మతిమరుపు మనిషి
మతిమరుపు మనిషి (Author: శరత్ చంద్ర)
“శాంతా... నేను టీ తాగానా?” అడిగాడు సదాశివం. “ఇందాకనే కదండీ ఇచ్చాను” అంది శాంత కుమారి.
“ఏంటోనోయ్ తాగినట్టే లేదు. పాలున్నాయేమో టీ పెట్టరాదూ” అని అడిగాడు. “పెట్టరాదు” అంది శాంత.
“నువ్వెందుకు ఇంత కఠినంగా మారిపోయావు శాంతా...?” అన్నాడు సదాశివం.
“మనం కొనేది ఖరీదైన పాలు. కోడలు పిల్ల నీళ్లు కూడా తక్కువే కలిపేది. ఉదయాన్నే నీకు నాకు టీ, బుజ్జిగాడికి హార్లిక్స్, పెద్దాడికి కాఫీ, కోడలు పిల్లలు తాగదు కాబట్టి సాయంకాలం నీకు నాకు 'టీ’ కి వస్తున్నాయ్” అంది.
“కోడలు పిల్ల టీ తాగకపోతేనేం బోర్నవిటా తాగుతుందిగా” అన్నాడు సదాశివం.
“హుష్... హుష్... నోటికొచ్చింది వాక్కండి” అంది శాంత.
“నా నోరు కప్పెట్టింది చాలు కనీసం “టీ, డికాషన్ అయినా కలుపుకొని రా” చెప్పాడు.
“టీ పొడి మాత్రం ఊరకే వస్తుందా? కేజి టీ పొడి ఎంతో తెలుసా?” అడిగింది.
“టీ పొడి ధర తెలియకుండానే ఇంతకాలం నేను నీతో కాపురం చేసానా?” అన్నాడు సదాశివం.
“మీరు తెచ్చింది అప్పట్లో లూజ్ టీపొడి. ఇప్పుడు పిల్లాడు తెచ్చేది కంపెనీ టీపొడి పొదుపుగానే వాడాలి” అంది.
“సరే, చిల్లర ఒక పది రూపాయలు పట్రా... అలా రోడ్డు మీద వరకు పోయి వస్తా” అన్నాడు సదాశివం.
“మీరు తప్పిపోతే మిమ్మల్ని వెతకడానికి ఆటోకి మాకు రెందొందలు అవుతుంది” అంది శాంత.
“నీతో పెద్ద చావొచ్చి పడిందే” కాస్త కోపంగానే అన్నాడు సదాశివం స్వరం పెంచి.
“కాస్త చిన్నగా మాట్లాడండి మావయ్యా... పండుగాడు ఇప్పుడే పడుకున్నాడు” అంది లావణ్య లోపలినుండి
బయటకు వచ్చి.
“ఎంత చెప్పినా ఈనకు అర్థం కాదమ్మా ఈయన రంది ఈయనదే” అంది అప్పుడే అటుగా తమ పని మనిషి బుజ్జమ్మ పోవడం గమనించింది శాంత.
గోడ దగ్గరకు వచ్చి “బుజ్జీ... బుజ్జీ” అని పిలిచింది.
“ఏంటమ్మగారూ...” అంటూ వచ్చింది బుజ్జమ్మ.
“మీ అయ్యగారికి కాస్త కవర్లో టీ తెచ్చి పెట్టవే” అంది.
“ఎందుకమ్మా... ఇంట్లో పాలు లేవా?” అడిగింది.
“అవి పిల్లాడికి కావాలి లేవే” అంది. “ఏంటోనమ్మా మీ పొదుపు” గొణిగింది.
ఇంతకు ముందు అంట్లు తోమి గచ్చుమీద తడి బట్ట వేసేది బుజ్జమ్మ...
“నువ్వు అంట్ల వరకు తోము బుజ్జమ్మా” అంది లావణ్య.
“ఎందుకనమ్మగారూ” అడిగింది. “ఇంట్లో ఇద్దరం ఆడవాళ్ళం ఖాళీగా వున్నాం ఇల్లు తుడుచుకోలేమా” అంది.
“ఇలా అందరూ అనుకుంటే మాకెలా పనులు దొరుకుతాయమ్మా” అంది బుజ్జమ్మ.
“నీకు పని కావాలని మేం శక్తికి మించిన భారం మోయలేంగా చెప్పు. గిన్నెలు తోమడం వరకే పరిమితం
అవుతావా అవి కూడా మమ్మల్నే చేసుకోమంటావా?” అంది.
“అంతమాటనకండి అమ్మగారు. నా కడుపు కొట్టకండీ” అంది.
“మా ఒక్కళ్ల వల్ల మీకేం కడుపు నిండదు లేవే” అంది లావణ్య.
“నాలుగిళ్లల్లో పని చేస్తేనే కదమ్మామాకు ఒక పదివేలు వచ్చేది” అంది బుజ్జమ్మ.
తాను నాలుగిళ్లల్లో పనిచేసుకొని ఆ ఇంటిమీద నుండే పోతుంటుంది. ఇరవై రూపాయలు ఇచ్చింది శాంత.
“స్పెషల్ టీ తేనా అమ్మా” అడిగింది. “మామూలుది చాలు లేవే” అంది.
