మమతల ఒడి  (Author: గొర్తివాణి శ్రీనివాస్)

తెల్లవారుతుందంటేనే మాధవికి భయం పట్టుకుంది. ఓ పక్క ఉద్యోగం, మరోపక్క ఇంటి బాధ్యత. రెండు పడవలమీద కాళ్ళు, రెండువైపుల పదునున్న కత్తులు,
ఇలా ఎన్ని ఉపమానాలైనా సరిపోవు.

ఉద్యోగం చేయక తప్పని స్థితిలో రెండింటినీ ఎంచుకున్న సగటు ఇల్లాలు మాధవి.
భర్త సంపాదనకు తన కష్టం కూడా తోడవబట్టే  బతుకుబండి సజావుగా సాగుతోంది.

పెద్దపిల్ల అరుణిమ పుట్టినప్పుడు ఇబ్బందులేవీ ఎదురుకాలేదు. మాధవీ, మోహన్ లు ఇద్దరూ సమయాన్ని విభజించుకుని జాగ్రత్తగా పిల్లని పెంచుకొచ్చారు.

మూడేళ్ళ తర్వాత దీపక్ పుట్టాడు. అప్పుడే అసలు సమస్యలు మొదలయ్యాయి. పుట్టగానే దీపూకి పచ్చ కామెర్లు వచ్చాయి. అది సహజం అవే తగ్గిపోతాయని చెప్పారు డాక్టర్లు. కామెర్లయితే తగ్గాయిగానీ దీపూ పెరుగుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు పెరిగాయి.

అదేవంటే గర్భవతిగా వున్నప్పుడు తల్లి పడిన మానసిక ఒత్తిళ్ల ప్రభావంవల్ల  బిడ్డలకు కొన్ని సమస్యలు వస్తున్నాయి అన్నారు డాక్టర్లు. నేటి స్త్రీలకు  ఇంటా బయటా ఒత్తిళ్లు మామూలే అని వాటిని పట్టించుకోవడం మానేశారు. దీపూ వారంరోజులు బాగుంటే మరో వారంలో జ్వరం వాంతులు మొదలయ్యేవి.

అవి తగ్గి కోలుకోడానికి మరో పదిహేను రోజులు పట్టేది. మొగ పిల్లల్లో ఇమ్యూనిటీ ఆడపిల్లలకన్నా తక్కువ అని నానుడి. పెరుగుతున్నకొద్దీ అవే తగ్గుతాయని, వెన్ను ముదరాలని పెద్దవాళ్ళు భరోసా ఇచ్చారు. వాడికి ఆరేళ్ళు వచ్చాక స్కూల్ లో వేసినప్పటినుంచీ సమస్య ఇంకా పెరిగింది. స్కూల్ అంటేనే దీపూకి భయం. ఒంటికి  వేడి, ముక్కుకి జలుబు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటాయి.

దీపూ   జ్వరంతో బాధపడుతుంటే అతనికి తోడుగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండాల్సిన అత్యవసర పరిస్థితి. కానీ ఉద్యోగాలు మానుకుని ఎవరుండాలి? నువ్వా? నేనా? అని మాధవి, మోహన్ ల వాదన మొదలైంది. ఆ వాదన తగ్గేందుకు దీపూని చూసుకునేందుకు బోలెడు డబ్బుపోసి నానీ (ఆయా) ని పెట్టుకున్నారు. ఆమె పొద్దునవచ్చి రాత్రి వెళ్లిపోయేది. అలా కొన్నాళ్ళు బాగానే గడిచినా ఆమె బయట వ్యవహారాలు చూసుకునేందుకు దీపూని కూడా తీసికెళ్లేది. బయట డస్ట్, ఎండ వలన  దీపూకి జ్వరం తగ్గేది కాదు.

