కాంతి  (Author: అప్పరాజు నాగ జ్యోతి)

అది తెలంగాణా రాష్ట్రంలోని మారుమూలప్రాంతాన ఉన్న కుగ్రామం.

ఆ గ్రామంలో వసతులన్నీ అరకొరగానే వున్నా, ఒక పోస్టాఫీసు, దానిని ఆనుకునే ప్రభుత్వపాఠశాల వున్నాయి. అవడానికది బాల, బాలికల పాఠశాలే అయినా అక్కడ చదువుకునేది మాత్రం కేవలం మగపిల్లలే, ఎందుకంటే ఆ ఊళ్ళోని పురుషులంతా కూడా ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి‘ అన్న మనుసూక్తికి ప్రతీకలు! వాళ్ళ దృష్ఠిలో స్త్రీ అంటే పురుషుల చెప్పుచేతల్లో వుంటూ వారి అవసరాలన్నీ కనిపెట్టుకుని వుండే ఒక అల్పజీవి మాత్రమే. స్త్రీలకి విద్య ఎంతమాత్రమూ అవసరం లేదన్నది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ ఊళ్ళో ఆడపిల్లలని బడికి పంపరు, చదివించరు. దాంతో తరతరాలుగా అక్కడి స్త్రీలందరూ కూడా నిరక్షరాస్యులుగానే ఉండిపోయారు.

అలాంటి ఫక్తు పురుషస్వామ్యం కొలువున్న ఆ ఊళ్ళోకి కాపురానికి వచ్చింది కొండయ్యని మనువాడిన అలివేలు.

తమ ఊళ్ళోని మునిసిపాలిటీ బళ్ళో ఏడోతరగతిదాకా చదివింది అలివేలు. ఆ తర్వాత పై చదువుకోసం ఆడపిల్లని పై ఊరు పంపించడం ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు కూతురు పుష్పవతి కాగానే కొండయ్యతో ముడేసి కాపురానికి పంపించేసారు. అలా పై చదువులు చదవాలన్న అలివేలు కోరిక అక్కడితో సమాధి అయిపొయింది.

మనువాడిన మగడి వెంట ఆ ఊరికి వచ్చిన కొద్దిరోజుల్లోనే అక్కడి మగవారి పెత్తనమూ, ఆడవారి దుస్థితీ అలివేలుకి బాగా అర్థమయాయి.

పగలంతా పొలంలో కష్టపడి కూలిపని చేసే కొండయ్య, సాయంత్రమవగానే ఆ కూలిడబ్బుతో సారాదుకాణానికి చేరుకుంటాడు. ఆ పైన అర్థరాత్రివేళకి తూలుతూ కొంపకి చేరుకుని పెళ్ళాం పైనపడి ఆబగా తన కోర్కె తీర్చుకుని సోలిపోయి తొంగుంటాడు. ఒక్క కొండయ్య అనే కాదు, అక్కడ మగాళ్ళందరి వరసా అదే!

కుట్టుమిషను పైన బట్టలు కుట్టగా వచ్చే డబ్బుతోనే అలివేలు యిల్లు నడుపుతోంది.

***

పెళ్ళైన ఏడాదికి అలివేలు నీళ్ళోసుకుంది. తొలిచూలు ఆడపిల్ల పుట్టగా ఆ ఊళ్ళోని ఆడోళ్ళందరి బతుకుల్లో తన బిడ్డ వెలుగులు కురిపించాలన్న ఆశతో, పాపకి ‘ కాంతి ’ అన్న పేరు పెట్టింది అలివేలు.

ఆ పై ఏడు కలిగిన మగ నలుసుని చూసి మురిసిపోయిన కొండయ్య, ఆ పిల్లోడికి ‘ రాజు ’ అన్న పేరు పెట్టుకుని ‘ ఈడు నా వొంశెం నిలబెట్టే మగబిడ్డ‘  అంటూ కొడుకుని కాలు క్రింద పెట్టకుండా గారాబంగా చూసుకోసాగాడు.