“స్పెషల్ ‘టీ’ అంటే అప్పుడే “టీ పొడి వేసి ఫ్రెష్‌గా జలీల్ పెట్టి ఇస్తాడమ్మా. నార్మల్ టీ అంటే అదే టీ పొడిలో వేడి
నీళ్లు పోసి మనకిస్తాడు. రంగు రుచి వాసన అవేవి ఏవీ వుండవ్. చిక్కదనం కూడా వుండదు” అంది.
తనతో వాదించలేక “ఏదో ఒక టీ తీసుకు రావే” అంది “సరే అమ్మగారూ...” అంటూ వెళ్లింది.
బుజ్జమ్మ వెళ్లాక లోపలికి వచ్చి “బుజ్జీని పంపాలే టీ కోసం కాస్త ఓపిక పట్టయ్యా” ఆంది.
“బయట ఏ టీ పొడి వాడుతారో?” గొణిగాడు సదాశివం. “ఇక మీ రాచరికం అలవాట్లు ఆపండి” అంది.
“టీ త్రాగడం రాజరికమా?” అన్నాడు సదాశివం. “టీ తాగడం రాచరికం కాదు. మీలా రెండుమూడు సార్లు
తాగడం మనలాంటి వాళ్ల ఇళ్ళల్లో రాచరికంతో సమానమే” అంది.
“అవేం మాటలు శాంతీ. ఎప్పుడైనా రాజీపడ్డామా? మన పెద్దోడు దొరబాబులా వున్నాడు కాన్వెంట్‌లో వేద్దామంటే నీ మాటలు కాదన్నానా? అన్నాడు. “ఏం వాడు నీ కొడుకు కాదా?” అంది.
“కొడుకేలే, కాకపోతే ఖర్చుకి వెనుకాడలేదని చెప్పడం నాఉద్దేశ్యం” అన్నాడు.
“సరే... మీ ఉద్దేశ్యం మడిచి చొక్కా జేబులో పెట్టండి” అంది.
అంతలోకి బుజ్జమ్మ ఒక పాలిథీన్ కవర్‌లో టీ దాంతో పాటు రెండు కప్పులు కూడా తెచ్చింది “మీరు కూడా తాగుతారా అమ్మా” అడిగింది. “నాకొద్దు” అంది శాంత.
“మీరు కూడా తాగుతారేమోనని రెండు కప్పులు తెచ్చానమ్మా. జిలానీ స్పెషల్ టీ చేసిచ్చాడు. ఫ్రేష్‌గా టీ పొడి
కూడా వేసి కాసిచ్చాడు” అంది టీ కప్పులో వంచుతూ. “ఆ టీ నువ్వు తాగేయ్ బుజ్జమ్మా” అంది.
“నాకెందుకు లేమ్మా” అంది బుజ్జమ్మ. “దాన్నెందుకు వత్తిడి చేస్తావ్. మిగతా టీ గ్లాసులో పోసి పెట్టు. తర్వాత
కాగబెట్టుకొని తాగవచ్చు కదా” అన్నాడు సదాశివం. “కాచి ఇస్తావుంటే సాయంత్రం దాకా తాగుతూనే వుంటారు”
అని బుజ్జమ్మ వైపు తిరిగి “బుజ్జీ నువ్వు తాగేయ్” అంది. “సరే అమ్మగారూ” అని బుజ్జమ్మ టీ తన గ్లాసులో ఒంపుకుంది. “కోడలుగారు లోపల వున్నారామ్మా” అడిగింది. “అవును... పిల్లాడ్ని నిద్ర పుచ్చుతుంది” అంది.
“ఇల్లు తుడవడం నేను ఆపేసినప్పటినుంచి మీకు పని ఎక్కువైనట్టు వుంది అమ్మగారూ” అంది.
“నాకేం ఎక్కువైందే” అంది. “నేను ఎప్పుడొచ్చినా మీరు తుడుస్తూనే వున్నారు కదా” అంది.
“నా ఇంట్లో నేను చేసుకోవడం పని ఎందుకవుతుందే పిచ్చి మొద్దా” అంది శాంత.
“మీకు నడుము నొప్పి కదా అమ్మగారూ... అందుకే అడిగా” అంది.
సదాశివం వింటూ “నువ్వు అంట్లు తోమడం మానేస్తే ఆ డ్యూటీ కూడా మీ అమ్మగారి మీదే పడుతుందే” అన్నాడు నవ్వుతూ.
“అమ్మగారి చేతి గోర్లు అంట్లుతోమితే కరాబు అవుతుంటుంది వుంది కదా అయ్యగారూ... ఆ మధ్య నేను
రాకపోతే రెండు రోజులు తోమిందంట. మురికంతా గోర్లలో చేరి నిమ్మకాయ పెట్టుకుందట” అంది.
అటు ఇటు చూస్తూ “అది గోరుచుట్టు లేవే... ఇక నువ్వు బయలుదేరు” చెప్పింది శాంత.
“త్రాగుతూ ఎలా వెళతానమ్మా. తాగనీయండి” అంది. మళ్లీ లావణ్య బయటకువచ్చింది.
