2022-2024 TFAS కార్యవర్గ విజయాలు  (Author: రాచకుళ్ల మధు)

తెలుగు కళా సమితి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రస్తుత బోర్డు అఫ్ ట్రస్టీస్ జట్టు రెండు సంవత్సరాల పదవీ కాలం ఈ మే నెల 31వ తేదిన దిగ్విజయంగా పూర్తిచేసుకుంది.

కోవిడ్‌ 19 వైరస్ వ్యాప్తి భయాందోళనల కారణముగా ఇంటికే పరిమితం అయినవారందరిని తిరిగి తెలుగు కళా సమితి కార్యక్రమాలకు తీసుకురావడాన్ని  మా జట్టు ఒక సవాలుగా తీసుకొని విశేషమైన కృషి చేసింది.

గత 2 సంవత్సరాలలో మేము తెలుగు కళా సమితి వేదిక మీద  25 కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాము.

తెలుగు కళా సమితిలో మొట్ట మొదటిసారిగా

  • రాగావధానం, యక్షగానం వంటి సాంప్రదాయ కళల ప్రదర్శన
  • అమెరికాలో పుట్టిన పిల్లలతో శ్రీకృష్ణరాయబారం అనే పౌరాణిక పద్య నాటక ప్రదర్శన.
  • పిల్లలలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రోబోటిక్స్, సైన్స్ ఫెయిర్‌, లైవ్ రాకెట్ లాంచింగ్ వంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక కార్యక్రమాల నిర్వహణ
  • పబ్లిక్ స్పీకింగ్, విద్యా సెమినార్లు, మోడల్ UN క్లబ్ వంటి కార్యక్రమాలలో మార్గదర్శకత్వం అందించడం ద్వారా యువతకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుటం
  • కైట్ ఫెస్టివల్(గాలిపటాలను తయారు చేయటం), మార్షల్ ఆర్ట్స్, హాస్య యోగా, మల్లకంబ్ వంటి క్రీడా మరియు శారీరక శిక్షణ కార్యక్రమాలను నిర్వహణ
  • మహిళలకు క్రికెట్ జట్టు, ప్రైమ్‌ టైమ్‌ లో  సెమినార్లు, త్రోబాల్ వంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మహిళలను స్ఫూర్తి పరచుట
  • సినిమా తారల గ్లామర్ తో కాకుండా  స్థానిక కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాల రూపకల్పన
  • 900 మందికి పైగా సభ్యులతో TFAS Family 2022-24 అనే WhatsApp గ్రూప్ ను ఏర్పాటు చేసి, సామాజిక మాధ్యమాలలో  ఆక్టివ్ గా ఉండటం
  • సాంప్రదాయ మీడియా వ్యవస్థల ద్వారా కాకుండా ఈ TFAS Family WhatsApp గ్రూప్ ద్వారా తెలుగులో తెలుగు కళా సమితి కార్యక్రమాలను మన చిన్నారులతో తెలుగులో ప్రచారం చేయటం
  • న్యూజెర్సీ లోని అన్ని స్థానిక మరియు జాతీయ  సంస్థలతో కలిసి పనిచేసి, పరస్పర సహకారాన్ని పెంపొందించటం  ద్వారా మన సామాజిక బాధ్యత నిరూపణ
  • బలమైన వాలంటీర్ల వ్యవస్థ నిర్మించి, వారిని తగు రీతితో గుర్తించటం
  • చాలా సంవత్సరాలుగా తెలుగు కళా సమితికి వివిధ కమిటీలలో సేవ చేస్తూ ఉన్నవారికి మన కార్యక్రమాలలో వేదిక మీద సత్కరించటం
  • తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు, శ్రీ మాధవపెద్ది సత్యం  గార్లకు శతజయంతి వేడుకలు,శ్రీ K. విశ్వనాధ్, శ్రీమతి జమున, శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి  గార్లకు  శ్రద్ధాంజలి కార్యక్రమాలను స్థానిక కళాకారులతో వినూత్నమైన రీతిలో నిర్వహించటం
  • 32 మంది బాలబాలికలతో భగవద్గీత అంత్యాక్షరి సంస్కృత శ్లోకాలు
  • అన్నమయ్య మరియు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గార్ల జయంతి కార్యక్రమాలు నిర్వహించటం
  • యువ వాలంటీర్లకు తెలుగు కళా సమితి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి వారిలో  నిర్వహణ సామర్థ్యం పెంపొందించటం
  • అనేక సంవత్సరాలుగా  తెలుగు కళా సమితి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న అన్ని మీడియా ప్రతినిధులకు వేదిక మీద తగు రీతిలో గౌరవించటం
  • పి. డి. ఎఫ్ డాక్యుమెంట్ ఫార్మాటు లో వస్తున్న తెలుగుజ్యోతి ని ఆన్ లైన్ లోకి తీసుకురావటం
  • తెలుగు కళా సమితికి  (tfasnj.org) కొత్త వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావటం
  • అటిజం మీద ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించటం
  • తెలుగు కళా సమితి కార్యక్రమాలలో పర్యావరణ పరిరక్షణల భాగంగా మొక్కలు, విత్తనాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం,
  • వివాహము చేసుకొన గోరు తెలుగు వారి పిల్లల కోసం పెళ్లిసందడి అనే కార్యక్రమం ద్వారా పరిణయ పరిచయము లాంటి   సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించటం
  • తెలుగు కళా సమితి కార్యక్రమాలలో ఇతర ఆర్గనైజషన్స్ వారి కార్యక్రమాలకు కూడా చోటిచ్చి పరస్పర సహకారాన్ని పెంపొందించటం ( MATA వారి ఆరోగ్య శిబిరం , వాసవి ఆర్గనైజేషన్ వారి డాక్టర్స్ సెమినార్ , JETS వారి యువతీ యువకుల  కార్యక్రమాలు, నాట్స్ వారి రీ యూనియన్ సదస్సు)
  • తెలుగు కళా సమితి 40వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయముగా అంగరంగ వైభవంగా నిర్వహించటం
  • నేక సామాజిక  కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇతర సంస్థలకు గౌరవ పురస్కారం అందచేయటం ( హెల్ప్ ఫౌండేషన్ , హోప్ ఫర్ స్పందన, వేగేశ్న ఫౌండేషన్)
  • వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన  న్యూజెర్సీ లోని తెలుగు వారికి గౌరవ పురస్కారం అందచేయటం
  • రెండు సంవత్సరాలలో సుమారు $400,000 డాలర్లు విరాళాలుగా సేకరించటం జరిగింది.
  • అన్ని కార్యక్రమాల ఖర్చులు పోను సుమారు 20,000 డాలర్లు తిరిగి తెలుగు కళా సమితి ఎండోమెంట్ ఫండ్ కు ఇవ్వటం జరిగింది.

