మరుగుజ్జు  (Author: మజ్జి భారతి)

శ్రీకాకుళం జంక్షనులో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైనెక్కాను, బెంగుళూరుకి. నా కూపేలోకి యెవ్వరూ రాలేదు. వైజాగులో యెవరెక్కుతారానన్న కుతూహలం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీల్లో ప్రయాణించే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే అదే ఫేర్ కి ఫ్లైట్ టికెట్ వస్తుంటే, యిన్ని గంటలు ట్రైనులో కూర్చోవాలని యెవరనుకుంటారు? కాని, నాకెందుకో ట్రైన్ జర్నీ అంటే చాలా యిష్టం. కిటికీలో నుండి అలా చూస్తూ, పరిగెత్తే చెట్లను, యిళ్లను, ఊర్లను, మనుషులను చూస్తుంటే, అంతకన్నా గొప్ప ఆనందమేముంటుంది? ట్రైనులో కూర్చుని, ఇంట్లో వున్నంత కంఫర్టుగా ల్యాప్ టాప్ లో వర్కుకూడా చేసుకోవచ్చు. ఫ్లైట్ లో యేముంది? ఇలా ఎక్కుతాం, అలా దిగుతాం. అందుకని నేనెప్పుడూ ట్రైను జర్నీనే ప్రిఫర్ చేస్తాను.

         నా పక్క సీట్లోకి యెవరొస్తారా అని చూస్తుంటే, నా కళ్ళ ముందు ఓ మెరుపు. ఆ మెరుపుతీగ నా పక్క సీట్లో కూర్చుంది. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. కళ్లకు విందు. కుదిరితే నాలుగు మాటలు, రాత్రి పడుకునే వరకు కాలక్షేపం. చూస్తే సాఫ్ట్వేర్ అమ్మాయిలాగే వుంది. కుదిరితే... ఆ ఆలోచన రావడమే తడవు, మనసప్పుడే డ్యూయెట్లు మొదలెట్టేసింది. ఓరగా చూశాను. ఆమె ముందుకు వొంగి, యేదో తీస్తుంటే, ముందుకు పడిన నల్లపూసల హారం, మంగళసూత్రాలు. గాలి తీసిన బుడగే ఐపోయింది మనసు. బలవంతాన చూపులు పక్కకు తిప్పుకున్నాను. ఎవడో ఆ అదృష్టవంతుడు.

         ఇంతలో, మబ్బులా వున్న ఒకడొచ్చి సరాసరి మెరుపుతీగ పక్కన కూర్చున్నాడు. షాక్కొట్టింది నాకు. మెరుపుతీగెక్కడ? ఈ నల్ల మబ్బెక్కడ? వీళ్ళిద్దరికీ యెలా కుదిరింది? నా ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. వెంటపడి, వేధించి, చచ్చిపోతానని బెదిరించి పెళ్లి చేసుకున్నాడేమో! లేకపోతే మబ్బుకి బోలెడాస్తుంటే, పెద్దవాళ్లు బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేశారేమో? ఆ అమ్మాయి మీద జాలేసింది. పేపరడ్డం పెట్టుకొని దొంగచూపులు చూస్తూనే వున్నాను వాళ్ళిద్దరిని.

         పక్కనే అంత అందమైన భార్యుందని కూడా పట్టించుకోకుండా, ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకొని పని చేసుకుంటున్నాడు మబ్బు. మబ్బునానుకొని కూర్చొని, పుస్తకం చదువుకుంటుంది మెరుపుతీగ. మధ్య, మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే ఆమే వెంటబడి చేసుకున్నట్టనిపిస్తుంది. కాని, అదెలా! నా లాజిక్ దేన్నో మిస్సవుతోంది. అదేమిటో తెలుసుకోవాలని... ఒకవేళ... ఆ ఊహకే నా గుండె దడదడా కొట్టుకుంది. వేరే వాళ్ళని మనసులో పెట్టుకొని, ఆ విషయం మబ్బుకి తెలియకుండా జాగ్రత్త పడుతుందా? అందుకే మబ్బు పట్టించుకోకపోయినా, అంత ప్రేమను ఒలకపోస్తుందా? అదే నిజమై వుంటుంది. లేకపోతే అందాల రాశెక్కడ? మబ్బు గాడెక్కడ? వాడికంత ఇంపార్టెన్స్ యిస్తుందంటే, బ్యాక్ గ్రౌండ్ లో యేదో రహస్యముంది. అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం నాలో. యిటువంటి టూ టైమర్స్ ని ఎంతమందిని చూడలేదు.

         ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ఆమె ఫోను. నెంబర్ చూసి ఇబ్బందిగా ముఖం పెట్టింది. భర్త యెదురుగా మాట్లాడ్డానికి సంశయిస్తుందంటే నా అంచనా తప్పలేదు. వాడిని యెక్కడ కలిసుంటుంది? వాడిని చేసుకోకుండా, వీడినెందుకు చేసుకుంది? నా ఆలోచనలు యెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కాని వీడేమీ పట్టించుకోనే లేదు. అందుకే మబ్బుగాడయ్యాడు. వాడిని అపోలజిటిక్ గా చూసి బయటకెళ్ళింది.

         కాస్సేపాగి, పనున్నట్టు నేనూ బయటికొచ్చాను. కూపే కారిడార్ ఖాళీగా వుంది. ఆ చివర, ఆమె... ఫోనులో. రహస్యాన్ని ఛేదిస్తున్నట్టు, ఆమెకు కనిపించకుండా నేను. మురిపాలొలికిస్తూ, ముసి ముసినవ్వులు నవ్వుకుంటూ ఫోనులో మాట్లాడుతూ వుంటుందన్న నా ఊహకు భిన్నంగా, గట్టిగా మాట్లాడుతుంది. కొంపదీసి అవతల వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? వెరీ ఇంట్రెస్టింగ్. జాగ్రత్తగా వినడం మొదలు పెట్టాను

         "పెళ్లికి రాలేకపోయానని, సాకులు చెప్పకు. వంశీని నేను చేసుకోవడం నీకిష్టం లేదని తెలుసు. నా వెంట, యెంతోమంది పడ్డారు. నేను మాట్లాడితే చాలని తహతహలాడారు. నన్ను పెళ్లి చేసుకోవాలనున్నారు. అయినా వీరందరినీ కాదని నేను వంశీనెందుకు పెళ్లి చేసుకున్నానని యెప్పుడైనా అడిగావా? వంశీని చేసుకుంటాననగానే కోపమొచ్చి, నాతో మాట్లాడ్డం మానేశావు" ఈమె విషయంలో నేననుకున్నది పూర్తిగా తప్పన్నమాట. బాగా దగ్గరవాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. ఎవరూ లేరని చాలా ఫ్రీగా మాట్లాడేస్తుంది.

         "ఇప్పుడు చెప్తున్నాను విను. వాళ్ళందరూ, నా అందాన్ని చూసి నా వెంటపడ్డారు. ఈ అందమే లేకపోతే, యింతే ప్రేమ నా మీద చూపించేవాళ్ళంటావా? కాలేజీ రోజుల్లో వంశీ, యేరోజూ నా వెంట పడలేదు. కాలేజీ దాటి నాలుగేళ్లయ్యాక కూడా, మా ఆఫీసులోనే పనిచేస్తూ యేరోజూ నాతో మాట్లాడాలని ప్రయత్నించలేదు. కాని, నన్ను చూసిన, మొదటిరోజే అతని కళ్ళల్లో మెరుపు. అది క్షణకాలమే ఐనా నేను గుర్తించాను. ఎన్నో రకాలుగా పరీక్షించాను. ఎవరితోనూ, యెప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు. వంశీ అంటే అందరికీ ఒక రకమైన గౌరవభావం. తన కళ్ళు నా మీదే వున్నాయన్న విషయం నేనప్పటినుండీ గ్రహిస్తూనే వున్నాను. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అని, అశాశ్వతమని, అందరికీ తెలిసిన విషయమే ఐనా, దాని కోసమెందుకు పాకులాడుతామో, నాకిప్పటికీ అర్థం కాదు" ఆమె మాటల్లో కోపం.