***

తన చదువు ఏడో తరగతితోనే ఆగిపోయినా కూతురిని మాత్రం పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డ అలివేలు, కూతురికి నాలుగేళ్ళు నిండుతుండగా భయంభయంగానే మొగుడిని అడిగింది.

“ సామీ, మన కాంతిని బడికి పంపి సదివిస్తే బాగుం.... “

ఆమె మాట పూర్తికాకుండానే కొండయ్య అంతెత్తున ఎగిరాడు.

“ ఆడోళ్ళని సదివించుడేందే! పెయ్య మీన సోసుండే మాటాడుతున్నవా నువ్వు ? “

“ అదికాదయ్యా... “

“ యింకోపాలి ఇదే సెప్పినవంటే అమ్మాకూతుళ్లిద్దరినీ అడ్డంగా నరికేస్తా “ అంటూ ఆవేశంతో రంకెలేసాడు కొండయ్య.

ఈఊళ్ళో పుట్టిపెరిగి, పురుషాహంకారాన్ని నరనరాలా జీర్ణించుకున్న తన మొగుడు కూతురిని సదివించడని అలివేలుకి బాగా అర్థమయింది. ఎలాగైనా కూతురిని విద్యావంతురాలిని చేయాలన్న పట్టుదలతో వున్న అలివేలు వెంటనే తన తల్లిదండ్రులతో సంప్రదించి ఒక పథకం వేసింది.

నాలుగురోజుల తర్వాత మొగుడు జరంత నిమ్మళంగ ఉన్న సమయంలో మెల్లిగా ఒళ్లో చేరి “ సామీ, మన రాజు సానా బక్కగున్నడు, ఒళ్ళు సేత్తలేడు. ఆడ్ని ప్రత్యేకంగ సూసుకోవాలని డాక్టరమ్మ సెప్పింది. నాకేమో ఇద్దరు పసిబిడ్డలని ఒంటిసేత్తో నిభాయించుడు అయితలేదు. గందుకే సెబుతున్న మల్ల, మన పెద్దబొట్టి కాంతిని మా అయ్య కాడికి పంపినమంటే నాకు సెయ్యి తీరికయ్యుద్ది. గప్పుడు రాజుని పుష్టిగ సేసేందుకు, బాగ సూసేందుకు కుదురుద్ది. ఏమంటవు సామీ ? “

కొడుకుకోసమనగానే పొంగిపోయిన కొండయ్య భార్య చెప్పినదానికి సంతోషంగ ఒప్పుకున్నాడు.

కూతురిని అంత పసివయసులోనే విడిచిపెట్టవలసి వస్తున్నందుకు మనసులో బాధగా వున్నా పిల్ల మేలుకొరకే కదాని తనకి తానే నచ్చజెప్పుకుని గుండె దిటవు చేసుకుని, ఆ మరుసటి దినమే బస్సులో పుట్టింటికి వెళ్లి అక్కడ కూతురిని దిగబెట్టి కళ్ళనీళ్ళతో తిరిగి ఊరుకి చేరుకుంది అలివేలు.

అలా అమ్మమ్మగారి ఊళ్ళో బడిలో చేరిన కాంతి, తల్లి ఆశలకు తగినట్లుగానే శ్రద్ధగా చదువుకోసాగింది.

ఇప్పుడు ఆ ఊళ్ళో పదవతరగతి వరకూ ఉండడంతో ఆమె చదువు పదవతరగతిదాకా నిరాటంకంగా సాగింది.

పదవతరగతిలో కాంతి బడి మొత్తానికి ప్రథమ స్థానంలో నిలవడంతో అలివేలు ఆనందానికి అవధుల్లేవు.

