శ్రమ జీవన పతాకం
శ్రమ జీవన పతాకం (Author: ఉప్పల పద్మ)
పట్నం రహదారి పక్కన ఓ ఒంటి స్తంభం
అలసిపోయి సాగిలపడుతున్న ఆమె దేహానికి
అదొక ఊతం
తన ఒడి వాకిట నాలుగు పాత బస్తాలు
సరికొత్త నేలమాళిగలు అవి
వాటి నిండుగా ఎందరో
కరివేపాకులా వదిలించుకున్న ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు
అవే ఈరోజు ఆమెకు దొరికిన లంకెబిందెలు
ఆకలి పొట్టకు అవే అన్నం మెతుకులు
చుట్టూ జోరీగల సంగీతం
ముసురుకుంటున్న దోమల సయ్యాటలు
వర్ణనలకందని వాసన
దేనితోనూ సంబంధం లేదు
ఎవరితోనో పోలిక లేదు
ఆమెకు ఆమే రాణి
రాలుతున్న చెమట చుక్కలే ఆమెకు ఓదార్పు
చెరగని బతుకు చిత్రానికి నమూనాగా ఆమె
ఒక్కో కాగితాన్ని వంగి వంగి ఏరుకొని సంచి నింపుకుంటుంది
ఏరుకున్న ప్రతిసారి ఆమె ముఖంపై నక్షత్రాలు మొలుస్తాయి
అంతస్తుల మీద అంతస్తులు కట్టినంత ఆనందం ఆమెకే సొంతం
ప్రత్యేక ఎక్సర్సైజులతో ఏ మాత్రం అక్కరలేని ఆమె
శ్రమ జీవన పతాకం
రాజ్యానికి రాజెవరైనా కానీ
రోడ్లన్నీ ఆమెవే
రిజిస్ట్రేషన్ ఆఫీసు మెట్లతో పని లేదు
వాడి పడేసిన వస్తు స్థానాలన్నీ ఆమె పని కేంద్రాలు
డంపింగ్ యార్డ్ ఆమె కేరాఫ్ అడ్రస్
పిచ్చి కాగితాలతోనే ఆమె సహజీవనం
పచ్చకాగితాలకు బదులు పిచ్చి కాగితాలను చూసి
మురిసిపోయే ఆమెకు
రిచ్ నెస్ ఓ వెక్కిరింత
ఆమె అలాగే ఉంటుంది
ఎన్ని కాలాలు మారినా
ఎన్ని విధానాలు వచ్చినా
ఆమె అలాగే ఉంటుంది
మార్పులేని జీవితానికి
మార్పులేని పదానికి పచ్చి ఉదాహరణ
ఆమె అలానే ఉంటుంది
గలీజే సిగ్గుపడేటట్లు
వ్యర్ధాలు ఉన్నన్ని రోజులూ
మనిషితనం కంపు కొడుతున్నన్ని రోజులు
ఆమె అట్లాగే ఉంటుంది
ఉండనిద్దాం!!
కవితా వస్తువులు
కథా వస్తువులు
పేదరికానికి కొలమానాలు
కావాలి కదా!!
ఓటు నడుక్కునే నాయకులకు
ఎప్పటికప్పుడు వాగ్దాన సంతకాలు చేయడానికి
బ్రతుకులు కొన్ని మిగిలే ఉండాలి కదా!
ఉండనిద్దాం!!
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)