నూర్రూపాయలు  (Author: చిట్టత్తూరు మునిగోపాల్)

“ఏయ్.. ఏయ్.. ఏమిటా పని? వద్దు వద్దు, అలా చేయద్దు..” వణికిపోతూ అరిచాను. కాదు, అరవాలనుకున్నాను. గొంతు పెగిలితేగా... అల్లల్లాడిపోతోంది వాడి చేతుల్లో నా శరీరం.

“రేయ్ శంకర్, ఏం చేస్తున్నావురా. ఏమిటాపని? నీకేమన్నా పిచ్చిపట్టిందా?” ఎవరో పుణ్యాత్మురాలు, వారిస్తూ ముందుకొచ్చి వాడి చేతులనుంచి నన్ను జాగ్రత్తగా విడిపించి తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటికీగానీ నా వణుకు తగ్గలేదు. భద్రంగా ఆ మెత్తటి చేతుల్లో ముడుక్కున్నాను.

వాడేం మాట్లాడలేదు. వెక్కుతున్నాడు. బుగ్గలపై కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇంతకుముందు నుంచీ అంతే. ఒకటే ఏడుస్తున్నాడు. మొదట వీడే నన్ను విసిరి వీధిలో కొట్టింది. మళ్ళీ తనే నన్ను వెదికి పట్టుకుని ఇదిగో, ఇలా స్కూల్ దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు తీసుకుని వచ్చాడు. హమ్మయ్య అనుకునే లోగానే, ఇలా నన్ను ముక్కలుముక్కలు చేయడానికి తెగించాడు. ఈమెవరో కానీ సమయానికి ఇటువైపు రాకుంటే- అమ్మో... మళ్ళీ భయం వేసింది.

“నమస్తే టీచర్.” దారిన వెళ్తున్న పిల్లలు నమస్కారాలు చేస్తుంటే తెలిసింది, ఆమె స్కూల్ టీచర్. చాలా మంచిదట. స్కూల్లో ఈ శంకర్ ను కూడా బాగా చూసుకుంటుందట. ఎప్పుడైనా పెన్నులు, పెన్సిళ్ళకు డబ్బులు లేవంటే తనే కొని ఇస్తుందట. మొన్న ఎప్పుడో చిల్లర అంగడి గల్లాలో పడివున్నప్పుడు వీడి అమ్మ, అదే అనసూయ... పక్కన ఉన్న ఇంకొకామెతో చెబుతుంటే విన్నాను ఈ మాట.

వేళ్ళ సందుల్లో నుంచి ఆమె ముఖం వంక నిక్కీ చూశాను. చాలా చల్లగా ఉన్నాయి స్కూల్ టీచర్ చూపులు. మెల్లగా శంకర్ తలమీద చేయి వేసి నిమురుతోంది.

“కళ్ళు తుడుచుకో.” హ్యాండ్ బ్యాగులోనుంచి కర్చీఫ్ తీసి చేతికిచ్చింది. వాడు తుడుచుకున్నాక నడిపించుకుంటూ స్కూల్ కు తీసుకు వెళ్ళింది.

“నువ్వు ఇక్కడే స్టాఫ్ రూములో కూర్చో, నేను ఇప్పుడే అటెండెన్స్ వేసేసి వస్తాను.” వాడితో చెప్పి బయటకు వచ్చింది. రిజిస్టర్ లో సంతకం చేసి, క్లాసులో అటెండెన్స్ తీసుకుని మళ్ళీ స్టాఫ్ రూముకు వచ్చింది. కన్నీళ్ళు కారడం ఆగింది కానీ, శంకర్ ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. చేతిలో ఉన్న నన్ను వాడి ముందుకు చాపింది.

అప్పుడు చూశాను, శంకర్ కాళ్ళూ చేతులూ వాచివున్నాయి. వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బలకు వీపుమీద కూడా వాతలు తేలి వుంటాయి, నాకు తెలుసు.

“ఇప్పుడు చెప్పు, ఎందుకు ఈ హండ్రెడ్ రూపీస్ ను చించేయడానికి చూశావు? టెంత్ క్లాసుకు నువ్వు. డబ్బులు లక్ష్మీ స్వరూపమని తెలియదా? కూలీనాలీ చేసుకుని నిన్ను పోషిస్తున్న మీ అమ్మకు ఈ నూర్రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయో తెలుసా?” స్కూల్ టీచర్ నిలదీసింది.

