పంజరం (కథలలో 2 వ బహుమతి గ్రహీత)  (Author: చొక్కర తాతారావు)

     "ఈసారైనా అబ్బాయి పుడితే బావుణ్ణు" రామకృష్ణ మనసులో ఆశ అయితే ఉంది. 'అమ్మాయి అయితే ఎప్పటికైనా మరో ఇంటికి వెళ్లిపోవాలి. అదే అబ్బాయి అయితే ఇంటికి దిక్కు, వంశానికి వారసుడవుతాడు' కొడుకు కోసం రామకృష్ణ కలలు కంటున్నాడు.

    రామకృష్ణ కల నిజమయ్యింది. సునీతకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. "నా కల పండించావు. కృతజ్ఞత ఎలా నీకు చెప్పాలో తెలియడం లేదు" ఆ ఆనందంలో సునీత నుదుటి మీద ఒక ముద్దు పెట్టాడు రామకృష్ణ.

     కొడుకు పుడితే 'మహేష్' అన్న పేరు పెట్టుకుంటానని రామకృష్ణ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా చూస్తాడు రామకృష్ణ. బారసాల రోజున కొడుక్కి  మహేష్ అని నామకరణం చేశాడు. కొడుకు పుట్టాడని కూతురు హేమ మీద ప్రేమ తగ్గలేదు. కాకపోతే మహేష్ మీద హేమ కన్నా కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు రామకృష్ణ.

ప్రభుత్వ ఉద్యోగంలో రామకృష్ణ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కొడుకు పుట్టాడన్న సంతోషంలో స్టార్ హోటల్లో తన కొలీగ్స్ కి ఘనంగా పార్టీ ఇచ్చాడు.

      పిల్లలిద్దరినీ సిటీలో పేరున్న కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు రామకృష్ణ. చదువులో మహేష్, హేమ కన్నా ముందున్నాడు. ఎప్పుడు పుస్తకాల మధ్యే ఉంటున్న మహేష్ ని చూసి "ఇప్పుడే చదువు మీద ఇంత శ్రద్ధ చూపుతున్నావు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు" కొడుకుని ఓరోజు రామకృష్ణ అడిగాడు.

"డాక్టర్ అవుతాను నాన్న" చెప్పాడు మహేష్. కొడుకు మాటలకు రామకృష్ణ ఆనందానికి హద్దులు లేవు. అంత చిన్న వయసులో చదువుపట్ల కొడుకు చూపిస్తున్న శ్రద్ధ చూసి సంతోషించాడు.

     ఓరోజు హోంవర్క్ చేసుకుంటున్న మహేష్ తో "ఎప్పుడు చదువే కాదు మధ్యలో ఆటలూ ఆడాలి. అప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది." అన్నాడు రామకృష్ణ. తండ్రి మాటలు పాటించాడు. ఇప్పుడు మహేష్ చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాడు. రత్నంలాంటి కొడుకును కన్నానని మురిసిపోయింది సునీత. ఆ ఇంట్లో మహేష్ పదకుండో పుట్టినరోజు ఘనంగా జరిగింది.

     "అదేంట్రా ఎప్పుడు చూసినా అద్దం ముందే ఉంటావు. ఆడపిల్లలా ఆ మేకప్పేంటి?" తల్లి మాటలకు మహేష్ కంగారు పడిపోతూ రెండు చేతులతో మేకప్ చెరిపేసుకున్నాడు. తనలో తనకే తెలియని మార్పు ఏదో వస్తోందని అప్పటిదాకా గమనించలేదు మహేష్. గమనించేటప్పటికి శరీరంలో ఊహించని మార్పులు రావటం మహేష్ ని కలవరపరిచాయి. అమ్మాయిల్లా మెలికలు తిరగటం, మాటల్లో మార్పు, చూపుల్లో తేడా రావటం, అమ్మాయిల్లా అనుకరించటం మహేష్ కి కొత్తగా ఉంది.