మా జట్టు చేసిన ఈ కార్యక్రమాలన్నిటికి ఆర్థిక సహాయం మరియు సహకారం అందించిన దాతలకు, స్పాన్సర్స్ కు, న్యూజెర్సీ లోని స్థానిక మరియు జాతీయ  తెలుగు సాంస్కృతిక సంఘాలకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  వారి విరాళాలు మన తెలుగు వారసత్వాన్ని కాపాడటంలో, తెలుగు సంప్రదాయాలు,తెలుగు సంస్కృతిని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు, భవిష్యత్ తరాలకూ అందించటంలో కీలక పాత్ర పోషించాయి. దాతలు అందించిన ఆర్థిక సహాయం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, మరియు పండుగలు ఘనంగా నిర్వహించగలిగాము.

మేము చేసిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంలో స్వచ్ఛంద సేవకులు(volunteers) అందించిన సేవలు అమూల్యం. వారు  కష్టపడి పనిచేయడం, సమయాన్ని మరియు శారీరక శక్తిని సమర్పించడం వలననే మేము ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగలిగాం. వారి అంకితభావం మరియు నిస్వార్థ సేవ అనేక విజయాలను తెచ్చింది. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గడచిన రెండు సంవత్సరాల్లో తెలుగు కళా సమితి  సలహాదారులు (Dr ఎప్పనపల్లి హరి, శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీమతి సత్యవేణి రావు & శ్రీ బండారు రాజారావు) అందించిన విలువైన సూచనలు, సలహాలుప్రణాళికలు, మార్గనిర్దేశన సేవలకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు కళా సమితి  సలహాదారులు ఆర్థికంగా కూడా వెన్ను దన్ను గా నిలిచారు. కష్ట కాలం లో  ధైర్యం చెప్పి, తోడు నిలిచి మా జట్టు ను ముందుకు నడిపించారు. వారికి నా ధన్యవాదములు తెలియచేస్తున్నాను.

