జీవన నౌక
జీవన నౌక (Author: P. L. N. మంగారత్నం)
ఆ సాయంత్రం కనుచీకటి పడే వేళ..
వాళ్లందరూ ఫిషింగ్ హార్బర్ సమీపాన సమావేశం అయ్యారు. అక్కడ మర బోట్లూ, పెద్దా, చిన్నా పడవలూ అనేకానేకం విశ్రాంతి తీసుకుంటున్నాయి. అందరూ అందరికీ వరసైన వాళ్ళే.
వాళ్లలో పెద్ద అయిన వీరబాబు అన్నాడు “రేపు గురువారం తెల్లారగట్ల మన పెయాణం. అందరూ నాలుగు అవకుండా వచ్చెయ్యాల” చెప్పాడు.
అలాగే అన్నట్టు తలూపారు వాళ్ళు. వాళ్ళంతా కలిసి పదకొండు మంది. డ్రైవర్ ‘నాగురు’ తో సహా.
వాళ్ళలో వీరబాబు మేనల్లుడు అయిన బుజ్జిబాబు “మొన్నటిలా కానివ్వకు గంగమ్మ తల్లీ.. ఈ సారి కాస్త కరుణించు. ఎవ్వరికీ ఏ కష్టం రానివ్వకుండా చూడు” అంటూ దణ్ణం పెట్టాడు ఎదురుగా కనబడుతున్న అఖండ జలరాశిని చూస్తూ.
ఆ జల ఘోష సాయం సంధ్యకు తోడయ్యింది. పశ్చిమానికి దిగిపోతున్న సూర్యబింబం అలలు అలలుగా కదులుతూ కనువిందు చేస్తుంది.
“ఒక్కోసారి అంతే రా! అలా జరుగుతూ ఉంటాయి. ఎదుటివాళ్ళు కట్టంలో ఉన్నప్పుడు తోటి మానవులుగా మనం సహాయం చెయ్యాల. మనకే గనుక అలాంటి ఆపద వత్తే ఎదుటి వాళ్ళు మాత్రం వదిలేత్తారా? అసలు మన కట్టుబాట్లు ఏమిటి? మనకి మనం తోడుండాలనే కదా!” చెప్పాడు ధనరాజు అనునయంగా.
“అంతేలే! మాయ్యా! మన ప్రయత్నంతో పాటు. పైన దేవుడున్నాడు“ నవ్వాడు బుజ్జిబాబు.
“అంతే, కదా! మరి” ఆ మాటకు కనబడని దేవునికి చేతులెత్తి మొక్కాడు వీరబాబు గతాన్ని మననం చేసుకుంటూ.
***
సరిగ్గా రెండు రోజుల క్రిందట..
మర బోటులో వీరబాబు బృందానికి వేట బాగానే సాగుతుంది. సముద్రం. ఓ నాలుగు సార్లు వల కూడా వేశారు. తీరానికి పది కిలోమీటర్ల దూరంలో, చేపల కన్నా ప్లాస్టిక్ కాగితాలూ, నీళ్ల బాటిళ్ళ చెత్తే ఎక్కువ పడింది. అలాగే పాములూ, జెల్లీ చేపలు కూడా.
వారిలో చిన్నవాడూ బలమైన వాడూ అయిన ‘ఎసేబు’ పాముల్ని కర్ర మీద వేసుకుని తిరిగి నీళ్లలో పడేస్తున్నాడు.
మిగిలిన వాళ్ళు దిలాసాగా కబుర్లు చెప్పకుంటూ.. వాటిలో ఉన్న చేపలూ, రొయ్యలూ, పీతల్ని వేరు చేస్తూ కుప్పలుగా పేరుస్తూ, అలాగే, సైజుల వారీగా గ్రేడింగు కూడా చేసేకుంటారు.
అక్కరలేనివి అన్నీ మళ్ళీ నీళ్ళలోకే వదిలేస్తున్నారు.
అలా ముందుకు వెళుతున్న కొద్ది వాళ్ళకి, చేపలు బాగానే దొరుతున్నాయి. వేట ఇంకా ముందుకు సాగుతుంది అనుకుంటుండగా..
మధ్యాహ్ననికి..
వాళ్ళ కన్నా గంట ముందుగా..
బయలుదేరిన ‘పాలెపు భోజరాజు’ బోటు నుంచి ఫోను.
“మేము ప్రమాదంలో చిక్కుకున్నాం బాబాయ్! మా బోటుకు ముందున్న చక్రంలో నీటిలో తేలివస్తున్న గుడ్డ ఏదో చిక్కుకుపోయింది. అది తిరగడం లేదు. దాన్నితీసే వీలులేదు. ఇంజను నడవడం లేదు. బోటు గాలివాలుగా మాత్రమే కదులుతుంది” అంటూ గాబరాగా చెప్పాడు భోజరాజు చిన్న కొడుకు గంగాధరం.