         ఆ మాటలు గట్టిగానే తగులుతున్నాయి నాకు. ఈమె మాటలు, ఆమె చూపులనెందుకు గుర్తు తెస్తున్నాయి? ఆమె చూపుల్లో కూడా యిదే భావమా? అందగాడినన్న నా అహంకారానికి, ఎదుటి వ్యక్తి భావాలతో తనకేమీ ప్రమేయం లేదన్నట్టు, ప్రశాంతంగా వున్న ఆమె చూపులు తూట్లు పొడుస్తుంటే, భరించలేక, అతిశయాన్ని యెక్కువగానే చూపించాను. నా ప్రవర్తనకి అమ్మానాన్నలు తలదించుకున్నా కూడా, లెక్కచెయ్యలేదు

         ఆమె... నిన్ననే నేను పెళ్లిచూపులు చూసినమ్మాయి. ఆమె నాకు తగదని, నేనిచ్చిన ఎక్స్ప్రెషన్స్... యిప్పుడు గుచ్చుకుంటున్నాయి నన్ను. చిన్నప్పటినుండి అందరూ అందగాడని పొగుడుతుంటే, యెక్కడో ఆకాశం నుండి దిగొచ్చినట్టు, చూసిన పెళ్లి సంబంధాలేవీ నా అందానికి సరిపోవని... ముఖ్యంగా నిన్న చూసినమ్మాయి... డిగ్నిఫైడ్ గా, కళగా వుందని, మంచి ఉద్యోగమని, గౌరవప్రదమైన కుటుంబమని, అమ్మానాన్నలు బలవంతం చేస్తే వెళ్లాను. కాని, కలర్ తక్కువ... వెళ్లిననుండి, ఆ అమ్మాయి నాకు తగదనే నా అభిప్రాయాన్ని దాచుకోడానికి నేనేమీ ప్రయత్నం చెయ్యలేదు. దానికామె కించిత్తు కూడా బాధపడకపోగా, చూపులతోనే చెప్పింది నువ్వే నాకు తగవని. తిరస్కరించడమే గాని, తిరస్కారమంటే తెలియని నన్ను చూసామె, హేలగా నవ్విన నవ్వు. దాంతో మండిపోయి కాస్త అనుచితంగానే ప్రవర్తించాను.

         మెరుపుతీగ మాటలు వినిపిస్తుంటే, మరల వర్తమానంలోకి వచ్చాను.

         "గుర్తుందా? ఇంటర్లో, రాజీవ్ సార్ అంటే పడి చచ్చేవాళ్ళం. ఆయన మనవైపు చూస్తే జన్మ ధన్యమైనట్లు, కలల్లో తేలిపోయేవాళ్ళం. మొన్న ఆయన నన్ను పలకరిస్తే గాని గుర్తుపట్టలేకపోయాను... నిజంగా సారేనా యితనని? పదేళ్లలో యెంత మార్పు?“

        “టెన్త్ క్లాస్ లో బయాలజీ మేడం... యెంతందంగా వుండేవారు. మేడం పెళ్లిలో, పెళ్ళికొడుకు మేడంకి యిచ్చిన ఇంపార్టెన్స్ చూసి యెంత థ్రిల్లయ్యాం. ఇప్పుడతను అదే ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకిస్తున్నాడు. ఇటువంటివి యెన్నో చూసినా, అందం గురించే పాకులాడుతాం గాని, వ్యక్తిత్వాలకు విలువనెందుకివ్వం మనం? సంవత్సరం నుండి వంశీ వ్యక్తిత్వాన్ని గమనిస్తున్నాను. నా చుట్టూ తిరిగిన వాళ్లందరికన్నా యెంతో యెత్తులో వున్నాడు. జీవితం ఆఖరిక్షణం వరకూ నన్నొకేలా చూసుకుంటాడన్న గట్టి నమ్మకం నాకుంది. అశాశ్వతమైన అందానికిచ్చిన ప్రాముఖ్యం, మనిషి మనసును తెలియజేసే వ్యక్తిత్వానికి యెందుకివ్వం? ఆఖరికి అమ్మానాన్నలు కూడా మరొక్కసారి ఆలోచించకూడదా అంటే నిజంగానే కోపమొచ్చింది. ఆ కోపాన్ని నీ మీద తీర్చుకుంటున్నాను. సారీ" క్షణం ఆగింది.

