బాపు, రమణలతో నా తీపి గురుతులు...  (Author: మందపాటి సత్యం)

గోదావరి జిల్లాల్లో ఒక బాపు. ఒక రమణ. ఒకరిది తూర్పు. ఇంకొకరిది పడమర. ఈ తూర్పూ పడమరలని కలిపి, ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు మనకి హాయిగా, హుషారుగా, అంతకు మించి ఎంతో స్వచ్చంగా నవ్వుకునే అదృష్టం కలిగించినది బాలానందం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావుగారు. వారు నడిపిన “బాల” పత్రికలో 1946లో రమణ వ్రాసిన కవితని, బాపు బొమ్మతో సహా ఆయన ప్రచురించారు.

          ఒకసారి రమణ ఒక కథ వ్రాసి, బాపు చేత బొమ్మ వేయించి, సంపాదకులు విద్వాన్ విశ్వంగారికి చూపించారు. ఆయన రమణని ఎగాదిగా చూసి, “ఇంతున్నావ్. నువ్వేం వ్రాస్తావ్” అన్నారుట. అప్పుడు రమణ, “నా కథ వేస్తే, ఈ బొమ్మ ఫ్రీ” అన్నారుట. ఆ బాపు బొమ్మ చూసి విశ్వంగారు, “ఇడ్లీ కన్నా పచ్చడే బావుంది” అని ఆ రెండూ కలిపి ప్రచురించారుట!

                               ౦                             ౦                             ౦

పుస్తకాలు చదవటం మొదలు పెట్టని 12 ఏళ్ల వయసులోనే, నేను బాపు రమణలకి పెద్ద అభిమాని నయిపోయాను. గుంటూరులో నేను పెరిగేటప్పుడు, మా ఇంట్లో ఎప్పటినించో తెలుగు పత్రికలు కొని చదవటం ఒక మంచి అలవాటు. అలాగే ఆంధ్ర సచిత్ర వారపత్రిక ప్రతివారం కొనేవాళ్ళు. 1956–57లలో అనుకుంటాను, బాపుగారి బొమ్మలతో, రమణ ముద్దు పలుకులతో, బుడుగు కథా ప్రస్థానం మొదలయింది. ఆంద్రపత్రిక రాగానే, నేనూ మా అక్కయ్యలూ, నేను ముందంటే నేను అని పోటీలు పడి ముందుగా చదివేది బుడుగు. ఆరోజుల్లో, ఆ వయసులోనే మేము గంటల తరబడి బుడుగు లీలలు చెప్పుకుంటూ ముణిగితేలేవాళ్ళం. బాపు, రమణలు, బుడుగుతో మమ్మల్ని అలరించటమే కాక, నాలాటి మీలాటి వారికి చిన్నప్పటినించీ, తెలుగు సాహిత్యం మీదే ఎంతో ఆసక్తి కలిగేలా చేసారు. నేను తెలుగులో ఎన్నో వందల పుస్తకాలు చదవటానికీ, తర్వాత రచయితనవటానికీ ఇదే కారణం. అదీకాక గుంటూరులో మా ఇంటి పక్కనే, గుంటూరు జిల్లా కేంద్ర గ్రంధాలయం వుండేది. అక్కడ ఎన్నో గొప్ప పుస్తకాలు వుండేవి. ఇక నాలాటి వారికి పుస్తకాల పండగే పండగ!   

          దరిమిలా ఆంధ్రపత్రికకు, జ్యోతి మాసపత్రిక తోడయింది. వివి రాఘవయ్యగారి సారధ్యంలో, దానికి సంపాదకులు బాపు, రమణ, నండూరి రామమోహనరావు, రావి కొండలరావు మొదలైన మహామహులు. వాటిల్లో నేను వదిలిపెట్టని సంచికలు లేవంటే లేవు. అప్పుడే రమణగారి సీతాకల్యాణం, ఇద్దరమ్మాయిలూ – ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్ ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతిక, ఋణానందలహరి, విక్రమార్కుని మార్కు సింహాసనం, కథానాయకుని కథ, గిరీశం లెక్చర్లు, నవ్వితే నవ్వండి.. ఇలా ఎన్నెన్నో కథలు, సినిమా రివ్యూలు.. రమణగారు ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం, పీటీ108 మొదలైన నవలలకి తెలుగు అనువాదాలు చేసి, నాలాటివారికి ఇంగ్లీష్ నవలల మీద కూడా ఉత్సాహం కలిగేలా చేసారు.

