుముందుండెన్నడూ ఆ చుట్టుపక్కల జరగనంత వైభవంగా జరిగింది నా పెళ్లి.
మూడు ముళ్లేసుకొని మూడు నెలలైంది. మా మామయ్య ఎప్పుడో చనిపోయారు. అత్తయ్య ఒక్కత్తే ఉన్నారు. మా ఆయన పదోతరగతి కూడా పూర్తి చేయలేదని నాకు పెళ్లయ్యాక తెలిసింది. వాళ్ళకి ఉన్న మూడెకరాల పొలం చూసుకుంటూ ఉండేవారు. కానీ చాలా మంచివారు ఎవ్వరినీ ఒక్కమాటకూడా అనరు. వాళ్ళ ఊర్లో ఆయనకి సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ మా అత్తయ్య గయ్యాళి ఏదో ఒక కారణంగా నాతో మా ఆయనతో గొడవలు పెట్టుకునేది. కొన్నాళ్లు విడిగా ఉన్నాం ఆవిడ ఆరోగ్యం బాలేదనీ వాళ్ళతో వీళ్ళతో చెప్పించి మమ్ముల్ని మళ్ళీ ఇంటికి రప్పించింది.
ఇక్కడ వ్యవసాయం సరిగా జరగక మా పుట్టింటి నుంచే డబ్బులు వస్తుండేవి. అయినా ఎందుకో మా అత్తయ్య నన్ను ఎప్పుడూ ఏదో ఒక కారణంగా తిడుతూ ఉండేది. ఈ లోపు మేము ముగ్గురం కాస్తా నలుగురం అవ్వబోతున్నామని తెలిసింది. ఆ కారణంగా నేను మా పుట్టింటికి వెళ్ళాను. మాకు కొడుకు పుట్టాడు, వాడ్ని తీసుకొని మళ్ళీ తిరిగి అత్తగారింటికి రావాలంటే కష్టంగా అనిపించింది. బాబుతో తిరిగి వచ్చిన నెలకి నాకూ మా అత్తయ్యకీ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది నేను కూడా సహనం కోల్పోయి గట్టిగట్టిగా అరిచాను. మా అయన అన్నీ విని ఆ రాత్రి ఎటో వెళ్ళాడు. ఆయనే వస్తాడులే అని నేనూ బాబూ పడుకున్నాము.
ఈ మాటలు రాయడం తప్పించుకుందామని చాలా ప్రయత్నిస్తున్నాను. రాస్తుంటే ఏడుపు కట్టలు తెంచుకొని వస్తుంది. మరుసటిరోజు పొద్దున్న పదిమంది ఎవర్నో మోసుకుంటూ వస్తున్నారు. వచ్చీ వచ్చీ మా ఇంటి ముందు ఆ మనిషిని పడుకోబెట్టారు. ఆ పడుకున్న మనిషి నాకు తెలుసు. అతనే నేను కాలేజీకి వెళ్తుంటే నా పక్కన బండి వేసుకొచ్చింది. అతనే నేను మా నాన్నముందు నిలబెడితే కనీసం ఇంట్లో అడగకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రమాణం చేసింది. అతనే నన్ను నా బిడ్డని వందేళ్లు జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించి మోసం చేసింది. ఇలా నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకొని తప్పించుకొని వెళ్ళిపోతే నేను ఏం చేయను? భూమి పగిలి అందులో నేను కూరుకుపోతున్నానా. ఆకాశం నామీద కూలిపోతుందా అర్ధం అవ్వలేదు. బాధ ఇంత తీవ్రంగా ఉండదని ఆ క్షణం దాకా నాకు తెలియదు. ఇంట్లో తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ లేరు. మా నాన్నే అల్లుడికి తలకొరివి పెట్టాడు. పదినెలల పిల్లాడితో నన్ను తనతో పాటు మా ఇంటికి తీసుకెళ్లాడు.
ఓ చీకటి గదిలో ఎన్నో నెలలు గడిసిపోయాయి. నేను అల్లరిగా చనువుగా తిరిగిన ఈ ఇల్లు నా బాధని చూడడం ఇదే మొదలు. వందల తుఫాన్లకి తట్టుకున్న మా ఇల్లు కూడా నా కన్నీరు కురవకుండా మాత్రం ఆపలేకపోయింది. ఏడ్చి ఏడ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు పగళ్లు నా కన్నీటిలో పడి కనబడకుండా పోయేవి. దీనికి కారణం నేనా? మా అత్తయ్యా? బ్రతకడానికి ధైర్యంలేని మా ఆయనా? ఎవరో కూడా నాకు అర్ధం అవ్వలేదు. నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. బాబుని చూసుకుంటూ బ్రతకడం ఒక్కటే ఇప్పుడు నేను చేయాల్సిన పని.
నేను నా జీవితాన్ని కోల్పోయి రెండేళ్లు అవుతున్నాయి. బాబుకి ఇప్పుడు మూడు సంవత్సరాలు. ఒకరోజు ఎందుకో బాగా లావు అవుతున్నాడనిపించి హాస్పిటల్ కు తీసుకెళ్ళాము. చాలా పరీక్షల తరువాత, చాలామంది డాక్టర్లకు చూపించాక బాబుకి ఆటిజం అనే మానసిక సమస్య అని తేల్చారు. ఎందుకు వచ్చిందో ఎవ్వరూ చెప్పలేక పోయారు కానీ తగ్గించే మందులు లేవనీ ఉన్న మందులు కేవలం బ్రతకడానికి సహాయం చేస్తాయనీ చెప్పారు. నా జీవితంలో రెండోసారి కుప్పకూలి పోయాను. ఇంకెంత లోతుకి నన్ను తీసుకెళ్తావు దేవుడా అని ఏడ్చి మొరపెట్టుకున్నా ఏ లాభం లేదు. ఒక మనిషి కళ్ళముందు లేకుండాపోయి బాధపెడితే ఒకడు ఉండి ఇంకాస్త ఎక్కువ బాధ పెడుతున్నాడు. ఆ మూడు సంవత్సరాలు ఏం నేర్చుకున్నాడో జీవితమంతా కేవలం అవే గుర్తుపెట్టుకుని ఏమీ తెలియని అమాయకుడిని జీవితాంతం నేను చూసుకోవాలి. చూసుకుంటాను నేను అమ్మని కదా? పిల్లల బాల్యం ఏ తల్లికైనా అయిదారేళ్ళు కానీ నాకు ఈ మూడేళ్ళ మానసిక వయసున్న పిల్లాడే నా జీవితమంతా ఉంటాడు.
