ప్రేమ రసాయనం  (Author: డాక్టర్ ఎమ్ సుగుణ రావు)

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్లయిట్‌ దిగిన శైలేష్‌, శిరీషలు తమ లగేజి పాయింట్‌ దగ్గరకొచ్చి వేచి చూస్తున్నారు. ఇంతలో ఫోన్‌ మోగింది. ‘‘తాతయ్య నుంచి’’ అన్నాడు శైలేష్‌, శిరీష వంక తిరిగి.

‘‘వచ్చేశాం తాతయ్యా. పావుగంటలో బైట వుంటాం’’ అన్నాడు.

ఐదు నిమిషాల తర్వాత తమ లగేజీతో బైట పడ్డారు. ఎయిర్‌పోర్ట్‌ బైటే తాతయ్య కనిపించాడు. పక్కనే నాన్నమ్మ. ఆ ఇద్దరూ శైలేష్‌ను కాకుండా అతడి వెంట వచ్చిన శిరీషను నఖశిఖపర్యంతం పరీక్ష చేస్తున్నారు. ఆమె తెల్లగా, పొడుగ్గా ఉంది. స్లీవ్‌లెస్‌ జాకెట్‌, మినీ ష్కర్ట్‌ వేసుకుంది. భుజం వరకూ ముడి వేయని జుట్టు. కళ్లకు నల్లటి కళ్లద్దాలు.

శైలేష్‌ ‘‘ఈమె నా పార్టనర్‌’’ అంటూ పరిచయం చేశాడు శిరీషను.

‘‘హాయ్‌...’’ అంటూ వారికి షేక్‌ హాండ్‌ ఇచ్చింది శిరీష.

‘‘పార్టనర్‌ అంటే...?’’ రామ్మూర్తి అడిగాడు.

‘‘నా జీవితభాగస్వామి. అంటే జీవనసహచరి’’ చెప్పాడు శైలేష్‌.

‘‘పెళ్లయిందా?’’ అంది సీతమ్మ.

‘‘మాకు పెళ్లి మీద నమ్మకం లేదు. లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌లో వున్నాం. ఇది మీకు కొత్త కావచ్చు. ఇష్టపడినంత కాలం మా మధ్య ఏ విభేదాలు రానంతకాలం ఇలాగే ఉంటాం. ఇదే బాగుంది’’ అంది శిరీష.

శైలేష్‌ ఆమె చెయ్యి నొక్కి వదిలాడు.

‘‘సరే... ఏంట్రా అబ్బాయ్‌ విశేషాలు!?’’ అన్నాడు తాతయ్య.

‘‘విశేషాలేమున్నాయ్‌. అమ్మా, నాన్నా బాగున్నారు అమెరికాలో. మీరు మన ఊళ్లో చేస్తున్న శ్రీరామ నవమికి వాళ్లు రాలేకపోవడంతో నన్ను పంపారు. శిరీష కూడా నాతో వస్తానంది. తీసుకొచ్చేసాను. ఈమె కూడా తెలుగమ్మాయే! వీళ్లది వైజాగ్‌. నాతో పాటు అమెరికాలో పని చేస్తోంది’’ అన్నాడు.

కారు ముందుకు దూసుకెళ్తోంది. రాజమండ్రి దాటిన గంట తర్వాత దగ్గరే ఉన్న పల్లెటూరుకి చేరుకుంది వాహనం. దారిలో నర్సరీలు చాలా కనిపించాయి. ఒక నర్సరీ దగ్గర కారు ఆపి మల్లెపూలు, గులాబీ, బంతిపూలు చాలా తీసుకున్నాడు తాతయ్య.

‘‘ఇవన్నీ దేనికి?’’ అన్నాడు శైలేష్‌.

‘‘పూలతోనే పని. సీతమ్మవారి పెళ్లిలో ఏం జరుగుతాయో అవన్నీ జరిపిస్తారు. చూస్తారుగా!’’ అన్నాడు తాతయ్య.