    అంతవరకు చూసిన జీవితంకన్న రాబోయే జీవితం భిన్నంగా ఉంటుందేమోనన్న ఆందోళన మొదటిసారి మహేష్ లో కలిగింది. చేతనావస్థ నుండి అచేతనం లోకి తను దిగజారిపోతున్నానన్న భయం మనసులో వెంటాడుతోంది. ఈ విషయం అమ్మానాన్నలతో ఎలా చెప్పాలో మహేష్ కి తెలియట్లేదు.

     ఓరోజు ఎవరూ చూడకుండా అక్క బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడి తనలో తనే నవ్వుకోవటం తల్లి కంట పడింది. "ఈ వేషాలు కూడా వేస్తున్నావా? అబ్బాయి అయ్యుండి అమ్మాయిల బట్టలు వేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదూ!" తనని ఆ స్థితిలో అమ్మ అలా చూస్తుందని మహేష్ అనుకోలేదు. అమ్మ ఎదుట అలా దిష్టిబొమ్మలా నిలబడిపోయాడు. సమాధానం ఏం చెప్పాలో తెలియట్లేదు మహేష్ కి. తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తనకే తెలియని అయోమయ పరిస్థితి. తనలోంచి తను దూరమవుతున్నట్టు ఏదో భావన. బయట చల్లగా ఉన్నా లోపల ఏవో సెగలు రేగుతున్నాయి. ఎందుకు తనిలా ప్రవర్తిస్తున్నాడు? మహేష్ లో ఏదో కనపడని ఆందోళన.  

     "ఇకనుంచి బుద్ధిగా ఉండక మళ్లీ నాముందు ఎప్పుడైనా ఇలా కనపడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు" మహేష్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడనుండి వెళ్ళిపోయింది సునీత. తనలో తనకే తెలియని ఒక అభద్రతాభావంలోకి వెళ్ళిపోయాడు మహేష్.

     మనుషుల్లో మార్పు రావడం సహజం. కొంత వయసు వచ్చాక అబ్బాయి గొంతు బొంగురుపోతుంది. నూనుగు మీసాలు వస్తాయి. అది సహజం. అవేవీ కాకుండా అమ్మాయిల్లా మాట్లాడటం, అమ్మాయిల బట్టలు వేసుకోవాలనే కోరిక కలగటం, వయ్యారంగా నడవటం ఇవన్నీ ఎటువైపుకి దారి తీస్తున్నట్టు? తనలో తనకే తెలియని ఈ మార్పు అమ్మా నాన్నలు గమనిస్తారేమోనని వాళ్ళ కళ్ళు కప్పి విషయం వాళ్ల దాకా చేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాడు మహేష్.

    'దాపరికం ఎన్నాళ్ళో దాగదు. ఏదో రోజున నా నటన ఇంట్లోవాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిన రోజున నా పరిస్థితి ఏంటి?' మహేష్ లో భయం ఇప్పుడు మొదలయింది. బయట తిరుగుతున్నా తనలో ఏదో భయాందోళన. మునుపటికన్న బయట తిరగడం చాలా వరకు తగ్గించేశాడు. అప్పుడప్పుడు స్కూలు డుమ్మా కొడుతున్నాడు. అలా డుమ్మా కొట్టిన రోజున ఎక్కడెక్కడో గడిపి అమ్మానాన్నల నుండి తప్పించుకుంటున్నాడు.

     ఈమధ్య స్కూలుకి సరిగా రావడం లేదని టీచర్ అడిగేసరికి మహేష్ జవాబు విని ఆశ్చర్యపోయాడు. "రావాలనే ఉంటుంది, కానీ ఎందుకో స్కూలుకి రావాలని అనిపించదుసార్" మహేష్ మాటల్లోనే కాదు చేష్టల్లోను ఏదో తేడా గమనించాడు టీచర్. మహేష్ ప్రవర్తన మీద అనుమానం కలిగి వాళ్ళ తల్లికి కబురుచేసి మహేష్ లో వచ్చిన మార్పు గురించి చెప్పాడు టీచర్.

      సునీత కలలన్నీ కరిగిపోయాయి. ఇంట్లో మహేష్ ని రోజూ చూస్తున్నా తాను గమనించని విషయాన్ని టీచర్ ద్వారా తెలుసుకున్నందుకు ఆమె సిగ్గు పడింది. జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. మహేష్ ని పట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ముందు ముందు వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన చెందింది.