“అదీ, అలా గడ్డి పెట్టండి టీచర్...” ఉక్రోషంగా అనుకున్నాను. ఎందుకంటే, నన్నేగా ఆ బుద్ధి లేనివాడు చించేయబోయింది.

శంకర్ మాట్లాడలేదు. కనీసం దించిన తల యెత్తి చూడలేదు.

“శంకర్, ఏం జరిగింది? ఎందుకు ఈ హండ్రెడ్ రూపీస్ ను చించేయబోయావు? వళ్ళంతా ఈ దెబ్బలు ఏంటి?” అలమరా తలుపు తీసి, ఏదో అయింట్మెంట్ తీసుకుని వచ్చి వాడి పక్కన కూర్చుని దెబ్బలపైన రాస్తూ మళ్ళీ అదే ప్రశ్న వేసింది.

“మా అమ్మ లం... అందుకే నాయన దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.” ఇంతకాలం తెలియని రహస్యం బయటపడినట్టు చెబుతున్న వాడి మాటలు వినిపించి ఉలిక్కిపడి చూశాను.

“రేయ్ శంకర్...” చేయి ఎత్తి కొట్టబోయి తమాయించుకున్నది టీచర్.

“ఇదిగో ఈ నూర్రూపాయలు నాకు దాని రంకు మొగుడే ఇచ్చాడు. అందుకే... అందుకే...” వాడి మాటలు ఆవేశంతో తడబడుతున్నాయి.

“షటప్, ఏమిటా బూతులు. ఇంకోసారి అలా మాట్లాడావంటే చంపేస్తా. అసలు ఏం జరిగింది చెప్పు ముందు. ఒకవేళ మీ అమ్మదే తప్పయితే పిలిపించి మందలిస్తాను.” వస్తున్న కోపాన్ని బలవంతంగా అణచుకొని అనునయంగా అతడి వీపు నిమురుతూ అడిగింది టీచర్.

“నేను... నేను... ఫ్రెండ్సుతో ఆడుకొని ఇంటికి వెళ్ళేసరికి...”

* * *

చాలాసేపు సావాసాగాళ్లతో ఆడి ఇంటికి వెళ్ళాడు శంకర్. తలుపు మూసి వుంది. కోపం వచ్చేసింది వాడికి. అసలే కడుపునిండా బువ్వ తిని రెండుమూడు రోజులు అవుతోంది. స్కూలుకు వెళ్ళి కూడా. అమ్మ చూస్తే పనికి వెళ్ళకుండా ఎప్పుడూ ఇంట్లో పడుకొనే ఉంటుంది. ఫ్రెండ్స్ తో ఆడుకొని వచ్చాడేమో, ఆకలి దంచేస్తోంది. కోపంగా వెళ్ళి తలుపు నెట్టబోయాడు. అదే సమయంలో దానికదే తెరచుకుంది. ఇంట్లోనుంచి బుల్లబ్బాయి బయటకు వచ్చాడు. వాడి వెనుక నిలబడి ఉంది అమ్మ. కింద జీరాడుతున్న పైట తీసి బయట పడిన వక్షస్థలాన్ని కప్పుకోవడానికి ప్రయాస పడుతోంది.

“అరె, వచ్చావా శంకర్. మీ అమ్మ మంచి సుఖం ఇచ్చిందిరా. దాన్ని ఎలాగూ నేను ఉంచుకున్నాను. ఇంద, నువ్వు దీన్ని ఉంచుకో. నేను దానితో ఎంజాయ్ చేసినట్టే నువ్వు ఈ నూర్రూపాయలతో జల్సా చేసుకో.” అంటూ నన్ను జేబులోనుంచి తీసి వాడి చేతిలో పెట్టాడు.

అనసూయ వైపు తిరిగి కన్నుకొట్టి, శంకర్ భుజం తట్టి అక్కడినుంచి చక్కా వెళ్ళిపోయాడు బుల్లబ్బాయి.

అమ్మాకొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరిలోనూ కదలిక లేదు. శిలాస్తంభాల్లా నిలబడిపోయారు.