“అలాగా! ఉండండి.. మా బుజ్జిగాడికి ఫోను ఇస్తాను మాట్లాడండి” అంటూ బోటు అంచుకి నిలబడి వల లాగుతున్న బుజ్జిబాబు దగ్గరకు వెళ్లి ఫోను అందించాడు వీరబాబు.
తన కన్నా కాస్త చదువుకున్న మేనల్లుడు నయం అని.
ఫోను అందుకున్న బుజ్జి “ఎంత దూరంలో ఉన్నారు బావా! మీరు? అలా బోటు గాలికి కొట్టక పోతుంది అనుకోకపొతే, లంగరు వదలక పోయారా? కొంత ఆగేది కదా!” అంటూ సలహా కూడా ఇచ్చాడు చుట్టూ కలియ చూస్తూ.
“లంగర్ లేదు మా కాడ. ఇట్ట జరుగుతుందని అనుకోలా“ చెప్పాడు గంగాధరం బాధగా.
“ఎక్కడున్నారు? ఇప్పుడు” అడిగాడు బుజ్జి.
“మీకు దగ్గర లోనే.. మీ తెరచాప మాకు కనిపిస్తుంది. మీ వెనక్కి చూడండి. కనిపిస్తాం” చెప్పాడు గంగాధరం.
వెనుదిరిగి చూస్తే, దూరంగా ‘పసుపురంగు’ లో ఉన్న బోటు చిన్న కాగితం పడవలా అలల మీద తేలియాడుతూ ఉంది.“అల్లదిగో.. అల్లదిగో” చెయ్యి పెట్టి చూపించారు మిగిలిన వాళ్ళు. మిమ్మల్ని చూసాం అన్నట్లు చేతులు కూడా ఊపసాగారు.
దాంతో.. వాళ్ళూ ఉత్సహంతో చేతులు ఊపసాగారు. మొత్తం ఓ అరడజను మంది ఉన్నారు వాళ్ళు.
జరుగుతున్న కలకలాన్ని చూసి.. “ఏం జరిగిందట” ఆసక్తిగా అడిగాడు నాగురు. స్టీరింగు పట్టుకుని తన కేబిన్లో కూర్చున్నా పరిసరాల్ని గమనించుకునే ఆవశ్యకత ఉన్నందున.
“ఆ ‘భోజి నాన్న’ వాళ్ళ బోటుకు ముందున్న చక్రంలో ఏదో గుడ్డ చిక్కుకుపోయి తిరగడం లేదంట. స్టీరింగు తిప్పడానికి వీలుకావడం లేద౦ట. నడిపినదాకా ఉంటే చక్రం విరిగిపోవచ్చని భయపడుతున్నారు. అందుకు మనం అక్కడికి వెళ్ళి ‘తాడు’ అందించాల” చెప్పాడు బుజ్జిబాబు.
ఆ మాటకి ఇంజను నెమ్మది చేసాడు నాగూరు.
“సరే! బోటు అటుగా పోనివ్వు. ఈరోజు వేట ఇంతటితో సరి. వాళ్ళని ఒడ్డుకి చేరిస్తే, మనమూ చేరుకున్నట్లే” చెప్పాడు.
నిరాశ పడ్డారు నూకరాజు, సత్యనారాయణా, ఏసేబులు ‘ ఏదో! నాలుగు డబ్బులు వస్తాయనుకుంటే, ఇలా జరుగుతుందా? ఈరోజు అని. దొరికిన వేటను అందరూ సమానంగా పంచుకుంటారు డ్రైవరుతో సహా. అందులో డీజిలు ఖర్చులు అదనం.
నెమ్మదిగా వంపు తీసుకున్న వీరబాబు బోటు..
ఆ పసుపురంగు బోటు వైపు దారి తీసింది.
వాళ్ళ బ్రతుకులకి భరోసా దక్కిందన్న ఆనందంలో ఉన్నారు వాళ్ళు.
గాలివాలుగా కొట్టు కెళ్ళే ఆ బోటుని చేరుకోవడానికి వీరబాబు బోటుకు కాస్త సమయం పట్టింది. ఎందుకంటే, దీని అలల అలజడికి అది మరింతగా ముందుకు పోతూ జరిగిపోతుంది.
అయినా, దగ్గరగా వెళ్ళి ఒక పొడవాటి తాడు తీసుకుని, బలంగా ఆ బోటులోకి విసిరాడు ముందుగా ఉన్న సత్యనారాయణ.
