కంటేనే అమ్మ! అంటే ఎలా?  (Author: ఉప్పలూరి మధుపత్ర శైలజ)

సాయంత్రం అయిదు గంటల సమయమయ్యింది. చల్లని వాతావరణంలో ఉద్యానవనం ఆహ్లాదభరితంగా ఉంది. పిల్లల ఆటలు, కేరింతలు ఐస్‌క్రీం బళ్ళవారి గంటల శబ్దాలు, వాకింగ్ చేస్తూ పిల్లల్ని గమనిస్తూ కబుర్లు చెప్పుకుంటున్న పెద్దలు, ప్రేమ ముచ్చట్లను చెప్పుకొనే యువతీయువకులు. సందడిగా ఉన్నాయి పరిసరాలన్నీ.

వాకింగ్ పూర్తిచేసి అలసిపోయిన స్వప్న’, ‘ఇందిర సిమెంట్ బెంచ్‌ పై కూర్చున్నారు. అలసట తగ్గకున్నా ఎడ తెరిపిలేకుండా ఎక్కడలేని కబుర్లు వివిధ విషయాలగురించి చెప్పుకుంటున్నారు. ఆ వరవడిలోనే అపర్ణ గుర్తుకొచ్చింది. ఏమిటో ఈరోజు ఆమె వాకింగ్‌కు రాలేదు అనుకున్నారు.

ఇంతలో అక్కడికి ఓ 40 ఏళ్ళ వయసున్నావిడ వచ్చి కూర్చున్నారు. వీరి మాటలు చెవినపడ్డాయి కాబోలు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో ఆ అపర్ణకు ఆడపడుచును నేను. నా పేరు గిరిజ. మా మరదలు స్కూల్‌లో పేరెంట్స్‌ మీట్ ఉంది, రమ్మనమని కబురొస్తే వెళ్ళింది. నన్ను కూడా రమ్మంది. కానీ నాకవన్నీ బోర్ కొడతాయి. నాపిల్లల స్కూల్‌కే నేనెళ్ళను అని విసుగ్గా అంటూ, “మీ గురించి చెప్పి పార్క్‌కు వెళ్తే కలవండి అని చెప్పింది.

ఇంతకీ మీరేనా మా మరదలు చెప్పిన స్వప్న, ఇందిరలు?” అని అడిగింది గిరిజ .  

ఔనండీ ప్రతి రోజూ మేము ముగ్గురం కలసి నడుస్తాం. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. అపర్ణగారు మాత్రం అప్పుడప్పుడూ పిల్లల పరీక్షలనో, పుట్టినరోజులనో, వాళ్ళ స్కూల్లో ఫంక్షన్లనో మానేస్తారు. ఆమెకి పిల్లలంటే పిచ్చిప్రేమ కదండి అంది స్వప్న.

ఔనౌను! బయిట పిల్లలమీద చాలాచాలా ప్రేమ ఒలకబోస్తుంది అని వ్యంగ్యంగా అంటున్న గిరిజ మాటలను విన్న స్వప్నకు పాపం అపర్ణగారు ఇలాంటి ఆమెను ఎలా భరిస్తున్నారో?” అనిపించింది.

బయట పిల్లలుఅంటూ గిరిజ చెప్పిన మాటలు సరిగ్గా అర్ధం కాలేదు ఇందిర, స్వప్నలకు.

మా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ పిల్లలకు తానే ఫీజులు కట్టి మంచి స్కూలులో చదివిస్తోంది. ఆ పిల్లల పేరెంట్స్‌ మీట్‌కే ఇప్పుడు తాను వెళ్ళింది. ఔనూ! నాకు తెలియక అడుగుతున్నాను, నా మరదలికి పిల్లలు లేరనే విషయం మీకు చెప్పలేదా ఇన్నాళ్ళుగా?” అని కుండబద్దలుకొట్టినట్లుగా అడిగింది గిరిజ.  

వింటున్న స్వప్న, ఇందిరలు ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా నిజమాండీ! దాదాపుగా సంవత్సరం అవుతోంది అపర్ణగారితో పరిచయం అయ్యి. ఎప్పుడూ ఈ విషయం మాకు చెప్పలేదు.

