అచ్చతెలుగు మాటలాట  (Author: కర్లపాలెం హనుమంతరావు)

తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 ప్రకారం అచ్చతెనుగు అంటే స్వచ్ఛమైన తెలుగు, సంస్కృతసమేతరమైన తెనుగు. శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి– 2004) ప్రకారం తత్సమేతరమైన ఆంధ్రభాష. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు- 1966) ప్రకారం తత్సమ పదములు కలియని ఆంధ్రభాష.

ఆంధ్రభాషలో పదాలు నాలుగు రకాలని  వైయాకరుణులు తెలియజేశారు. అవి: తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము. ఇందులో తత్సమం రెండు విధాలు : సంస్కృతసమము,  ప్రాకృతసమము. సంస్కృత సమేతరమైన భాషనే అచ్చతెలుగు అంటారు.

అచ్చ తెనుగులో ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు ఉంటాయి. గ్రామ్యం లక్షణ విరుద్ధం కాబట్టి ప్రయోగానికి పనికిరాదని లాక్షణికులు చెప్తారు కానీ, ఆయాజాతుల ప్రయోగాన్ని బట్టి ఉపయోగించవచ్చని కొందరు ఖండిస్తారు.

అచ్చతెలుగు కావ్యరచనకు మార్గదర్శి పొన్నెగంటి తెలగనార్యుడు. ఇతని కృతి యయాతి చరిత్ర.

" అచ్చతెనుంగు పద్దె మొకటైనను గబ్బములోన నుండినన్

హెచ్చని యాడుచుందు రది యెన్నుచు, నేర్పున బొత్త మెల్ల ని

ట్లచ్చ తెనుంగున్నన్నుడువ నందుల చంద మెఱుంగు వారు నిన్

మెచ్చరొ, యబ్బురం బనరొ, మేలనరొ, కొనియాడరో నినున్"

ఇది ఐదొందల యేళ్ళనాటి పొన్నెగంటి  తెలగన్న కవి తాను అచ్చతెలుగులో యయాతి చరిత్ర కావ్యం వ్రాయాలని సంకల్పం చెప్పుకుంటూ, సంస్కృతపదం ఒక్కటి కూడా వాడకుండా పద్యం చెప్పాలనుకున్నాడు.

మొదటి అచ్చతెనుగు కావ్యం పొన్నెగంటి  తెలగన కవి 'యయాతి చరిత్ర'. సంస్కృత భాషా పదాలను దేశీ, తడ, లను మాత్రమే ప్రయోగించి కవి ఈ కావ్యాన్ని రచించాడు. సంస్కృత పదాలను అచ్చ తెనుగులో తనే  తయారు చేసుకున్నాడు.

ఉదాహరణకు..

పంచవదనుడు= ఐదు మోముల వేల్పు,

వాల్మీకి= కనువినుకలి తావుచూలి,

బ్రహ్మ= నీటి పుట్టువు, పట్టి .

ఇంకా.. పక్కడాలు, వేల్పు, పొక్కిలి, పసిబిడ్డ, (హిమవంతుడు )మరుమేపు కందోక మామగారు అని ఈ విధంగా అచ్చతెనుగు పదాలను తయారు చేసుకొన్నాడు.  అచ్చతెనుగు కావ్యం రాయడం వల్ల అతడికి తెనగన కవి అని పేరు వచ్చిందని అంటారు .

కీ.శే. దాసు శ్రీరాములు పంతులుగారు సంస్కృతంలోని 'అభిజ్ఞాన శాకుంతలము' ను అచ్చతెనుగులోకి అనువాదం చేశారు. ఒకసారి  ఆయన పనిమీద మదరాసు తిరువల్లిక్కేణిలో ఉన్నప్పుడు కొందరు బి.యే. విద్యార్థులు ఒక సంస్కృత నాటకాన్ని తెలుగులో రాయమని   కోరితే మహాకవి కాళిదాసు విరచిత "అభిజ్ఞాన శాకుంతలము”లోని  'అనాఘ్రాతం పుష్పం' శ్లోకాన్ని ఆశువుగా అనువదించాడు. తీరా చూస్తే  అది కాస్తా అచ్చ తెలుగు పద్యం అయి కూర్చుంది అట. ఆ పద్యం ఇట్లా ఉంటుంది.

గీ. ఎపుడు మూచూడని విరిగోఱిడని చిగురు

గ్రుచ్చని రతన మానని క్రొత్త తేనె

మించు నోములపంట నమ్మంచిరూపు

నెవనిఁ గలయంగఁ గూఱ్చునో యెఱుఁగనలువ.

అదే పట్టు మీద ఆ కవిశ్రేష్టుడు   20 రోజులలో మొత్తం నాటకాన్ని అచ్చ తెలుగులోనే అనువదించాడని అంటారు.

ఆ అచ్చతెనుగు నాటకం ఆరంభంలో సూత్రధారుడు "ఈ ఱచ్చకు విచ్చేసియున్న వారి యిచ్చఁదీర్చి మెచ్చుకొనఁ జేయుట కంటె మనకు మరేమి  పనియున్నది?'' అని అడిగితే,

నటి "సామీ! ననకాఱు, ఉబ్బకాఱు, వానకాఱు, తెల్లుకాఱు, చలికాఱు, చలువకాఱు అని ఆఱు కాఱులు గదా; ఇందు ఏ కాఱు మీద పాట బాడిన బాగుగానుండును.'' అని అడుగుతుంది.