ప్రతి నవలకీ, కథకీ బాపుగారి చిత్రాలంకారం. బాపుగారి బుడుగు స్ట్రిప్ కార్టూన్లు. సాధారణంగా కథలకి వేసే బొమ్మలు పట్టించుకోం. కానీ బాపుగారు బొమ్మ వేస్తే, ముందుగా బొమ్మని పట్టిపట్టి చూసి ‘అమ్మో.. ఎంతమంచి బొమ్మో..’ అనుకుని, తర్వాతే కథ చదువుతాం. ఆరోజుల నించీ బాపుగారి కార్టూన్లు తలుచుకుని సమయాసమయాలు లేకుండా నవ్వుకునేవాళ్ళం. ‘జరగరా జరుగు.. ఇంకొడొస్తున్నాడు..’, ‘అయ్యా.. ఈ మహత్తర యవ్వన గుళికలు సేవిస్తే, నా పించనుకేమీ ఇబ్బంది రాదుకదా’ మొదలైన కార్టూన్లు ఎన్నో.. 

అంతేకాదు నా కథలు కూడా 1968నించీ, ఆంద్రపత్రిక, జ్యోతి, యువ, ఆంధ్రప్రభలలో తరచుగా వస్తుండేవి. ప్రతి ప్రత్యేక సంచికలోనూ బాపూగారి ముఖచిత్రాలు, కార్టూన్లు. రమణగారి చెణుకులు.

అంత  చక్కని కళా సరస్వతుల స్వర్ణయుగంలో, నేను పెరగటం నా అదృష్టం.

తర్వాత నేను ఏ సభలో మాట్లాడినా, ఏ పార్టీలో కబుర్లు చెప్పుకున్నా, బాపూ రమణల హాస్యం గురించి తలుచుకోని సందర్భం వుండదు. వారి ప్రభావం అంత ఎక్కువగా వుంది మరి!  

                     ౦                             ౦                             ౦

తెలుగు సినిమాల్లో కూడా రమణగారి కథ, మాటలూ వుంటే ఆ సినిమాని తప్పకుండా చూసేవాళ్ళం. రక్తసంబంధం, మూగమనసులు, తేనెమనసులు, కన్నెమనసులు, వెలుగునీడలు, దాగుడుమూతలు, ఇద్దరు మిత్రులు, ప్రేమించి చూడు, పూలరంగడు.. ఇలా ఎన్నో సినిమాలకి రమణగారు కథ లేదా మాటలు లేక రెండూ వ్రాసేవారు. అన్నీ బాగా హిట్ అయిన సినిమాలే!

1967లో బాపు-రమణల మొదటి చిత్రం సాక్షి విడుదలయింది. బాపు రమణలు ప్రకటించినట్టుగా  అది నిజంగా సాక్షి నామ సంవత్సరమే! నాకు ఆనాటికీ ఈనాటికీ ఎంతో ఇష్టమైన సినిమా! అది నడిచింది కొద్ది వారాలే అయినా, నేను నాలుగైదుసార్లు చూసాను. 1968లో నేను వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఇ. చదువుతున్నప్పుడు వచ్చింది “బంగారు పిచిక”, బాపు రమణల రెండవ సినిమా. చాల సరదాగా వుండే సినిమా. కానీ ఎక్కువ రోజులు ఆడలేదు. ఆనాడు పత్రికల్లో, “బాపు రమణలు తెలుగు సినిమారంగానికన్నా ఎంతో ముందున్నారు, అందుకే ఈ సినిమా బాగా ఆడలేదు” అని వ్రాసారు. తర్వాత తీసిన బుద్ధిమంతుడు సినిమాతో, బాపు రమణల దశ తిరిగిపోయింది. ఆ ఇద్దరు మిత్రుల మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు మూడో మిత్రుడిగా చేయి కలిపి, బాపు రమణల యుగం ముందుకు సాగటానికి ఎంతో సాయం చేసారని బాపుగారు,  రమణగారు ఎప్పుడూ చెబుతుంటారు.