ఒకటికి రెండు సార్లు వెయ్యడంతో అందుకున్నారు వాళ్ళు. దాన్ని జాగ్రత్తగా బోటుకున్న ఒక ఇనుప కమ్మీకి కట్టేశారు. ఇక భయం లేదన్నట్లు. నెమ్మదిగా రెండు బొట్లూ ఒకదాని వెంట ఒకటి.. ఒడ్డుకి ప్రయాణం సాగించారు. అలా జరిగిపోయింది ఆ రోజు అంటూ మననం చేసుకున్నాడు వీరబాబు.
***
ముందుగా అనుకున్నట్లుగానే..
గురువారం తెల్లవారుజామున షిప్పింగ్ హార్బర్ నుంచి బయలుదేరింది వీరబాబు బోటు కోరంగి, తాళ్ళరేవు మీదుగా ప్రయాణం చేసి భైరవపాలెం చేరుకుంది.
భైరవపాలెం చుట్టూ నీరే, కావడంతో చేపలు దండిగానే పడతాయని.. అక్కడ ఒక పెద్ద వలను వేసి మరింత ముందుకు వెళ్లారు.
వాళ్ళు ముందుకు వెళుతున్నకొద్దీ మత్స్య సంపదకి లోటు లేదన్నట్టు పడుతున్నాయి చేపలు. వలలు వేసేవాళ్ళు వేస్తుండగా.. తీసేవాళ్ళు తీస్తున్నారు. వంటకు కూర్చున్నాడు ఆదికేశవులు. చేసేది చేపల కూరే. భోజనాల తరువాతా సాగుతూనే ఉంది వేట. నాగూరు కాస్సేపు బయటకి వస్తే.. స్టీరింగు అందుకుంటాడు సత్యనారాయణ.
చేపలు దండిగా పడుతున్నాయి. ముందురోజు అర్ధాంతరంగా వేట ముగిసినందుకు.. ఈరోజు అవీ, ఇవీ కలిపి పడ్డాయిలే అన్నంత సంతోషంగా ఉంది. ఆ నిశీధిలో ఉల్లాసంగా.. ఉత్చాహంగా సాగిపోతుంటే, చల్లనిగాలీ తోడయ్యింది.
ఇంతలో.. బోటులో ఉన్న ‘వైర్ లెస్ సెట్’ మోగింది. అంటే, సెల్ సిగ్నల్స్ అందనంత దూరంలో వచ్చేసారన్న మాట. అది కోస్ట్ గార్డ్ బోటు నుంచి వస్తున్న ప్రసారం.
అప్పుడు గడియారంలో సమయం.. తెల్లవారుఝాము ఉదయం మూడున్నర చూపిస్తుంది. అంటే, శుక్రవారం లోకి వచ్చేశారు.
ఈ సమయంలో ‘వైర్లెస్ సెట్’ మ్రోగడం ఏమిటబ్బా! అనుకుంటూ అదిరే గుండెలతో పలికాడు బుజ్జి“ సార్!“ అంటూ.
“మీరెక్కడ ఉన్నారు?” అడిగాడు ఆఫీసరు.
“మేము చాలా దూరం వచ్చేసాము సార్! నిన్న తెల్లవారుఝామున బయలుదేరాం. వంద నాటికల్ మైళ్ళ పైన దాటే ఉంటాం” చెప్పాడు బుజ్జిబాబు.
“ఇప్పుడే, వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జరీ చేసింది. ఎవ్వరూ వేటకు వెళ్ళ కూడదనీ.. సముద్రంలో వేటాడ కూడదని, కాబట్టి, మీరు వెంటనే, దగ్గర ఉన్న తీరాలికి వెళ్లిపోవాలి. ఇంకా మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే.. వాళ్ళకీ సమాచారం ఇవ్వండి” అంటూ చెప్పాడు ఆఫీసరు.
ఆ మాటలకి అయోమయంగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. వైర్ లెస్ సెట్లో మాటలు బయటకే వినిపిస్తాయి. సముద్రం ప్రశాంతంగానే, ఎప్పటిలానే ఉంది.
“మరో బోటు ఏదీ మాకు తగల్లేదు సార్!“ చెప్పాడు బుజ్జిబాబు చుట్టూ పరికించి చూస్తూ.
“సరే! మీరైతే, వెనక్కి వెళ్ళిపొండి” మరోసారి హెచ్చరించాడు ఆఫీసరు.
“అలాగే. సార్!” చెప్పాడు బుజ్జిబాబు.
***
అలా వెనక్కి వెళ్ళే క్రమంలో.. బోటుని, ముందుగా వల వేసి ఉంచిన ‘భైరవపాలెం’ వైపు పోనిచ్చాడు. అది కూడా తీసేసుకుంటే, ఇక వచ్చిన చోటుకే వెళ్లి పోవచ్చని.