     "మహేష్" అంటూ కొడుకుని గుండెలకు అదుముకుంది సునీత. దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నాడు మహేష్. తల్లి కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లు జలజలా కారుస్తున్నాడు. ఏమి చేతకాని వాడిలా తల్లి చేతుల్లో అలా చూస్తూ ఉండిపోయాడు.

     "నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే మాకీ అవస్థ వచ్చుండేది కాదు" మహేష్ ని ఇంకా దగ్గరకు తీసుకొని ఏడుస్తూ అంది సునీత. జరిగిందంతా పీడకల అయితే బావుణ్ణని సునీత మనసులో అనుకుంది. ఎదురుగా కొడుకుని పట్టుకుని వలవలా ఏడ్చింది. 'ఇప్పుడు తనేం చేయాలి. భర్తకి ఈవిషయం ఎలా తెలియజేయాలి?' దారీ తెన్ను తెలియని చౌరస్తాలో నిలబడినట్టుంది సునీత పరిస్థితి.

      ఆఫీసునుంచి వచ్చిన రామకృష్ణ ఇళ్ళంతా మౌనంగా ఉండటం గమనించాడు. ఎప్పుడూ ఎదురొచ్చే భార్య ఆరోజు రాకపోవటం వింతగా తోచింది. వచ్చిన వెంటనే కాఫీ కప్పుతో శ్రీమతి ప్రత్యక్షమవడం జరగలేదు. తన ఇంటికి కాక వేరే ఇంటికి  వచ్చానా అన్న ఫీలింగ్ మొదటిసారి కలిగింది రామకృష్ణకి.  

     వంటగదిలోకి వెళ్ళాడు రామకృష్ణ. అక్కడా లేదు. పెరట్లోకి వెళ్లి చూసాడు. అక్కడా లేదు. "ఎక్కడికి వెళ్లుంటుందా!" అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు రామకృష్ణ. అశోకవనంలో సీతలా ఓ మూల దుఃఖిస్తూ కనబడింది సునీత. ఆమెను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. జరగరానిది ఏదీ జరగ లేదు కద...'ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళల్లోకి చూసాడు. కంటినిండా ఉబుకుతున్న కన్నీళ్లు. ఆగని దుఃఖం ఆమెను వేదిస్తున్నాయి. కారుతూన్న కన్నీళ్లను వేలితో తుడుస్తూ"ఏం జరిగింది"అంటూ ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు రామకృష్ణ."మన అబ్బాయి... మన అబ్బాయి..." నోట మాట రావట్లేదు. కన్నీళ్లు ఆగటం లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది.

     మహేష్ మీద ఈగ వాలితే సహించని రామకృష్ణ "మన అబ్బాయికి ఏమైంది, ఏడీ వాడెక్కడ?" అనగానే ఏడుస్తూ పక్క గదిలోకి తీసుకెళ్ళి మహేష్ ని చూపించింది సునీత. మహేష్ ఆ గదిలో ఓ మూల దిగాలుగా కూర్చుని ఉండటం రామకృష్ణ గమనించాడు. "వాడు బాగానే ఉన్నాడు, ఇంతకీ నువ్వు ఎందుకేడుస్తున్నావ్?" మహేష్ ను పట్టుకుని భార్యను అడిగాడు రామకృష్ణ. మళ్ళీ ఆమెలో మౌనం.

      అంతా అయోమయంగా ఉంది రామకృష్ణకు. తనకు తెలియని సంఘటన ఏదైనా జరిగిందేమో? ఎంత అడిగినా భార్య చెప్పడం లేదంటే అదేదో బయటకు చెప్పుకోలేని బాధ అయ్యుంటుంది. అదేమిటో తను తెలుసుకోవాలి.   రామకృష్ణ మనసులో ఆతృతతో పాటు అనుమానం మొదలయ్యింది. భార్యను నిదానంగా అడిగి విషయమేమిటో ఆరా తీశాడు.