వారి సినిమాల గురించి ఎంత చెప్పినా తరగదు. మీ అందరికీ తెలుసు అవి ఎలాటివో.  బాలరాజు కథ, అందాలరాముడు, సీతా కల్యాణం, సంపూర్ణ రామాయణం, ముత్యాలముగ్గు, వంశవృక్షం, భక్త కన్నప్ప, మన ఊరి పాండవులు, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం... ఇలా ఎన్నో. ఒక్కొక్కటీ ఒక్కొక్క ఆణిముత్యం.

                     ౦                             ౦                             ౦

బాపుగారు మన అభిమాన చిత్రకారుడు, సినిమా దర్శకుడు, హాస్య ప్రియుడు. బాపు తర్వాత బాపు అంతటివాడు. చేయెత్తి దణ్ణం పెడితే, తనని కాదు, ఎవరినో అనుకుని వెనక్కి తిరిగి చూసేంత నిగర్వి.

          మనందరం గర్వించదగ్గ మనిషి. ఆయన చిత్రాలూ, కార్టూన్లూ, సినిమాలూ చూసి ఆనందించటం, ఆయన జీవించిన యుగంలోనే మనమూ వుండటం మన చేసుకున్న అదృష్టం.

          ఆయనతో పరిచయం, నాకు అదృష్టంన్నర. మళ్ళీ మాట్లాడితే ఇంకా ఎంతో బోలెడు ఎక్కువ అదృష్టం.

                               ౦                             ౦                             ౦ 

          మొట్టమొదట బాపూగార్ని1996లో హ్యూస్టన్ నగరంలో కలిసాను. సన్నగా పొట్టిగా, అతి సామాన్యంగా వున్న ఆయన్ని చూడగానే, ఈయనేనా బాపుగారు అనుకున్నాను. కొంచెంసేపు కూడా అవకుండానే, ఈయనే బాపుగారు అని తెలిసిపోయింది. ఆయనతో మాట్లాడటమే, గిరీశం అన్నట్టు, ఒక ఎడ్యుకేషన్. ఆయన మాట్లాడుతుంటే, హాస్యానికి భాష్యం చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు పూర్తిగా ఆయనతో గడిపి, ఆ రోజుని నా జీవిత పుటల్లో భద్రంగా దాచుకున్నాను. అంతకు ముందే నా కథలు కొన్ని చదివానని చెబితే, ముఖమాటం కొద్దీ అంటున్నారులే అనుకున్నాను. నా కథల ద్వారా నేను వ్రాసిన దేవుడి మీద నా నమ్మకాలు నాకే చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. నా “అమెరికా బేతాళుడి కథలు” పుస్తకం ఇస్తే, కళ్ళకద్దుకుని తీసుకున్నారు. తప్పకుండా చదివి తన అభిప్రాయం వ్రాస్తానన్నారు. ఏదో బిజీగా వుండే పెద్దమనిషి కదా, సరదాగా అన్నారనుకున్నాను. తర్వాత ఒక నెల రోజుల్లో తనకి నచ్చిన విషయాలూ, సంఘటనలూ వివరంగా రెండు పేజీల్లో వ్రాసి నన్ను ఆశ్చర్యపరిచిన గొప్ప  పాఠకుడాయన. 