గడచిన రెండు సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మా జట్టు సభ్యులు అందరి సహకారం, కృషిఉత్సాహం, క్రమశిక్షణ, మరియు ప్రతిభ మన తెలుగు కళా సమితికి ఎనలేని మన్ననలు తెచ్చాయి. మేమందరమూ ఒకటిగా కలిసి పనిచేయడం వలనే మనం ఇన్ని విజయాలు సాధించగలిగాం.  మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

సాంస్కృతిక కార్యదర్శి దేవులపల్లి సుధ గారి కృషితో తెలుగు కళా సమితి  సాంస్కృతిక కార్యక్రమాలు మరింత వైభవంగా కొనసాగాయి. తెలుగు కళా సమితి 40 ఏళ్ల వేడుకల కో-కన్వీనర్‌గా, 40 ఏళ్లుగా తెలుగు కళా సమితి వైభవంగా జరుపుకుంటున్న తెలుగు కళా సమితికి నివాళులు అర్పిస్తూ తెలుగు కళా సమితి  వైభవం అనే డ్యాన్స్ బ్యాలెట్ నిర్వహించడం,  “ఓల్డ్ ఈజ్ గోల్డ్” ( తెలుగు కళా సమితి లోని సీనియర్ సిటిజన్‌లచే ఒక ప్రత్యేకమైన తెలుగు సినీ పాటల అంత్యాక్షరి), విభిన్న పౌరాణిక ఇతివృత్తాలపై ప్రసిద్ధ నృత్య ప్రదర్శనలుముఖ్యంగా ఎన్టీఆర్ శతజయంతి నృత్యం, కాంతారా నృత్యం అత్యద్భుతమైన కొరియాగ్రఫీ, భగవద్గీత అంత్యాక్షరి, యువత కోసం పబ్లిక్ స్పీకింగ్ విజయవంతంగా నిర్వహించారు.  ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా  ఆహ్వానించబడిన అతిథులకు ఆతిథ్యం కూడా సమకూర్చారు. యువ తరానికి  ప్రోత్సహించేందుకు యూత్ సర్వీసెస్ కమిటీని కల్చరల్ కమిటీతో కలిపారు.  ఇది యువత మరియు తల్లిదండ్రుల మధ్య చాలా సామరస్య పూర్వకమైన వాతావరణం సృష్టించింది.

తెలుగు కళలు  మీద ఎంతో అభిమానం వున్న అన్నదానం రవికృష్ణ గారు జనరల్ సెక్రటరీగా తెలుగు కళా సమితి  కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు.  జట్టు సభ్యుల మధ్య సమన్వయాన్ని సాధించటం, BOT తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడం,   బైలాస్ కమిటీకి BOT ప్రతినిధిగా వ్యవహరించటం, సమావేశాలను నేర్పుగా నిర్వహించటం, జట్టు సభ్యులకు tasks కేటాయించటం , వివిధ స్టాండింగ్ కమిటీల్లోని సభ్యులకు నియామక పత్రాలు అందజేయటం, ఆటలపోటీలకు వాలంటీరుగా సహాయం చేయటంప్రతి ఈవెంట్ యొక్క వ్యూహం మరియు ప్రణాళికలో అధ్యక్షుడు మరియు BoT తో సన్నిహితంగా పని చేయడం, 40వ వార్షికోత్సవం కోసం ఏర్పాటు చేసిన సుమారు 25 కమిటీల పనితీరును నిర్వహించటం మున్నగునవి చేశారు. ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా  ఆహ్వానించబడిన అతిథులకు ఆతిథ్యం కూడా సమకూర్చారు. ప్రతి ఈవెంట్ లోను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ ను పర్యవేక్షించారు.

తెలుగు కళా సమితి  ఉపాధ్యక్షుడిగా, కోశాధికారిగా  చెరువు శ్రీనివాస్ గారు విశేష సేవలు అందించారు. విరాళాలు సేకరించటమే కాకుండా  సంస్థ యొక్క  ఆర్థిక వనరులను కూడా బాధ్యతాయుతంగా నిర్వహించారు. అన్ని కార్యక్రమాలకు బడ్జెట్ తయారుచేయటం, బడ్జెట్ పనితీరును పర్యవేక్షించటం, నిధులను కేటాయించటంఫైనాన్షియల్ కమిటీ సమావేశాలు నిర్వహించటంఆదాయం, ఖర్చులు మరియు నగదు ప్రవాహంతో సహా సంస్థ యొక్క ఆర్థిక స్థితిపై అప్‌డేట్‌లను అందిస్తూరెగ్యులర్ ఫైనాన్షియల్ రిపోర్టులను సిద్ధం చేసి సమర్పించారు. రికార్డ్ కీపింగ్, వ్యవస్థీకృత అకౌంటింగ్ పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు మరియు ఆర్థిక లావాదేవీలతో సహా సంస్థ కోసం ఖచ్చితమైన మరియు తాజా ఆర్థిక రికార్డులను నిర్వహించడానికి క్విక్‌ బుక్స్ ఆన్‌లైన్‌లో అమలు చేసారు.  తెలుగు కళా సమితి బ్యాంక్ ఖాతాలు మరియు నగదు ప్రవాహం, డిపాజిట్లు, ఉపసంహరణలు మరియు చెల్లింపులను పర్యవేక్షించడం సమర్థవంతంగా నిర్వహించారు.

