వేకువ స్వప్నం
వేకువ స్వప్నం (Author: జుజ్జూరి ఉమాదేవి)
నిద్రలో నా చెంపలపై దోబూచులాడే నీ...
పెదవులు ఎందుకో ఈ
మధ్య నాతో ఊసులాడడం
మానేసినా.... నీ చూపుల వెచ్చటి ఊపిరి
నాశ్వాసలోకి ప్రవేశించి నన్ను
ఆలింగనం చేసుకుంటున్నాయి...
నల్లని నీ కురులు నా
మోముపై చిరుగాలిని
విసిరి పోతున్నాయి....
తెల్లటి పాలవంటి నీ
నవ్వులు నాగుండెలో
అలజడిని రేపుతున్నాయి..
నీ కాలి మువ్వల సవ్వడితో
నా ఏకాంతాన్ని భగ్నం చేస్తూ...
మంచు బిందువులా.. నను తాకి...
మెల్లగా నన్ను సాంత్వన పరచి............
నా అంతరంగంలో తేలియాడీ....
నాతో కబుర్లు చెబుతూ....
పచ్చటి పచ్చిక బైరులా...
నీ హృదయాన్ని నా ముందు పరచి....
ఎండిపోబోతున్న మోడుకు
ఆశల చిగురు తొడిగి వసంతం పూస్తూ
వచ్చి పోతావెందుకు నేస్తం.....
మృత్యువుకు భయానికి... మధ్య నేనొక శిలను మాత్రమే.....
నీ మనస్సుతో నన్ను చెక్కి చెక్కి.... శిల్పంగా మలచి.......
రాగాలు పలికించగలవేమో.... గానీ.....
కొన్ని క్షణాల తరువాత నీ శ్వాసతో నాకు.....
ఊపిరి పోయగలవా... నేస్తం...
వాలిపోయిన పొద్దు
రేపటి ఉషోదయానికి
నాంది... ఈ చెక్కిన శిల్పం
ఉంది చూడూ.........
రోజూ సగం చస్తూ...
ఆకాశం వైపు చూస్తూ...
నిశి రాత్రి నక్షత్రాలను
నా ఒళ్ళంతా పూసుకొని...
ఇంకొన్ని క్షణాల్లో ఈ
దేహాన్ని విడిచిన నా...
ఆత్మ మృత్యువు వెంట
పరుగు తీస్తుంది చూడూ...
ఇంతకీ....... నీవు ఎవరివి నేస్తం....
నా ఆశల వాకిట ముంగిట వాలిన రంగవల్లివా........
లేక..... గత స్మృతులతో
వెంటాడుతూ వచ్చిన
వేకువ స్వప్నానివా...
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)