ఇట్లా అచ్చతెనుగు రచనల వల్ల పదసంపద పెరుగుతుంది. భాషానిర్మాణ వ్యూహాలు అంటే సమాసాదుల తయారీ వగైరాలు ఎలా ఉంటాయో ఎరుక పడుతుంది. ఈ మేరకు శ్రీరాములుగారికి తెలుగు భాష  ఋణపడి ఉన్నట్టే.

ఇంత చెప్పుకొన్నా ఏది అచ్చ తెనుగు? అనే ప్రశ్న ఈ  మారుతున్న  కాలంలో భాషావేత్తలను తొలుస్తూనే ఉంది. అతిసామాన్య ప్రజల నాలుకల మీద ఆడే మాటలే అచ్చతెనుగు అంటారు కొంతమంది. కాని, ఈ మాటల్లో పర్షియన్, ఉర్దూ, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి పదాల్ని కలిపి మాట్లాడుతూనే ఉన్నారు కదా! ఆ మేరకు అచ్చగా అచ్చతెనుగు రాయటం అంటే ముక్కాలి పీటమీద ఏనుగును  ఆటాడించినట్లే .

అయినాసరే, జనంలోకి వెళ్ళిపోయిన పదాలు విదేశీయమైనా స్వదేశీయంగా మార్చుకోలేక పోతే భాష ఎదుగుదల లేక గిడసబారి పోతుంది. అలాగని, అయినదానికీ కానిదానికీ సంస్కృతాంగ్ల పదాలను ఇష్టారాజ్యంగా ప్రయోగించటమూ తప్పే! వీలున్నంత వరకూ కల్తీ లేని తెలుగు పదాలను ఉపయోగిస్తేనే మన సొంత ముద్ర మనకు  మిగులుతుంది .

Two wheeler ని ద్విచక్ర వాహనం అని అన్నా అది అచ్చ తెలుగు పదం కాబోదు. రెండు చక్రాలబండి అంటే బాగుంటుంది. విచిత్రం ఏంటంటే- ఇంగ్లీషూ, సంస్కృతమూ ఎవరికి బొత్తిగా తెలియవో వాళ్ళకే అచ్చమైన  తెలుగులో పదాలు పలుకుతాయి. సామాన్యుడు డ్రెడ్జరుని “తవ్వోడ (సముద్రం అడుగున ఇసుకని తవ్వి తీసే ఓడ)” అనగలడు. ఫ్లయోవరుని ‘పైవంతెన’ అనగలడు. తెలివి మీరిన మన బోటి వాళ్ళం అట్లా మాట్లాడటం నామర్దా అనుకుంటాం.

పొన్నగంటి తెలగన్నది కూడా ఇదే దృష్టి. ఆయన దేవతల పేర్లని ‘పాదం అడుగున నీళ్ళున్నవాడు’ లాంటి అనువాదాలతో హింస పెట్టకుండా చక్కగా తెలుగు పదాలుగానే తన  కావ్యంలో వాడేశాడు. కావ్యం పేరే ' యయాతి చరిత్ర'  అని రెండు సంస్కృత పదాలతో ఉంటే ఇంక అచ్చతెలుగులో వ్రాసేదేవుంది? అని ఈసడించిన వాళ్ళున్నారు.

కానీ, సంఙ్ఞావాచకాలను అంటే, పాత్రలూ, ప్రకృతి సంపదలు, పట్టణాలు, పనిముట్లు వంటి వాటి  పేర్లను తెలుగులోకి మార్చాలనే ప్రయత్నం తాను చేయననన్నాడు. అట్లా చేస్తే వికారంగా కూడా ఉంటుంది నిజానికి. మనవి కాని వస్తువుల  పేర్లు మన భాషలో ఉండవు. కంప్యూటర్, ఇంటర్నెట్ లాంటి మాటల్ని తెలుగు చేయలేం. అట్లాగని బలవంతంగా  గణక యంత్రం, అంతర్జాలం అన్నందు వల్ల  తెలుగు భాషకు ఒరిగేదేమీ ఉండదు. వాటిలోనూ అన్యభాషా పదాలు ఉన్నాయి గమనించారా? అందుకే పొన్నెగంటి తెలగన్న అలా తెలుగీకరించే పని తాను చేయబోనన్నాడు.

కాకపోతే, రైలు, రోడ్డు, ఫ్యాను లాంటి మాటల్ని తెలుగుమాటలుగా తీసుకుంటే వచ్చే నష్టం లేకపోగా తెలుగుభాష విస్తృతమవుతుంది. రైలెక్కు, ఫ్యానెయ్యివంటివి ఏనాడో తెలుగు మాటలుగా తెలుగు పలుకుబడులుగా స్థిరపడి పోయాయి. వీటిని దుష్టసమాసాలుగా ముద్ర వేసినా ప్రయోజనంలేదు.  సామాన్యుల వాడకంలో ఉన్న మాటల్ని కనీసం వంద సంవత్సరాలకు ఒకసారయినా దేశ్యపదాలుగా కలుపుకుంటే, భాష విస్తృతమై విచ్చుకుంటుంది. లేకపోతే వాడకం తప్పి ముడుచుకు పోతుంది. అదీ సంగతి.

I

Kommentera