చదివేది పదో తరగతే కానీ, వయసుకు మించిపోయిన బుద్ధి శంకర్ ది. చేసే సావాసాలు కూడా అలాంటివే. అక్కడి దృశ్యం చూస్తూనే ఏదో అర్థమైంది వాడికి.

“థూ... గుడిసేటి లం...” కేకరించి వాడు ఊసిన ఎంగిలి రెండు బార్ల దూరంలో వెళ్ళి మన్నులో పడింది. చేతిలో ఉన్న నన్ను ఉండలా చుట్టి వీధిలోకి విసిరికొట్టాడు.

ఆ మాటతో తననుతాను మరచిపోయింది అనసూయ. కుక్కలను తరమడానికి ఉపయోగించే సన్నపాటి దుడ్డు కర్రను తీసుకుని సుడిగాలిలా వచ్చి మీదపడింది. కొడుకు దేహం మీద అయిదు నిముషాల సేపు ఆ కర్ర శివతాండవం చేసింది. తర్వాత దాన్ని విసిరికొట్టి“శంకరా... నా కన్నా...” అంటూ రెండు చేతులతో కొడుకును జవురుకొని అక్కున చేర్చుకుంది.

ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపిస్తోంది. క్షణంసేపు అలానే ఉండి అమ్మ చేతులు విదిలించి కొట్టాడు శంకర్. వీధిలోకి వచ్చి వెదకి ఒక చిన్న పొద పక్కన పడివున్న నన్ను చేతిలోకి తీసుకున్నాడు.

పైట జారిన అమ్మ... ఇంట్లోనుంచి బయటకు వస్తున్న బుల్లబ్బాయి... అమ్మను ఉంచుకున్నానంటూ అతడు పలికిన మాటలు... వాడి కంటికి కనిపించినవి, వినిపించినవి అన్నీ పొల్లుపోకుండా చెప్పేశాడు శంకర్.

టీచర్ కు ఏమి మాట్లాడాలో తెలితీయలేదు కాబోలు... అలానే చూస్తూ ఉండిపోయింది.

వాడు చెప్పిన కథనం విని నాకు గుండె ఝల్లుమంది. తలుపు తీసిన తర్వాత జరిగిన కథ మాత్రమే చెప్పాడు వాడు. అంతకుముందు మూసిన తలుపు వెనుక జరిగిన అసలు కథ తెలిసింది నాకు కదా.

* * *

తెల్లారి లేస్తూనే దంతధావనం చేసి, షోగ్గా రెడీ అయ్యాడు బుల్లబ్బాయి. లాల్చీ లాంటి షర్టు వేసుకున్నాడు. నిన్నటి రోజున పేకాటలో వెయ్యి రూపాయాలదాకా గెలుచుకుని మంచి ఉషారుమీద ఉన్నాడు అతడు. పది వంద నోట్లు లాల్చీ జేబులో ఇరుకిరుకుగా చికాకు పడుతున్నాయి. ఆ వంద నోట్లలో నేనూ ఒకదాన్ని అని మీకు తెలిసే ఉండాలి ఈపాటికి. చాలా పలుచగా పారదర్శకంగా ఉన్న ఆ జేబు నుంచి బయటి పరిసరాలు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇంట్లో నుంచి బయటకు వచ్చి అటుఇటు చూశాడు బుల్లబ్బాయి. చేలకు వెళ్ళిన మగవాళ్లకు, పనివాళ్లకు సంగటి ముద్దలు ఎత్తుకుని వెళ్తున్న ఆడవాళ్ళు ఒకరిద్దరు తప్ప, వీధి మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది, నేరుగా అనసూయ ఇంటికి చేరుకున్నాడు బుల్లబ్బాయి. అనసూయ ఎవరో తెలుసు కదా- ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడే శంకర్... వాళ్ళమ్మ. ఇంటికి అంటే వాకిట్లోకి కాదు, దొడ్డివైపు వెళ్ళాడు. రెండు మూరల ఎత్తు ఉండే ప్రహరీని సునాయాసంగా లంఘించి లోపలివైపు గోడకు ఆనించి వేసిన పేడదిబ్బపై సునాయాసంగా దూకేశాడు.