      ఆరోజు స్కూల్లో మాస్టారు చెప్పిన విషయం సునీత నోట వినేసరికి రామకృష్ణ నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు కొడుకు మొహంలోకి సూటిగా చూశాడు. ఆ మొహంలో అంతకు ముందు కనబడని ఛాయలేవో రామకృష్ణకి కనిపించాయి. వాడి హావభావాలు చూసి మనసు చెరువైపోయింది. ఉన్న ఒక్క కొడుకు ఇలా తయారయ్యాడని మనసులో కుమిలిపోయాడు. నిలువెల్లా దుఖంతో కొడుకుని అమాంతం కావలించుకున్నాడు. తండ్రి గుండెలో తల దాచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు మహేష్. "నాన్నా" అంటూ తండ్రి మొహంలోకి చూసి బావురుమన్నాడు. "తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను నాన్నా!" అని మనసులో క్షోభ పడ్డాడు మహేష్.

     ఉన్నపళంగా మహేష్ ని సంబంధిత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు రామకృష్ణ. మహేష్ కి పరీక్షలన్నీ చేసి రిపోర్ట్స్ పరిశీలించాక డాక్టర్, రామకృష్ణతో ఇలా చెప్పాడు. "ముందు మీరు ఆందోళన పడక నేను చెప్పేది వినండి. లక్ష మందిలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పదేళ్ల తర్వాత అబ్బాయిల్లో ఇలా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ స్టిక్స్ డెవలప్ అవుతుంటాయి. అలాంటివాళ్లు అమ్మాయిల్లా ప్రవర్తించటం, మాటతీరు, నడక తీరులో మార్పు రావటం,, వక్షోజాలు పెరగటం, ఆడవాళ్ళ దుస్తులు ధరించటం, అచ్చం అమ్మాయిల్లానే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన.                          

      ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు సంసారానికి పనికిరారు. ఆడ కాక మగ కాక మధ్యలో వీళ్ళ జీవితాలు దుర్భరంగా తయారవుతాయి. సర్జరీ ద్వారా వీళ్ళని మామూలు మనుషులుగా మార్చడానికి విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అవి ఫలించే దశలో ఉన్నాయి" డాక్టర్ చెప్పింది విని కొడుకు వైపు జాలిగా చూసి కాళ్ళీడ్చుకుంటూ కొడుకుతో పాటు ఇంటికి చేరుకున్నాడు రామకృష్ణ.

     "డాక్టర్ గారు ఏం చెప్పారండి?" అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళను చూసి, ఆత్రంగా రామకృష్ణని అడిగింది సునీత. "టీచర్ చెప్పినట్టే అంతా జరిగింది. మన మహేష్ హిజ్రా అట." వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పాడు రామకృష్ణ.

     "మీ అబ్బాయి మహేష్ ఈమధ్య అమ్మాయిల బెంచీలో కూర్చుంటున్నాడు. అబ్బాయిల వైపు చూస్తూ చిలిపి నవ్వులు నవ్వుతున్నాడు. ఇలా ప్రవర్తిస్తే స్కూల్లో పిల్లలు చెడిపోతారు. రేపటి నుండి మీ అబ్బాయిని స్కూలుకు పంపొద్దు" అంటూ టీచర్ సునీతను హెచ్చరించడం గుర్తుకొచ్చింది. "వాడి చదువు పోయింది, జీవితమూ పోయింది" కొడుకును హత్తుకొని గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది సునీత.

     ఇవేవీ హేమకు తెలియనివ్వలేదు వాళ్ళు. "నాన్నా మరో పది రోజుల్లో తమ్ముడు పుట్టిన రోజు వస్తోంది. ఈసారి తమ్ముడు పుట్టినరోజు ముందుకన్న ఘనంగా చేయాలి. నాఫ్రెండ్స్, తమ్ముడు ఫ్రెండ్స్ ని కూడా బర్త్ డే ఫంక్షనుకి పిలుద్దాం నాన్నా" హేమ ఆనందాన్ని చూసి నీరుగారి పోయాడు రామకృష్ణ.   "అలాగే" అని అప్పటికి అనేసాడు గాని,   మహేష్ పుట్టిన రోజు జరపటానికి రామకృష్ణకి ధైర్యం చాలటం లేదు. కొడుకు పరిస్థితి తెలిసి ఏ ముఖం పెట్టుకుని మహేష్ పుట్టినరోజు జరిపిస్తాడు.  