అక్కడా భారీగానే చేపల పడ్డాయి. ఆ భారీ వలను లాగడానికి చాలా ప్రయాస పడవలసి వచ్చింది. పైనున్న కప్పీకి తాడు వేసి మరీ నలుగురు కలిసి లాగుతున్నారు.
అయినా అంత తేలికగా లేవడం లేదు. నిండుగా, బరువుగా ఉంది. అలా వల లాగే క్రమంలో.. అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజను నుంచి.. టాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి ‘డీజిలు’ పైకి ఎగ జిమ్మడంతో.. ఆ గొట్టాల పరిసరాలు అన్నీ ఇంధనంతో తడిచి.. తెలియకుండా మంటలు అంటుకున్నాయి. సముద్రపు రాకాసి అలలను.. తలదన్నే ఎత్తు ఉన్న ‘అగ్నికీలలు’ ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెర పోయారు. ఆ కీలలు తమ బోటు నుంచి అని తెలిసేలోపే, మంటల్లో చిక్కుకున్నారు.
అంతులేని మత్యసంపదతో తీరానికి చేరుకుంటున్నామన్న ఆనందం ఎంతసేపో నిలవలేదు. క్షణాల మీద తలరాత మారిపోయినట్లు మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యుఒడి లోకి చేరుకున్నట్లు అయ్యింది. హాహాకారాలు చేసారు.
వలను అలాగే వదిలేసి.. అందరూ తలో దిక్కుకూ తప్పుకున్నారు. కకావికలమైన మనసుతో చుట్టూ పరికించారు. కనుచూపు మేర ఏ సహాయమూ కనిపించలేదు.
ఆ మంటలు దావాలనంలా వ్యాపించి.. ఇంజను నుంచి బోటు అంతటకూ వ్యాపించసాగాయి. వలలన్నీ మండిపోయి, మత్యసంపద నీటిపాలు అయ్యింది. చుట్టూ అంతా చీకటి. సముద్రం తనదైన రీతిలో ఘోష పెడుతూ ఎగసి పడుతుంది. అంతకంతకూ మంటలు చుట్టుముడుతుంటే..
ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్తితిలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ‘ లైఫ్ జాకెట్లు’ వేసుకుని అంతా సముద్రంలోకి దూకేశారు.
“గంగమ్మ తల్లీ! వచ్చేటపుడు నీకు మొక్కే వచ్చాం కదా! మమ్మల్ని ఇలా నట్టేట మున్చేస్తావా?” కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆదినారాయణ. అతనికి భార్యా పిల్లలు గుర్తుకు వచ్చి.
“భయపడకు. ఇలాంటి సమయంలోనే, మనం ధైర్నంగా ఉండాల. ఏదైతే, అదే అవుతుంది. మనం చివ్వరి వరకూ పోరాడాల. అన్నిటికీ పై నున్న భాగమంతుడే ఉన్నాడు” అంటూ ఆదినారాయణ ధైర్య వచనాలు పలికాడు వీరబాబు.
అప్పటి వరకూ ఉన్న బోటు మండే ‘దీపశిఖ’ లా పరశురామ ప్రీతి అయిపోతుంటే,.. ప్రాణాలు దక్కాయని సంతోషపడ్డారు.
***
నీటి మీద తేలుతూ అలా ఎంతసేపు ఉన్నారో వాళ్లకే తెలియదు.
ఓ గంట తరువాత..
అటుగా వచ్చిన ఓ మత్స్యకారుల బోటు’ వారికి ఆపన్నహస్తం అందించి బోటులోకి చేర్చుకుని, తిండీ, నీరూ ఇచ్చి ఆదుకున్నారు. అయితే, వాళ్ళ గమ్యాలు వేరుకావడంతో..
కోస్ట్ గార్డులకు సమాచారం అందించారు.
కాస్సేపటికి..
కార్పొరేట్ వారి బోటు వాళ్ళ కోసం రావడంతో, వారందరూ ఈ బోటు నుంచి.. ఆ బోటులోకి చేరుకుని, అందరికీ చేతులు జోడించారు ఆనందభాష్పాలతో.
“మనలో మనకు ఏమిటన్నా! మనందరమూ గంగ పుత్రులమే. కష్టం అంటూ వస్తే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవలసిందే” చెప్పాడు అంతర్వేది బోటు పెద్ద వీరేశం.
వారిని గమ్యం చేర్చే దిశగా ఆ కార్పొరేటు బోటు ‘కాకినాడ పోర్టు’ వైపు పయనమవడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు కనిపించని దేవుడికి దండాలు పెట్టుకుంటూ.
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)