బుజ్జమ్మతో బయట నుండి టీ తెప్పించుకున్నారని అర్థమైంది. “బయట నుండి తెచ్చుకొని డబ్బులు హోటల్‌వాళ్లకి ధారపోయడం ఎందుకు కాసేపు అయితే లంచ్ టైమ్ అవుతుంది కదా” అంది.
“అప్పుడే లంచ్ చేయడం నాకు అలవాటు లేదు కదమ్మా” అన్నాడు సదాశివం.
“డబ్బులేం చెట్లకి కాయవు కదా మావయ్యా. వృథా చేయకండి. ఎవరివైనా డబ్బులు డబ్బులే కదా” అంది లావణ్య.
పరిస్థితి అర్థమై అక్కడ్నించి జారుకుంది బుజ్జమ్మ. “ఏం మనిషో? ఈయన చెప్పింది వినడు” అంది పిల్లాడు పడుకున్న గదిలోకి చూస్తూ.
“పప్పు తాళింపు వేసావా అత్తయ్యా?” అడిగింది. “వేస్తానమ్మా” అంది శాంత
“ఆయన వచ్చే టైమ్ అవుతుంది. ఫ్రిజ్‌లో బంగాళా దుంపలు వున్నాయ్... తాళింపు కూడా చేయండి. మీరు బాగా చేస్తారా?” అంది. “చేసేస్తాలే అమ్మా” అంది. వంటగదిలోకి వెళ్లింది శాంతా. ఇద్దరూ లోపలికి వెళ్లిన వైపు చూస్తూ
“ఉదయం టీ తాగలేదు కదా... ఏంటి ఇది నేను టీ తాగాను అని అంటుంది” అనుకున్నాడు సదాశివం.
శాంత కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. భర్త అలవాటు శాంతకు తెలుసు. ఇంట్లో వుంటే ప్రతి రెండుగంటలకి టీ అడుగుతాడు అతడికి వచ్చిన జబ్బు తనకో వరమైందని మొదటిసారి భావించింది.
“ఉదయం పాల పాకెట్ కట్ చేస్తుంటే. పిల్లాడికి పాలు తగ్గుతున్నాయ్. కాస్త టీలో పాలు తగ్గించండి అత్తయ్యా”
అంది. “సరేలేమ్మా” అంది. టీ తాగకపోతే ఏమౌవుతుందిలే అని అసలు టీ నే పెట్టలేదు.
++++
“కాసేపటి క్రితమేగా తిన్నది. మళ్లీ ప్లేటు తెచ్చావ్” అన్నాడు సదాశివం.
“మీ మతి మండా...మీరెప్పుడు తిన్నారు? ఇప్పుడేగా గిన్నెలు తేవడం” అంది శాంత.
“అన్నం గిన్నె మీద మూత తీసి, ఇదేంటి?" అడిగాడు. “పిల్లాడు తిని పోయాడు లేవయ్యా” అంది.
“అసలు అల్జీమర్ జబ్బు నీకొచ్చినట్టుంది. నా కడుపు ఆకలి నాకు తెలీదా?” అన్నాడు.
అప్పుడే అక్కడికొచ్చిన లావణ్య “తిన్నాను కదా అని మావయ్యగారు అంటున్నారు కదా అత్తయ్యా. ఆకలయితే మళ్లీ అడుగుతారులే” అంది. “ఇవి ఖరైదైన బియ్యం కదమ్మా.. రాత్రికి ఎవరూ ఈ అన్నం తినరు. వీధి కుక్కలకి వేయాలి.
“మీ మావయ్య నైట్ చపాతీలే కదా తింటారు” అంది.
“పర్వాలేదత్తయ్యా, ఆ రొట్టె ఆపేసి అన్నమే పెట్టండి. ఒక రోజుకేం షుగర్ పెరిగిపోదులే” అంది.
“షుగర్ పెరిగిపోతే లేని పోని సమస్యలు వస్తాయమ్మా...వాటికి పెట్టే ఖర్చులు మనకి తడిసి మోపెడవుతాయి” అంది.
“అదీ నిజమే... ఏదో ఒకటి చేయండి” అంది.
సాయంత్రం అవుతుండగా సదాశివం స్నేహితుడు రామచంద్రం వచ్చాడు. పడుకొని వున్న మిత్రుడి దగ్గరకు వచ్చి “ఏంట్రా సదా పడుకొని వున్నావ్? ఒంట్లో బాగాలేదా?” అడిగాడు.
“అదేం లేదురా? ఏంటి సంగతులు?” అడిగాడు.
అప్పుడే అటుగా వచ్చిన శాంతను చూసి... ”నాకేం టీ పెట్టవద్దమ్మా నేనూ సదా అలా బయటకు వెళ్లి వస్తాం”
అన్నాడు. “బ్రతికించారు” అనుకుంది శాంత.
“ఇప్పుడు బయటకు ఎందుకు లేరా?” అన్నాడు సదాశివం.
“లెగరా... మీ ఇంటి పక్కన పార్కు వుంది కదా. కాసేపు నడుద్దాం” అన్నాడు. “సరే పదా” అన్నాడు సదాశివం.
సదాశివం కాస్త దూరంగా వున్న చెప్పులు స్టాండ్ దగ్గరకి వెళ్లడంతో తన బొడ్లో వున్న యాభైరూపాయలు ఇచ్చి
“ఆయనకేవైనా టిఫిన్ చేయించండి” అంది. “చేయిస్తాను. నా దగ్గర ఉన్నాయిలేమ్మా” అన్నాడు.