కూతురినెలాగైనా సరే పట్నానికి పంపించి పై చదువులు చదివించాలని ఆరాటపడింది ఆ తల్లి మనసు. అయితే ఆమె ఆశలపై నీళ్ళు చల్లేస్తూ కూతురికి పెళ్లిసంబంధాలని వెతకడం మొదలెట్టాడు కొండయ్య. పద్దెనిమిదేళ్ళు నిండని పిల్లకి అప్పుడే పెళ్లేమిటంటూ అలివేలు నెత్తీనోరూ కొట్టుకున్నా కొండయ్య ఆమె మాట వినలేదు.

“మొండివాడు, అన్నంత పనీ చేస్తాడీడు. ఇప్పుడు గనక కాంతికి మనువు సేసినాడంటే ఇంక దాని బతుకూ నా బతుకులాగే బుగ్గవుద్ది. ఏం చేయాలిరా దేముడా “ అనుకుంటూ తలపట్టుకుంది అలివేలు.

***

కాంతి కేవలం చదువులోనే కాదు, అన్నింటిలోనూ చురుకైన పిల్ల. చిన్నతనంనుండీ తమ యింట్లోనూ, ఊళ్ళోనూ  ఆడపిల్లలపట్ల అంతా చూపుతున్న తేడాని గమనిస్తూ వస్తోంది. ఈ లింగవివక్షతని రూపుమాపి ఆడా, మగా సమానమవాలంటే “చదువొక్కటే ఆయుధం” అని గ్రహించింది. అందుకే కేవలం తరగతి పుస్తకాలే కాకుండా, బళ్ళో గ్రంథాలయంలో వున్న వ్యక్తిత్వవికాసపుస్తకాలూ, వార్తాపత్రికలూ క్షుణ్ణంగా చదివింది, అర్థం చేసుకుంది. గాంధీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వివేకానందుడు లాంటి గొప్పవాళ్ళ జీవితచరిత్రలని చదివి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.

తండ్రి తన పైచదువులకి మోకాలడ్డం పెడుతూ వివాహప్రయత్నాలు మొదలెట్టాడని తెలియగానే, సగటు ఆడపిల్లలాగా ఏడుస్తూ కూర్చోకుండా ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుని, తను చదువుకున్న బడికివెళ్లి అక్కడి ప్రధానోపాద్యాయుడిని కలిసి విషయమంతా వివరించింది.  

“మాస్టారూ, మా నాన్నకి ఎదురొడ్డి నా మనువు ప్రయత్నాలనాపి పైచదువులకోసం నేను కాలేజీలో చేరడమనేది కల్ల. అలాగని నా చదువుని యిక్కడితో ఆపేయలేను. కాబట్టి నేను యింట్లోనే వుండి ప్రైవేటుగా చదువుకోవాలనుకుంటున్నాను. దయచేసి, మా నాన్నకి తెలియకుండా మీరు నాచదువుకి కావలసిన ఏర్పాట్లని చేయగలరా ?“

ఆ చిన్నారికి చదువుపట్ల వున్న తపననీ, ఆరాటాన్నీ  చూసి ముగ్దుడయిన ఆ ఆచార్యుడు “నువ్వు ప్రైవేటుగా చదివేందుకు కావలిసిన పుస్తకాలు, ఫీజులు అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటానమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండు“ అంటూ అభయమిచ్చాడు. ఆ శుభవార్తని యింటికి వచ్చి అమ్మతో పంచుకుంది కాంతి.

కూతురి చదువు సమస్య యిలా పరిష్కారమైనందుకు సంతోషించిన అలివేలు మెదడుని అంతలోనే మరో ఆలోచన తొలిచేసింది.