అతడి మాటలకు ముసిముసి నవ్వులు నవ్వింది నాన్నమ్మ. తమ ఊరు చేరారు. చుట్టూ ప్రహరీ గోడ. ఇంటి ముందు పశువుల కొట్టాం. లోపల విశాలమైన ఖాళీ స్థలం. ఒకవైపు షటిల్‌ కోర్టు. మధ్యలో రెండస్థుల భవనం. కారు దిగి తమ సామానులు డ్రైవర్‌ తీసుకువెళ్లి రెండో అంతస్థులో ఉన్న రూమ్‌లో పెట్టబోతుంటే ‘‘శిరీష లగేజీ వేరే రూమ్‌లో పెట్టండి. ఆమెకు సెపరేట్‌గా రూమ్‌ ఇవ్వండి’’ అన్నాడు శైలేష్‌.

ఆ మాటలకు పెద్దవాళ్లిద్దరూ ఏదో చెప్పబోయి ఆగిపోయారు. ఆ ఇద్దరి సామానులు రెండు వేరు వేరు గదుల్లో పెట్టించారు తాతయ్య. ఆ ఇంటి ఆవరణలోనే వేసిన షామియానా దగ్గర చాలా మంది బంధువులు బిలబిలమంటూ కనిపించారు. ఆ షామియానా కింద ఒక ఫ్లెక్సీ. ‘సీతారాముల పెళ్లి సందడి’.

‘‘సరే, మీ ఇద్దరూ ఫ్రెష్‌ అయి రండి’’ అన్నాడు రామ్మూర్తి.

ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత రామ్మూర్తికి నడవడం అలవాటు. అలా నడుస్తూ శైలేష్‌ శిరీష ఉంటున్న గది వైపు చూశాడు. ఆ రూమ్‌లో లైట్లు వెలుగుతున్నాయి. కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. శైలేష్‌ గదిలో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నట్టు, అలాగే శిరీష తన గదిలో మరో అబ్బాయితో మాట్లాడుతున్నట్టు.

రామ్మూర్తికి ఆశ్చర్యం కలిగింది. ఇదెలా సాధ్యం? ఇద్దరూ తమ గదుల్లోకి ఒంటరిగానే వెళ్లారు. ఇప్పుడు ఎవరి గదిలో వాళ్లు ఉన్నారు. కానీ తమ గదుల్లో వేరే వారితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏమీ అర్ధంకాకుండా ఉన్న ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రామ్మూర్తికి ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు.

తర్వాతి రోజే శ్రీరామ నవమి. రామ్మూర్తి ఆ ఊరిలో మోతుబరి. ఆ ఊర్లోనే సీతారామాలయం ధర్మకర్త. ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి ఘనంగా జరుపుతాడు. రామ్మూర్తి కొడుకు అమెరికాలో ఉన్నాడు. అతడి తరఫున కొడుకు శైలేష్‌, తన స్నేహితురాలు శిరీషతో శ్రీరామ నవమి పండుగ వేడుకల్లో పాల్గోనడానికి వచ్చాడు. కూతుళ్లు, అల్లుళ్లు ఇండియాలో ఉన్న వారంతా ఆ ఊరు చేరుకున్నారు. చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది.

* * *

ఆడవాళ్లంతా పూలకు మాలలు కడుతున్నారు. మగవాళ్లంతా ఒక చోట చేరి చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయారు. శైలేష్‌, శిరీష ఫ్రెష్‌ అయి వచ్చారు. ఇద్దరూ జీన్‌, టి`షర్ట్‌లలో కనిపించారు.