“పర్వాలేదు ఉంచండి అన్నయ్యగారూ. ప్రతిసారి బయటకు తీసుకెళ్లి మీరే కదా ఖర్చుపెడతారు” అంది.
అయిష్టంగానే తీసుకున్నాడు.
బయటకొచ్చాక “అరే, శేషమ్మ పునుగులు బాగా చేస్తుంది కదా. ఒక ప్లేటు తిని వెళ్దాం”
చెప్పాడు. “సరే పదా” అన్నాడు సదాశివం.
వాళ్లు వెళ్లేసరికి శేషమ్మ పునుగులు వేడి వేడిగా ఇస్తుంది.
వాళ్లని చూసి రెండు ప్లేట్లలో వేసి స్నేహితులిద్దరికీ ఇచ్చింది. సదాశివం ఆవురావురమని తిన్నాడు.
“ఏంట్రా మధ్యాహ్నం లంచ్ చేయలేదా?” అడిగాడు. “చేసానురా... షుగర్ ఎక్కువైందేమో అందుకే
ఆకలేస్తుందేమో” చెప్పాడు. “టిఫిన్ చేసాక జిలాల్ టీ కొట్లో టీ తాగి వెళ్దాం” అన్నాడు.
“మళ్లీ తాగుదాం పార్కులోకి వెళ్దాం పద” చెప్పాడు రామచంద్ర.
పార్కులోకి వెళ్లిన మిత్రులిద్దరికి కేరింతలు కొడుతూ ఆడుకొనే పిల్లలు కన్పించారు. “రాఘవని పార్కులోకి తీసుకెళ్లరా అని చెబుతాను. వాడు పని వుంది నాన్నా అని కంప్యూటర్‌లోకి తల దూరుస్తాడు” అన్నాడు.
“ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎంప్లాయిస్ రక్తం పిండుకుంటున్నాయ్. మా గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడు ఐదు కల్లా బయటకు వచ్చేస్తాం” అన్నాడు. రామచంద్ర ప్రావిడెంట్ ఆఫీస్‌లో పని చేసి ఆ మధ్యే రిటైర్ అయ్యాడు.
“సండే అన్నా తీసుకు పోవచ్చుకదా” అన్నాడు. “చిన్నప్పుడు వాడ్ని పార్కులోకి తీసుకొచ్చి జారుడుబండ రంగుల రాట్నం అన్ని ఆడించే వాడ్ని” చెప్పాడు “చెప్పు రంగుల రాట్నం తిరుగుతావా?” అడిగాడు రామచంద్రం.
“వద్దులే విరిగిపోతుంది” అన్నాడు నవ్వుతూ.
“మీ చిన్నోడు కేశవ ఫోన్ చేస్తున్నాడా?” అడిగాడు రామచంద్రం.
“నెలకోసారి వాళ్ల అమ్మకే చేస్తాడు” చెప్పాడు. “వాడి ఫ్యామిలీ ఎలా వుంది?” అడిగాడు రామచంద్రం.
“పర్లేదు. డబ్బులు వేయమని వాళ్లన్న వాడితో గొడవ పడుతూ వుంటాడు” చెప్పాడు.
“పాపం రాఘవ ఒక్కడే భరించడం కష్టమే కదా” అన్నాడు.
“అవును నా మెడిసెన్స్ శాంత మెడిసెన్స్‌కే చాలా ఖర్చవుతుంది. ఎలాగూ తిండీ తిప్పలు తప్పవు కదా” అన్నాడు.
“అన్నీ సంగతులు బాగానే గుర్తుంటున్నాయి కదా? మరి నీకు అల్జీమర్ సమస్య ఉందంటాడేంటి మీ వాడు” అడిగాడు రామచంద్ర.
వాడు అనడం కాదు... మెడికల్ రిపోర్ట్స్ అలా చెబుతున్నాయి. కొందరి ముఖాలు గుర్తొస్తే పేర్లు గుర్తు
రావు. పేర్లు గుర్తొస్తే మనుషులు గుర్తురారు. ఈ మధ్య శాంత 'టీ’ ఇచ్చాను అంటుంది. నాకసలు గుర్తు వుండదు. అందుకే మళ్ళీ అడుగుతుంటాను. ఈ రోజు ఒక విచిత్రం జరిగింది అంటూ ఆగాడు. వంటది అడిగాడు.
“భోజనం చేయలేదని శాంత అంటుంది చేశానని నేను అంటాను”అన్నాడు. “నిజమేంటి...” అడిగాడు.
“తెలీదు” అన్నాడు సదాశివం. “నిజం ఏంటంటే నువ్వు లంచ్ చేయలేదు” చెప్పాడు.
“గుర్తుంది కానీ, శాంతికి చిన్న ట్రీట్‌మెంట్ ఇచ్చాను” అన్నాడు నవ్వుతూ.
“సదా శాంతకి నువ్వు తప్పా ఎవరున్నారు?
నువ్వు కూడా బాధ పెడితే ఎలా? అడిగాడు.