క్రిందటి వారం కూడా మాబాబు బర్త్‌డే పార్టీకి వచ్చి, అభివృద్ధిలోకి రమ్మని వాణ్ణి ఆశీర్వదించండి అని అపర్ణ పిలిస్తే వెళ్ళాం. ఎంత బాగా ఆబాబు బర్త్‌డే పార్టీని చేశారో!. అపార్ట్‌మెంట్‌లోని పిల్లలందరిని ముందు రోజే పార్టీకి రమ్మనమని పిలిచారట. ఇల్లంతా చక్కగా డెకరేట్ చేసి ఎంతబాగా పిల్లలతో ఆటపాటలు, కేక్‌ కటింగ్ చేయించారో? ఇవిగో నా సెల్‌లో ఫొటోలున్నాయి చూడండి. ఇడిగో ఈ బాబు బర్త్‌డేనే జరిగింది. మరి వీడెవరు?” అని అడిగింది స్వప్న.

ఫొటోలను చూసిన గిరిజవీడా, వీడు వాళ్ళ పనిమనిషి కొడుకు. వాడికి వాళ్ళమ్మ కొత్త డ్రస్సు కొంటానుగానీ పార్టీలు, గీర్టీలు నా వల్లకాదు అని అంటే, వాడు ఏడుస్తూ మారాంచేయటం మొదలుపెట్టాడు. అదిచూసిన అపర్ణ నీ బర్త్‌డే పార్టీని మా ఇంట్లో గ్రాండ్‌గా చేస్తానుఅని అలా చేసింది. చూడబోతే ఆపార్టీకి చాలా ఖర్చు పెట్టినట్లుగా ఉందే అని ఒక్కో ఫొటోను కోపంగా చూస్తూ అంది.

మా తమ్ముడు అహర్నిశలు కష్టపడి సంపాదిస్తూంటే, ఈ మహాతల్లి ఇలా బయట పిల్లలందరికీ పుట్టినరోజు పార్టీలనీ, చదువులనీ, డ్రస్సులనీ డబ్బంతా నీళ్ళలా ఖర్చుపెట్టిస్తోంది. హవ్వా! పిల్లలంటే అంత ఇష్టమున్నప్పుడు, నా రెండో కొడుకును దత్తత ఇస్తానని లక్షలసార్లు చెప్పాను, ఊహూ! వింటే కదా! మావాడు కాకపోతే మా బంధువుల్లో ఎవరి పిల్లలనైనా చేరతీయమన్నా, వినిపించుకుంటే కదా. ఈ వృధా ఖర్చుల విషయం మా తమ్ముడికి చెపితే, ‘పోనీలే అక్కా! డబ్బు పేదవారి గురించేగా ఖర్చుపెడుతోంది. తన ఇష్టానికే వదిలేద్దాం అని ఒక్క మాటతో కొట్టిపడేస్తాడు అంటూ కోపంగా, రోషంగా అంది గిరిజ.

అపర్ణగారి వ్యక్తిత్వాన్ని ఆమె ఆడపడుచు మాటలద్వారా విని ఆశ్చర్యపోయారు స్వప్న, ఇందిరలు. ఇంతవరకు అపర్ణ తన పర్సనల్ విషయాలేవీ తమ దగ్గర ప్రస్తావించలేదన్న విషయం వాళ్ళకి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ పిల్లల స్కూలుకి వెళ్ళి ఫీజులు కట్టాలి, హోంవర్క్‌లు రాయించాలి, పేరెంట్స్ మీటింగ్‌ల కెళ్ళాలి, యానివర్సరీ కెళ్ళాలి, పరీక్షలొస్తున్నాయి వాళ్ళను చదివించాలి, చరణ్ ఈరోజు జంతికలు కావాలన్నాడు, చేసొచ్చేటప్పటికి లేటయ్యింది ఇలాంటి మాటలు తప్ప ఆమె నుండి స్వవిషయాలనేవేవీ వినలేదు. ఎంత ఉన్నత వ్యక్తిత్వం ఆమెది అనుకుంటూ చీకటిపడుతోంది వెడదామండీ అంటూ కదిలారు స్వప్న, ఇందిరలు.

మరునాడు స్వప్నా, ఇందిరలు వచ్చేటప్పటికి, నవ్వుతూ ఎదురొచ్చి పలకరించింది అపర్ణ. ఒక్కసారిగా పారిజాత పరిమళాలు వీచిన అనుభూతి కలిగిందా ఇద్దరికి.