ఇంట్లో వుండి చూసుకోవాలిగానీ పిల్లాడ్ని బయట తిప్పడానికి వీల్లేదని చెప్పింది మాధవి. ఇంటిపట్టున ఉండిపోవడం కుదరదని చెప్పి నానీ వెళ్ళిపోయింది. మరొకళ్లను పెట్టినా మరొక సమస్య. పసివాడి ప్రాణాంకన్నా మీ డబ్బుసంపాదన ముఖ్యమా? ఏం పరుగు పందాలు ఆపండి. కాస్త ఆగి మీ సంతానాన్ని పెంచుకోండి"  అని అటు ఇటు పెద్దవాళ్ల పోరు పెట్టారు. పోనీ ఎవరో ఒకర్ని వచ్చి వుండమన్నారు.
"మాకెక్కడ కుదురుతుంది. నేను లేకపోతే మీ నాన్న ఒక్కరే వండుకుని తిని ఆఫీస్ కి వెళ్లడం కష్టం" అని తల్లీ, "మీ మావగారికి ఆరోగ్యం బాగోలేదు. నేనెలా రాగలను" అని అత్తగారూ  చెప్పారు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉద్యోగం మానేసి దీపూని చూసుకోవడమే శాశ్వత పరిష్కారం అని తేల్చేశారు.


ఎవరు  ఇంటిపట్టున ఉండాలని మాధవి, మోహన్ ముందున్న  మిలియన్ డాలర్ ప్రశ్న మళ్ళీ వచ్చింది. మాధవి పొద్దున్నే లేచింది. పక్కనే నిద్రపోతున్న దీపూ ఒంటిపై చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు చల్లగానే ఉంది. జ్వరం రాలేదు. హమ్మయ్య. అనుకుని చాలా సంతోష పడింది. "ఈరోజు స్కూల్ కి వెళతావా నాన్నా" అంది దీపూని  లేపుతూ.
ఊ...అన్నాడు. అదేచాలు. ఆ మాటే పదివేలు. ఒక్క వుదుటన లేచి ఇంటిపనీ వంటపనీ కానిచ్చింది. తనకీ, భర్తకి ఆఫీసుకి క్యారేజీలు సర్దింది. పిల్లలిద్దర్నీ స్కూల్ కి తయారుచేసి టిఫిన్  తినిపించింది. మోహన్ పిల్లల్ని స్కూల్ లో దింపి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. మాధవి కూడా టిఫిన్ గబగబా నోట్లో కుక్కుకుంటూ, వాషింగ్ మిషన్ లో రాత్రి వేసిన బట్టలు తీసి బాల్కనీలో ఆరేసింది. చకచకా వంటిల్లు సర్దేసి ఇల్లు తాళం వేసి బాక్సు తీసుకుని ఆఫీసుకి బయల్దేరింది. కిక్కిరిసిన బస్సులో అరగంట సేపు ప్రయాణించి ఆఫీసులో అడుగుపెట్టింది.
"హై మాధవీ...ఈరోజు చాలా తాపీగా కనపడుతున్నావు. మీ వాడికి ఒంట్లో బానేవుందా?" అని అడిగింది కొలీగ్ బిందు.

"ఆ బానే వున్నాడు. అందుకే కాస్త రిలీఫ్ గా ఉంది" అంది మాధవి
"వీళ్ళు ఇంట్లో వుండేదానికంటే హాస్పిటల్ లో ఉండేదే ఎక్కువ. నెల్లో ఇరవైరోజులు అక్కడే వుంటారు" అంది మరో కొలీగ్.
మాధవి మొహం చిన్నబుచ్చుకుంది.
"ఏం చేస్తాం. వాడు కాస్త పెరిగేదాకా మాకీ కష్టాలు తప్పవు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా జబ్బేమీ లేదంటారు. కానీ జ్వరం వస్తూనే ఉంది" దిగులుగా చెప్పింది మాధవి. ఇంతలో ఫోన్ వచ్చింది. "ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏ హాస్పిటల్ మేడం?" అంది మాధవి ఏడుస్తూ.
"ఏవైంది. మళ్లీ మీ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లమా?" అడిగింది బిందు.
"అవును. దీపూ స్కూల్ లో కళ్లు తిరిగి పడిపోయాడుట. వెంటనే వెళ్ళాలి" అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది మాధవి.
"పిల్లల సమస్యలన్నిటికీ తల్లే బాధ్యతవహించాలంటే ఎలా? ఉద్యోగం చేసే ఆడవాళ్లకు ఎటెండవటం ప్రతిసారీ ఎలా కుదురుతుంది. ఏం..? వాళ్ళాయన వెళ్ళొచ్చుగా. అన్నిటికీ ఇదే వెళ్ళాలా?" అంది బిందు ఆమె వెళ్లినవైపే చూస్తూ.


