సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్)

తెలుగుజ్యోతిలో ఒక చర్చా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయాలని మా చిరకాల వాంఛ. కరలపాలెం హనుమంత రావు గారి 'సాహిత్యం సామాజిక ప్రయోజనం' అన్న వ్యాసంతో ఆ ప్రయత్నానికి ఒక అంకురార్పణ జరిగిందనుకుంటున్నాము. నిజానికి మన ప్రస్తుత వాడుకలో సాహిత్యానికీ వాఙ్మయానికీ పెద్దగా తేడా లేదు. కానీ హనుమంత రావు గారు, "సహితస్య భావః సాహిత్యం" అన్న ఒక దృక్కోణంలో ఆలోచిస్తూ సామాజిక ప్రయోజనం లేనిది సాహిత్యం అనరాదూ అని అంటారు, ఈ వ్యాసంలో! 

కానీ సాహిత్యానికి సామాజిక సంక్షేమం తప్ప మరో ధ్యేయమేమీ ఉండకూడదు అన్న వారి సైధ్ధాంతిక (doctrinaire) వాదం చర్చనీయం.  సాహిత్యాన్ని నీతులు బోధించడమే పనిగా అలా ఒక ఉక్కు చట్రంలో బంధించ కూడదని నా ఉద్దేశ్యం. సాహిత్యానికి చాలా చాలా ఉపయోగాలున్నాయి. ఉదాహరణకి మానసిక వికాసం, మానసోల్లాసం లాంటి ప్రయోజనాల మాటేమిటి? తిలక్ గారి భావ కవిత్వమేమిటి? అవధాన ప్రక్రియ యొక్క ఉపయోగమేమిటి? అశ్లీలత లేని ఏ సాహిత్యమైనా ఆమోద యోగ్యమే అని నా ఉద్దేశ్యం మీరేమంటారు?

ఇక ఈ సంచికకొస్తే:

వీడ్కోలు లోని తియ్యని బాధ గురించి రాసింది చిరంజీవి మేధశ్రీ

  • నింగి నేలలో సతృప్తంటే ఏమిటొ చక్కగా చెప్పారు సూర్యనారాయణ గారు
  • సోపతి (స్నేహం) కి విలువ కట్టద్దన్నారు సుబ్రహ్మణ్యం గారు
  • అమ్మని గుఱించి మరో కవిత రాశారు ఉమాదేవి గారు
  • ప్రేమ మత్తులో పడద్దు తస్కాత్ జాగ్రత్త అంటున్నారు సత్యనారాయణ గారు
  • పరిచయం లేకుండా జరిగే మన పరిణయాలలో ఆడపిల్ల అడకత్తెరలో పడ్తుందన్నారు విజయకుమారి గారు
  • చారెడు చేనితో రైతులు పడే కష్టాలు వర్ణించారి నాగజ్యోతి గారు
  • మన ఆనందమే తల్లిదండ్రులకొక పెద్ద ట్రిబ్యూట్ (tribute) అన్నారు అంకబాబు గారు
  • ఈ కృత్రిమ మేధా యుగంలో ఇటువంటి కొత్త అధ్యాయాలు జరగగలిగితే ఎంత బావుణ్ణు అంటున్నారు సత్యవతి గారు
  • జీవితం విలువ నూఱ్ఱూపాయలు కూడా లేని బీద బతుకుల గుఱంచి రాశారు మునిగోపాల్ గారు
  • యుధ్ధకాండలో నలిగిపోయేది బడుగు దేశాలేనని వాపోయారు మురళీమోహన్ గారు
  • చేపల కోసం జీవితాల్నే పణంగా పెట్టే జాలరి బతుకుల గుఱించి రాశారు సీతారమరాజు గారు

మానవుణ్ణి విశ్వవిజేతవి కమ్మని బోధించారు సురేష్ బాబు గారు


Comentar