“ పదోతరగతిదాకా అమ్మమ్మ ఇంట్లో వుండి సదివింది కాబట్టి సరిపోయే. మల్ల గిప్పుడేమో ఇంట్లనే పుస్తకాలెట్టుకుని అది సదువుకుంటుంటే అది సూసి నా మొగుడు ఊరుకుంటడా? ఆ పుస్తకాలని సింపి పోగులెడతడు, బిడ్డ పీక పిసికి సంపినా సంపుతడు. పోనీ కాంతిని మళ్ళీ అమ్మకాడికే పంపుదమంటేనేమో బిడ్డకి సమ్మందాలు సూసుడు మొదలెట్టినాక దాన్ని యాడికీ పంపనీడాయె! ఆడికి తెలీకుండా దీన్ని సదివించేది ఎట్టాగబ్బా, ముందర ఈ పెళ్లిసమ్మందాల గోల ఆపేదెలా దేముడా “ అంటూ అలివేలు ఆలోచిస్తుండగా, చటుక్కున వెనకవీధిలో ఉండే సరస్వతమ్మ ఆమె మనసులో మెదిలింది.

సరస్వతమ్మకి చిన్నతనంలోనే పెళ్లైంది. పిల్లల్లేరు. రెండేళ్ళ క్రితం ఏదో జబ్బు చేసి ఆమె భర్త చనిపోవడంతో అతని పేరిట వున్న నాలుగెకరాల పొలాన్నీ కౌలుకిచ్చి, ఆ వచ్చే ఆదాయంతో సొంత యింట్లో వుంటూ కాలంగడుపుతోందామె. చదువుకోకపోయినా మంచి లోకజ్ఞానం ఉందామెకి. పైగా పరోపకార బుద్ధి గల మనిషి.

కాంతిని తీసుకుని సరస్వతమ్మ యింటికి వెళ్లి ఆమె సాయాన్ని కోరింది అలివేలు.

“గిందులో గంత ఘనం సోచాయించేదేంది అలివేలూ. కాంతిని నాకు సాయంగా వుంటూ ఈడనే చదువుకోమను. సదువుకునే పిల్లలంటే నాకు శానా ఇట్టం. దాని సదువు ఖర్సులన్నీ నానే పెట్టుకునుడే కాకుండా జీతం కూడా ఇస్తలే. నాకెట్టాలాగూ పిల్లల్లేరు. ఈ డబ్బు నీ కూతురికైనా ఉపయోగపడితే నాకంతే సాలు“ అన్న సరస్వతమ్మ ఉదారబుద్ధికి చేతులెత్తి ఆమెకి దండం పెట్టారు కాంతి, అలివేలూ.

ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి మంచి సమయం చూసుకుని కొండయ్యతో చెప్పింది అలివేలు.

“అయ్యా, మన రాజు పదోక్లాసు ప్యాసయినంక ఆడ్ని పట్నం పంపి పైసదువులు సదివించాల, ఆడు పెద్ద ఉద్యోగం సేసి దొర బాబులాగుండాలన్నదే మన ఆశ కదా! మరి ఇట్టాంటి సమయంలో కాంతి పెళ్లి సేస్తే మనకాడున్న డబ్బులన్నీ దాని మనువుకే ఖర్సయిపోతయి. గందుకే నేనొక్కమాట సెబుతా, ఇనుకో. కొన్నిదినాలు కాంతిని యాడన్నా పనికి పెట్టినమంటే మంచిగ డబ్బులు జమవుతయి. గా డబ్బుల్ని రాజు సదువుకీ, కాంతి మనువుకీ వాడొచ్చు. మన ఇంటెనకే వుండే సరస్వతమ్మకి వొయసైపోతాందిగా, సేతి సాయానికి గామె ఆడమడిసి కోసం సూస్తాంది. కాంతిని ఆమె కాడికి పంపితే మస్తు జీతం ఇస్తది. నువ్వు ఊ అంటే నేనెల్లి ఆ అమ్మితోటి మాటాడతా మల్లా “

కొడుకుకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమనే కొండయ్య వెంటనే అలివేలు చెప్పినదానికి ఒప్పుకున్నాడు.

అలా ప్రధానోపాధ్యాయుని సహకారంతో, సరస్వతమ్మ యింట్లో కాంతి యింటర్ చదువు మొదలైంది.

