నీలి కెరటాలు
నీలి కెరటాలు (Author: గొర్తి వాణిశ్రీనివాస్)
"రెండు వందలకి మూడు యాపిల్ పళ్ళా? అవి పళ్ళా తుపాకీ గుళ్ళా? మరీ అంత ఖరీదు చెబితే ఎలా ?" అంది లత.
"మీరు ఈ రోడ్డులోనే వెళుతుండటం చూస్తూ ఉంటాను. మీకైతే నాలుగిస్తాను తీసుకోండి. రండి" అంది పళ్ళమ్మాయి లెక్కపెట్టి కవర్ లో వేస్తూ.
"నీపేరేంటోగానీ...ఆగాగు. నాకొద్దు వెయ్యకు" అంది లత.
"నాపేరు నీలమ్మ. ఆ పక్కనే మాయిల్లు. పెద్ద పళ్ళు మీకు ఎంచి ఏస్తాను తీసుకోండమ్మా" బతిమలాడింది నీల.
“వద్దులే . నీ పళ్లకో దణ్ణం.అవి లోపలపెట్టు” అంటూ పక్క అంగడి దగ్గరకు వెళ్ళింది లత.
ఏ పళ్ళకి దణ్ణమో అర్థంకాక, తన ఎత్తు పళ్ళని పెదవులతో మూసుకుంది నీల. నీల నల్లన, జుట్టు తెల్లన. ఆమెని చూడగానే ఏవగించుకుంటుంది లత. పళ్లమ్మే పక్కామె పండల్లే ఉంది. ఆమెను చూస్తే సానుకూలంగా అనిపించింది.
"నీ పేరు కళ అయ్యుంటుంది. చక్కగా కళగా ఉన్నావు. యాపిల్స్ ఎంత?" అనడిగింది.
"నా పేరు లచ్చిమి. రెండొందలికి నాలుగిస్తాను తీసుకోండమ్మా" అని పళ్ళు లెక్కపెట్టి సంచిలో వేసింది.
"నేనూ నాలుగేగా ఇస్తానంటి. రెంటికీ ఏం తేడా?" అంది నీల.
చాలా తేడా ఉందిలే అని తీసుకుని ఇంటికొచ్చేసరికి భర్త రాహుల్ టి.విలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ పాప్ కార్న్ తింటున్న భంగిమ చూసి చిరాకు పడింది లత.
"నోట్లో పెట్టుకున్న ఎంగిలి చేతులతో రిమోట్ ఎలా పట్టుకుంటారండీ..... ఇలాంటివి నాకు చాలా అసహ్యం" అంది చిరాగ్గా మొహంపెట్టి.
"ఇందులో ఏముందోయ్...తర్వాత ఎలాగూ చేతులు కడుక్కుంటాగా...నీకు రోజురోజుకీ ఓ సీ డీ ఎక్కువవుతోంది. శుభ్రత సంగతేమోగానీ అందరిమీదా తెగ చిరాకు పడుతున్నావ్. నీకే పెద్ద శుభ్రత ఉన్నట్టు." అన్నాడు.
కొడుకు కాలిమీద గోక్కుంటూ ఒళ్లుమరిచి క్రికెట్ చూస్తూ పాప్ కార్న్ తింటున్నాడు.
"చ...ఇదంతా చూడ్డం నావల్లకాదు. నా ప్రపంచంలో అన్ని అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి. లేకపోతే నాకు పిచ్చి పట్టినట్టు ఉంటుందని మీకూ తెలుసుగా" అంది వాళ్ళిద్దరి చేతులపై శానిటైజర్ స్ప్రే చేస్తూ.
"ఆ చిరాకు తగ్గేందుకేగా నిన్ను 'హో పోనో పోనో' టెక్నిక్ సెంటర్ లో చేర్చింది. వాళ్ళేం చెప్పారు. నీలోని నెగిటివ్ థాట్స్ తీసేస్తేనే నువ్వు ఊహించింది జరుగుతుందని అన్నారు. ప్రతిదాన్ని ప్రేమించడం, కృతజ్ఞత కలిగివుండటం లాంటి గుణాలు ఉన్నప్పుడే విశ్వశక్తితో మూడోకన్ను తెరవబడుతుందని చెబితే, నువ్వేం చేస్తున్నావ్? ఎప్పుడూ చిర్రులూ బుర్రులూ. కోరుకున్నది కళ్ళముందు ఉన్నట్టు ఊహిస్తూ క్రియేషన్ బుక్ లో రాసుకోమన్నారుగా. రాశావా?" అడిగాడు రాహుల్.
రాసేందుకు కూర్చున్న లత కళ్లముందు నీల రూపం కదలాడింది. ఎందుకిలా ఆమే కనిపిస్తోంది. నా ఊహల్లో ఆమెకి స్థానం ఏంటి? ఇంత పెద్ద యూనివర్స్ లో ఇంకేం లేవా? ఆ మనిషి రూపం నాకెందుకు అని విసుక్కుంది లత. ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత కుదరలేదు.
ఓరోజు ఎప్పటిలా ఆఫీసునుంచి అదే రోడ్డులో నడిచొస్తోంది లత. వెనకనించి కీచుమని అరుపు వినిపిస్తే వెనక్కి తిరిగి చూసింది. ఎవరో అమ్మాయి. మంచి చీర, ఒంటినిండా నగలు, ఎర్రటి శరీర ఛాయతో బాగుంది. ఆమె రమ్మని పిలిచింది. లత ఆగి చూసింది. ఎవరామె? నన్నెందుకు పిలుస్తోంది? నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఇందాక ఇక్కడ లేదు. ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది? బహుశా నేను హో పోనో పోనో ప్రాక్టీసు చేస్తున్నాను కాబట్టి విశ్వశక్తి నాతో ఏదో చెప్పాలని చూస్తోందా? ఆ అందమైన అమ్మాయి నాకు ఏదైనా సాయం చేయాలముకుంటోందా? లేక ఆమే నానుండి సాయం కోరుతోందా అని అర్ధం కాక వెనక్కి రెండడుగులు వేయబోయింది.