“మరి 'టీ' ఇవ్వకుండా ఇచ్చానని చెప్పవచ్చా” అడిగాడు కోపంగా.
“ఇంటి కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయి” అన్నాడు రామచంద్ర.
“ఎన్ని కష్టాలు వున్నా... నిజాలే చెప్పాలి” అన్నాడు సదాశివం.
“సర్లే పదా.. టీ తాగి వెళ్దాం” అన్నాడు. ఇద్దరూ టీ తాగి ఇంటిదారి పట్టారు. ఇంటికి వెళ్ళాక సదా వాష్
రూంకి వెళ్ళిన సమయం చూసుకొని “నువ్వు అబద్దం ఆడుతున్న విషయం సదా గుర్తు పట్టాడు” అన్నాడు.
“నేనేం చెయ్యగలను అన్నయ్యా, ఈయన కోసమే రాఘవ దగ్గర డబ్బులు తీసుకొని దాచి ఖర్చు చేస్తున్నా. కొడలి పిల్లతో అన్ని విషయాలపై గొడవ పెట్టుకోలేను కదా..?” అంది.
“మీ వదిన అన్ని విషయాలు చెప్పిందమ్మా” చెప్పాడు.
“ఇక నా కష్టాలు చెప్పుకోడానికి ఎవరు వున్నారు అన్నయ్యా” అంది.
రామచంద్ర భార్య సుమతితో శాంతకి మంచి చెలిమి.
ఆ రోజు ఉదయం సుమతితో “అయన అలవాట్లు నా ప్రాణానికి వస్తున్నాయి సుమతీ... పిల్లాడికి పాలు సరిపోవడం లేదు. ఈయన గారు ఇస్తే రోజుకు నాలుగు సారైనా టీ తాగుతాడు” అంది.
“పిల్లాడికి తల్లి పాలే బలం కదా ఎందుకు ఇవ్వడం లేదు...?” అడిగింది సుమతి.
“కారణాలు తను ఎక్కడ నాకు చెబుతుంది? అందం పోతుందని ఇవ్వడం లేదో... పాలు సరిగ్గా పడక ఇవ్వడం లేదో తెలీదు. పిల్లాడికి పోతపాలే అలవాటయ్యాయి” చెప్పింది.
సుమతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
సదాశివం ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసేవాడు. అప్పట్లో అచ్చు యంత్రాలే వుండేవి. అక్షరాలు పేర్చి ప్రింట్ చేసే వాళ్ళ సదాశివం మంచి కంపోజర్. కదలకుండా పని చేసేవాడు. వర్క్ డిస్టర్బ్ కాకూడదని గంటకో రెండు గంటలకో టీ తెప్పించేవాడు ఓనర్. అప్పట్నించి టీ అలవాటు అలా స్థిరపడింది. కాలక్రమంలో యంత్రాలు మారాయి. చదువుకున్న కుర్రాళ్ళు రంగంలోకి వచ్చారు. కంప్యూటర్‌ల ద్వారా డీ.టి.పి. చేసే రోజులు రావడంతో ఆ పని మానుకోవల్సి వచ్చింది. పిల్లలు రాఘవ, కేశవ ఇద్దరూ కాలేజీల్లోకి ఎంటర్ కావడంతో మరో పని చేతకాక లేత్ వర్క్‌లో పనికి కుదిరాడు. అక్కడ కూడా పని నిరాఘాటంగా కొనసాగడం కోసం అతడి 'టీ' తాగే అలవాటు కొనసాగింది. పిల్లల చదువుల తర్వాత వాళ్ళ సెటిల్ అయ్యారు గానీ సదాశివం సెటిల్ కాలేదు. కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. పోషణకు పిల్లల మీద ఆధారపడే పరిస్థితి.
అల్జీమర్ పలకరించింది అతడ్ని. పెద్దకొడుకు రాఘవ వున్న ఊర్లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్‌లో చేరాడు. రెండోవాడు ఉద్యోగం పేరుతో బెంగుళూర్ వెళ్ళిపోయాడు.
గింజుకొని... గింజుకొని నెలకి ఐదువేలు వేస్తుంటాడు. “మీ ఒక్కడిదేనా పేరంట్స్ బాధ్యత” అని లావణ్య గుంజు
కుంటూ దెప్పుతూ వుంటుంది రాఘవని... భార్యాభర్తలు ఇద్దరూ గమనిస్తూనే వుంటారు.
+++++
“ఎంటన్నయ్యా... నువ్వు చెప్పేది?” అడిగాడు కేశవ. “అవున్రా.. నాన్న తప్పిపోయాడు” చెప్పాడు రాఘవ.
“ఎలా జరిగింది అన్నయ్యా అమ్మ ఎప్పుడూ నాన్నను కనిపెట్టుకొనే వుంటుందిగా” చెప్పాడు.
“నాన్నకి టీ ఎక్కువ తాగే అలవాటు వుంది కదా? టీ పెట్టి ఇవ్వమన్నాడట.. ఇందాకే కదా తాగావ్ అందట అమ్మ.. టీ తాగే పిచ్చి ఆపుకోలేక... అమ్మ నిద్ర పోతున్న సమయం చూసి బయటకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు." చెప్పాడు.
“పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అన్నయ్యా” చెప్పాడు కేశవ. “ఏమని ఇస్తాంరా” అన్నాడు నిస్పృహగా..