***

ఆడపిల్ల కాంతి తన చదువు కోసం యింతలా తాపత్రయపడుతుంటే, రాజు మాత్రం వాళ్ళ నాన్న చేసిన గారాబం మూలంగా ఒట్టి జులాయిలా తయారయ్యాడు. ఊళ్ళో కనిపించిన ప్రతీ ఆడపిల్లనీ చొంగకార్చుకుంటూ చూడడమే కాకుండా వాళ్ళని అల్లరి పెడుతూ ఏడిపిస్తుంటాడు!

ఒకమారు పొలంలో పనిచేస్తున్న పన్నెండేళ్ళ కూలిపిల్లకి మాయ మాటలు చెప్పి, చెట్టు చాటుకి తీసుకెళ్ళి మానభంగం చేయబోతుంటే, అదేసమయానికి అటుగా వస్తున్న కాంతి, అది చూసి తమ్ముడి చెంపలు వాయించి లాక్కుని యింటికి తీసుకొచ్చి తల్లితండ్రులకి జరిగిన విషయం చెప్పింది.

వెంటనే కాంతి చెంప మీద తన చేతి అచ్చులు తేలేటట్టుగా కొట్టిన కొండయ్య “ఆడగుంటవి, అణిగిమణిగి ఓ మూలన పడుండు. పెత్తనం సేయమాకు. ఆడు నా కొడుకే, మగాడు. ఆడికి ఎలాక్కావాలంటే అలాగుంటాడు. యింకో తూరి ఆడి విషయంలో యేలు పెట్టినవంటే గమ్మునుండ, జాగ్రత్త “ అంటూ కాంతికే బుద్ధి చెప్పాడు.

అలా తండ్రి యిచ్చిన ప్రోత్సాహంతో రాజు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. అత్తెసరు మార్కులతో ఎలాగో పదవ తరగతి గట్టెక్కిన కొడుకుని కాలేజీ చదువు కోసం దగ్గరలో వున్న పట్నంలో చేర్పించాడు కొండయ్య.

“హమ్మయ్య, ఊరికి పట్టిన పీడ వదిలింది “ అనుకుని ఊపిరి పీల్చుకున్నారు ఊళ్ళో ఎదిగిన ఆడపిల్లలూ, వారి తల్లితండ్రులూను.

పట్నం లో వాడి ఆగడాలకి అడ్డు పెట్టే వారెవ్వరూ లేకపోవడంతో రాజు మరింత పోరంబోకులాగా తయారయ్యాడు. దానికి తోడు గదిలో వీడితో వుండే వీడి స్నేహితులూ వీడికంటే నీచులే కావడంతో వాళ్ళతో కలిసి క్రమేపీ త్రాగుడుకీ, మాదకద్రవ్యాలకీ అలవాటుపడ్డాడు.

***

యింటరు మంచిమార్కులతో పాస్ అయిన కాంతి “ ఊళ్ళో ఉన్న బడిలోనే ఉపాధ్యాయురాలిగా చేరి, ఇక్కడి ఆడపిల్లలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం” అని స్పష్టం చేయడంతో, ప్రధానోపాధ్యాయుడు ఆమె టీచర్ ట్రైనింగ్ చేసేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసారు.

సరస్వతమ్మ సాయంతో  పొరుగూరికి వెళ్లి ప్రాక్టికల్ తరగతులకి హాజరై టీచర్ ట్రైనింగ్ కోర్సుని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కాంతి రెండునెలల తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగం కై ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్యాసయి, ముఖపరీక్షకీ హాజరై ఫలితాలకోసం ఎదురు చూస్తోంది.

***

అప్పుడప్పుడూ సెలవులకి ఊళ్ళోకి వచ్చినా పట్టుమని పదినిముషాలైనా ఇంట్లో వుండని కొడుకు, ఈ మారు వారంరోజులైనా యింటినుండి బైటకి కాలుపెట్టకపోవడంతో ఆశ్చర్యపడింది అలివేలు.

