సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ (ప్రధాన సంపాదకులు))

అండ పిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే ఏమిటౌతుందీ అని ప్రశ్న, ఏమీ కాదు అని సమాధానం. అంటే, మానవ జాతి ఎంత గొప్పదైనా, ఎంత గొప్పదని తనకి తాను అనుకున్నా, ఏమి చేసినా చేయక పోయినా ఈ బ్రహ్మాండానికి గానీ, భూమికి గానీ, చివరికి ఈ ప్రపంచానికి గానీ ఏమీ అవ్వదు. ఈ అశేష బ్రహ్మాండంలో మనమూ మన సమాజమూ తుమ్మితే ఊడి పోయే ముక్కు లాంటి వాళ్ళము, మనం ఉన్నా ఊడినా తేడా ఉండదు అని భావం.

ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద బ్రహ్మాండమైన శరీరం ఉండి మాకెదురు లేదని మిగతా జీవ చరాలనింటికీ అదురు పుట్టించిన డైనోసార్లు, ఒక్క ఉల్కా పాతం తో (meteor fall at Chicxulub crater) నాశనం ఐపోయాయి, వాటి అస్థి పంజర శకలాలు మాత్రం దొరుకుతున్నాయి ఇవాళ. ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు వాటిని గుఱించి పట్టించుకున్న జీవమే లేదు.  మఱో పెద్ద భూకంపమో (like the Big One expected on the west coast) పెద్ద అగ్ని పర్వతపు పేలుడో సంభవిస్తే మన గతీ అంతే ఔతుందేమో.

మన కాలంలో ఈలాన్ మస్క్ (Elon Musk) అన్నట్లు, అంతకు ముందు ఎందఱో అనుకున్నట్లు మనం ఈ గ్రహాన్ని దాటి, ఈ భూమిని అధిగమించి అంతరిక్ష జీవులమైతే కాని మనకి మనుగడ లేదు, రంకెలు వేసి వేసి చివఱకు భస్మమైపోయే ఆంబోతుల్లా అంతరించి పోతాం. ఐతే నివాస యోగ్యమైన గ్రహాలే ఇప్పటి వఱకూ కనిపించ లేదు.

వందల కోట్ల సంవత్సరాలనుంచీ మన భూమి మీద ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు ఒకటి తరువాత ఒకటిగా జఱగ బట్టి భూమి మీద నాగరిక జీవులమైన మనం పుట్టడానికి అవకాశం కలిగింది. అవన్నీ కూడా యాదృఛ్చికంగా జరిగినవే. ఇప్పటి దాకా పరిశోధించిన వేల కొద్దీ గ్రహాలలో వేటిలోనూ కూడా జీవరాసులుండ దగిన పరిస్థెతులే కనపడ లేదు. మరో గ్రహమ్మీద నివాసానికి సరి పడిన వాతావరణం ఉన్నా కూడా, ఆయా సంఘటనలన్నీ వరసగా జరగకపోతే, బుధ్ధి గల జీవరాసులు, అంటే మనలాంటి వాళ్ళు పుట్టక పోవచ్చు. కాబట్టి, మనం ఈ భూమి మీద ‘రంకెలు వేసి వేసి’ సమసి పోతామా అని చాలా మంది శాస్త్రజ్ఞులు బాధ పడ్తుంటారు. మనం

అలాంటిది, ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James Web Telescope) ద్వారా చేసిన పరిశోధనలలో K2-18b అన్న గ్రహంలో జీవరాసులున్న ఛాయలు కనిపించాయని వర్తమానం విన్నాం: https://www.bbc.com/news/articles/c39jj9vkr34o . అవి కేవలం ‘ఛాయలేననీ’ ఇదమిధ్ధమని, నిజమని చెప్పడానికి మరో రెండేళ్ళ పాటు పరిశోధనలు చేయాలని అన్నారు. అది నిజమేనని తేలితే అమ్మయ్య, మనం ఒకళ్ళమే కాదు అని ఒక రకమైన తృప్తి కలుగుతుంది.

ఐతే ఆ గ్రహం ఎక్కడుందీ అంటే, ఓ పన్నెండు కోట్ల కోట్ల కిలోమీటర్ల (124 light years) దూరంలో ఉన్నది. అంటే మనం కాంతి కన్నా పదిరెట్లు వేగంగా ప్రయాణం చేయగలిగితే కేవలం ఓ పన్నెండేళ్ళ పైన పడ్తుందన్నమాట. నిజానికి మనం కాంతి కన్నా వేగంగా ప్రయాణించగల శక్తి గడించలేకపోతే మానవ జాతి ఈ భూమి మీదే భస్మమవక తప్పదు.

         ఓ వందేళ్ళలో ఎద్దు బళ్ళ నుంచి రాకెట్ల దాకా వచ్చాం, అతి త్వరలోనే అలా కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేసే సామర్ధ్యం సంపాదించగలమని ఆశిద్దాం.
         ఈ నేపధ్యంలో అపరిచిత విమానాలున్నాయన్న వాదాలు (UFO Theories) బలం పుంజుకుంటున్నాయి.

వాటి సంగతి ఏమైనా, మనకి ఆ సామర్ధత రావడానికి ఎన్నేళ్ళు పట్టినా ఎన్ని వేల ఏళ్ళు పట్టినా ఏమైనా ఈ అనంత విశ్వంలో మనమొకళ్ళమే కాదు వేరే జీవరాసులున్నాయి అన్న విజ్ఞానమే ఒక పెద్ద విషయం.

ఈ అంశం పైనే ఈ సంచిక ముఖచిత్రం.  దాన్ని వేసిన చిరంజీవి అక్షర ప్రతాప్ కి ఆశీస్సులు.  

మరొక ముఖ్య విశేషం; ఈ యేడు వచ్చిన పద్మా అవార్డులలో మన తెలుగు వారు చాలా మంది ఉండడం మనకి చాలా గర్వ దాయకం.

Comentar

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)