“కంప్లైంట్ ఇస్తేనే కదా అన్నయ్యా వాళ్ళు వెదకగలరూ” అన్నాడు.
సరేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు రాఘవ.
సదాశివం ఫోటోలు కూడా ఇచ్చాడు. అవి పాత ఫోటోలు. ఈ మధ్య కాలంలో సదాశివం ఫోటోలు ఏవీ తీసుకోలేదు. పిల్లాడి ఫంక్షన్‌లో కూడా ఫోటోలు ఏవీ తీసుకోలేదు. సదాశివం స్నేహితుడు రామచంద్ర మిత్రుడ్ని ఊరంతా వెతికాడు. ఒక రోజు అలిసిపోయి వచ్చిన రామచంద్రని చూసి. “ఎన్ని రోజులు వెతుకుతారు అన్నయ్యా వదిలేయండీ” అంది. అప్పటికి సదాశివం ఇల్లు వదిలి వెళ్ళిపోయి పదిరోజులు అవుతుంది.
“వాడు వెళ్ళాక ఎలా ప్రశాంతంగా వుండగలుగుతున్నావమ్మా?” అడిగాడు.
“రోజు అబద్దాలు చెప్పే శ్రమ నాకు తగ్గింది అన్నయ్యా” అంది శాంత. అర్థంకానట్టు చూశాడు రామచంద్ర.
లోపలి నుండి భయటకు వచ్చిన లావణ్య, “అంకుల్‌కి టీ పెట్టుకురానా? అత్తయ్యా” అడిగింది.
“అన్నయ్య టీ తాగడం మానేశారటమ్మా” చెప్పింది. ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర విదిలేనట్టు.
“అవునమ్మా టీ మానేశాను” చెప్పాడు ఇక మీరు శ్రమ పడి వెదక్కండి అన్నయ్యా, పిల్లలు పోలీస్ కంప్లైంట్
ఇచ్చారు కదా?” అంది. “సదా సమాచారం ఏం తెలిసినా చెప్పమ్మా”అన్నాడు.
రామచంద్ర వెళ్ళిన వైపే చూస్తుండి పోయింది శాంత. ఒక రోజు రాత్రి భర్త అన్న మాటలు ఆమె చెవుల్లో గింగిర్లు
తిరిగాయి. “చిన్నోడి కంటే పెద్దోదే మంచోడు. మనల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటున్నాడు. చిన్నోడి చదువుల కోసం అయిన అప్పులు కూడా వాడే తీరుస్తున్నాడు. చిన్నోడికి అంత బాధ్యత తీసుకొనే స్వభావం లేదు. పెద్దోడి జీవితం బావుండాలి. అమ్మగా ఎప్పటికీ నీ ఆలనా పాలన వాడికి వుండాలి. కోడలి పిల్ల కాస్త పొదుపరి. మనలాగా వుంటే కుదరదు కదా? ఇప్పుడు కాస్త పొదుపు చేస్తేనే కదా వాళ్ళ పిల్లలకు కాస్త మిగిలించి ఇవ్వగలరు? మనలా కాదు కదా? నువ్వేం ఆ అమ్మాయిని అపార్థం చేసుకోకు. వాడి దృష్టికి ఏమీ తీసికెళ్ళకు ఇదీ” సదాశివం వెళ్ళిపోయే ముందు ఇచ్చిన సందేశం. శాంత తన నోరు కట్టేసుకుంది. కోడలి పిల్ల గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఇంటి పనంతా తానే చేసేది “పెద్దోడా ఇల్లు తుడవడానికి ఒక మనిషిని చూడరా... నాకు నడుములు పట్టేస్తున్నాయ్” అని చెప్పాలనుకుని ఆగిపోయింది. రెండు మూడు సార్లు లావణ్యని చూస్తూ.
“లావణ్యా... అమ్మ ఎక్కడ తుడుస్తుంది? నువ్వు తుడువు” అని చెప్పాడు. “పిల్లాడికి పాలిచ్చి నేనే తుడుస్తానని చెప్పానండీ...
“అత్తగారు ఊరుకొండే మనిషి కాదు కదా? పైగా శుభ్రత ఎక్కువ” అంది. రెండు మూడు సార్లు
“లావణ్యా... అమ్మ చేతికి కొంచెం డబ్బులు ఇచ్చిపెట్టు. నాన్నకు ఏమైనా అవసరం వుంటే చూసుకుంటుంది గదా? నేను నా పనుల్లో నేను వుంటాను కదా?” చెప్పాడు. రెండు, మూడు సార్లు “కొంచెం డబ్బులు కావాలిరా?” అని తల్లి అడగ్గానే “నన్ను అడగడం ఎందుకమ్మా... నా జేబులో వుంటాయి కదా తీసుకెళ్తుండు” చెప్పాడు.
శాంత ఇబ్బందిగా చూస్తుంటే... “నువ్వు నిద్రపోయేప్పుడు నీ కొంగుకు కట్టిపెట్టుకున్న డబ్బుల్ని ఎన్ని సార్లు విప్పి తీసుకున్నానో తెలుసా అమ్మా” అనేవాడు అల్లరిగా.