పెరట్లో ఎక్కడా అలికిడి లేదు. తెరచివున్న దొడ్డి వాకిలిగుండా రేకులు కప్పిన ఇంట్లోకి దూరిపోయాడు పిల్లిలాగా.

ఆపక్కనే బోర్లించిన సత్తు దబర కాలికి తగిలి దొర్లుకొంటూ నట్టింట్లోకి వెళ్ళి ఆగింది.

“ఫో... ముదనష్టం ముండా. మా కొంపలో ఏముంటాదే నీకు... నా ప్రాణం తీయడానికి దూరడం తప్ప.” గుమ్మం మీద తలపెట్టుకుని నిస్సత్తువగా పడుకుని ఉన్న అనసూయ నీరసంగా అదిలించింది... ఏ కుక్కో, పిల్లో అనుకుని.

“నేనేనే అనసూయా, బుల్లబ్బాయిని.” హఠాత్తుగా ఎదుటికొచ్చి నిలబడిన అతడిని చూసి భయపడిపోలేదు ఆమె.

“చెప్పానుగా, నేను అటువంటి దాన్ని కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ముందు బయటకు నడువ్. పో ఇక్కడినుంచి.” రెండు అరచేతులను నేలకు ఆనించి నెమ్మదిగా పైకి లేస్తూ చెప్పింది.

“రెండు రోజులుగా నువ్వు పస్తులు ఉంటున్నావని నాకు తెలుసు. ఎందుకు ఈ గర్వం నీకు. నాకు నువ్వు కావాలి. ఊరికే వొద్దు. కొంగు పరిస్తే నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను. ఒక్కసారి కోరిక తీర్చవే.” దగ్గరగా వచ్చాడు బుల్లబ్బాయి.

“నిలువక్కడే, నన్ను ముట్టుకున్నావంటే మర్యాద దక్కదు.” పక్కనే గోడకు ఆనించివున్న రోకలి బండ చేతికి అందుకుంది.

“చూడు అనసూయా. నీ ఒంట్లో క్యాన్సర్ గడ్డ పెరిగిపోతున్నదని నాకు తెలుసు. ఊళ్ళో వైద్యం చేసే ఆరెంపీ డాక్టరు చెప్పాడు. ఇంకా ఎన్నో రోజులు బతికే ఛాన్స్ లేదు నీకు. పోయే ప్రాణానికి పరువు, ప్రతిష్టలు ఎందుకు? అవి కూడు పెట్టవని నీకు ఇప్పటికే తెలిసివచ్చి ఉండాలి. ఒక్కసారి నాతో పడుకొన్నావానుకో, నువ్వు బతికినంతకాలం నిన్ను నీ కొడుకును పోషిస్తాను. నువ్వు పొయ్యాక కూడా వాడిని ఎక్కడో హాస్టల్లో చేర్పించి బాగోగులు చూసుకుంటాను. నీలాంటి మొగుడు విడిచిపెట్టిన ఆడదానికి నాబోటి మిండగాడే దిక్కు.” చేయి పట్టుకోబోయాడు.

“థూ... నీ బతుకు చెడా...” కేకరించి ఊసింది. చటుక్కున పక్కకు తప్పుకోకుంటే గోడ మీద పడ్డ ఎంగిలి అతడి ముఖాన్ని పావనం చేసేదే.

అనసూయ కళ్ళు నిప్పులు ఉముస్తున్నాయి. రఒక అడుగు వెనక్కు వేసి రెండు చేతులతో రోకలి బండ పైకి ఎత్తింది ఆవేశంగా.

అదిరిపడి దూరంగా జరిగాడు బుల్లబ్బాయి. ఇంతకు మించి బలవంతం చేస్తే ఆమె నానాయాగీ చేసి రచ్చకీడుస్తుందని తెలుసు. అంతేనా, ఆ రోకలి బండతో తల బద్దలు కొట్టినా కొట్టేయచ్చు. క్రూరంగా చూశాడు ఆమెవైపు. వంకర నవ్వు అతడి పెదాలపై మెరిసింది.