‘‘రామ్మా...!’’ అంటూ శిరీషను ఆడవాళ్లు ఆహ్వానించారు. వారితో పాటు పూలకు మాలలు కట్టడంలో నిమగ్నమైపోయింది. గంట తర్వాత గోరింటాకు రుబ్బి ఆడవాళ్లంతా గోరింటాకు పెట్టుకుంటున్నారు. రామ్మూర్తిగారు సీతమ్మకు, సీతమ్మ రామ్మూర్తిగారికీ గోరింటాకు పెట్టింది. శిరీషకు సరదా అనిపించింది. శైలేష్‌కు గోరింటాకు పెట్టింది. తనకూ పెట్టమనడంతో ఆమె చేతులకు, కాళ్లకు గోరింటాకు పూసాడు. మధ్యాహం అంతా సహపంక్తి భోజనాలు చేసారు.

సాయంత్రమైన తర్వాత ఆ ఆవరణలో ఉన్న షటిల్‌ కోర్టులో రామ్మూర్తి, సీతమ్మ షటిల్‌ ఆడడం చూసి శిరీష, శైలేష్‌ ఆశ్చర్యపోయారు. అంత వయసులోనూ దంపతులిద్దరూ ఏ అలసట లేకుండా ఆడడం విడ్డూరం అనిపించింది. రాత్రి భోజనాలు అయిన తర్వాత తమలపాకులని చిలకలుగా చుట్టి, ఐదు వేళ్లకూ ఆ చిలకలు తగిలించి రామ్మూర్తి నోటికి అందించడం చూసిన శిరీష ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యింది. తనూ చిలకలు చుట్టి శైలేష్‌ నోటికి అందించింది. ఇదేదో బాగుందే అనుకున్నాడు. ఆరోజు రాత్రి ఆ దంపతులు శిరీష, శైలేష్‌లను తమ గదికి పిలిచి చెప్పడం మొదలెట్టారు.

‘‘ఎంత కాలం ఇలా... పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా!?’’ అన్నారు.

‘‘పెళ్లి దేనికి? మేము ఆనందంగా ఉన్నాం మీకు లాగా!’’ అన్నాడు శైలేష్‌.

‘‘మీది సహ జీవనం. మాది సహజ జీవనం. మీకు పెళ్లి కాకపోవడంతో ఏదో భయం భయంగానే బతుకుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక గదిలో ఉండడానికి సంశయించారు. మొహమాట పడ్డారు. ఇదంతా దేనికి? ఒకరికి ఒకరు ఇష్టపడిన మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా!’’ అన్నాడు.

ఆ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు. తమ గదులలోకి వెళ్లిపోయారు.

* * *

తరువాత రోజు శ్రీరామ నవమి. రామ్మూర్తి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో విశాలమైన తాటాకు పందిరి. ఆ పందిట్లో సీతారాముల కల్యాణం మొదలైంది.

ఆనందమానందమాయెనె, మా రామయ్య పెళ్లికొడుకాయెనె, మా సీతమ్మ పెళ్లికూతురాయెనె’ అనే పాట పాడుకుంటూ అక్కడికి వచ్చిన ముత్తయిదువలు పెళ్లి సంబరాల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి, సీతమ్మ ఇద్దరూ సీతారాముల కల్యాణం జరిపించారు.

సీతారాముల పెళ్లి జరిపించిన పురోహితుడు, మైక్‌ అందుకొని చెప్పడం మొదలుపెట్టాడు.

‘‘రామ్మూర్తిగారు పుట్టినప్పటి నుంచీ వెయ్యి పౌర్ణమిలు చూసారు. ఆమె మెడలో మంగళసూత్రం కట్టిన ఘడియ బలం ఏమిటో, ఎనభై ఏళ్లు దాటిన రామ్మూర్తిగారు, డెబ్బై debbhaiఐదేళ్లు దాటిన సీతమ్మ ఆది దంపతుల్లా ఇన్నేళ్లయినా హుషారుగా, ఉత్సాహంగా యువతీ యువకుల్లా మన ముందు తిరుగుతున్నారు. భార్యాభర్తలను వేదం దంపతులు అనదు. దంపతి అంటుంది. ఎందుకంటే అది ఏకత్వానికి చిహ్నం. ఈ ఏకత్వ భావన ఈ సీతారాముల దాంపత్యంలో మనం చూడవచ్చు.