“అడ్డాలు నాడు బిడ్డలు గానీ గడ్డాలు నాడు కాదు కదా నాయనా. అమ్మ దగ్గర కొడుక్కి వున్న స్వేచ్చ కొడుకు దగ్గర కొడుక్కి వుంటుందా? అందులోనూ పెళ్లైన కొడుకు దగ్గర వుంటుందా?” స్వగతంలో అనుకునేది.
“నీకెమైనా అవసరాలు వుంటే లావణ్యకు చెప్పమ్మా... చూసుకుంటుంది” అనేవాడు.
రెండు మూడు సార్లు అడిగినప్పుడు... “అసలు చేతిలో డబ్బులు నిలవడం లేదు అత్తయ్యా... ఆయన ఇవ్వడం
అయిపోవడం వెంట వెంటనే జరుగుతున్నాయి. ఆయన శాలరీలో సింహభాగం కొత్తగా మనం తీసుకోబోయే
ఫ్లాట్‌కే పోతున్నాయి. ఈసారి తీసి పెడతాను ఎంత అవసరమో చెప్పండి” అంది గానీ ...తాను తీసి పెట్టింది లేదూ తనకి ఇచ్చిందీ లేదు. ఆల్జీమర్ సమస్య రాకముందు భర్త మొహమాట పడుతున్నాడని తానే డబ్బులు ఖర్చుకు తీసి ఇవ్వడానికి ట్రై చేసేది. ఒకసారి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నది. బహుశా వాళ్ళ అక్కయ్య అయ్యి వుంటుందోమా అత్త బాగా దుబారా అక్కా. మావయ్య అవసరాల పేరుతో తీసుకుంటుంది. ఆ డబ్బులు ఏం చేసుకుంటుందో అసలు తెలుసుకోలేం” అంది. అవతల నవ్వుతున్న శబ్దం తనకి విన్సిస్తూనే వుండేది. చెల్లి పిల్లలు పెద్దమ్మా అని ఆప్యాయంగా వస్తే. . కనీసం జాకెట్ ముక్క కూడా తీసివ్వడానికి డబ్బులు లేని పరిస్థితి.
+++
ఒక నెల గడిచింది సదాశివం జాడలేదు. శాంత బాగా క్రుంగిపోయింది. అన్నం కూడా తనకి సహించడం లేదు.
“నువ్విలా బెంగ పెట్టుకుంటే ఎలా అమ్మా... నాన్నను వెతికిస్తున్నాం కదా?” చెప్పాడు రాఘవ.
చిన్న కొడుకు కేశవ కూడా వచ్చి సముదాయించబోయాడు. తృణీకారంగా చూసింది.
“ఎలా గోలా అడ్రస్ తెలుసుకొని వస్తార్లే మావయ్య” అంది లావణ్య. పిల్లాడు నానమ్మ మీదికి దూకాడు.
“వీడికి నాన్న పేరే పెట్టాను కదమ్మా... వీడిలో నాన్నను చూసుకోమ్మా” అన్నాడు రాఘవ.
“మావయ్య వెళ్ళిపోవడం...మీరిలా కావడంతో ఈయన పూర్తిగా మనశ్శాంతి కోల్పోయారు అత్తయ్యా... ఈ
మధ్య డ్యూటీకి కూడా సరిగ్గా పోవడం లేదు” దిగాలుగా చెప్పింది లావణ్య.
“నాకేం కాదు లేరా... నువ్వు డ్యూటీకి వెళ్ళు” చెప్పింది శాంత.
“నిన్న రాత్రి నాకో విషయం ఈయన చెప్పారు అత్తయ్యా” అని భర్త వైపు చూసింది. “ఏంటి” అన్నట్టు చూసింది.
“క్రొత్తగా తీసుకుంటున్న ఇల్లు మీ కోసమేనట అత్తయ్యా... మనం అద్దె ఇంట్లోనే వుండి అమ్మా, నాన్న ప్రైవసీగా
వుంటారు కొత్త ఇల్లు ఇద్దాం అన్నారు. నేనేం కాదనలేదు” చెప్పింది లావణ్య.
“మీ నాయన లేకుండా నాకు ఇల్లెందుకురా అయ్యా” అంది శాంత. “వెదుకుతున్నాం కదా అమ్మా ... నాన్న
ఎక్కడున్నా దొరుకుతాడు. త్వరలో పోలీసులు పట్టుకుంటారు. తమ్ముడు మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చాడు” చెప్పాడు. “ఆయన భూమి మీద వుంటే ఎవరో ఒకరి కంట్లో పడేవాళ్ళు...అసలు వున్నారో లేదో” అంది దిగాలుగా. మరో నెల గడిచింది. సదాశివం జాడలేదు. తీవ్రంగా జ్వరం తావడంతో శాంతి తీవ్రంగా జ్వరానికి లోనైంది. పిల్లాడికి ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో లావణ్య అత్తగారి దగ్గరకి రాలేదు.