కాస్త ముందర నీల పళ్ళ దుకాణం ఉంది. నీల లతకి వెళ్ళొద్దని సైగ చేసి చెప్పింది. కొంచెం దూరంలో ఉన్న నీల చేతులు ఊపుతూ తన దుకాణం వైపుకు రమ్మని పిలుస్తోంది. ఎటువెళ్ళాలి? ముందుకా, వెనక్కా...ఏమీ పాలుపోక మధ్యలో ఆగింది. ఇంతలో నీల పరిగెత్తుకొచ్చి లత చెయ్యిపట్టి లాక్కుంటూ ముందుకు తీసికెళ్లింది.
"ఏయ్ నీకెంతదైర్యం. నా చెయ్యి పట్టుకుంటావా?" నా చెయ్యి అని ఒత్తి పలికింది గగుర్పాటుగా చూస్తూ.
"రండమ్మా... ఇటొచ్చెయ్యండి" అంది నీల మరింత కంగారుగా.
నాలుగు అడుగులు ముందుకేసి వెనక్కి తిరిగి చూసింది లత. వెనక అమ్మాయి అటుగా వచ్చిన కుర్రాడి బండి ఎక్కి వెళ్ళిపోయింది.
"పాపం ఆపిల్ల నాతో ఏదో చెప్పాలనుకుంది. లాక్కొచ్చేశావు. నీకు పిచ్చిగానీ పట్టిందా?" అనరిచింది.
నీల పట్టుకున్న చేతిని చీర కొంగుతో తుడుచుకుంటూ. "అయ్యో అమ్మా.. అది పెద్ద దొంగది. ఏదో ఆపద ఉన్నట్టు పిలిచి మాటల్లో పెడుతుంది. ఆదమరచి వున్నప్పుడు బండిమీద ఆ కుర్రాడు వచ్చి మెళ్ళో నగలు తెంపుకుపోతాడు. ఇలా కొంతమందికి జరిగిందని విన్నాను. అందుకే మిమ్మల్ని వెళ్లద్దన్నాను" చెప్పింది నీల.
అయ్యబాబోయ్... కొత్తగా కొనుక్కున్న కాసులపేరు ఈరోజే వేసుకున్నాను. తళతళ మెరిసిపోతోంది. ఆ అమ్మాయి దాన్ని కాజెయ్యడానికి పిలిచిందా? తను సాయం చేయబోతే గాయమయ్యేది. ఈ నీల లేకపోతే ఈపాటికి లబోదిబోమంటుండేదాన్ని.
"థాంక్స్ నీలా....పెద్ద ఆపదనుంచి నన్ను కాపాడావు. ఈ వీధిలో అలాంటివాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు"
"ఆళ్ళు ఇక్కడోళ్ళు కాదనుకుంటా...పోలీసులకి చిక్కితే ఆళ్ల ఆటలు కట్టు"
"డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్” అంటే ఇదేనేమో.
"ఏమంటున్నారమ్మా?"
"నీ ఋణం తీర్చుకోలేను" అంది లత కృతజ్ఞతగా చేతులు జోడిస్తూ.
"అయ్యో, నాదేముంది. అంతా ఆ పైవాడి దయ . మీరు లేచిన వేళ మంచిది" అంది నీల.
"రోజూ నీదగ్గర పళ్ళు కొనకుండా పక్కనామె దగ్గర కొంటున్నానని కొంచెం కూడా కోపం లేదా నీకు?" అనడిగింది.
"కోపం దేనికి, ఎక్కడకొన్నా ఒకటే. ఆ లచ్చిమి నా కోడలే" అంది నీల.
"అవునా.... అత్తా కోడళ్లు పక్కపక్కనే వున్నా కొట్టుకోకుండా వ్యాపారం చేస్తున్నారంటే గొప్పే. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది"
"నా కొడుకు పోయాక నన్ను పోషిస్తూ వాడు లేనిలోటు లచ్చిమి తీరుస్తోంది. నిజానికి పళ్ళ యాపారం చేసేది అదే. నేను దానికి తోడు అంతే" చెప్పింది నీల.
లచ్చిమి వైపు చూసింది లత. జీవితంలో అన్ని కోల్పోయినా ఆశను వదులుకోకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. అత్తను జాగ్రత్తగా చూసుకుంటోంది.
ఏవో మిరాకిల్స్ జరుగుతాయని ఆకాశంలోకి చూస్తే మూడోకన్ను తెరుచుకుంటుందో లేదోగానీ, నేలవైపు చూపు సారిస్తే ఈ ప్రపంచంలో మనచుట్టూ ఎన్నో పడి లేచే కెరటాలు కనిపిస్తాయి. అవి మన కళ్ళు తెరిపిస్తాయి. అకారణంగా ఎవరినైనా ద్వేషించడం, వెంటనే ఒక అభిప్రాయానికి రావడం రెండూ తప్పే. నీలకి ధన్యవాదాలు చెప్పి ఆమె వద్దంటున్నా ఐదొందల నోటు చేతిలో పెట్టి కృతజ్ఞతలు చెప్పి అక్కడినుంచి బయల్దేరింది.