ఆ రాత్రి మాధవి, మోహన్ లు ఇద్దరూ ఆ విషయం మీదే గొడవపడ్డారు.
"నేనే ఎందుకు ఉద్యోగం మానెయ్యాలి?
నెలకి అరవై వేల జీతం వదులుకుని ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలి నేను?" అడిగింది మాధవి.

"పిల్లాడి ఆరోగ్యం బాగుండట్లేదుకదా. వాడి బాగోగులు నువ్వే చూసుకోవాలి. వాడు కాస్త గడికొన్నాక (పెద్దయ్యాక) మళ్లీ చేద్దువుగాని" అన్నాడు మోహన్.
"ఆ పనేదో మీరే చెయ్యొచ్చుగా. కొన్నాళ్ళు ఉద్యోగం మానేసి వాడిని కనిపెట్టుకుని ఉండండి"

"ఇది మరీ బాగుంది. కన్నది నువ్వు. కనిపెట్టుకునేది నేనా? ఆడవాళ్లే పిల్లల్ని బాగా చూసుకోగలరు"
"సమాజానికి ఇది కొత్త కాబట్టి చేతకాదు, మాకు తెలీదని అంటారు. ఫారెన్ కంట్రీల్లో
ఈ వివక్ష లేదు. మగవాళ్ళు కూడా పిల్లల బాగోగులు చూసుకుంటారు"

"అలా కాదు మాధవీ! తల్లి మమకారం, లాలనలో పిల్లలకి ఊరట దొరుకుతుంది.
తల్లి స్థానం అత్యుత్తమమైనది. దాన్ని ఎవరూ చేరుకోలేరు. కనీసం దరిదాపులక్కూడా రాలేరు"

"అబ్బ, ఏం చెప్పారండీ...మహాత్మురాల్ని చేసి ఆకాశంలో కూర్చోపెడితే ఇక ఆ అంచనాలు అందుకోవక్కర్లేదనేగా మీ పలాయనవాదనా పటిమ. "రుసరుసలాడింది మాధవి.
"ఒకటి చెబుతా విను. పిల్లల పెంపకంలో మూడు దశలుంటాయి. ఒకటి మార్జాల కిశోర న్యాయం. అంటే మనమే పిల్లల్ని అహర్నిశలూ వెన్నంటి కాపాడుకోవాలి.

కాస్త పెరిగాక  గోవత్స న్యాయం. కాస్త ఊహ తెలిశాక వాళ్ళు మనల్ని అనుసరిస్తూ వస్తారు. ఇంకాస్త పెద్దయ్యాక మర్కట కిశోర న్యాయం. ఇక మనం వాళ్ళని పట్టించుకోనవసరం లేదు. వాళ్లే కోతి పిల్లలా మనల్ని అంటి పెట్టుకుని జాగ్రత్త పడతారు.
ఆ విషయం ప్రకృతే చెప్పినపుడు మనమెంత." అన్నాడు మోహన్.

"అయితే మనలో పిల్లల్ని పెంచే పిల్లెవరు?"
"నువ్వే. తల్లే పెంచాలి" అన్నాడు.
"మళ్లీ మొదటికి వచ్చారు. మీరెందుకు ఉద్యోగానికి విరామం ఇచ్చి వాడ్ని చూసుకోకూడదు అని అడుగుతున్నా.
తొమ్మిది నెలలు అష్ట కష్టాలు పడి మోసి, కని ఆరోగ్యం గుల్ల చేసుకుని, ఉద్యోగాలు మానేసి అన్ని త్యాగాలూ నేనే చెయ్యాలా? మీరేం చేయరా" పళ్ళు పటపట కొరికింది మాధవి.

"సరే మాధవి. నేనెంత చెప్పినా నీకు అర్ధం కాదు. శ్రీకృష్ణుడు గీతలో ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నీ అర్జునుడు విన్నాడు. కానీ మధ్యమధ్యలో 'ఈ విషయాన్ని అర్థం చేసుకో' అంటాడు కృషుడు. కానీ నువ్వు విను అని అనడు. వినడానికీ, అర్ధం చేసుకోడానికి చాలా తేడా ఉంటుంది. సరే నీకెలా ఇష్టమైతే అలా చేద్దాం" అన్నాడు. మాధవికి కాస్త ఊరట కలిగింది.