ఏమిటి ఈ రోజు మీరు లేటయ్యారు? ఒక్కదాన్నే వాకింగ్ చేయటం అంటే కాస్త బోర్. అందుకే మీరెప్పుడొస్తారా? అని ఎదురుచూస్తున్నాను అంది అపర్ణ. ముగ్గురూ ముచ్చట్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.

నిన్న మీకోసం బాగా ఎదురు చూశాంఅన్న స్వప్న మాటలకు రాలేకపోయానండీ. పిల్లల స్కూలులో మీటింగ్ ఉంటే వెళ్ళాను. మా వారికి టైం ఉండదు. పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను నేనే చూసుకుంటాను. పిల్లలు మంచి మార్కులను తెచ్చుకుంటున్నారు. ఇంటి దగ్గర మీరు పిల్లలపై మంచి కేర్ తీసుకుంటున్నారని టీచర్లు అన్నప్పుడు నాకు కలిగిన సంతోషం వర్ణింపలేనిది అంది అపర్ణ.

ఆమె మాటలను వింటూ, “ఎంత ఆనందంగా ఉందో! తన సొంత పిల్లలే ఇంత బాగా చదువుతున్నంతగా ఆనందంతోనూ, తన్మయత్వంతోను ఉన్న అపర్ణ కళ్ళలోని వెలుగును చూస్తూ, “అసలు సంగతి అడగాలా? వద్దా?” అనే డైలమాలో పడ్డారు స్వప్నా వాళ్ళు.

ఇందిర ఆగలేక అపర్ణగారూ, నిన్న మేమిద్దరం మీకోసం ఎదురుచూస్తుంటే, గిరిజగారని మీ ఆడపడుచుగారట, వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది.

ఆమె మాటలకడ్డువస్తూ ఔనండీ ఆమె చాలా సరదా మనిషి. అందుకే స్కూలుకు రమ్మంటే రానన్నారని, పార్కుకు వెళ్ళి మీతో పరిచయంచేసుకుని కబుర్లు చెప్పమన్నాను అంది అపర్ణ.

ఔనండీ! కానీ మీగురించి ఆమె ఎందుకో అసంతృప్తికి గురవుతున్నట్లనిపించింది నాకు అంది ఇందిర.

ఔనా! దానికో కారణం ఉందిలెండి. ఆమె వాళ్ళ అబ్బాయిని మాకు దత్తతకు ఇస్తామంటారు. దానికి నేను, పిల్లలు లేరని బాధపడ్తూంటే అప్పుడు దత్తత విషయం గురించి ఆలోచించవచ్చు. కానీ మాకు ఎక్కడికెళ్ళినా చాలామంది పిల్లలు ఉంటారు. ఉన్నారు. నాకా పిల్లలతోనే 24 గంటల సమయం చాలటంలేదు.

ఇక నేను ఎవరినైనా దత్తత తీసుకుంటే నేను, నా పిల్లాడు అన్న సంకుచిత భావంతో ఇంతమంది పిల్లలను దూరం చేసుకుంటాను. స్వార్ధంఅనే పంజరంలో ఇరుక్కుపోతాను. అయితే నా భావాలు ఆమెకు నచ్చలేదు. అదే బాధపడుతూ మీకు చెప్పి ఉంటారు అని తన ఆడపడుచు చులకన కాకుండా, ఆమె ఫీలింగ్స్‌కి విలువనిస్తూ బదులు చెప్పింది అపర్ణ.

అపర్ణ సంస్కారవంతమైన మాటలకు ముగ్ధులవుతూ, ఈమె నుండి మనం ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చనుకున్నారా మిత్రద్వయం. ఇంకా కుటుంబ విషయాలనడిగి ఆమె ఆనందాన్ని పాడు చేయటం భావ్యం కాదనిపించింది వాళ్ళకు.

ఇంతలో అటుగా పరిగెడుతున్న పిల్లవాడొకడు కాలుపట్టుతప్పి పడిపోయాడు. అపర్ణ ఒక్క ఉదుటున వాడి దగ్గఱకెళ్ళి, వాణ్ణి లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, దెబ్బను తుడిచి, తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న బాండెయిడ్ తీసి అంటించింది. ఏడవకు కన్నా! అంటూ వాడికో టాఫీనిచ్చి ఓదార్చుతోంది.

