TFAS అధ్యక్షుని సందేశం
TFAS అధ్యక్షుని సందేశం (Author: అన్నా మధు (TFAS అధ్యక్షుడు))
వావ్| ఐదు నెలలు ఐదు నిమిషాలుగా గడిచిపోయాయి. సభ్యుల ఆదరణ, కార్యవర్గసభ్యుల సహకారం సంస్థ విజయానికి ఎలా తోడ్పడతాయి అంటే, మా విజయవంతమైన కార్యక్రమాలే ఉదాహరణలు.
తెలుగు భాషకి పెద్ద పీట వేసి, తెలుగు కళాసమితి గౌరవ ప్రతులతో గత 40 సం.లుగా ప్రచురిస్తున్న, తెలుగుజ్యోతి 2024-26 కి ప్రాతినిధ్యం వహిస్తూ, ఈ దీపావళి సంచికని పూర్తిచేస్తున్న శ్రీ విజ్ఞాన్ కుమార్ గారికీ, వారి సంపాదక వర్గానికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.
సెప్టెంబర్ 29వ తారీఖున ఆనంద మందిర్ లో జరిగిన శ్రీ మంగళంపల్లి బాలమురళి గారి నివాళి సభ అతి మనోహరం. కళావేదిక వారికి పత్ర్యేక ధన్యవాదములు. వారి సహకారంతో జరిపిన ఈ మహాసభ శ్రీ వీణపాణి గారి స్వర కామాక్షి గానంతో సభ్యులను మంత్రముగ్ధులను చేసింది. 72 మేళకర్త రాగాలతో, 72 పంక్తులతో స్వరపరిచిన అద్భుత రచన వీణపాణి గారిచే పాడించి ఆనంద మందిర్ లో నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు శ్రీమాత ఇచ్చిన వరం వీణపాణి గారు నిర్వహించిన మ్యూజిక్ థెరపీ, మరియు సప్తస్వర సంగీత రాగావధానం మళ్లీ మళ్లీ అంత తేలిగ్గా లభించని అవకాశాలు. మన న్యూ జెర్సీ సంగీత నాట్య కళాశాలలు, గాయనీగాయకులు బాలమురళి గారికి విలువైన నివాళులర్పించారు.
తెలుగు కళా సమితి ప్రతి సంవత్సరం నిర్వహించే దీపావళి వేడుకలు సెప్టెంబర్ లో మొదలయ్యాయి. వాలీబాల్, టెన్నిస్, బ్యాట్మెంటన్, పురుషుల క్రిక్కెట్, స్త్రీల క్రికెట్ క్రీడా పోటీలు నిర్విఘ్నంగా 10 వారాలు పాటు నిర్వహించడం మా కార్యవర్గసభ్యుల నైపుణ్యతకు నిదర్శనం.
సంగీత నృత్య వాయిద్య పోటీలకు సకల సౌకర్యాలు ఏర్పరిచి ఆహ్లాదంగా నిర్వహించిన శ్రీ పానుగంటి కోటేశ్వరరావు, శ్రీమతి పానుగంటి సుశీల దంపతుల ఆతిథ్యం, సహకారానికి మా కార్యవర్గసభ్యులు, న్యాయనిర్ణేతలుగా పోటీల్లో పాల్గొన్న పెద్దలు, బాలబాలికలు, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేయడంలో పోటీపడ్డారు.
వస్తున్నది నవంబర్ 23! East Brunswick, NJ లోని Jo Ann Magistro Performing Arts Center లో ఏర్పాటు చేస్తున్నదీపావళి సంబరాలకు మా కార్యవర్గసంఘ సభ్యులు అహర్నిశలూ కృషిచేస్తున్నారు. తెలుగు కళా సమితి విలువలతోనూ, వైవిధ్యతలతోనూ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు, సినీ సంగీత విభావరులూ తెలుగు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబింపచేసి మన్ననలను అందుకుంటాయని ఆశిస్తున్నాను.
ఏ కార్యక్రమానికైనా ధన సహాయం చాలా ముఖ్యం. సభ్యులు, పెద్దలు ఉదారంతో విరాళాలు ఇచ్చి దీపావళి సంబరాలు విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.
కలుద్దాం నవంబర్ 23న!
మీ,
మధు అన్న