సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ (తెలుగుజ్యోతి ప్రధాన సంపాదకులు))

విశ్వావసు నామ సంవత్సరాది సందర్భంగా అందఱికీ అభివందనలు. ఈ కొత్త సంవత్సరం మీరందరికీ సుఖశాంతి శుభప్రదమౌతుందని ఆశిస్తున్నాం.


 

ఈ ఉగాది సంచికలో మామూలు గా ఉండే తెలుగు కథలు కవితలే కాక రెండు కొత్త అంశాలు ప్రచురిస్తున్నాం.

•   మొదటిది ఎం. వి అప్పారావు గారు, Rev. S. C. Milan అనే ఆంగ్లేయుడు సేకరించి ఆంగ్ల లిపి లో ప్రచురించిన తెలుగు సామెతల్ని తెలుగు లిపి లోకి అన్వయించారు. వాటిలో మొదటి విడత ఈ సంచికలో ప్రచురిస్తున్నాము. మొత్తం ఐదారు విడతలలో పూర్తౌందనుకుంటున్నాము.

•   రెండవది సెల్ఫోన్ మీద. దీనిలో చాలా, చాలా ఆంగ్ల పద జాలం ఉండడంతో మన తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురిద్దామా వద్దా అని కొంత మల్లగుల్లాలు పడి, స్టేషను, పోస్టు బస్సు లాగే ఈ పదాలు కూడా సామాన్య వాడుక లోకి వచ్చాయి అని ఎత్తి చూపవచ్చు అని ప్రచురిస్తున్నాము.

సాహిత్యంలో సాంఘిక స్ఫురణ ఉండాలా అక్కరలేదా, సాహిత్యానికి సాంఘిక బాధ్యత అవసరమా కాదా అన్నవి చాలా పెద్ద విషయాలు. అటువంటి విషయాల మీద ఎన్నో చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం ఎలాచెప్పుకున్నా, ఏ నాటి సాహిత్యమైనా అది ఆ నాటి సంఘాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతి బింబించాలి కూడాను అని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. అప్పటి సాంఘిక పరిస్థితులని ప్రతిబింబించకుండా ఉన్న సాహిత్యం ఒక నేల విడిచిన సాము మాత్రమే అవుతుంది. రచయితలు కూడా తమ ఎరిక లోకి వచ్చిన విషయాల గుఱించే, తమ అనుభవంలో జఱిగిన వాస్తవాన్ని చిత్రిస్తూనే చాలా మటుకు రాస్తుంటారు. పూర్తిగా ఊహాగానం చేస్తూ సుదూర భవిష్యత్తు లో జరిగే విషయాలు చర్చించే, ‘science fiction’ లాంటి రచనలు కూడా; అప్పటి సంఘం ఇవాళ్టిలా ఉండదు, ‘ఇలా’, అంటే మరోలా ఉంటుంది అని ప్రస్తుత సాంఘిక పరిస్థితులని reference లాగా తీసుకునే చేస్తూ ఉంటారు.

ఈ వేళ చర్చనీయాంశం వివాహిత మహిళల పట్ల జఱిగే అత్యాచారాలు. ఓ ముఫ్ఫై నలభై ఏళ్ళ క్రితం ఏ రోజు పేపరు (అప్పట్లో అంతర్జాలం లేదు కదా, వార్తలన్నీ వార్తా పత్రికల నుంచే) తెరిచినా ఆ వార్తలే కనబడేవి. పేపరు తెరవాలంటే భయం వేసేది ఏ అఘాయిత్యపు కబుర్లు చదవాల్సొస్తుందోనని. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక లాంటి వార పత్రికలలో పడే కథలలో కూడా ఆ విషయం మీద కథలు తరచుగా కనపడేవి. ఈ రోజులలో విద్యాధికులు ఎక్కువున్నారు, సంఘ విలువలు మారాయి, సాంఘిక పరిస్థితులు మారాయి, సంఘంలో మహిళల స్థానం పెరిగింది, అటువంటి వార్తలు ‘ఆట్టే’ వినబడటం లేదు. ఏ ఇంట చూసినా ఉద్యోగం చేసే మహిళలే కనిపిస్తారు ఇక్కడ ఉత్తరామెరికాలోనే కాదు, ఆంధ్రావనిలో కూడా. వారి ఆర్ధిక స్థోమతు చాలా పెరిగింది, సంఘంలో స్థాయి పెఱిగింది. అంటే అవి జరగడం లేదని కాదు. అరుదుగా జరుగుతున్నాయి, ‘మానవి’ (https://www.manavi.org/) లాంటి సంస్థలకి అవసరం తగ్గి పోలేదు అని.

కొంత మంది అభాగినులు ఇంకా అడకత్తెరలో ఇరుక్కునే ఉన్నారు అన్న విషయానికి ఈ సంవత్సరం మొదటి బహుమతి పొందిన ‘యత్ర నార్యంతు పూజ్యంతే…. ’ (తెలుగు జ్యోతి 45 వ సంపుటి సంక్రాంతి సంచిక: https://telugujyothi.com/magazine) అన్న కథ తార్కాణం. ఐతే ఈ కథ రాసిన లక్ష్మీ గాయత్రి గారు యధాతథంగా, జరుగుతున్న అత్యాచారాలు చెప్పి కేవలం మన కంట తడి పెట్టించి వదిలేయకూండా, పరిస్థితులని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి గెలిచిన ఒక మహిళ గుఱించి చెప్పారు. నిజానికి చెప్పాలంటే పాత కాలంలో అలా నిలబడి పోరాడిన వనితని సంఘం మెచ్చేది కూడా కాదేమో, అటువంటి పోరాటం ‘ఈ’ నాడే సాధ్యమౌతుందేమో!

మనబడి (https://manabadi.siliconandhra.org/) లో గురజాడ అప్పారావు గారు, ఆయన రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం గుఱించి పాఠం చెప్తూంటే, అసలు కన్యా శుల్కం అంటే ఏమిటి, వరకట్నం అంటే ఏమిటి, అని ఆ అనాచారాల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సొచ్చింది. ‘అబ్బా అలా జఱిగేదా’ అని విస్తు పోయారా చిన్నారులు. అప్పట్లోనే కాదు, ఈ నాడూ అటువంటి దౌర్భాగులు ఉన్నారు అని చెప్పలేదు; ఆ చిన్నారులు పెరిగి పెద్ద వాళ్ళయ్యేటప్పటికి ‘ఈ’ అనాచారాలు అలా పాత జ్ఞాపకాల లాగే మిగిలి పోతాయనీ, ఏదో పాఠంలో చెప్పుకున్న కథల లాగే ఉండి పోతాయనీ అన్న ఆశతో.

శెలవు.

Kommentera

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)