ఇంతలో ఆబాబు తల్లి కాబోలు కంగారుగా వచ్చి ఏరా కార్తీ! దెబ్బ బాగా తగిలిందా?” అంటూ వాడిని దగ్గఱకు తీసుకుంది.

పర్లేదండి. బాండెయిడ్ వేశాను. వాడు ఏడుపు కూడా మానేశాడుఅంది అపర్ణ.

చాలా థాంక్సండి! వాడు గోల చేయటంతోనే, ‘ఆడుకుంటూ ఉండరా, ఐస్‌క్రీం తీసుకువస్తాను అని వెళ్ళాను. ఇంతలో ఇలా జరిగింది. కార్తీ! ఆంటీకి థాంక్స్ చెప్పు అంది. సిగ్గు సిగ్గుగా కార్తి థాంక్స్ ఆంటీ అంటూ వాళ్ళమ్మతో కలసి వెళ్ళిపోయాడు.

అపర్ణలోని అమ్మతనాన్ని గమనించిన స్వప్న, ఇందిరలు, “కొత్త బాబు ఏడుపుని కూడా క్షణంలో పోగొట్టింది. మనకిలాంటి ఆలోచనలెందుకు రావు అనుకున్నారు. 

ఓ రోజు పార్కుకు అపర్ణ తన తల్లి జానకిని తీసుకొచ్చి తన స్నేహితురాళ్ళకు పరిచయం చేసింది. అమ్మ తమ్ముడి దగ్గర ఉంటుంది. భార్యా భర్తలిద్దరికీ ఉద్యోగాలవ్వటంతో, వాళ్ళింట్లో ఆమెకు క్షణం తీరుబడి ఉండదు. వారి ఇద్దరి పిల్లలను అమ్మే చూసుకోవాలి. వాళ్ళను ఆఫీసులకు పంపటం, తిరిగి వచ్చే వేళకు వంటచేసి పిల్లలకు పెట్టి, నిద్ర పుచ్చటం వంటి పనులతో, సమయంతో పరిగెట్టటంలో అలసిపోయిన ఆమెకు, ఆ పనులు వయసుకు మించిన భారమయ్యాయి.

BP పెరిగిపోయి మొన్న అమ్మ పడి పోయిందట. డాక్టర్ దగ్గఱకు తీసుకెళ్ళి చెకప్ చేయిస్తే, మందులతో పాటు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందన్నారట. అక్కడ మా ఇబ్బందులను చూసి తాను ఆగలేదు. మేమే ఏదో విధంగా కిందామీదా పడతాం. నీ దగ్గఱ కొన్నాళ్ళు ఉంటే ఆవిడకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ తమ్ముడు రాత్రి అమ్మను మా ఇంట్లో దింపి వెళ్ళాడు. “మందులతో పాటు కాస్త వాకింగ్ చేస్తూ, పచ్చని ప్రకృతిలో గడుపుతుందిఅని నా వెంట తీసుకొచ్చాను అని చెప్పింది అపర్ణ.

ఏమైనా పనుల వత్తిడి వల్ల అపర్ణ పార్కుకు రాలేకపోయినా జానకి మాత్రం పార్కుకు వచ్చేది. అలా తాను ఒంటరిగా పార్కుకు వచ్చిన ఒకరోజు జానకి, అపర్ణ గురించిన కొన్ని విషయాలను బాధపడుతూ స్వప్న, ఇందిరలకు చెప్పటం మొదలుపెట్టింది.

పెళ్ళయిన తరువాత పిల్లలకోసం అయిదు వసంతాలు ఎన్నో పూజలు, ఉపవాసాలు, మొక్కులతో ఎంతో బిజీగా ఉండేది నా తల్లి. ఆమె పూజలకు ఏ దేవుడు కరుణించాడో ఆమె కల తీరింది. తొమ్మిది నెలలు ఎలా గడిచాయో తెలియలేదు. ఇంటి నిండా పిల్లల ఫోటోలు, బొమ్మలు ఏవి కనిపిస్తే అవి కొని అలంకరించింది. పసిపిల్లలంటే దానికి అంత ఇష్టం.

