ధర్మో రక్షతి రక్షితః  (Author: దివాకర్ల పద్మావతి)

రాత్రి పది గంటలు దాటింది. ఏకధాటిగా తన నర్సింగ్ హోంలో పేషంట్లను చూసి అలసిపోయిన డాక్టర్ హారిక బయట ఇంకెవరైనా పేషంట్లు వేచి ఉన్నారా చూసి రమ్మని నర్స్ నిర్మలకి చెప్పింది. నిమిషం తర్వాత, ఆమె బయటకు వెళ్ళి మరెవరూ లేరని చెప్పడంతో విశ్రాంతిగా కుర్చీలో వెనక్కు వాలింది. మంచినీళ్ళు తాగి, కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలపాటు అలా విశ్రాంతిగా వాలిందో లేదో, బయట హాల్లో ఏదో గొడవ గొడవగా ఉంటే ఏమిటోనని కళ్ళు తెరిచింది డాక్టర్ హారిక. తనని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాచ్‌ మేన్ని, నర్సుని కూడా తోసుకుంటూ ఆమె గదిలోకి ప్రవేశించాడో ఆగంతకుడు.

        అతని వెనుకే వాచ్‌ మేన్, నర్సు నిర్మల కూడా కంగారుగా లోపలకి ప్రవేశించారు. వాళ్ళెందుకు ఆ మనిషిని అడ్డుకుంటున్నారో అర్ధం కాలేదామెకి.

        "మేడం!..." అంటూ ఏదో చెప్పబోయిన నిర్మలని ఆగమని సైగ చేస్తూ, "పేషంట్‌ని ఎందుకు అడ్డుకుంటున్నారు, వదిలేయండి!" అంది హారిక.

        అలా అన్న తర్వాత, అప్పుడు ఆ వచ్చిన వ్యక్తివైపు ఆశ్చర్యంగా చూసింది, ఎందుకంటే అతని చేతిలో పిస్తోల్ ఉంది. అది ఆమెకి గురిపెట్టి ఉంది. అతన్ని రంగడిగా గుర్తించిందామె. చూడటానికి చాలా భయంకరంగా ఉన్న రంగడ్ని వాచ్‌మేన్ ఎందుకు ఆపాడో అప్పుడు తెలిసొచ్చిందామెకు. మాసిన గడ్డంతో, చెదిరిన జుట్టుతో పరమ వికృతంగా ఉన్నాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. అతనివైపు భయం భయంగా చూస్తూ నిలబడిపోయిందామె. రెండు రోజుల క్రితం పోలీసు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ ఫోన్ చేసి చెప్పిన సంగతి గుర్తుకువచ్చిందామెకు. జైల్లో ఉన్న రంగడు తప్పించుకుని పరారీ అయ్యాడని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడతను. ఆ సంగతి గుర్తుకు వచ్చి నిలువెల్లా కంపించిపోతూ నిలబడిందామె.

        సరిగ్గా సంవత్సరం క్రితం కిరాయి రౌడీ అయిన రంగడు హత్య చేస్తుండగా పట్టుబడ్డాడు. ఆ హత్యకి డాక్టర్ హారిక ప్రత్యక్ష సాక్షి. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని బతికించడానికి విఫల ప్రయత్నం చేసింది హారిక. తను హత్య చేసిన విషయం పోలీసులకి తెలుప వద్దని, అలా చేస్తే చంపేస్తానని ఆమెని బెదిరించి అక్కణ్ణుంచి మాయమైయ్యాడు రంగడు. అయితే, హతుడు ఆ పట్టణంలో పేరుపొందిన రియల్ ఎస్టేట్ యజమాని కావడంవల్ల, పోలీసులు సులభంగానే రంగడ్ని పట్టుకున్నారు. డాక్టర్ హారిక సాక్ష్యం చెప్పడంవల్ల, రంగడికి పన్నెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు.

        సాక్ష్యం చెప్పినందువల్ల ఆమెపై పగబట్టాడు రంగడు. ఎలాగైనా జైలు నుండి తప్పించుకొనైనా ఆమెని చంపుతానని అందరి ఎదుట శపథం చేసాడు. తను జైలుకెల్తే తన భార్యా, పిల్లలు అనాథలవుతారని, అందుకు ఆమెదే బాధ్యత అని నిందించాడామెని.