మోహన్ ఉద్యోగం మానేస్తున్నాడనే విషయం తెలియగానే అటువాళ్ళూ ఇటువాళ్ళూ ఫోన్లు చేసి మాధవిని కేకలేశారు.
"అల్లుడు ఉద్యోగం మానడం ఏవిటే? అంతగా అవసరమైతే నువ్వే మానెయ్యి" అంది మాధవి తల్లి.

"అమ్మా, నా జీతం అరవై వేలు. ఆయన జీతం యాభై వేలు. ఏది ఎక్కువ?" అంది.
"హయ్యరామా....ఆడదానికి అంత పొగరు కూడదే. అల్లుడుగారి జీతం తక్కువని ఎద్దేవా చేస్తున్నావా? నిన్నిలాగే పెంచామా మేము? మాట అనేముందు మంచీ చెడూ వుండక్కర్లా." తల్లి, తండ్రి కలిసి మాధవి మీద దండయాత్ర చేశారు.

"నేను చెప్పేది వినరేం. నేనాయన్ని తక్కువ చేయట్లేదు. మామూలుగా చెబుతున్నాను.
ఏం... ఇంటి మొత్తానికి నాదే జవాబు దారీనా.

ఇల్లు పిల్లలు ఇద్దరి సొత్తు. ఇద్దరిదీ సమాన బాధ్యత. ఆయనకు లేని బాధ మీకెందుకు?
నేను ఉద్యోగం మానేదిలేదు" అని చెప్పింది.
మోహన్ తల్లీతండ్రి కూడా "అదేవిట్రా, ఆడదానిలాగా ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగం పురుష లక్షణం. ఆడది ఇంటికోసం అవసరమైతే ఏ త్యాగమైనా చెయ్యాలి" అన్నారు.
"అమ్మా, మగాడు ఉద్యోగం, ఆడవాళ్లు ఇంటి పనులు చేయాలి అనేది ఒకప్పటి ఆలోచన. ఇప్పుడది మారింది. ఆడపిల్లని చదివిస్తున్నప్పుడే మంచి ఉద్యోగం చేయాలని కన్నవాళ్ళు కోరుకుంటారు. చదువుకున్న, తెలివైన అమ్మాయే రావాలని భర్త, అత్తమామలు కోరుకోవడం మామూలే. స్త్రీ ఉద్యోగాన్ని ఆహ్వానించినపుడు, ఆమె బాధ్యత పంచుకునేందుకు భర్త కొన్నాళ్ళు ఇంట్లో ఉంటే తప్పేంలేదు. " అన్నాడు మోహన్.

"నీ ఖర్మ ఇలా ఉంటే మేమేం చేస్తాం. సరే చంటాడిని జాగ్రత్తగా చూసుకో. వేళకి పాలూ నీళ్ళూ చూస్తే, మూడు మూడు రోజులకీ ఆ జ్వరం రావడం  తగ్గుతుందేమో చూద్దాం" అన్నారు. ఎవరూ వచ్చి ఉండరుగానీ ఫోన్ లలో ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు
అనుకుంది మాధవి. చెప్పినట్టుగానే మోహన్ ఉద్యోగానికి కొన్నాళ్ళు లీవ్ పెట్టాడు. మోహన్ ఇంట్లో మాధవి ఆఫీస్ కి.

అక్కడికి వెళ్లినా ఇంటి గురించే బెంగ. దీపూ మందు మింగలేక కక్కేసాడేమో... ఏమీ తినకుండా నీరసించి పోయాడేమో. మోహన్ ని ఏం ఇబ్బంది పెడుతున్నాడో.  అని ఆఫీస్ లో వున్నా ఇంటి ఆలోచనలే. అక్కడ పరధ్యానంగా గడుపుతోంది మాధవి.
మ్యానేజర్ అడపా దడపా వచ్చి చూసి సరిగా పనిచేయట్లేదని మందలించాడు.
"సార్, మా బాబుకి ఒంట్లో బాగుండట్లేదు. కొన్నాళ్ళు లీవ్ తీసుకుంటాను" అంది.

"అన్ని లీవ్ లు ఇవ్వడం కదరదమ్మా... ఇంట్లోంచి వర్క్ చెయ్యమనటానికి వీలులేని పబ్లిక్ కష్టమర్సని డీల్ చేసే రోల్. ఆఫీస్ కి రాక తప్పదు" అన్నాడు.
మన అవసరానికి లీవ్ దొరకదని అర్ధమైంది.