మొదటి రెండు మూడు సంవత్సరాలు ప్రతీ క్షణం బాధ కోపం విసుగు వచ్చేవి కానీ క్రమంగా అవి కూడా పోయేవి. మానసికంగా నా అంత దృడంగా లేని మా అమ్మా నాన్న ఒక్కొక్కళ్ళుగా వెళ్లిపోయారు. ఈ కళ తప్పిన ఇంట్లో నేనూ నాతో పాటు అరుస్తూ అందర్నీ కొడుతున్న నా కొడుకూ. కొన్నాళ్ళకు మా ఇంటివైపు ఎవ్వరూ రావడం మానేశారు. వచ్చిన వాళ్ళమీదకి రాళ్లు విసిరేస్తుంటే ఎవరైనా ఎందుకొస్తారు. ఒకరోజు బడికెళ్లే పిల్లలమీద రాళ్లు విసిరేస్తే వాళ్ళ తలలు పగిలి రక్తమొచ్చింది. వాళ్ళ అమ్మానాన్నా మా ఇంటిమీదకి గొడవకొచ్చారు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా ఊరుకోకుండా నా కొడుకుని కర్రతో కొట్టి వెళ్లారు. నాకు చాలా బాధేసింది. చాలాసార్లు ఇద్దరం చనిపోతే బాగుండు అనిపించింది.
నాన్న చనిపోయాక పొలం చూసుకునేవాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు. ఆర్ధికంగా బాగా బ్రతికిన మేము ఇప్పుడు పిల్లాడి మందులకు ఇంట్లో సరుకులకు ఇబ్బంది పడడం బాధేసింది. కొంతమంది బంధువులు నా కొడుకుని ఏదో ఆశ్రమంలో వదిలేసి వచ్చి వేరే పెళ్లి చేసుకొమ్మని సలహాలిచ్చారు. ఒకసారి బలవంతంగా వాడిని తీసుకెళ్లి ఏదో పిచ్చోళ్ళ హాస్పిటల్లో వదిలేసి వచ్చారు. ఆ రోజు రాత్రి ఇంటి నిండా నిశ్శబ్దం వాడి అరుపులకంటే భయంకరంగా ఉంది. పొద్దున్నే నేను వెళ్లి నా కొడుకుని తెచ్చుకున్నాను. వయసు పెరుగుతున్నా, దేహం పెరుగుతున్నా వాడి మనసు మాత్రం మూడు సంవత్సరాలదే. చూస్తుండగానే కాలం కదిలి వాడికి ఇరవైనాలుగేళ్ళు వచ్చాయి. ఈ వయసు కొడుక్కి స్నానం చేయించడం. మలమూత్రాలు కడగడం కన్నా బాధ ఏ తల్లికైనా ఇంకోటేదైనా వుంటుంది అంటే నేను నమ్మను. ఒక్కోసారి నన్ను కొడితే రెండుమూడు రోజులు లేవడం నడవడం కూడా కష్టమయ్యేది. కానీ లేచి వాడ్ని చూసుకోవాలి అనే ఒకేఒక్క సంకల్పం నాది. నాకు ఇప్పుడు ఏ కోరికా లేదు. నేను చనిపోతే వీడు ఏమైపోతాడా అన్న భయం తప్ప.
ఇరవై అయిదు సంవత్సరాలనుంచీ మందులు వాడుతూనే ఉన్నా వాడిలో ఏ మార్పూ లేదు. నేను తిన్నా తినకున్నా వాడి మందులు. ఆరోగ్యం విషయంలో ఏ లోటూ చేయలేదు. మందులవల్లనో ఎందుకో తెలియదు గత రెండేళ్లుగా బాగా లావయ్యాడు. నేను మోయలేక పోయేదాన్ని. ఆ రోజు రాత్రి వాడు పడుకున్న గంటకే నాలుగైదు సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఎప్పుడూ జరగలేదు నావైపు తిప్పుకొని పడుకోబెట్టుకున్నాను. వాడి చేయి తీసి నామీద వేసుకున్నాను. వాడి తల నా చంపకి ఆనిచ్చుకొని పడుకున్నాను. ఇల్లంతా నిశ్శబ్దం. వాడి శ్వాస నాకు తగలట్లేదు. గుండె చప్పుడు నాకు తెలియట్లేదు. నా మూడేళ్ళ కొడుకు చనిపోయాడు. రాత్రంతా అలానే పడుకోబెట్టుకున్నాను. ఏవేవో కథలు చెప్పాను. వాడు వింటూ పడుకున్నాడు. తెల్లవారబోతోంది, దూరంగా కౌసల్యా సుప్రజా రామా వినిపిస్తోంది. మనసారా దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. నాకన్నా ముందు వాడ్ని తీసుకెళ్ళినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో చాలా రోజుల తరువాత నాకు నవ్వొచ్చింది.