        "నేరం చేసినవాడివి దాని పర్యవసానం నీకు తెలియదా? భార్యా బిడ్డల క్షేమం కోరేవాడివి ఇలాంటి వృత్తి ఎందుకు స్వీకరించావు? కిరాయి హంతకుడివైన నువ్వు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి చిక్కవలసిన వాడివేకదా? నీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు పట్టుబడ్డావు. నువ్వు చంపబోయిన మనిషికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. డాక్టరుగా నా ధర్మం నిర్వర్తించాను. అలాగే ధర్మాన్ని రక్షించడంకోసం కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేను చేసినదాంటో తప్పేమీ లేదు. అందుకు నా మీద పగబట్టడం సబబా?" అని అడిగింది హారిక.

        "అదంతా నాకు తెలియదు. నా వృత్తే అది! ఇప్పటివరకూ ఎన్నో హత్యలు చేసాను, ఎప్పుడూ పట్టుబడలేదు. ఇప్పుడు జైలుకు వెళ్తున్నాను. నేను జైలుకెళ్తే నా భార్యాబిడ్డల గతి ఏమిటి? డాక్టరమ్మా, బాగా గుర్తు పెట్టుకో, నేను కలకాలం జైలులో ఉండిపోతానని అనుకోకు. జైలు గోడలు నాకో లెక్క కాదు, ఎలాగైనా తిరిగివచ్చి నీ అంతు చూస్తాను. అంతవరకూ నాకు నిద్ర కూడా పట్టదు." కళ్ళల్లోంచి నిప్పు రవ్వలు కురిపిస్తూ డాక్టర్ హారిక వైపు చూస్తూ శపధం చేసాడు రంగడు.

        కోర్టులో తీర్పు వెలుపడిన రోజు రంగడు అన్న మాటలే గుర్తుకు వచ్చి భయంతో నోటమాట రాక నిలబడింది హారిక.

        "డాక్టరమ్మా!... నేను శపధం చేసినట్లుగానే జైలు నుండి తప్పించుకొని వచ్చేశాను. నేను అనుమానించినంతా అయింది, నా భార్యాపిల్లలు ఎటువెళ్ళారో ఎవరూ చెప్పలేకపోయారు. పాపం ఎలాంటి దీనావస్థలో ఉన్నారో ఏమో? దీనంతటికీ నువ్వే కారణం. నేనేంత ప్రాధేయపడ్డా సాక్ష్యం ఇచ్చావు. ఇప్పుడు నా పగ తీర్చుకోవడానికే వచ్చాను." అంటూ రంగడు డాక్టర్ హారిక వద్దకు వచ్చి అమె తలకు రివాల్వర్ గురిపెట్టాడు.

        డాక్టర్ హారిక గజగజా వణికిపోయింది. నర్సు నిర్మల, వాచ్ మేన్ ఇద్దరూ కంగారుగా ఒక్క అడుగు ముందుకి వేసారు. వాచ్ మేన్ అయితే జేబులోంచి ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చెయ్యబోయాడు.

        రంగడు అది గ్రహిచాడు. వాళ్ళవైపు తిరిగి రివాల్వర్ ఎత్తి గాల్లోకి కాల్చాడు.

        "ఖబర్దార్! ఇద్దరూ చేతులెత్తండి. మిమ్మల్నిద్దర్నీ చంపడం నాకిష్టం లేదు. నేను డాక్టరమ్మను మాత్రమే చంపుతాను. నేను ప్రాధేయపడ్డా, బెదిరించినా ఆమె నా మాటలు అసలు ఖాతరు చెయ్యలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి." కర్కశంగా హెచ్చరించాడు వాళ్ళిద్దర్నీ.

        దెబ్బకి ఇద్దరూ వణికిపోతూ చేతులెత్తి నిలబడ్డారు.

        కొంచెం ధైర్యం కూడగట్టుకుంది హారిక, "చూడు రంగడూ! అప్పుడూ నువ్వు చేసింది తప్పే! ఇప్పుడూ మరో తప్పు చెయ్యబోతున్నావు. నేరం చేసి చట్టం నుండి నువ్వు తప్పించుకోలేవు. నీ అసలు బెంగంతా నీ భార్యాపిల్లల గురించేకదా..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమె మాటలకు అడ్డుతగిలాడు రంగడు.

        రంగడి మొహం కోపంతో మరింత ఎరుపెక్కింది.

        "నేనెంతో ప్రేమించిన నా భార్య, పిల్లలు దూరమైతే నాకు బాధ ఉండదా? పాపం వాళ్ళెలా ఉన్నారో ఏమో! అయినా నీకవన్నీ అనవసరం. చావడానికి సిద్ధపడు డాక్టరమ్మా!" అంటూ అమె తలకు గురిపెట్టి రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు.