కొడుకు మొహంలో ఎన్నడూ చూడని భయమూ, కంగారూ కనిపిస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానం కలగడంతో అదే విషయాన్ని ఆలోచిస్తూ, ప్రక్కింటి పార్వతమ్మ మనవరాలికి గౌను కుట్టమని యిచ్చిన సిల్క్ గుడ్డని కాగితంచుట్టనుండి తీస్తున్న అలివేలుకి ఆ కాగితంపై కొడుకు ఫోటో కనిపించడంతో వెంటనే కళ్ళకి జోడుని పెట్టుకుంది.

“ ప్రభుత్వపాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న దివ్య అనే పదమూడేళ్ళ బాలికని ఈ ఫోటోలో వున్న ముగ్గురు యువకులు త్రాగిన మత్తులో సాముహికమానభంగం చేయడమే కాకుండా, ఆ బాలిక పొత్తి కడుపులో సీసాతో పొడిచి చంపి, ఆ తరువాత ఆ శవాన్ని మురుక్కాలవలో పడేసి పరారయినారు. పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన వారు వెంటనే ఈ క్రింది ఫోన్ నెంబరుకు తెలియచేయగలరు “.

వార్తని చదివిన అలివేలు కొయ్యబారిపోయింది!

రాజు పోరంబోకేనని తెలిసినా, యింతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోయిందా తల్లిమనసు.

గదిలోకి తొంగిచూస్తే కొడుకు గాఢనిద్రలో వున్నాడు.

ఆ తర్వాత రెండుగంటలకి....

పోలీస్‍జీపు అలివేలు ఇంటి ముందు ఆగింది.

గేటు తీసుకుని లోనికి వస్తున్న పోలీసులని చూస్తూనే పారిపోబోయిన రాజుని రెక్కలు విరిచి పట్టుకుని అతని చేతులకి బేడీలు వేసారు కానిస్టేబుల్స్.

అప్పుడే యింటికి వస్తున్న కొండయ్య పరిగెత్తుకొచ్చి “పోలీసు బాబూ, నా బిడ్డ ఏం సేసిండు? ఆడినెందుకు తీసుకెళ్తన్నరు?“ అని అడగగా పోలీసు యిన్‌స్పెక్టర్ విషయమంతా వివరించాడు.

అంతే, శివాలెత్తిపోయాడు కొండయ్య.

“ఒసేయ్, ఎంతకు తెగించినవే! నా బిడ్డనే పోలీసులకి పట్టిస్తవే, నిన్ను సంపితేగానీ నాకూ, నా కొడుక్కీ పట్టిన శని వదలదు“ అంటూ ఆవేశంగా అలివేలుపైకి కొడవలితో లంఘించాడు కొండయ్య.

సమయానికి అలివేలు ప్రక్కకి జరగడంతో, మెడ మీద పడాల్సిన వేటు ఆమె భుజంపై పడి రక్తం బొటబొటా కారింది. అయినా అలివేలు ఎంతమాత్రమూ బెదరలేదు.

“యిన్‌స్పెక్టర్ గారూ, ఆ ఎదవతో పాటు, నామీద హత్యా ప్రయత్నం సేసినందుకుగాను ఈడిని కూడా జైలుకి తీసుకెళ్ళండి. సమాజానికి పట్టిన చీడ వదులుతుంది. ఎక్కడ సంతకం పెట్టాల్నో సెప్పండి బాబూ, నాను పెడతాను“ అన్న అలివేలువేపు మెచ్చుకోలుగా చూస్తూ కొండయ్యని కస్టడీలోకి తీసుకున్నాడు యిన్‌స్పెక్టర్.

“అమ్మా, నాకు ప్రభుత్వపాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. మన ఊర్ల బడిలోనే నేనింక పాఠాలు చెప్పేది“ అంటూ అప్పుడే సరస్వతమ్మ ఇంటినుండి ఆనందంతో పరిగెత్తుకొచ్చిన కాంతి అక్కడ చేతులకి బేడీలతో వున్న తమ్ముడినీ, తండ్రినీ చూసి నిర్ఘాంతపోయింది.