నీ కొడుకు వీణ. నేను తీగె. నీ కొడుకు శ్రావణ మేఘం. నేను మెరుపు. నీ కొడుకు సూర్యుడు. నేను వెలుగు’ అంటుంది రామాయణంలో సీత తన అత్త కౌల్యతో. ఇది మన భారతీయ దాంపత్య రసయోగంలోని పరమ అద్వైత స్థితికి అద్దంపట్టే వాక్యం. వాక్కు, అర్ధం, పువ్వు, సువాసన, వెన్నెల, చల్లదనం ఎలాగో ఈ రాముడు సీతలాగే! అలాగే ఇది మన రామ్మూర్తిగారు, సీతమ్మలకు వర్తిస్తుంది’’ అంటూ వారిని ఆశీర్వదించాడు.

అందరూ భోజనాలు కానిచ్చారు. సాయంత్రంకల్లా బంధువులు, స్నేహితులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆరోజు రాత్రి పెద్దవాళ్లిద్దరూ శైలేష్‌ను, శిరీషను తమ గదిలోకి రప్పించుకొని మాట్లాడడం మొదలుపెట్టారు.

ఆ పెద్దవాళ్లు ఇద్దరినీ చూసి ఆనందపడ్డారు, శైలేష్‌, శిరీషలు.

సీతమ్మ ఆకుపచ్చ బోర్డర్‌ ఉన్న తెల్లటి పట్టుచీర కట్టుకుంది. తల నిండా మల్లెపూలు. బాగా పండిన ఆమె జుట్టు రంగులో కలిసిపోయాయి. చేతులకు పండిన గోరింటాకు. కాళ్లకు పారాణి. రామ్మూర్తిగారు తెల్ల పట్టు పంచెలో నవ వరుడులా కనిపిస్తున్నారు. ఇద్దరూ తాంబూలం వేసుకుని ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎన్నో కబుర్లు. తమ వైవాహిక జీవితం గురించిన వింతలు, విశేషాలు. శైలేష్‌, శిరీష ఇద్దరూ శ్రోతలైపోయారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా సీతమ్మగారు ఆ యువతీ యువకులవైపు తిరిగి ‘‘నేను ఒక విషయం అడుగుతాను. ఏమీ అనుకోరుగా!?’’ అంది.

‘‘పర్వాలేదు నాన్నమ్మా, అడుగు...’’ అని శైలేష్‌, ‘‘పర్వాలేదు అమ్మమ్మ’’ అని శిరీష ముక్తకంఠంతో చెప్పారు.

ఆమె వెంటనే అంది ‘‘మీరెంత కాలం నుంచి ఈ సహ జీవనం చేస్తున్నారు?’’

‘‘ఆరు నెలల నుంచి...’’ చెప్పాడు శైలేష్‌.

‘‘సహ జీవనం అంటే?’’ తిరిగి ప్రశ్నించింది.

‘‘లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌’’ చెప్పాడు శైలేష్‌.

‘‘అంటే?’’ మళ్లీ ప్రశ్నించింది.

‘‘కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. కష్టం సుఖం సమానంగా పంచుకుంటాం. ఇంట్లో పనులు షేర్‌ చేసుకుంటాం. వంట కూడా ఇద్దరం సమానంగా చేస్తాం. మాకు వచ్చే డబ్బులు సమానంగా ఖర్చుపెట్టుకుంటాం. ఒకరు ఎక్కువా లేదు, ఒకరు తక్కువా లేదు’’ చెప్పింది శిరీష.

ఆ మాటలకు సీతమ్మ ‘‘మీ మధ్య ఏమైనా ఉందా?’’ అని అడిగింది.

‘‘అంటే...!?’’ ఆ ఇద్దరికీ అర్ధంకాక అడిగారు.