          అప్పుడే ఇంకొక సంఘటన జరిగింది. ఆయన కాలిఫోర్నియాకి అనుకుంటాను, ఫీనిక్స్ మీదుగా వెళ్ళాలి. ఫీనిక్స్ ఎయిర్పోర్టులో ప్లేన్లు మారాలి. కొంచెం గాబరా పడిపోయి, మీకు ఎవరైనా తెలిస్తే అక్కడ ఎయిర్పోర్టుకి వచ్చి సహాయం చేయమని చెప్పగలరా అని అడిగారు. తప్పకుండాను అన్నానే కానీ, నాకు ఆ రోజుల్లో ఫీనిక్సులో తెలిసిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళనీ వీళ్ళనీ అడిగితే, చివరికి అక్కడ వుండే ఒకాయన ఫోన్ నెంబరు దొరికింది. ఆయనకి ఫోన్ చేసి, “నేను ఫలానా, మాకు తెలిసిన వారికి మీ సహాయం కావాలి” అని విషయం చెప్పాను. ఆయన పాత తెలుగు సినిమాలో రేలంగిలా “ఎవడ్రా వీడు.. ముక్కూ ముఖం తెలీకుండా సహాయం అడుగుతున్నాడు” అనుకుని వుంటాడు. అయినా ఆరోజుల్లో ఇంకా సాటి తెలుగువాళ్ళం పరస్పరం గౌరవించుకునే వాళ్ళం కదా, అందుకని మర్యాదగానే, “ఎవరండీ ఆ వచ్చే ఆయన” అని అడిగాడు. “బాపూ గారని..” ఇంకా చెబుతుండగానే ఆయన ఎగిరి గంతేసాడని అర్ధమయిపోయింది. తర్వాత బాపూగారు అన్నారు, “అదేమిటండీ, నాకు సహాయం కోసం ఎవర్నో ఒకర్ని పంపించమంటే, మరీ పెద్ద బెటాలియన్నే పంపించారు” అని! అదీ ఆయన గొప్పతనమే అని నమ్మటం ఇష్టపడని గొప్ప మనిషి ఆయన!   

          తర్వాత ఆయన అమెరికాకి వచ్చినప్పుడల్లా ఎక్కడో అక్కడ కలుస్తూనే వున్నాను. ఎంతో ప్రేమగా పలకరించేవారు.

          నా “గవర్నమెంటాలిటీ కథలు” పుస్తకానికి రమణగారు ముందుమాట వ్రాసి ఇచ్చారు.  నేను వ్రాసిన ఆ పన్నెండు కథల కన్నా కూడా ఆయన వ్రాసిన ముందుమాటే బాగుంది నాకు. మళ్ళీ ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది. బాపుగారు అట్ట మీద బొమ్మ వేస్తానన్నారు కానీ, భాగవతం సీరియల్ తీస్తూ బిజీగా వుండి, వ్రాయలేకపోయారు.

          “నన్ను క్షమించాలి. ఈసారి ఒకటి కాదు, మీకు రెండు పుస్తకాలికి బొమ్మలు వేస్తాను” అని ఉత్తరం వ్రాసిన ఎంతో పెద్దమనిషి. 

          తర్వాత ఒక సంవత్సరం గడిచిందనుకుంటాను. ఒకరోజు ఉత్తరాల కట్టలో, బాపుగారి ఉత్తరం వుంది. ఆయనకి మెహిదీ హసన్ సంగీతమంటే ప్రాణం. మెహిదీగారి సంగీతమంతా ఆయన దగ్గర వుందిట. మెహిదీ హసన్ కొడుకు అమెరికాలో కొలరాడోలో వుంటాడని తెలిసింది. ఇంట్లో కచేరీ చేసుకునేటప్పుడు పాడుకునే కొన్ని టేపులు ఆయన దగ్గర వుండే అవకాశం వుంది కనుక, అవి తెప్పించి పెట్టగలరా అని సారాంశం. “పుస్తకానికి ముఖచిత్రం వేయమంటే కుంటిసాకులు చెప్పాడు, ఇప్పుడేమో సంగీతం టేపులు కావాలని అడుగుతున్నాడు అనుకోకండి. సంగీతానికి సిగ్గూ ఎగ్గూ వుండవు” అని ఉత్తరంలో వ్రాసారు,  

