మా ఊరు మారింది  (Author: ఎన్. లహరి)

ఇప్పుడంటే

ఊరి నిండా ఒంటరితనాలు

ఆక్రమించిన దేహాలున్నాయి

ఒకప్పుడు సమూహమై

నిత్య ముత్తైదువులా

కళకళలాడేది మా ఊరు.

రచ్చబండ పై కబుర్లు వింటూ

కాలం జోకొడుతుంటే

మత్తుగా నిద్రపోయేది ఊరు

 

పండిన బంగారు పంటల్ని

ఒంటికి ఆభరణంగా తొడుక్కుని,

పచ్చని చెట్టులా వేకువనే

మా వైపు చూసి నవ్వేది!

ఇప్పుడు రియల్ ఎస్టేట్ జెండాలతో

ఊరి పొలాలన్నీ నిండిపోయాయి

ప్లాట్లుగా మారిన నేలతల్లి

పగిలిన అద్దంలా చిట్లిపోయింది

 

అనాధలా మిగిలిపోయిన ఊరు

కూలిపోయిన అరుగులతో

కాసేపు మాట్లాడి నిద్రపోతుంది

శిధిలభవనాలలో గతించిన

జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ

తిరిగిరాని మనుషుల కోసం

ఆశగా ఎదురుచూస్తుంది

తరాల అంతరాల ప్రేమలకై

వంశాంకురాల కోసమై నిరీక్షించి

అలసిపోయి అడవిలో మోడులా

మిగిలిపోయి ఉంది మా ఊరు.

 

మనుషులు చేసిన మానని గాయాలకు

నిత్య క్షతగాత్రలా ఉండలేక

తానూ పట్టణమై పోవాలని

ప్రతీక్షణం ప్రయత్నిస్తోంది!

Comentar