అంతలోనే తల్లి భుజంనుండీ కారుతున్న రక్తాన్ని గమనించి, గభాల్నతన చీరకొంగుని చింపి గాయానికి గట్టిగా కట్టుకట్టి “ఏంటమ్మా యిదంతా “ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న కాంతిని దగ్గరకి తీసుకుంది అలివేలు.

“అమ్మా కాంతీ, ఈ ఊళ్ళ ఆడపిల్లలందరికీ నువ్వు సదువు సెప్పి ఆళ్ళ బతుకుల్ల కాంతి నింపాలన్న ఆశతోటే నీకా పేరు పెట్టుకున్న. యింతకాలానికి నా కోరిక నెరవేరింది. యిన్‌స్పెక్టర్ బాబూ, నా కూతురు బాగ సదువుకుని మన ఊర్ల బడికే వచ్చిందయ్యా! ఉండండి. మీ అందరి నోర్లూ తీపి చేస్తాను “ అంటూ అలివేలు సంతోషంగా ఇంట్లోకి వెళ్లి స్వీట్లు తెచ్చి అందరికీ పంచింది.

“కాంతీ ‘ ఒక పురుషుడు చదువుకుంటే, అతను మాత్రమే విద్యావంతుడవుతాడు. అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులవుతారు ‘ అన్న సర్వేపల్లి రాధాకృష్ణగారి మాటని మరోసారి రుజువు చేసిందమ్మా మీ అమ్మ! చదువుకున్న స్త్రీగా తన కూతురిని పెద్దచదువులు చదివించడమే కాకుండా, బాధ్యత గల పౌరురాలిగా, నేరం చేసిన వ్యక్తిని తన కొడుకని కూడా చూడకుండా చట్టానికి అప్పగించింది! అలాంటి తల్లి కడుపున పుట్టిన నువ్వు ధన్యురాలివి కాంతీ. సమాజంలో పాతుకుపోయి వున్న అన్నిజాడ్యాలకీ మూలకారణం నిరక్ష్యరాస్యతే. నువ్వూ నీతల్లి మార్గంలోనే నడిచి ఈఊళ్ళో నిరక్ష్యరాస్యతనీ, లింగవివక్షతనీ రూపుమాపుతావని ఆశిస్తున్నానమ్మా. ఈవిషయంలో నీకు మా సహకారం ఎప్పుడూ వుంటుంది. “ అంటూ కాంతిని అభినందించాడు పోలీస్ యిన్‌స్పెక్టర్.

“ మీ తోటి స్త్రీ ధైర్యసాహసాలూ, పట్టుదలా చూశారు కదా! కేవలం చదువు అన్న ఆయుధంతోనే ఇదంతా సాధ్యపడింది. కాబట్టి యికనైనా మీరంతా తెలివి తెచ్చుకుని, మీ పిల్లలందరినీ ఆడా,మగా అన్న వివక్షత లేకుండా బడికి పంపించండి, మీ భవిష్యత్తునీ, మీ పిల్లలభవిష్యత్తునీ తీర్చిదిద్దుకోండి “ అంటూ చుట్టూ చేరిన జనాన్ని ఉద్దేశించి చెప్పి రాజుతో పాటు కొండయ్యనీ తీసుకునివెళ్ళాడు పోలీస్ యిన్‌స్పెక్టర్.

అక్కడే నిలబడి చోద్యం చూస్తున్న పిల్లలంతా కూడా “ అక్కా, రేపటి సందీ మేమంతా నీతోటే బడికొచ్చి బాగా చదువుకుని నీలాగే గొప్పోళ్ళమవుతాము“ అని చెబుతుంటే తాము ఎన్నాళ్ళ నుండో కన్న కల యింతకాలానికి నిజమవబోతోందన్న సంతోషంతో ఆ పిల్లలని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు కాంతీ, అలివేలూ!!!

Comentar