‘‘అదే... మీ మధ్య ఏమైనా జరిగిందా, జరుగుతుందా!?’’ మళ్లీ ప్రశ్నించింది.

ఆ మాటలకు రామ్మూర్తి భార్య నెత్తిమీద మొట్టికాయ వేస్తూ ‘‘ఛీ... అవేం మాటలు, పిల్లల దగ్గర’’ అన్నాడు.

‘‘ఎంతయినా మన బిడ్డలే కదా! మనవడూ, మనవరాలూ’’ అంది సీతమ్మ.

ఆ మాటలకు శిరీష తల వంచుకుంది. శైలేష్‌ చిన్నగా నవ్వి ‘‘అలాంటివేం లేవు. ఏమీ జరగలేదు. ఎందుకో ఇష్టం లేదు. ఇలా స్నేహంగా ఉండిపోవడమే బాగుంది’’ అన్నాడు.

‘‘మై గాడ్‌... నిజమా...!?’’ అన్నాడు రామ్మూర్తి ఆశ్చర్యంగా చూసి.

‘‘నిజమే తాతయ్యా. మీరనుక్నుట్టు మీరే కాదు, చాలా మంది అనుకున్నట్టుగా మా మధ్య ఏమీ జరగలేదు. అలాంటిది జరిగితే వచ్చే సమస్యల గురించి భయపడుతున్నాం. ఈ సహ జీవనం ఎంత కాలం ఉంటుందో తెలియదు’’ అన్నాడు.

‘‘అయ్యో...’’ అంది నిట్టూరుస్తూ సీతమ్మ.

వెంటనే అన్నాడు రామ్మూర్తి ఆ ఇద్దరితో మెల్లగా ‘‘రాత్రి మీ రూమ్‌ల దగ్గరకు వెళ్లినపుడు నాకేవో శబ్దాలు వినిపించాయి. మీ రూమ్‌లలో ఎవరో ఉన్నట్టు. నాకు ఆశ్చర్యం కలిగింది. మీరు ఒక్కొక్కరే చెరో రూమ్‌లో ఉన్నారు. మరి రాత్రి మీరెవరితో గడిపినట్టు? అసలేం జరిగింది?’’ అన్నాడు రామ్మూర్తి ఆ ఇద్దరి మొహాల్లోకి పరిశీలనగా చూసి.

సీతమ్మ ఆ మాటలకు ‘‘నిజమా. ఎప్పుడు జరిగింది?’’ అంది.

ఆ ఇద్దరూ తల వొంచుకున్నారు. వెంటనే శైలేష్‌ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేనూ శిరీష్‌ ఒక ఎడ్జస్ట్‌మెంట్‌ కోసం ఈ లివింగ్‌ రిలేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ఇది వాణిజ్యపరమైన సర్దుబాటు. అమెరికాలో వీసా కోసం మేము జంటగా ఏర్పడ్డాం. అక్కడ ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం ఆ సంబంధం కొనసాగించాం. ఇద్దరం కలసి మా ఖర్చులు షేర్‌ చేసుకోవడం కోసం ఈ లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌ బాగుంది.

ఒకే ఇంట్లో ఉంటోన్న మా మధ్య ఏమీ జరగడంలేదు. అంటే నిజంగా ఎవరూ నమ్మరు. నిజంగా ఏమీ జరగలేదు. అలా జరగకుండా ఉండేందుకే మేము చేసుకున్న ఈ ఏర్పాటు. ఈ ‘ఛాట్‌ బాట్స్‌’ అన్నాడు శైలేష్‌.

‘‘ఛాట్‌ బాట్స్‌ అంటే...?’’ రామ్మూర్తి ప్రశ్నార్థకంగా చూసాడు.

‘‘డిజిటర్‌ పర్సన్‌. అంటే మరమనిషి’’ అంది శిరీష.

‘‘ఓహో...’’ అంది సీతమ్మ.

