నేను శాంతిని‌ కోరుకొంటాను  (Author: వారణాసి భానుమూర్తి రావు)

అకారణంగా నాలో నేను కుచించుకు పోతాను 

అకారణంగా నాలో నేను కుమిలి పోతాను 

 

నా ఎదలో మండే జ్వాలలు నన్ను దహించుతూంటే 

నేను బూడిదై గాలిలో కలిసి పోతున్నాను 

 

ఈ నడుస్తున్న కాలానికి పగ్గాలు వెయ్యడం కుదరదు 

కాలానికి గాలం వెయ్యాలనుకొంటే అది వట్టి భ్రమ అవుతుంది 

భ్రమలో పడి మనిషి అస్థిత్వాన్ని పోగొట్టు కొంటున్నాడు 

 

పచ్చని చెట్ల మీద మొలుస్తున్న అగ్ని పుష్పాలు 

నదుల్లో మునిగి తేలుతున్న చిల్లర శవాలు 

 

కొండల మధ్య పారుతున్న రక్తపు టేరులు 

అవును అగ్ని పర్వతాలు లావాను ప్రసవించాయి 

 

మనిషి హృదయం ఒక అగ్ని పర్వతమే! 

రక్తాన్ని మూట గట్టుకొని పచ్చని బ్రతుకుల్ని‌ 

రుధిరంతో అభిషేకం చేస్తున్నాడు 
 

నా అక్షరాలు నిలువెల్ల కంపిస్తున్నాయి 

నేను మరణ శాసనం వ్రాయడానికి రాలేదు 

 

ప్రపంచం ఉన్మాది లక్షణాలతో వూగి పోతున్నప్పుడు 

నేను శాంతిని కోరుకోవడం తప్పా??

Ajouter des commentaires