మర్నాడుపొద్దున లేచేసరికి దీపూ ఒళ్ళు చల్లగానే ఉంటుంది. పొద్దెక్కినకొద్దీ క్రమంగా వేడొస్తుంది. ఆ లక్షణం ఏవిటో ఏ డాక్టర్  కనుక్కోలేకపోయారు.

తనవైపు తిరిగి పడుకున్న దీపూ మొహంలోకి చూసింది మాధవి.  బుజ్జి మొహం, బుల్లి ముక్కు, చిట్టి నోరుతో ఆదమరచి నిద్రపోతున్నాడు. నుదుటిపై ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకుంది. నిద్రలోనే లక్కపిడతలా నోరు తెరిచి చిన్నగా నవ్వాడు. ఇంకాస్త దగ్గరకు లాక్కుని వాడి కాలు తీసి తనమీద వేసుకుంది. తల్లిని కరుచుకుపోయాడు దీపూ.

వాడి మొహం తేటగా కనపడింది. ఎప్పుడూ ఇలాగే వుండొచ్చుకదరా నాన్నా. ఆ మాయదారి జలుబు, జ్వరం రాకుండా ఉంటే బాగుండు.
పక్కమీంచి లేద్దామని చూసింది. దీపూ మంగళ సూత్రాలు పట్టుకుని పడుకున్నాడు. మెల్లిగా విడిపించుకుని పనులు పూర్తిచేసుకుని ఆఫీస్ కి వెళ్ళింది.

"మీవాడు ఎలా వున్నాడు మాధవీ" అంటూ పలకరించింది కొలీగ్. పిల్లాడి గురించి అడిగి తెలుసుకోవడం సంతోషమే. కానీ అది తప్ప మరే ఇతర విషయాలూ తమ మధ్య రావట్లేదని నొచ్చుకుంది. "నేనొచ్చేదాకా బానేవున్నాడు" అని
ఇంటికి ఫోన్ చేసింది మాధవి.  దీపూ కి  ఒళ్ళు కాస్త  వెచ్చపడిందని చెప్పాడు మోహన్.

మనసంతా దిగులు కమ్ముకుంది. కస్టమర్లతో అన్యమనస్కంగా మాట్లాడింది. ధ్యాసంతా ఇంటిమీదే ఉంది. లంచ్ తినాలనిపించలేదు.
మధ్యాహ్నం ఇంటికి ఫోన్ చేసింది. మోహన్ ఎత్తలేదు. కంగారుగా మళ్లీ మళ్లీ చేసింది. నో రిప్లై. భయమేసింది. దీపూని మళ్లీ హాస్పిటల్ కి తీసికెళ్లాడా? అయితే నాకు చెప్పేవాడేగా.
చెప్పడం ఎందుకనుకున్నాడా? చెప్పేంత టైం లేకనా?

"మాధవీ అంతలా ఆలోచించకు. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది చూసుకో. మోహన్ గారు బాబుని చూసుకుంటారులే. నువ్వు దిగులుపడకు. మీవారు ఆఫీస్ లో వున్నప్పుడు ఇంటి గురించి ఇంతలా ఆలోచిస్తూ ఫోన్లు చేసేవారా చెప్పు "అంది

"లేదు. ఆయన ఆఫీస్ లో ఉంటే ఇంటిగురించి ఆయనకి ధ్యాస ఉండేది కాదు. కానీ నా మనసు ఆవైపే లాగుతోంది. ఇక్కడ నేనేం చెయ్యలేకపోతున్నాను.
నేనింటికెళ్లిపోతున్నాను" అని వేగంగా ఇంటికెళ్లింది.
దీపూకి జ్వరం పేలిపోతోంది.
"అమ్మా" అంటూ దీపూ మాధవి రాగానే లేచొచ్చి చుట్టేసుకున్నాడు. పిల్లాడిని చూసుకునేదాకా మనసు నిలవలేదు మాధవికి. ఇడ్లీ తినిపించి మందువేసి పడుకోబెట్టింది.
మర్నాడు కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది మాధవి. ఆహ్లాదకరమైన వాతావరణం.