తెలుగు కళా సమితికి సభ్యత్వ కార్యదర్శిగా కామరసు జ్యోతి గారు  కొత్త సభ్యుల నమోదు కు విస్తృతంగా కృషి చేశారు. ఆమె నిర్వహణలో, సభ్యత్వ ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా మారింది. జ్యోతి గారి కృషి ఫలితంగా 75  కొత్త సభ్యులు  నమోదు చేసుకున్నారు. వరుసగా 2 సార్లు ప్రతిష్టాత్మకమైన త్రి మూర్తి దినోత్సవ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. యువత కోసం పబ్లిక్ స్పీకింగ్ కార్యక్రమం, యూత్ స్టేజి కోఆర్డినేషన్ మున్నగునవి నిర్వహించారు. సబ్‌ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎన్నికల కోసం సభ్యుల భాగస్వామి వివరాలను సేకరించటంలో చాల కష్టపడి చేసారు. తెలుగు కళా సమితి నిర్వహించిన ప్రతి కార్యక్రమం లోను కీలక బాధ్యతలు నిర్వహించారు.

తెలుగు కళా సమితికి  ఐటీ సేవల కార్యదర్శిగా వెలిశాల నాగమహేందర్ గారు అమోఘమైన విశేష సేవలు అందించారు. ఈవెంట్ ఫ్లైయర్‌ల రూపకల్పనలో , ఫ్లయర్స్ ను తెలుగు కళా సమితి సభ్యులకు సకాలంలో చేరవేయటంసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో  పోస్ట్ చేయటంలో  సమర్థవంతంగా వ్యవహరించారు. కొత్త తెలుగు కళా సమితి వెబ్‌సైట్ రూపొందించే బాధ్యతలను తీసుకోవటం తో పాటు  ఈవెంట్ ఫ్లైయర్‌లను, ఈవెంట్ ఫొటోలను, ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్‌లు, EC కమిటీ ఫొటోలను అప్‌లోడ్ చేయటంఈవెంట్ వివరాలను అప్‌లోడ్ చేయటం నిర్వహించారు. సభ్యులను, పెద్ద సంఖ్యలో వాలంటీర్లను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో ఆయన కీలకపాత్ర వహించారు. భోగ్ రెస్టారెంట్ వారితో పనిచేసి ఫుడ్ మెనూ ప్రిపేర్ చేయటం, ఫుడ్ వాలంటీర్స్ కోఆర్డినేషన్ చేయటం వంటి బాధ్యతలు నిర్వహించారు. పేరుకే ఐటీ సేవల కార్యదర్శి అయినప్పటికీ తెలుగు కళా సమితి కార్యక్రమాలలో అన్ని కీలక బాధ్యతలు నిర్వహించి అందరికి తలలో నాలుకగా (మిస్టర్ డిపెండబుల్) వ్యవహరించారు. 