శైలేష్‌ చెప్పడం కొనసాగించాడు. ‘‘ఒక స్త్రీ పురుషుడితో లేదా పురుషుడు స్త్రీతో జరిపే చాటింగ్‌ కొంత కాలానికి బోర్‌ కొట్టవచ్చు. ఇద్దరి మనసుల వేవ్‌లెంగ్త్‌ సరిపోకపోవచ్చు. అయితే ఈ ఛాట్‌ బాట్స్‌తో ఈ సమస్య ఉండదు. అందుకే చైనాలో యువత దీనిపై ఆకర్షితులౌతున్నారు. చాలా మంది తమ బాయ్‌ ప్రెండ్స్‌ గర్ల్స్‌ ఫ్రెండ్స్‌తో స్నేహానికి స్వస్తి చెప్పి ఈ ఛాట్‌ బాట్స్‌లకు ఆకర్షితులౌతున్నారు. అలా నేనూ శిరీష ఈ ఛాట్‌ బాట్స్‌ సేవలను పొందుతున్నాం’’ శైలేష్‌ చెప్పాడు.

‘‘మై గాడ్‌...’’ నిట్టూర్పు విడిచాడు రామ్మూర్తి. శైలేష్‌ చెప్పడం కొనసాగించాడు.

‘‘మాకు ఈ ఛాట్‌ బాట్స్‌ ద్వారా మా భాగస్వామి అయిన డిజిటల్‌ పర్సన్‌ ప్రేమ కబుర్లు, కవిత్వం చెబుతుంది. పాటలు పాడుతుంది. డ్యాన్సు చేస్తుంది. మాతో బీచ్‌కు, సినిమాకు వచ్చినట్టుగా ఊహించి మాతో చాటింగ్‌ చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో పని చేస్తున్న మేము కూడా కృత్రిమ మనుష్యులుగా తయారయ్యాం. కృత్రిమ మేథస్సుతో తయారుచేసిన ఛాట్‌ బాట్స్‌ను డేటింగ్‌ బాయ్‌, డేటింగ్‌ గర్ల్‌గా ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఆడా మగా స్నేహితుల మధ్య వచ్చే గొడవలు ఈ చాట్‌ బాట్స్‌తో రావు. ఈ కృత్రిమ ఛాట్‌ బాట్స్‌ పార్ట్‌నర్‌కు ఎమోషనల్‌ సపోర్ట్‌ ఇస్తాయి. అలా రాత్రి మీరు చూసినపుడు మేము ఒంటరిగా ఉన్న గదుల్లో ఛాట్‌ బాట్స్‌తో గడుపుతున్నప్పుడు మీరు వేరే మనిషి ఉన్నారనుకొని అపార్ధం చేసుకున్నారు’’ చెప్పడం ముగించాడు శైలేష్‌.

‘‘అయ్యో, మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను’’ అన్నాడు రామ్మూర్తి.

క్షణం సేపు ఆ ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. శిరీష మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది.

‘‘మీ దాంపత్య జీవితం ఇప్పటికీ పచ్చగా, నిత్యనూతనంగా సాగుతోంది. మా యువతరం అలా ఉండలేకపోతున్నాం. కారణం ఏమిటి?’’ అంది మెల్లగా.

ఆ మాటలకు ఒక్క క్షణం ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు రామ్మూర్తి.

‘‘నేడు చాలా ప్రేమ పెళ్లిళ్లు, మీలా ఏర్పరచుకొన్న సహజీవన సంబంధాలు విఫలమవడానికి కారణం దంపతుల మధ్య కెమిస్ట్రీ లేకపోవడమే’’ అన్నాడు రామ్మూర్తి. ఆ మాటలకు ఇద్దరూ చిన్నగా నవ్వారు.

ఆ మాటలకు సీతమ్మ ఈ ఇరువురి వంక చూసి చెప్పడం మొదలుపెట్టింది.