కానీ ఏ పూర్వజన్మ పాపఫలం ఇప్పుడు తగిలిందో, డెలివరీలో పుట్టిన బిడ్డ చనిపోయింది. ఇది తట్టుకోలేక బెంగపడిన అపర్ణ మంచం పట్టింది. ప్రశాంతత కోసం అల్లుడు ఆమెను యాత్రలనీ, విహారయాత్రలనీ వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళాడు.

రోజు అపర్ణ ఏదో పనిలో ఉండగా ఫోనొచ్చింది. తనకు పురుడు పోసిన గైనకాలజిస్ట్, ఓసారి వెంటనే ఆసుపత్రికి రమ్మనమని చెప్పారు. ఆ సమయంలో భర్త ఇంటిలోనే ఉండటంతో ఆలస్యం చేయకుండా కారులో ఆసుపత్రికి వెళ్ళారా దంపతులు.

అపర్ణను చూసిన డాక్టర్ ప్రభావతి చూడమ్మా ఈరోజు నేను నీ చిరకాల వాంఛను తీర్చబోతున్నాను. రా ఇటు అంటూ ప్రక్కనే ఉన్న పిల్లల వార్డ్‌కు తీసుకెళ్ళింది. ఉయ్యాలలో విరబూసిన గులాబి వంటి బుల్లి బుజ్జాయి నిదురపోతోంది.

ఈపాప తల్లి ఓ విధివంచితురాలు. తల్లిదండ్రులులేని ఆమె ఓ సేవాసదన్‌లో ఉంటూ, మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఏదో చిన్న ఉద్యోగం కూడా సంపాదించిన ఆమె ఒక తప్పటడుగు వేసింది. రోజూ ఆఫీసుకు వెళ్ళే దారిలో పరిచయమైన ఓ అబ్బాయి ప్రేమించానంటే నమ్మి గుళ్ళో పెళ్ళి చేసుకుంది. ఆమెను తల్లిని చేసిన ఆ మోసకారి, ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఈమెను వదిలేశాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆమెను ఆదరించక కొడుకు వైపే మాట్లాడారు. దానితో అశక్తురాలైన ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ స్థితిలో నా దగ్గరకు వచ్చింది. ఆమెకు ధైర్యం చెప్పి నేను ట్రీట్‌మెంట్ చేశాను.

పాప పుట్టిన కాసేపటికే ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఈపాప దురదృష్టవంతురాలవ్వకుండా మీ లాంటి అమృతమూర్తి ఇంట కూతురిగా పెరగాలని ఆ దేవుడనుకున్నాడేమో, నాకు మీరు వెంటనే గుర్తుకొచ్చారు. ఇక నుండి ఈపాప ఆలనాపాలనా మీరే చూసుకోండి అంటూ పాపను అపర్ణ చేతిలో పెట్టారామె.  

అపర్ణకు తనువు, మనస్సు పులకరించిపోయాయి. పాప స్పర్శతో ఆమెలోని తల్లి హృదయం పొంగి, ఆ చిట్టితల్లిపై  ముద్దుల వర్షం కురిపించింది.

భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఏవైనా పత్రాలపై సంతకాలు చేయాలా?” అంటూ డాక్టర్ ప్రభావతిని ప్రశ్నించాడు అపర్ణ భర్త.

ఆమె సమాధానం చెప్తూండగానే ఓ నర్స్ వచ్చి డాక్టర్! 5వ నెంబర్ బెడ్ మీద ఆమెకి డెలివరి అయ్యింది కదా! ఆమెకు స్పృహ వచ్చింది. నాకు పాపను చూపండి అంటూ ఒకటే ఏడుపు. ఆమె ఏమౌతుందోనని కంగారుగా ఉంది. మీరు ఓసారి అర్జెంట్‌గా రండి అంటూ ప్రభావతిని తీసుకెళ్ళింది.

మీరిక్కడే కాసేపు ఉండండి. ఆ పేషంట్ పరిస్థితి ఏమిటో చూసొస్తాను అంటూ నర్స్ వెంట వెళ్ళింది డాక్టర్ ప్రభావతి.

ఏడుస్తున్న పేషంట్‌తో డాక్టర్ ప్రభావతి పాప వీక్‌గా పుట్టింది. అందుకే ఇంక్యుబేటర్లో ఉంచాం. నీకు ఆపరేషన్ జరిగింది. ఇలా ఏడుస్తూంటే కడుపులో నరాలు కదిలి, నువ్వు ప్రమాదంలో పడతావు అంటూ పాప చనిపోయిందన్న నిజాన్ని చెప్పలేక అబద్ధాలతో ఆ తల్లిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.