     మహేష్ పరిస్థితి తల్లిదండ్రులు చెప్పక పోయినప్పటికీ తమ్ముడి ప్రవర్తనలో వస్తున్న పరిణామాలు హేమ గమనిస్తోంది. తల్లిని అడిగితే డాక్టర్ చెప్పిన విషయాలు హేమతో చెప్పింది సునీత. తమ్ముడి మానసిక స్థితి చూసి హేమ దుఃఖపడింది. ఆవిషయం తెలిసనప్పటి నుండి మహేష్ పుట్టినరోజు జరపమని తండ్రిని అడగలేకపోయింది హేమ.

     ఇక ఆ ఇంట్లో పుట్టిన రోజులు లేవు, పండుగలూ లేవు. మహేష్ తప్ప వాళ్లకి ఏ సమస్య లేదు. అలాగని పెంచిన చేతులతో మహేష్ ని ఇంటినుండి బయటకు పంపించలేరు. బతకడానికి ఏదో తింటున్నారు తప్ప వాళ్లు కడుపారా తిని చాలా రోజులయింది. రోజులకేం ఎలాగోలా గడిచిపోతాయి. రేపు వస్తుందంటేనే వాళ్ళలో భయం కమ్ముకుంతోంది.

     "వీడు ఇలాగే ఇంట్లో ఉంటే రేపు అమ్మాయికి పెళ్ళవుతుందా?" బాధను పంటికింద అణచుకుని భర్తతో అంది సునీత. "ఏం చేస్తాం మరి, ఈ స్థితిలో వాడిని బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని చెప్పలేం కద" కొడుకు మీద ప్రేమ అతనితో అలా మాట్లాడించింది. "తప్పదండి. ఒకరు వెళ్ళిపోతే తప్ప మరొకరికి దారి దొరకదు. వీడు ఇంట్లో నుంచి వెళ్ళందే అమ్మాయి జీవితం బాగుపడదు, మన పరువు నిలబడదు" ఆ మాటలు సునీత బయటకు అనడమే కాదు. గుండెలో బాధను మోస్తూ చెప్పింది. ఎంతైనా పెంచిన ప్రేమ కద.

      ఆ మాటలు మహేష్ చెవిన పడ్డాయి. "నా గురించి మీరేం బాధపడకుండి నాన్న. ఈ ఇంట్లోంచి నేనే వెళ్లిపోతున్నాను. మీరనుకున్నట్టు మీ పరువుకేం భంగం కలిగించను." ఎదురుగా బ్యాగ్ తో నిలబడుతూ కనిపించాడు మహేష్. "ఎక్కడికి వెళ్తావురా మమ్మల్ని విడిచి?" రామకృష్ణ గొంతు జీరబోయింది. "మీ పరువుకి అడ్డు రానంత దూరం వెళ్ళిపోతాను. మీ ప్రపంచంలోకి తొంగిచూడకుండా మరో చోటుకి వెళ్ళిపోతాను నాన్నా!" "ఎలా బతుకుతావురా?" తల్లి మనసు ఘోషించింది. మహేష్ ని చూసి వాళ్లు బావురుమన్నారు.

     “దారి తప్పి నేను మీ కడుపున పుట్టాను. నాలాంటి దారితప్పిన వాళ్లకోసం ప్రపంచంలో ఎక్కడో ఒక చోటు ఉండే ఉంటుంది. అమ్మా.. నాన్నా.. అక్కా.. వెళ్తున్నాను మీనుంచి. నాకోసం ఎప్పుడూ ఏడవకండి. ఈరోజుతో మీ మహేష్ చచ్చిపోయాడనుకోండి" దుఃఖపు తెరలు కళ్ళనిండా నింపుకొని అక్కడ నుండి భారంగా కదిలాడు మహేష్. "మహేష్" అంటూ ఆ గది నాలుగు గోడల మధ్య వాళ్ళ ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి.

     ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియని బాటసారిలా పొద్దున్నుంచి మహేష్ అలా నడుస్తూనే ఉన్నాడు. గమ్యం తెలియని వాడు ఎంత దూరమని వెళతాడు. ఎక్కడికని వెళతాడు. మహేష్ మనసునిండా ఎడతెగని ఆలోచనలు. ఎటు వెళ్ళాలో తెలియని సంకటస్థితి. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు మహేష్. అప్పుడెప్పుడో అమ్మానాన్నతో కలసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు రైలులో హిజ్రాలు యాచకవృత్తి చేయడం చూసి ఆ చిన్న వయసులోనే చలించిపోయాడు మహేష్. వాళ్ళ దీనస్థితి చూసి గుండె తరుక్కు పోయింది అప్పుడు. ఇవాళ తను అదే రైల్వే స్టేషన్ ముందు మోకరిల్లాడు. రేపటినుండి తన దినచర్య అదే. ఆ దృశ్యం తలచుకుంటుంటే మహేష్ లో వణుకు మొదలయ్యింది. తన బతుకు ఎందుకిలా తలకిందులయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు.

     సాయంత్రం ఏదో ఎక్స్ ప్రెస్ రైలు ప్లాట్ ఫామ్ లో ఆగింది. ఎదురుగా ఉన్న  కంపార్ట్ మెంట్ నుంచి ఆరుగురు హిజ్రాలు దిగడం మహేష్ చూసాడు. మహేష్ ఉదయం నుంచి ఏమీ తినలేదు. అడుక్కోవడానికి మనసు అంగీకరించటం లేదు. ప్లాట్ ఫామ్ మీద నడుస్తున్న హిజ్రాల్లో ఒకామె అక్కడ ఓమూల దిగులుగా కూర్చున్న మహేష్ ను చూసి దగ్గరగా వచ్చి  "నువ్వు కొత్తగా వచ్చావా?" అంటూ ఆప్యాయంగా పలకరించింది. "అవునక్కా... ఈరోజే నేను ఇంటినుండి వచ్చేసాను" చెప్పాడు మహేష్. "సరే మాతో రా" అని మహేష్ ని వాళ్లతో పాటు మరో రైలులో తీసుకుపోయి ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు లేదని మహేష్ కి తమ దగ్గరున్న రొట్టెలు పెట్టారు. వేరే స్టేషన్ లో దిగి వాళ్ళుంటున్న ఇంటికి మహేష్ ని తీసుకెళ్లారు హిజ్రాలు. మనుషుల్లో లేని ఐక్యత హిజ్రాలులో కనిపిస్తుంది. ఎక్కడైనా దిక్కులేని హిజ్రాలు కనిపిస్తే వాళ్లను సాదరంగా ఆహ్వానించి ఆదరిస్తారు.

     అది ఒక విశాలమైన గది. ఆ గదిలో ఇరవై మంది హిజ్రాలు కలిసి ఉంటున్నారు. హిజ్రాలు సమూహాలుగా నివసిస్తారు. ఉన్నదేదో కలిసి తింటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కలిసి పంచుకుంటారు. దీదీ అక్కడ వాళ్ల పెద్ద దిక్కు. మహేష్ ని ఏబై ఏళ్ళ పద్మావతి దీదీకి పరిచయం చేశారు వాళ్ళు.

      "ఈరోజు నుండి నీ పేరు మహేష్ కాదు, మహేశ్వరి. ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంతా కలిసి సామూహికంగా ఏదో పని చేస్తే తప్ప రోజు గడవదు.   నాలుగు డబ్బులు వెనకేసి తల్లిదండ్రుల నిరాదరణకు గురైన మనలాంటి వాళ్ళందరి  బాగోగుల కోసం మనమంతా కృషి చేయాలి. రేపు ఉదయమే'జల్సా'తంతు జరిపి నిన్ను మా హిజ్రా సమాజంలో కలిపేసుకుంటాం. మాతోపాటు ఉంటూ ఓ కొత్త జీవితం నువ్వు ప్రారంభించాలి" మహేష్ తో చెప్పింది పద్మావతి.