        రంగడితో ఇంకా ఏదో చెప్పలనుకొని నోరు తెరిచిన హారిక భయంతో కళ్ళు మూసుకుంది.

        రివాల్వర్ గుండు దూసుకుపోయింది. ఎవరో ఒక్కసారి రంగడ్ని బలంగా తొయ్యడంవల్ల రంగడి రివాల్వర్ నుండి వెలుపడిన తూటా గురితప్పి పైన సీలింగ్ కి తగిలింది. ఆశ్చర్యపడుతూ కళ్ళు తెరిచింది హారిక. రంగడు కూడా తనను తోసిన వ్యక్తెవరా అని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆమె ఎవరో కాదు అతని భార్య మంగి.

        ఎవరికోసం తను పరితపిస్తున్నాడే ఆమె ఎదుట కనిపించేసరికి రంగడి కంట్లో నీళ్ళు ఆగలేదు.

        "మంగీ నువ్వా!..." అన్నాడు ఆశ్చర్యంగా.

        రంగడివైపు ఛీత్కారంగా చూసింది మంగి.

        "ఛీ... దేవత లాంటి డాక్టరమ్మను చంపాలని ఎందుకు ప్రయత్నించావు? నీకెలా చేతులు వచ్చాయా పని చెయ్యడానికి? నువ్వు జైలుకెళ్ళాక, నేనెంతో బాధపడుతూంటే నన్ను పిలిచి తన క్లినిక్ లో ఉద్యోగం ఇచ్చి నన్నూ, నా బిడ్డలను ఆదుకున్న పుణ్యాత్మురాలు ఆ డాక్టరమ్మ. నాకు ఉద్యోగం ఇచ్చిందేకాక, మన పిల్లల్ని చదివిస్తోంది కూడా ఆమె. ఇప్పుడు క్లినిక్ మూసేవేళయ్యిందని గది చిమ్మడానికి నేను రాకపోయి ఉంటే డాక్టరమ్మ ప్రాణాలు తీసేవాడివి కదా పాపాత్ముడా! అసలు నువ్వు మొదట చేసిందే తప్పు! డాక్టరమ్మ ధర్మంగా నడిచింది. ఆవిడ చేసిన ధర్మమే ఆవిడ్ని కాపాడింది. వెళ్ళు... ఆవిడకు క్షమాపణలు చెప్పు." అంది మంగి.

        రంగడికి భార్య కనిపించిందన్న ఆనందం ఒకవైపు, డాక్టరమ్మ పూర్తిగా చెప్పబోయేది వినకుండా ఆమెను హత్యచెయ్యడానికి ప్రయత్నించిన తన తొందరపాటు తనానికి ఆవేదన ఒకేసారి కలిగాయి. పరితాపంతో రంగడి మనసు దహించుకుపోతోంది. ఆమె ధర్మం పక్షాన నిలిచింది. తనే ఇప్పటివరకూ ఎన్నో నేరాలు చేసి పాపం మూట గట్టుకున్నాడు. దేవతలాంటి డాక్టర్ హారికను కూడా హత్య చెయ్యబోయ్యాడు. పశ్చాత్తాపంతో అతని కళ్ళంట నీళ్ళు వెలుపడ్డాయి. డాక్టర్ హారిక కాళ్ళపై పడ్డాడు.

        "డాక్టరమ్మా! నన్ను క్షమించు! నేను ఎన్నో పాపాలు చేసాను. నాకు శిక్ష పడవలసిందే! నా భార్యాబిడ్డలు ఏమయ్యారో అన్న అవేదనతొ ఇంగిత జ్ఞానం కోల్పోయి మిమ్మల్ని చంపాలనుకున్నాను. నేనిప్పుడే వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. మీలాంటి మంచి మనుషులుండగా నా వాళ్ళకి ఈ లోకంలో లోటేంటి?" కన్నీళ్ళతో ఆమె పాదాలు కడిగాడు. భార్యవైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూసాడు.

        "మంగీ, నీకు మాటిస్తున్నాను. నాలో పూర్తిగా పరివర్తన వచ్చింది. జైలు నుండి నేను మారిన రంగడిగానే తిరిగి వస్తాను." అన్నాడు.

        మంగి కళ్ళు కూడా చెమర్చాయి. "మావా.." అంటూ రంగడ్ని హత్తుకుపోయిందామె.

         ******

Comentar

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)