అధ్యక్షుని సందేశం  (Author: అన్నా మధు)

అందరికీ నా నమస్కారం.

వసంత శోభలతో ప్రారంభమైన మాకార్యవర్గ బాధ్యతలు - సభ్యుల సహకారంతో - ఆద్యంత ఉత్సాహంతో నిర్వహించామని తెలియజేయడానికి మనసారా ఆనందిస్తున్నాను. 

చిన్న చిన్న మారృులతో ఖరారైన నాతోటి కార్యవర్గ సభ్యుల ఊహించని అద్భుతమైన సహకారంతో న్యూజెర్సీలో నివసిస్తూ భీమా సదుపాయం లేక మరియూ వైద్యుల ప్రత్యేక సూచనల కోసం ఎదురుచూస్తున్న తెలుగు వారికి ఉచిత వైద్య శిబిరం జూన్ 9 న ఏర్పాటు చేసి 8 మంది వైద్యుల ద్వారా ప్రత్యేక సేవలందించాము. 

పూర్వాధ్యక్షులు శ్రీ గేదెల దాము గారు ప్రత్యేకంగా సభను జూన్ 19 న ఏర్పాటు చేసి న్యూజెర్సీ లో తెలుగు ప్రముఖులను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

జూలై 6 న శ్రీమతికొండవీటి జ్యోతిర్మయి గారి సంగీతవిభావరి సభ్యులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.  జులై 28 న జరిపిన వేసవి వన భోజన సందడి కిక్కిరిసిన సభ్యులతో ఉద్యానవనం శోభాయమానంగా విరాజిల్లింది. కార్యవర్గ సభ్యుల దక్షతతో ఏర్పాటు చేసిన పదహారణాల తెలుగు విందు భోజనం  ప్రతి ఒక్కరి మన్ననలను పొందడం ఒక ప్రత్యేకత. 

ముగ్గురు ప్రముఖ న్యాయవాదులతో ఆగష్టు 6 న ఏర్పాటు చేసిన చట్టపరమైన సలహాలు, హాజరైన సభ్యుల ప్రశంసలను పొంది, వారి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.

అందరూ ఎదురు చూస్తున్న దీపావళి సంబరాలకి అందరం సంసిద్ధులమవుతున్నాం. క్రీడా పొటీలు, గాన, నృత్య పోటీలు నిర్వహిస్తున్నాము. 

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ప్రత్యేక నివాళులు అర్పించడానికి శ్రీ స్వర వీణాపాణి గారిని ఆహ్వానిస్తున్నాము. ప్రత్యేక ప్రదర్శనలతో బాలమురళి గారికి నివాళులు అర్పించడానికి సిద్ధమవుతున్నాము.   

కార్యవర్గ సభ్యులకూ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తున్న దాతలకు, కార్యకర్తలకూ, సభ్యులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ముగింపుగా సంతోషం కంటే విచారమే మనసులో మెదలుతున్నది. రెండు తెలుగు రాష్త్రాలలో ఇటీవల సంభవించిన వరదలు భయభ్రాంతులను చేస్తూ ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఉడతా భక్తిగా తెలుగు కళా సమితి సభ్యులు విరాళాలు సేకరించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిధులకు పంపటానికి కృషి చేస్తున్నాం. అందరూ మాకు సహకరించి విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రార్థన. 

త్వరలోనే మళ్లీ మళ్లీ వచ్చే కార్యక్రమాలలో మిమ్మల్ని కలుసుకోవాలని ఆకాంక్షిస్తూ...

అన్నా మధు.

Kommentera