రాఘవే తల్లికి దగ్గరగా వుండి చూసుకుంటున్నాడు. తనకి జ్వరం వస్తే రాత్రింబవళ్ళు మేల్కొని తల్లి చేసిన సేవలు చేసిన రోజులు గుర్తుకొచ్చాయి. వాలు కుర్చీవేసుకొని అందులోనే పడుకున్నాడు రాఘవ. ఎందుకో భయం అన్పించి తమ్ముడికి ఫోన్ చేశాడు. విషయం విని ”పి.ఎఫ్ పెట్టాను అన్నయ్యా...డబ్బులు చేతికి రాగానే అమ్మకి పూర్తిగా బాడీ చెకప్ చేయిద్దాం. మీ మరదలు వసుంధర కూడా పాజిటీవ్‌గానే వుంది. నువ్వేం బెంగపెట్టుకోకు మేం వచ్చేస్తాం” చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. తల్లి ఫోన్ అది. అప్రయత్నంగా ఫోన్ చేతికి తీసుకొని మెసేజ్ ఓపెన్ చేశాడు.
“బావున్నావా శాంతీ... ఇంట్లో నుండి భయటకి వచ్చాక మళ్ళీ వెనక్కి రాబుద్ది కాలేదు. మన ఇద్దరి పోషణ పిల్లలకు కష్టం అన్పించింది. నీ కన్నా ఇంట్లో పని వుంది. నాకేం పని వుంది? నేను టీ అడిగినప్పుడల్లా ఇందాకే తాగావ్ కదా? అని నువ్వు అనడం అబద్దం అని నాకు తెలుసు. నేనూ నటిస్తూనే వుండిపోయాను. నాకూ అబద్దం ఆడాలి అన్పించి అన్నం తిన్నా కదా... అని కొన్నిసార్లు చెప్పాను. చెల్లుకి చెల్లు అయ్యింది కదా? నేను భోజనం చెయ్యకుండా మతిమరుపు పేరుతో నటిస్తున్నానని అర్థమై… నన్ను ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాలేదు నీకు. రామచంద్రని పిలిపించి నాకు నువ్వు టిఫిన్ ఏర్పాటు చేయడం కూడా నాకు గుర్తే ఇంతా చేసి మన ఇద్దరి భారం భరించడం పిల్లలకు కష్టం అని నాకు అర్థమైంది. రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. కన్పించిన రైలు ఎక్కాను. అది పోయినంత దూరం వెళ్ళాను. నన్ను గమనించిన ఒక పెద్దాయన ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. నా మనసుకెందుకో జీవితం ముగించాలని “కాశీకి” అని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో తానే దగ్గరుండి ఒక రైలు ఎక్కించాడు. కాశీలో దిగాక మళ్ళీ ఎక్కడికి ఎలా పోవాలో తెలియలేదు. గంగలో మునకేశాను. కడుపులోకి నీళ్ళు వెళ్ళాయి. కళ్ళు మూతలు పడ్డాయి. లేచాక కొన ఊపిరితో హాస్పిటల్ బెడ్ పై వున్నాను. ఇక్కడే నా కథ మరో మలుపు తిరిగింది. నాప్రక్క బెడ్ మీద వున్న వ్యక్తిది ప్రింటెడ్ పెస్సేనట. అందులోనూ అతడు తెలుగు వాడేనట ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి అతడు కూడా ఆ హాస్పెటల్‌లోనే జాయిన్ అయ్యాడు. నన్నుతనతో తెచ్చేసుకున్నాడు. వైద్యం కూడా చేయిస్తున్నాడు. డి.టి.పి నేర్పించడమే కాకుండా ప్రూఫ్ రీడర్ గా పెట్టుకున్నాడు. ఇరవై వేలు జీతం ఇవ్వడానికి సిద్దమయ్యాడు. శాంతీ... నేను వచ్చి నిన్ను తెచ్చేసుకుంటాను. కోడలి పిల్ల దయతో మనం బ్రతకాల్సిన పని లేదు. లీటర్ పాలు తీసుకో మనం కట్టేదాం. నేను అడిగేది రోజుకు రెండు మూడు సార్లే కదా? మాటి...మాటికి చెయ్యడానికి నీకు ఇబ్బంది అయితే ఇక ప్లాస్కో వాడుదాం లే. ప్రతి సారి ప్రెష్ గా పెట్టివ్వమని వేదించను. మన ఖర్చులూ ఇంటి రెంట్‌కి పోను ఐదారు వేలు మిగుల్తాయి. పెద్దాడి ఫోన్ నెంబర్ తీసుకొని వాడికి పంపుదాం. వాడికి చాలా అప్పులు వున్నాయి కదా? ఆఖరిగా ఒక మాట ఈ మెసేజ్ చూసిన వెంటనే డిలీట్ చెయ్యి... పెద్దాడు చూస్తే బాధ పడతాడు. నీ సదాశివం. రాఘవ కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. మంచం మీద వున్న తల్లిని చూస్తూ...
“అమ్మా...అమ్మా” అని కదిపాడు.
“నాన్న వస్తున్నాడమ్మా” తట్టి మరీ లేపాడు.
తల్లిలో ఎంతకీ కదలిక లేకపోవడంతో
“అమ్మా” అని అరిచాడు. ఆ అరుపుకు ప్రక్క గదిలో వున్న లావణ్య ఒక్క ఉదుటన భయటకు వచ్చింది.
అప్పటికే ఆమెకి అర్థమైంది. తన అత్తగారు లోకం విడిచిపోయారని.
+++++