చిరస్మరణీయం  (Author: మొహమ్మద్ అఫ్సర వలీషా)

కొన్ని బంధాలకు కొలమానాలు ఉండవు

ఎన్ని అవాంతరాలు ఎదురైనా

ఉత్సాహ గీతం పాడుతూనే ఉంటాయి... 

 

శిలలకు, అలలకు ఎంతటి అవినాభావ సంబంధం

అవి ఎడబాటు ఎరుగని ప్రేమికుల్లా ఉంటాయి... 

 

ఎల్లవేళలా అలసట మరచి

ఉవ్వెత్తున గాలిలో ఎగురుతూ, గంతులేస్తూ అల

ఎప్పుడు వచ్చి నన్ను తన కౌగిట్లో బంధిస్తుందా అని

ఎదురు చూపులతో శిల

ఒకరి కోసం ఒకరు ఎంతలా తహతహ లాడుతూ ఎదురు చూస్తుంటాయి ... 

 

ఒకరు తెలుపు,  మరొకరు నలుపు

వర్ణ వివక్ష లేని ఆ బంధం 

నలుగురికి ఆదర్శంగా

నీవు లేక నేను లేనంతగా

ఎంతలా కలిసి మెలసి ఉంటాయి... 

 

శిల ఏ ఆకారములో నున్నా ఇష్టమే అలకు

అల ఎంతలా ఎలా ఎగిసి పడినా నష్టం లేదు శిలకు

జన్మ జన్మల బంధం వాటివి

ఒకరికొకరు ఎలా ఉన్నా మాకు కష్టం లేదంటాయి... 

 

మాటలు రాని శిలంటే ఎంత ముద్దో అలకు

పగలంతా చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టే అలంటే ఎంత ప్రీతి శిలకు

వారి అనోన్యతకు అందరూ ఫిదానే

ఏమిటో ఆ బంధానికి ఏ పేర్లు ఉంటాయి... 

 

ఎన్నో చదువులు చదివి విజ్ఞాన సంపద ఆర్జించినా

అర్ధం చేసుకునే మనసులు ఉన్నా

అవివేకంతో, క్షణికావశాలతో, 

కోప తాపాలతో తమ విలువైన జీవితాలను

వినాశనానికి దారి తీసుకునే జంటలకు

అల పట్టుదల, శిల ఓర్పులు సదా చిరస్మరణీయం కాదా… !! 

Comentar