         అవతల యేమి మాట్లాడారో! "మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే, మన భావాలు అవతలవాళ్ళ భావాలు కలుస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇద్దరిదీ ఒకటే మైండ్ సెట్ అయినప్పుడు, జీవితాంతం వాళ్లతో కలిసి మెలిసి వుండగలం. అందంగా వున్నారనో, తీయగా కబుర్లు చెబుతున్నారనో, ఆస్తుందనో, పెద్ద ఉద్యోగమనో చేసుకుంటే, రేపవి మనకి సంతోషాన్ని యివ్వకపోవచ్చు. ఎవరికైనా ఓకే చెప్పేముందు బాగా ఆలోచించుకో" ఆమె మాటల ప్రవాహం సాగుతుంది.

         ఆ మాటలు నాతోనే చెప్తున్నట్టు అనిపిస్తుంది. యింక నేను వినవలసిందేమీ లేదు. మెరుపుతీగ గురించిన నా అంచనా పూర్తిగా తప్పైంది. ఈమె వ్యక్తిత్వం ముందు నేనో మరుగుజ్జునయ్యాను. ఈమే కాదు... ఆమె వ్యక్తిత్వం ముందు కూడా... నా ప్రవర్తనకు, మా అమ్మానాన్నలు సిగ్గిల పడకుండా... మేము వెళ్ళినప్పుడు ఏ చిరునవ్వుతో స్వాగతం పలికిందో, అదే చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపింది.

         కూపే లోపలికి వచ్చేసాను గాని, నిన్నటి నా ప్రవర్తన ఎంత అసహ్యంగా వుందో తెలుస్తోంది. ఆమెకు క్షమాపణలు చెప్పాలని... మనసును కూడ దీసుకుంటున్నాను. ఒకవేళ ఆమె నన్ను క్షమించగలిగితే...

         ఫోన్ చేశాను. రింగ్ టోన్ వినిపించిన కాసేపటికి“హలో” అన్న సుతిమెత్తని స్వరం. విన్న నాలో ఏవో ప్రకంపనలు. నిన్న ఏమీ అనిపించలేదు. ఈ రోజెందుకు ఆ స్వరం విన్న నాలో ఉలికిపాటు? నేనెవరో చెప్పాక అటు నుండి నిశ్శబ్దం. కాస్సేపయ్యాక చెప్పండన్న ఆమె మాట. మాటలో అదే మృదుత్వం. గొంతు సవరించుకొని, "నేనంటే మీకేమీ అభ్యంతరం లేకపోతే, మీరంటే నాకిష్టమేనని చెప్తానన్న" నా మాటలకు అటునుండి మరల నిశ్శబ్దం. ఈసారి మరింత ఎక్కువసేపు.

        "హఠాత్తుగా మీ నిర్ణయంలో ఈ మార్పెందుకు?", నెమ్మదిగానే అయినా, సూటిగా ఆమె ప్రశ్న.

         నిన్నటి నా ప్రవర్తనకి, యిప్పుడు నా మాటలకి హస్తి మశకమంత అంతరముంది. అది నాకూ తెలుసు. ఇప్పుడే కదా నిజమేమిటో గ్రహించాను.

         "అందమన్నది చర్మ సౌందర్యం కాదని, అంతఃసౌందర్యమని, జీవితాంతం కలిసుండాలంటే వ్యక్తిత్వాలు కలవాలని, మీరు ఉన్నత భావాలు కలిగినవారని, యిప్పుడే కనువిప్పయింది."

         నా సమాధానానికి, ప్రక్క సీట్లో కూర్చున్నామె నమ్మలేనట్లు, కోపంగా నన్ను చూస్తుంటే, కళ్ళతోనే ఆమెకు క్షమాపణ, ధన్యవాదాలు రెండూ చెప్పుకున్నాను. కనువిప్పు కలిగించింది ఈమే కదా!

        "ఆలోచించుకోవడానికి నాక్కొంచెం టైం కావాలి" ఆమె సమాధానం.

         "టేక్ యువర్ ఓన్ టైం" నిన్న నేను చేసిన తప్పును భేషరతుగా ఒప్పుకోవడంతో, ఆమె నన్ను క్షమిస్తుందని ఎక్కడో నమ్మకం.

         ***

Comentar

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)