     ఆరోజు మహేశ్వరి  జీవితంలో మలుపు తిరిగే రోజు. జల్సా కార్యక్రమంలో మహేశ్వరికి పచ్చచీర కట్టారు. ఒళ్ళంతా పసుపు రాసి, నుదుటున పెద్ద బొట్టు పెట్టారు., నెత్తిమీద పాల బిందె పెట్టి, దీదీ తన చేతితో కాలికి మట్టెలు తొడిగింది. మెడలో పుస్తె కట్టింది. ఆ రోజు నుంచి హిజ్రా సమాజంలో మహేశ్వరి పరిపూర్ణమైన హిజ్రాగా అవతరించింది.

      ఆక్డడ అక్క హేమకు పెళ్ళి కుదిరింది. తన పెళ్ళికి రమ్మని తమ్ముడు మహేష్ కి ఫోన్ చేస్తుంది హేమ. "నాకు రావాలనే ఉంది. అమ్మనాన్నలు అందుకు ఒప్పుకుంటారంటావా అక్కా!" అని మళ్లీ అంతలోనే "వద్దక్కా. నేను రాలేను, రాను... నా ముఖం చూస్తే వాళ్ళ పరువు పోతుంది" ఏడుపు దిగమింగుకుని చెప్పాడు మహేష్. "తమ్ముడూ" అంటూ ఫోన్ లోనే ఏడ్చేసింది హేమ.

     "జీవితంలో ఎన్నో కలలు కన్నాను. ఓ పెద్ద డాక్టర్ అవుదామనుకున్నాను. ఆ కలలన్నీ మధ్యలోనే కరిగిపోయాయి. జీవితంలో ఏ ఒడ్డుకీ చేరుకోలేకపోయాను. చివరకు ఇలా దిక్కు లేని జీవితం గడుపుతున్నాను" గదిలో ఆ రోజు ఒంటరిగా బాధపడుతూ గడిపింది మహేశ్వరి.

     బంధాలను తెంచుకుని మహేశ్వరి ఇప్పుడు పంజరంలోకి అడుగు పెట్టింది. ఆ పంజరం తలుపులు తెరుచుకుని రైల్వే కంపార్ట్ మెంట్ లో తోటి హిజ్రాలతో పాటు మహేశ్వరి మొదటిసారి యాచన చేయడానికి బయలుదేరింది. బతకడానికి ఏదో ఒక వృత్తి చేయాలి. ఏ పనికీ నోచుకోని హిజ్రాలు వీధుల్లో, షాపుల్లో, రైళ్లల్లో ఇలా భిక్షాటన చేసి తమ కడుపులు నింపుకోవాలి. వాళ్ళ ఛీత్కారాలకు, చిన్నచూపుకు గురవ్వాలి. ఇదే అనాదిగా ఈలోకంలో జరుగుతున్న తీరు. రాత్రి వేళల్లో అక్కడక్కడ కొంతమంది హిజ్రాలు వెలయాళ్ళుగా మారుతున్నారు.  

      అన్నీ ఛేదించుకుని  కొంతమంది హిజ్రాలు పీజీ వరకు చదువుకున్నా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు. హిజ్రాలను థర్డ్ జెండర్ గా గుర్తించమని చట్టాలు చేసినా దాన్ని అమలు చేసే నాధులు కరువయ్యారు. తమ జీవితాల్ని తమతోనే అంతం చేసుకుంటున్నారు. వారసులు లేని సమాజం ఏదైనా ఉందంటే అది హిజ్రా సమాజమే.

      సమాజ  నిరాదరణకు గురవుతున్న ఈ అంటరాని అభాగ్య జాతి పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని వాళ్ల శారీరక లోపాలను గుర్తించి సర్జరీ ద్వారా సరిచేసి సమాజ జన జీవన స్రవంతిలో భాగస్వాములను చేసేందుకు కృషిచేయాలి. వీళ్ళూ మనుషులే. సమాజంలో వీళ్ళూ భాగమే. అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వాలూ వీళ్ళను ఇలా అనాధలుగా వదిలేస్తే సమాజం మనల్ని ఎప్పటికీ క్షమించదు.

               * * *

Kommentera