యువత  కార్యదర్శిగా వీరిశెట్టి అనిల్ కుమార్ గారు నాయకత్వంలో యువతలో సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, మోడల్ UN కాన్ఫరెన్స్, ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్‌లు, యూత్ సెమినార్లు, సైన్స్ ఫెయిర్‌ స్పేస్ థీమ్ (రాకెట్ లాంచింగ్ & లైవ్ డెమాన్స్‌ట్రేషన్) ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు సాంస్కృతిక పరంపరను యువతలో ప్రోత్సహించారు. అనిల్ గారి సమర్థతతో, తెలుగు కళా సమితి  యువ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రధాన శక్తిగా మారింది. తెలుగు కళా సమితి  40వ వార్షికోత్సవం వేడుకలకు నిధుల సేకరణ సమన్వయకర్తగా పనిచేశారు. సంస్థ కోసం సానుకూల నగదు ప్రవాహంతో విజయవంతంగా నిధుల సమీకరణ & 98.5% హామీలను గ్రహించారు. అనిల్ ఆధ్వర్యంలో అనేక  నిధుల సేకరణ ఈవెంట్‌లను నిర్వహించటం జరిగింది.  ఎడిసన్‌లోని వుడ్రో విల్సన్ మిడిల్ స్కూల్‌లో రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ వైదేహి శశిధర్ M.D, ఫ్యామిలీ మెడిసిన్ ద్వారా నిపుణులైన కీలక ప్రసంగంతో నిర్వహించారు. అనిల్ చేసిన కృషి వల్ల  ఈ రెండు సంవత్సరాలలో 40+ అర్హత గల యువ వాలంటీర్లు PVSA అవార్డులను అందుకున్నారు.  తెలుగు కళా సమితి కార్యక్రమాల సమయంలో సంబంధిత కమిటీలు / ఈవెంట్‌లను నడపడంలో యువతను ప్రోత్సహించడం & అవకాశాలను అందించడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించారు. తెలుగు కళా సమితిలో వెండర్ మేనేజ్‌మెంట్ సమర్థవంతంగా చేసారు.

కమ్యూనిటీ సేవల కార్యదర్శిగా తాతా వెంకట సత్య  గారి  నాయకత్వంలో, తెలుగు కళా సమితి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్‌లలో  క్రీడా పోటీలను, క్రికెట్ మరియు త్రోబాల్‌లో మహిళలకు తొలిసారిగా క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించింది. వీటిలో అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు ప్రాధాన్యం పొందాయి. యువత కోసం రోబోటిక్స్ మరియు సైన్స్ ప్రోగ్రామ్‌లు, స్పేస్ థీమ్ ఈవెంట్లలో కీలక పాత్ర వహించారు. తెలుగు జ్యోతి కమిటీలో BOT కి ప్రాతినిధ్యం వహించారు. కొత్త తెలుగు జ్యోతి ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌ను రూపొందించడం, పరీక్షించడం మరియు ప్రారంభించడం, అనేక తెలుగు కళా సమితి ఈవెంట్‌ల కోసం వెండర్లను కోఆర్డినేట్ చేసారు.

న్యూజెర్సీ తెలుగు కళా సమితి తెలుగు కళల వికాసానికి చిరునామా కావాలని మా జట్టు సభ్యులందరూ గడచిన 2 సంవత్సరాలు ఎంతగానో శ్రమించారు. మా జట్టు సభ్యులందరి లోనూ అందరితో నూ కలిసి పనిచేసే గుణం, అప్పటికప్పుడు ప్రణాళికలను వేసుకుని, అటు దాతలతో, ఇటు తెలుగు కళా సమితి సభ్యులు, ఇతర స్థానిక మరియు జాతీయ సంస్థలతో కలిసి పనిచేయటం, కమ్యూనిటీకి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండటం, పెద్దలు చూపిన మార్గంలోనే నడుస్తూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ, నేటితరం, రాబోయే తరాలకు స్ఫూర్తివంతంగా ఉండేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా  తెలుగు కళా సమితిని  అగ్రశ్రేణి సంస్థ గా తీర్చిదిద్దటం జరిగింది.

మన చిన్నారులు ఎంతో ఇష్టపడి, కష్టపడి నేర్చుకున్న నాట్యం, సంగీతం లాంటి తెలుగు కళలను వేదిక మీద ప్రదర్శించటానికి విభిన్నమైన, వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలను మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా, మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాము.  ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, కళా ప్రదర్శనల ద్వారా స్థానిక కళాకారుల్లో వారి అంతర శక్తులను వెలికి తీసి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సాంఘిక చైతన్యాన్ని పెంపొందించాము.

ఈ రెండు సంవత్సరాలలోనూ తెలుగు కళా సమితి కార్యక్రమాలకు రుచికరమైన భోజనం అందించిన భోగ్ రెస్టారెంట్ టీం శ్రీ నిమ్మారెడ్డి రవి గారికి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, శ్రీమతి శ్వేత గారికి  నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. నా అధ్యక్ష పదవి ముగియనున్న ఈ సమయంలో  సహకరించిన నా సహధర్మచారిణి లక్ష్మికి, నా పిల్లలు ఆదిత్య, అజయ్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. మన తెలుగు కళా సమితి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెన్నో విజయాలను సాధించాలని ఆశిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు.

మీ రాచకుళ్ల మధు

2022-24 అధ్యక్షులు, తెలుగు కళా సమితి

Comentar