          బాపూగారంటే నాకు భోలెడు ఇష్టం కాబట్టి, ఎలాగైనా సాధించాలని పట్టుబట్టాను. వరుసగా నాలుగు రోజులు ఎంతోమందికి ఫోన్ చేసి తారీఖ్ హసన్ గారిని పట్టుకున్నాను. ఆయన కూడా పాటలు చాల బాగా పాడతాడు. పేరున్న మనిషి. ముక్కూ ముఖం తెలియని నాతో మాట్లాడతాడని అనుకోలేదు. అయినా చాల స్నేహపూరితంగా మాట్లాడాడు. బాపుగారి గురించీ, ఆయన కోరిక గురించీ అంతా చెప్పాను. అంతేకాదు, మెహిదీ హసన్ మద్రాసు వచ్చినప్పుడు బాపూగారు గీసిన ఆయన చిత్రాన్ని నాకు పంపించారు, తారీఖ్కి ఇవ్వండి అని వ్రాస్తూ. మీరు టేపులు పంపిస్తే, నేను మీ నాన్నగారి బాపూ బొమ్మ పంపిస్తాను అని. ఆయన వెంటనే టేపులు పంపించాడు. నేను ఆయనకి బొమ్మ పంపించాను. బాపుగారు “ఆ టేపుల క్వాలిటీ అంత బాగాలేదు కానీ, పాటలు చాల బాగున్నాయి. సంతోషం!” అని చెప్పారు తర్వాత.

          తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు, బెంగుళూరు నించీ గుంటూరు వెడుతూ, మద్రాసులో బాపు గారింటికి వెళ్లాను.

          “మద్రాసులో మా ఇల్లు ఎవరికీ తెలీదు. టాక్సీ ఎక్కి, సినిమా యాక్టర్ మాముట్టి ఇంటికి తీసుకు వెళ్ళమనండి. ఆయన ఇంటికి ఎదురిల్లే మాది” అని చెప్పారు రమణగారు. 

          నేను వెళ్లేసరికీ ఎండలో బయట నిలుచుని వున్నారు రమణ గారు “వచ్చారా” అంటూ.

          “అదేమిటి సార్, ఎండలో నుంచున్నారు” అంటే, “మీకు దారి తెలుస్తుందో, లేదోనని” అన్నారాయన. 

          “అమెరికానించీ ఇండియా వచ్చివాడిని, సెంట్రల్ స్టేషన్ నించీ మీ ఇంటికి రాలేనా గురువుగారూ” అంటూ, ఆయన అలా ఎండలో నుంచుని ఎదురు చూసినందుకు చాల బాధ పడ్డాను.

          నా జీవతంలో ఎంతో మరువలేని రోజు అది. బాపుగారు కానీ, రమణగారు కానీ, కష్టాలూ సుఖాలూ ఏం మాట్లాడినా, హాస్యం రంగరించే చెబుతారు. జీవితంలో ప్రతి నిమిషాన్నీ అలా క్షుణ్ణంగా అనుభవించటం ఒక గొప్ప వరం. అప్పుడే గుర్తుకి వచ్చింది రమణగారు పెళ్లిపుస్తకం సినిమాలో వ్రాసిన గొప్ప డైలాగ్.

“నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!” అని. 

ఆ మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు ఆప్యాయంగా వండి, వడ్డించిన అసలు సిసలు గోదావరి వంటకాలు.

అప్పుడే నాకు అనిపించిది. నేనెవర్ని? అంత గొప్పవాళ్ళకి నేను ఏమవుతాను? బాపూ రమణల కళా వైదుష్యం ముందూ, పేరు ప్రతిష్టలకి ముందూ, నేనెంత? ఎందుకు నాకీ మర్యాదలు?

