మేమింకా అక్కడే !  (Author: వెంకు సనాతని)

ఎన్ని ఉదయాస్తమయాలు

కలిగిపోయాయో

ఎన్ని హృదయమాంసాలు

నలిగిపోయాయో

మా గూడును,

ఎముకల గూడును చూసి

చూపు తిప్పుకోకండి

మేం కూడా మనుషులమే !

సామ్యవాదం కోసం

ఎలుగెత్తిన ప్రతిసారి

సామరస్యపు మోసాన్ని

చవిచూడటం పరిపాటి 

కడజాతి వాళ్ళమని

కాండ్రించి ఉమ్మేసినా తుడుచుకున్నాం

ఎడంగా పెట్టి, ఊరికి దూరంగా నెట్టేసినా

ఆ చూరు కిందే ముడుచుకున్నాం

మాకు వెక్కిరింతలు కొత్త కాదు

ఈసడింపులకు లోటు లేదు

రాట్లు, పాట్లు, తిట్లూ, చీవాట్లతో 

మా రోజు ఇట్టే గడిచిపోతుంది

ఇంకా.. 

నీళ్ల కోసం మైళ్ళ దూరం

నడుస్తూనే ఉన్నాం

గుళ్ళ ముందు వేయి కళ్ళతో

పడిగాపులు కాస్తూనే ఉన్నాం

బడుల దగ్గర బావుల దగ్గర 

కులసర్పం కాటుకు

కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాం

నిన్న మొన్నటి దాకా

మా వెనుక తాటాకు తోకలేగా

ఈరోజేమన్నా మారిందా అంటే ?

సమాజం ఏమారిందంతే !

ఆకలితో మా డొక్కలెండుతున్నా

అగ్గిలో మా పాకలు బుగ్గవుతున్నా

అందులోనే మా ప్రాణాలు

కాలిపోతున్నా, గాలిలో కలిసిపోతున్నా

మమ్మల్ని హత్తుకునేవారు

భుజాల పైకెత్తుకునేవారు

కనుచూపుమేరలో కానరారు

అంటరాని వారంటే

వెంటరాని వారంటూ

పల్లె పొలిమేరల్లో

పట్టణ శివారుల్లో

అడవుల్లో,

అడగారిన గుడిసెల్లో

మేమింకా అక్కడే !

Kommentera