సాయం చేయలేను  (Author: ఓట్ర ప్రకాష్ రావు)

వేటగాడి వలలో ఆ పావురాలు చిక్కుకొని ఉండటం పావురాల నాయకుడు చూసాడు.  

       "పావురాల్లారా భయపడ వద్దండీ, మా తాతయ్య నాయకుడిగా ఉన్నసమయాన ఇలాగే పావురాలు చిక్కుకొంటే ఒక్కసారిగా  ఎగురుకొంటూ  మా తాతయ్య మిత్రుడు ఎలుక దగ్గరకు వెళ్లి  సాయం  కోరితే వలను కొరికి   బంధ విముక్తి చేసింది. నాకూ ఒక ఎలుక స్నేహితుడు ఉన్నాడు" అన్నాడు పావురాల నాయకుడు.

    "నీకూ ఎలుక స్నేహితుడు ఉన్నాడా.....వెంటనే పిలిపించు ....ఆ వేటగాడు వచ్చే సమయమైంది " అంది వలలో చిక్కుకొన్న పావురం.

       "చాలా  దూరం వెళ్ళాలి. పిలుచుకొని రావడం కష్టం. మీరందరూ ఒక్కసారిగా పైకెగిరి నా వెనుకనే రండి మనమందరం అక్కడికి వెళదాం" అంది పావురాల నాయకుడు

      అన్ని పావురాలు ఒక్కసారిగా వలతోపాటు పైకి యెగిరి పావురం నాయకుడు వెనుకనే వెళ్లి నాయకుడు చూపించిన చోట కిందకు దిగాయి.

      ఒక చెట్టు కిందున్న బొరియ దగ్గరకు వెళ్లి "ఎలుక మిత్రమా ఎలుక మిత్రమా" అంటూ పావురం నాయకుడు గట్టిగా పిలిచాడు. బొరియలోపల నిదురిస్తున్న ఎలుక  మేలుకొంది. మిత్రుడి గొంతు గుర్తుపట్టి సంతోషంతో బొరియనుండి బయటకు వచ్చి కుశలములు విచారించింది.        

     మిత్రునితో  జరిగిందంతా చెప్పిన తరువాత "నీ సహాయం కోరి వచ్చాను. నీవు వలను కొరికి మా పావురాలను విడిపించాలి ఎలుక మిత్రమా"

     "క్షమించు మిత్రమా నేను నీకు సాయం చేయలేను." అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకొంది ఎలుక

     "ఎందుకు ఎలుక మిత్రమా?"   అడిగింది  పావురం

     "శీతల పానీయ (కూల్ డ్రింక్ ) కర్మాగారం అక్కడ నిర్మించారు. ఆ శీతల పానీయం రుచిగా ఉండుట చేత మా ఎలుకలందరూ ప్రతిరోజూ దొంగతనంగా వాటిని త్రాగడం అలవాటు చేసుకొన్నాము."

      "మాకు సహాయం చేయలేక పోవడానికి, ఆ శీతల పానీయానికి సంబంధం ఏమిటి? "అసహనంగా అడిగింది  పావురం.

      "ఆ శీతల పానీయం త్రాగడం వల్ల మా ఎలుకల దంతాలకు వ్యాధి వచ్చి పడిపోయింది. ఇక్కడున్న ఎలుకలన్నింటికీ దంతాలు లేక  ఒక్క పండు కూడా తినలేకపోతున్నాము.  అంతేకాదు ఆ కూల్ డ్రింక్ వల్ల  ఆరోగ్యం బాగా దెబ్బతినింది. మీరు వెంటనే ప్రక్క అడవికి వెళ్ళండి. అక్కడ  నా మిత్రుడు ఒకడు ఉన్నాడు.  మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. నన్ను క్షమించుమిత్రమా నేను మీకు  సాయం చేయలేని స్థితిలో ఉన్నాను"  బాధగా అంది ఎలుక.

          "అయ్యో, అలాగా ఎలుకా… మీ పిల్లలకు ఆ శీతలపానీయం చాలా ప్రమాదకరమైండదని, వాటి దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించి  పెంచండి, మేము ప్రక్క అడవికి వెళ్తాము" అంది పావురం.                                                         

(అయిపొయింది)

Kommentera