దానికి ఒక్కటే జవాబు. అది వారి సంస్కారం! మనం ఎవరైనా వాళ్ళు చేసేది అదే!

అది ఏ వ్యక్తిలోనైనా ఒక మనిషిని చూడగలిగే గొప్ప వ్యక్తిత్వం!

చీకటిలో చందమామ, ఎన్నారై కథలు అనే నా రెండు పుస్తకాల వ్రాతప్రతులూ బాపుగారికిచ్చాను. “మీకు వీలున్నప్పుడే ముఖచిత్రం వేయండి, గురువుగారు!” అని చెప్పి.

          ఇక సెలవు తీసుకుంటానని చెప్పి, “మీ ఇద్దరి కాళ్ళకీ నమస్కారం చేసి వెడతాను సార్” అన్నాను.

          కుర్చీలో కూర్చున్న రమణ గారు కాళ్ళు క్రిందకి దించారు. పాదాభివందనం చేసాను. 

          కార్పెట్ మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాపుగారు, “మీరు అమెరికా వాళ్ళు. షేఖాండ్ ఇవ్వండి చాలు” అన్నారు.

          “లేదు. నేను ఇండియా వాడినే. మీ కాళ్ళు ముందుకి చాపండి” అన్నాను.

          “నా కాళ్ళు. నేనివ్వను” అన్నారు బాపుగారు మొండిగా.

          “మీరు ఇవ్వక పొతే, నేను వెళ్ళను. ట్రైన్ మిస్సవుతాను” అన్నాను.

          మా ఇద్దరి పట్టుదల చూసి రమణగారు తీర్పు ఇచ్చారు. “బాపూ.. నీ కాళ్ళు చాపూ..” అని.

          ప్రాణ స్నేహితుని మాట జవదాటని బాపూగారు, కాళ్ళు ముందుకి చాపారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించి బయల్దేరాను.

          మర్నాడు ప్రొద్దున్నే గుంటూరుకి ఫోన్ చేసారు బాపుగారు. “బొమ్మలు రెడీ.. పంపిస్తున్నాను” అని.

          ఆయన ఆ రాత్రి అసలు నిద్ర పోయారా అని నా అనుమానం! ఒక్కరాత్రిలో నా పుస్తకాలు చదివి, బాపుగారు నా రెండు పుస్తకాలకి ముఖచిత్రం వేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు.

          తర్వాత కొన్నేళ్ళకి, వంగూరి ఫౌండేషన్ వారు హైదరాబాదులో నిర్వహించిన ప్రప్రధమ ప్రపంచ తెలుగు సదస్సు, బాపు రమణల స్నేహానికి షష్టిపూర్తి సందర్భంగా నిర్వహించారు. దానిలో బాపు, రమణల గురించి మాట్లాడి, వారిని ఆహ్వానించే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజుగారు. ఆరోజే బాపుగారు, రమణగారు నా రెండు పుస్తకాలు ఎన్నారై కబుర్లు ఒకటి, ఎన్నారై కబుర్లు మరోటి ఆవిష్కరించారు కూడాను.

          బాపూ రమణలు, ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోవటమే కాదు, ప్రతి తెలుగువారి హృదయం మీదా పెద్ద ముద్ర వేసారు. చెరపలేనంత ప్రేమ ముద్ర అది.

మనిషికీ మనిషికీ మధ్య ఏముంటుందో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ చెప్పిన సహృదయులు. కళాకారులు. స్నేహితులు. గురువులు.

          మిమ్మల్ని మేం మరచిపోలేం గురువుగారూ!

          అంతేకాదు మీరెక్కడికీ వెళ్ళలేదు, సార్!

మా హృదయాల్లో అలా కలకాలం నిలిచేవున్నారు!

నిలిచే వుంటారు!

                     ౦                             ౦                             ౦

Comentar