అక్షర కోవెల! అంతర్యామి
అక్షర కోవెల! అంతర్యామి (Author: పి. మంజూ)
యుగాలెందుకు?
క్షణాలు చాలు నీలో మార్పుకి, తీర్పుకి.
నీలో జరిగే ఘర్షణైనా ఎదుటి వారిలోని సంఘర్షణైనా
ఎక్కడో జరిగిన ఘటనైనా మరెక్కడో జరిగిన సంఘటనైనా
వర్తమాన, భూత, భవిష్యత్తులను పూలదండలా గుచ్చాలన్నా
పూసగుచ్చినట్టు చెప్పాలన్నా
నీతో ముచ్చటిస్తున్నట్టు,
నిన్నుపలకరించి, పులకరిస్తున్నట్టు
నీ అనుభవాలను తట్టి లేపుతున్నట్టు,
చీకట్లను తొలగించి నీ ముంగిట దీపమైనట్టు,
నీ భయాలను తొలగించి నీకు భరోసా ఇస్తూ
నిన్ను నిన్నుగా ముందుకు సాగమంటోంది
నిశ్శబ్దంగా....... ఎన్నో శబ్దాలను చేస్తోంది
నిరంతరం నిశ్శబ్దంగానే.
ఈనాడు తలదించుకున్నానని బాధపడకు నేస్తమా!
ఎంత తలదించుకుంటే అంతలా నిన్ను తల ఎత్తుకునేలా చేస్తోంది,
నీవు తల దించుకొని చదివిన పుస్తకం.
ఏకాకివని ఎవరన్నారు నిన్ను?
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి విజ్ఞాన దీపాన్ని వెలిగించె
గురువు కొలువుండె అక్షర కోవెలె నీ మహాప్రస్థానమైతే!?
ఇసుకతిన్నెలపై శిలాఫలకాలపై తాళ పత్రాలపై
జ్వలిత ప్రజ్వలిత మదితో
రవిని మించిన కవివరేణ్యుల కలాలు అందించి,
సంధించిన అక్షర లక్షలు గీసిన చిత్రాలు
గత చరిత్రకు ఆనవాళ్లు, భవితకు పునాది రాళ్లు, నేడు మైలు రాళ్లై
నీ మస్తిష్కం నిండా నవరసభరితంగా పరవళ్ళు తొక్కుతాయి గంగా ఝరిలా!
పురివిప్పి నాట్యమాడుతాయి అక్షర నెమళ్లై!
ఆకాంక్షల నిలువెత్తు నివేదికలై నీ జీవన వేడుకగా.
అక్షరం వృధా కాదు
యుద్ధ జ్వాల రగిలించాలన్నా
సమర శంఖారావం పూరించాలన్నా
శాంతి స్వరం వినిపించాలన్నా
సత్య శోధనకు, లక్ష్య సాధనకు అక్షరమే వజ్రాయుధం.
మహాకవి కాళోజి అన్నట్టు
'ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక',
అయితే నీవు చదివే వేవేల సిరా చుక్కలు
మా’నవ’ మల్లెలు పూయించే కోటి ఆశలు
మీటే కల్ప తరువులే కదా మరి!
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)