Article
జయ వందేమాతరం (Author: పాలూరి సుజన)
(మచ్చుకి వినండి: https://youtu.be/YULIc8NjQac)
శతాబ్దాలు చేసింది దేశమాత దాస్యం!
కోహినూరు కొల్లగొట్టె తెల్లవారి స్వార్థం!
రత్నగర్భ మా తల్లికి మిగిలె మిగుల శోకం!
ఆమె దుఃఖ మాక్రోశం పెంచె ప్రజల ఆవేశం!
సుస్వరాజ్య ఉద్యమానికదే కదా ఆరంభం!
ఉరి కొయ్యల ఊయలూగ భగత్ సింగులొచ్చినారు!
గుండు కెదురు గుండె నొడ్డి రామరాజు నిలిచినారు!
అహింసయే ఆయుధమై మహాత్ముడే అడుగేసెను!
పటేల్, బోసు, ఝాన్సిరాణి సింహాలై గర్జించెను!
బానిస సంకెళ్ళు త్రుంచి తెచ్చె మనకు స్వాతంత్ర్యం!
ప్రాణాలను పెట్టి పణం, తీర్చుకొనిరి అమ్మ ఋణం!
సాయుధ సంగ్రామంలో త్యాగం శూరుల రుధిరం!
సత్యాగ్రహ సత్పథాన శుభ్రజ్యోత్స్నా శ్వేతం!
సస్యశ్యామల సేద్యపు రైతుల స్వేదం హరితం!
మువ్వన్నెల దివ్వె వెలుగు వందేమాతర గీతం!
నాలుగు సింహాల ధర్మ విక్రమ మశోక చక్రం
మామిడి, నెమలి, కమలం, పులులు గర్వ చిహ్నం!
ఎన్ని మతాలెన్ని రీతులెన్ని భాషలున్నా,
హిమవన్నగ సన్నుతేల, ఉన్నతి మిన్నంటిపోవ!
జీవనదీ జలనిధులే సంగమించు జలధులన్ని
భరతమాత జలతారు చీర చెంగు పరవళ్ళే!
బుద్ధుడు, నానక్, జైనుల బోధలకే ఆధారం!
నమస్కార సంస్కారం నా దేశపు సత్కారం!
యోగాయేనా? జగతికి ఓంకారం నా దేశం!
రంగం ఏదైన గాని పారంగతులకు తీరం!
నింగి కెగసి పోలేదా, మంగళ గ్రహమా దూరం?
పట్టుదలతో పని చేద్దాం! ప్రగతిబాట సాగుదాం!
గణతంత్రపు వీణలపై ఘన ప్రణతుల నిక్వణం!
జన గళమున గణగణమను జనగణమన గానం!
జయ జయ జయహే నాదం నినదించే జనం మనం!
జయ జయ జయహే నాదం జయ వందేమాతరం!