తల్లి ఏడుస్తూ పెళ్ళయిన ఇన్నేళ్ళకు దేవుడు నన్ను కరుణించాడని సంబరపడ్డాను. ఇన్నాళ్ళూ గొడ్రాలు అని ముద్ర వేసి నన్ను మానసికంగా వేధించారు అత్తింటివారు. నాకు ఇక పిల్లలు పుట్టరని నిందిస్తూ, వాళ్ళంతా కలసి మావారికి వేరే పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా పాపను ఒళ్ళోపెట్టుకుని, అమ్మనైనానని సగర్వంగా తలెత్తుకుని వాళ్ళ ముందుకు వెడతాను. ప్లీజ్! ఒక్కసారి నా పాపను చూపించండి అంటూ హిస్టీరిక్‌గా మాట్లాడుతోంది.

ఆమె దుఃఖాన్ని చూసిన అపర్ణ ముందుకొచ్చి తన ఒడిలో ఉన్న పసిపాపతోఇదిగో పాపాయి! నీ కోసం అమ్మ ఎలా ఏడుస్తోందో చూడు! అమ్మా! నేను రెస్ట్ తీసుకుని నీ దగ్గఱకొచ్చాను బెంగపడ్డావా? అని అడుగు తల్లీ, అడుగు అంటూ ఏమ్మా! మీపాపను చూసుకోండి. ఏడవకండి అంటూ ఆ తల్లిని ఓదార్చి, పక్కకొచ్చి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంది.

ఇంతలో నర్స్ బయిట కూర్చున్న ఆ పేషంట్ భర్త, ఇతర బంధువులను పిలిచి పాపను చూడమని చెప్పటంతో అంతా పాపాయిని చూసి మురిసిపోయారు.

డాక్టర్ ప్రభావతి వాళ్ళందరికి జాగ్రత్తలు చెప్పి, అపర్ణతో కలసి తన రూంకు వచ్చి అపర్ణా! నీవు చేసిన మేలు ఇంకో స్త్రీ జీవితానికి వరంగా మారింది. ఎంత గొప్ప త్యాగం చేశావమ్మా అంటూ దీవించారు.

డాక్టర్! నేను కూడా అలాంటి దుఃఖాన్ని అనుభవించినదాన్నేగా. అందుకే ఇంకో స్త్రీ నాలాగా బాధ పడకూడదని ఆ పని చేసాను. నేను ఆ టైంలో ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళానో? మా వారు, అత్తమామలు, అమ్మానాన్నలు, తమ్ముడు అంతా నా వెనుక నిలబడి నన్ను మామూలు స్థితికి తీసుకువచ్చారు.

కానీ ఆమె పరిస్థితి వేరు కదా! పాప లేకపోతే ఆమెకి బ్రతుకే లేకుండా పోతుంది. ఆమె భర్తకు మరో పెళ్ళి చేయటానికి అత్తింటి వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే పాపను ఆ తల్లికి ఆశల జాబిలిగా మార్చి ఆమె కళ్ళలో వేయి పున్నముల కాంతిని చూడగలిగాను. ఓ తల్లి బాధను తీర్చానన్న తృప్తి ఎంతో ఆనందాన్నిచింది. ఇది చాలు నా జీవితానికి అంది అపర్ణ.

అలా నాకూతురి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. ఎవరి పిల్లలనైనా తన పిల్లలలాగానే భావించి అన్నీ తానై పని చేస్తూంటుంది మా అపర్ణ. చుట్టాలలో చాలామంది దానిని అపార్ధం చేసుకుంటున్నారు. నా అల్లుడు మాత్రం మనసున్న మారాజు. అపర్ణ ఏమిచేసినా కాదనడు. అందుకే నా అపర్ణను పార్వతీదేవితో పోల్చుతూంటాను నేను. ఆ తల్లి అందరికి అమ్మే కదా! అని ముగించింది జానకి.

స్వప్న, ఇందిరలు అపర్ణలోని తల్లిహృదయానికి కదిలి పోయారు. ఆమెనుండి మనం ఏ కొంచెమైనా నేర్చుకోవాలనిపించింది వాళ్ళకి.

Kommentera