పచ్చని చెట్లు, వాటిమీద  పక్షిగూళ్ళను చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది.
సృష్టిలో ప్రతిజీవీ తల్లయ్యాక తమ బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. వాటన్నిటినీ తల్లే ఎందుకు పెంచాలి? అవే ఎందుకు కష్టపడాలి? ఇలా ఆలోచిస్తుండగా దీపూ  లేచి తల్లిదగ్గరకు ఒళ్ళోకెక్కి కూర్చున్నాడు.

అతని తల నిమురుతూ చిన్నగా కూనిరాగం పాడుతుంటే కళ్ళుమూసుకుని వింటూ మళ్లీ నిద్రలోకి జారుకున్నారు దీపూ. మాధవి మనసు పులకించింది. మరింత దగ్గరగా పొదువుకుంది.

ఎంత చిత్రంమమతలోని తీయదనం వర్ణించలేం. గాలిలా, భగవంతుని రూపంలా రూపం లేనిది . అనుభవించాల్సిందే.
ఓహ్...ఈలోకంలో ప్రతి తల్లీ తమ పిల్లలు పెరిగేదాకా తామే పెంచుతాయి. పిల్లల్లో  తమ మమకారాన్ని నింపుతాయి. అదే వాళ్ళని నిరంతరం నడిపించే ఇంధనం. ఎనిమిదేళ్ల వయసు వచ్చేదాకా వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు పిల్లల జీవితాన్ని నడిపించే ముడి సరుకులు.

తల్లిగా నా బిడ్డకి ఆ ధైర్యాన్ని అందిస్తాను. ప్రేమకు లోటు రానివ్వను. అమ్మంటే శక్తి.
ఆ శక్తిని పిల్లలకు పంచడానికి అమ్మ వాళ్ళని పెంచాలి . బహుశా యూనివర్స్ ఇదే నాకు చెప్పాలనుకుంటోందేమో అనే ఆలోచన వచ్చింది  మాధవిలో.
"హలో...కొడుకుని పట్టుకుని ఎంతసేపు కూర్చుంటావ్? ఆఫీస్ కి వెళ్ళవా?" అడిగాడు
మోహన్.

"లేదండీ...నేను వెళ్లను. రేపటితో మీ లీవ్ అయిపోతుందిగా. మీరు ఆఫీస్ కి వెళ్ళండి.
నేను నా ఉద్యోగానికి రిజైన్ చేస్తాను." అంది.
అర్ధం కానట్టు చూసాడు మోహన్.
దీపూని ఎత్తుకుని గదిలోకి వెళ్ళిపోయింది మాధవి.

"ఆఫీస్ కి రాలేదే. దీపూ బాగున్నాడా" అని ఫోన్ చేసింది కొలీగ్.
"దీపూ బానేవున్నాడు. నేను ఆఫీస్  రావట్లేదు. రిజిగ్నిషన్ లెటర్ పంపుతాను." అంది మాధవి.
"మోహన్ తో ఏదైనా గొడవా? అతను నిన్ను ఇంటికే పరిమితం అవమని శాసించాడా?" అడిగిందామె.

"ఛ ఛ...అదేం లేదు. నేనే మానేద్దామనుకుంటున్నాను. దీపూ పెద్దవాడయ్యేదాకా ఉద్యోగం చేయను." మాధవి మాటలకి మోహన్ విస్తుపోయాడు.

తల్లి రక్షణ పిల్లలకు భద్రత. బాల్య దశలో  ఆత్మన్యూనతను జయించే బడి అమ్మ ఒడి. అది వాళ్ళ నూరేళ్ళ జీవితానికి సరిపడా బలాన్నిస్తుందని తను అప్పుడు చెబితే అత్తెరీ నేను ఉద్యోగం మానెయ్యాలా అని సీరియస్ అయింది.

ఇప్పుడు తనకు తానుగా అర్ధం చేసుకుంది. అందుకే కృషుడు అర్జునుడితో 'అర్ధం చేసుకో' అన్నాడు. విన్నది అర్ధం కాదు, అర్ధం చేసుకున్నది వ్యర్థం కాదు.
నిన్ను వదలి ఇక ఎక్కడికీ వెళ్లను నాన్నా అని చెప్పేసరికి దీపూ మొహం వెలిగిపోయింది. ఆరోజంతా అమ్మ ఒడి దిగలేదు. ఆ తర్వాత  జ్వరం రాలేదు.

Ajouter des commentaires