‘‘రెండేళ్ల క్రితం మనల్ని కరోనా వెంటాడిరది. తాతయ్యకు కోవిడ్‌ సోకింది. నాకు రాలేదు. మాస్క్‌ కట్టుకొని ఆయనకు అవసరమైనవన్నీ అందించాను. ఒక అర్థరాత్రి తాతయ్య ఆయాసపడడం మొదలుపెట్టారు. ఆ రాత్రిపూట ఆస్పత్రికి వెళ్లాలంటే కష్టం. ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా లేదు. నాకేం చేయాలో అర్ధం కాలేదు.’’

ఆ మాటలు పూర్తి కాకమునుపే రామ్మూర్తి చెప్పడం ప్రారంభించాడు.

‘‘ఆ అర్థరాత్రి పూట ఊపిరి అందక నానా యాతనా పడ్డాను. చావు ఘడియలు సమీపించాయనుకున్నాను. అప్పుడు తను వచ్చి ఒక సాహసం చేసింది. ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతున్న నాకు తన నోటి ద్వారా ఊపిరి అందించింది. తన ప్రాణాలకు ప్రమాదం అని భయపడలేదు. నన్ను కాపాడుకోవడం లక్ష్యంగా నా నోటిని తన నోటితో బలంగా మూసి, తన ఊపిరితో నా ఊపిరి నింపింది. అలా సీత నా ఊపిరి నిలపడం కోసం తన ఊపిరిని ప్రాణంగా పెట్టింది. ప్రాణానికి ప్రాణం అంటే ఇదే. ఇదే దాంపత్యంలో ఉన్న గొప్పతనం. మీకు ఇందాక కెమిస్ట్రీ గురించి చెప్పాడు. అది సరదాగా చెప్పింది కాదు. ఇద్దరి ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ రసాయనాల గురించి సైన్స్‌ కూడా ప్రయోగాత్మకంగా నిరూపించింది.

ఎఫినెఫ్రిన్‌ అనే రసాయనం ఆకర్షణ కలిగిస్తుంది. డోపమైన్‌ ఆ భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. సెరటోనిన్‌ అనే రసాయనం ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఆక్సిటాసిన్‌ అనే రసాయనం ప్రేమికులకు ఒక భద్రతను కల్పిస్తుంది. ఇలా రసాయనాలు శరీరంలో ఉద్భవించి ఆ బంధం మరింత బలపడడానికి పురుష హార్మోన్‌ టెస్టోస్టిరాన్‌, స్త్రీ హార్మోన్‌ ఈస్ట్రోజన్‌లు పాత్ర వహిస్తాయి. ఈ ప్రేమ రసాయనాలన్నీ సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే ప్రేమికుల మధ్య బంధం బలంగా ఉండాలి. మర మనుష్యుల తోటి తమ అసహజ సహజీవనంలోను ఈ ప్రేమ రసాయనాలు ఉత్పత్తి కావడం సాధ్యమా? ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ నడుస్తుందా? ఇప్పుడు చెప్పండి. పండంటి కాపురానికి ఉండాల్సిన సూత్రం ఏంటి?’’ అన్నాడు రామ్మూర్తి.

ఒక్క క్షణం ఆలోచించి వెంటనే చెప్పారు ఆ యువతీ యువకులిద్దరూ. ‘‘పండంటి కాపురానికి ఒకటే సూత్రం. మంగళసూత్రం. అన్యోన్యమైన దాంపత్యం మొదలయ్యేది వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేసే ఆ క్షణంలోనే. అది మాకు మీ దంపతులను చూసిన తర్వాత తెలిసింది. మా సహ జీవనాన్ని సహజ జీవనంగా మార్చుకుంటాం. మీ ఆది దంపతులే మా పెళ్లి జరిపించాలి. మీతో మాట్లాడుతున్నప్పుడే మాలో ప్రేమ రసాయనాలు ఉద్భవించాయి’’ అంటూ శైలేష్‌, శిరీషలు ఆ పెద్దవాళ్లు కాళ్లకు నమస్కరించారు.

Comentar