“సరే చూస్తాను. నువ్వు కాపాడుకుంటున్న పరువు, ఎంతకాలం నీతోపాటే అట్టిపెట్టుకుని ఉంటుందో తేలుస్తాను.” కసిగా అన్నాడు. ఒక్కసారిగా ముందుకు దూకి ఒకచేత్తో ఆమె రెండు చేతులూ కదలకుండా పట్టుకుని, రెండో చేత్తో ఆమె పైట పిడికిట పట్టి బలంగా లాగేశాడు. ఆ వెంటనే వీధి గుమ్మం తలుపు తీశాడు.

అంతా హఠాత్తుగా జరిగిపోవడంతో అనసూయ అడ్డుకోలేక పోయింది. మ్రాన్పడిపోయింది. తేరుకుని చూసేసరికి తెరచిన గుమ్మం బయట కొడుకు శంకర్ నిలబడి ఉన్నాడు. వాడి కళ్ళు జుగుప్సగా చూస్తున్నాయి పైట జారిన తనవైపు.

* * *

“నీకు బుద్ధి ఉందా అనసూయా, చిన్న బిడ్డను పట్టుకొని ఇలా గొడ్డులా బాదుతావా. వీడు చస్తే నీ రంకుకు అడ్డు లేకుండా పోతుందనా ఈ దురాగతం చేశావు?” టీచర్ మందలిస్తోంది.

స్కూలుకు పిలిపించింది అనసూయను టీచర్. దెబ్బలతో శోష వచ్చినట్లున్న శంకర్, ఆరెంపీ ఇచ్చిన నిద్రమాత్రలతో గదిలో ఆ పక్కనే టేబిల్ పై పడి నిద్రపోతున్నాడు.

వరి కోతలకు వెళ్ళిన అనసూయ అలాగే వచ్చి మోకాళ్ళ దాకా ఎగగట్టిన చీరతో, కొడవలి చేతిలో పట్టుకుని నిలబడింది. ఆమె ముఖం నిరామయంగా ఉంది. ఒకసారి టీచర్ వంక చూసి, కొడుకు దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా ఒళ్ళు నిమిరింది. ఆమె కళ్ల నుంచి రెండు కన్నీటి చుక్కలు వాడి షర్టుపై రాలిపడ్డాయి.

కొడుకు పక్కనే బాగా నలిగి పడివున్న నన్ను ఒకసారి చూసి, చేతిలోకి తీసుకుంది.

నాకు తలుపుల వెనుక కరిగిన కథ మొత్తం టీచరుకు చెప్పాలని ఉంది. శంకర్ కు తెలియని కథ అది. టీచర్ కు వాడు చెప్పలేని కథ. కానీ నోరు లేదుగా, ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాను.

“నేనిక్కడ అడుగుతుంటే మూగిమొద్దులా మాట్లాడవేమే..” రెట్టించింది టీచర్.

“మేం చెప్పే మాటలు ఎవరు నమ్ముతారమ్మా... నేను రంకు చేయలేదంటే మీరు ఒప్పుకుంటారా?” నిర్లక్ష్యం లేదుకానీ... ఆమె గొంతులో ఒకరకమైన తూష్ణీభావం. అందులోనే అంతులేని ఆవేదన.

“కొడుకు ముందే రంకు చేస్తూ పట్టుబడి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్...”

“అమ్మా... వీడిని హాస్టల్ లో చేర్చడానికి ఎంతవుతుంది?” సంబంధం లేని ప్రశ్న వేసింది అనసూయ.

“అంటే, నీ రంకు సాగించడానికి కన్న బిడ్డను వదిలించుకోవాలనుకుంటున్నావన్న మాట..”

“మీ ఇష్టమమ్మా, ఆ మాదిరిగానే అనుకోండి. కానీ మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డను హాస్టల్లో చేర్పించండి. దానికి ఎంత కర్సవతాదో చెప్పండి.” మొక్కడానిక్ కిందికి వంగింది.

“ఛ, చా... ఏమిటీ పని, పైకి లెయ్యవే. అయినా ఇంత జరిగినాక వాడు నీ దగ్గరే ఉంటే నిన్ను చంపడమో, వాడు చావడమో చేస్తాడు. గవర్నమెంట్ హాస్టల్ లో చేర్చే ఏర్పాటు నేను చేస్తాను. దానికి డబ్బులు ఏమీ కట్టనవసరం లేదు.”

“అలా చెయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటాది. ఇంకెన్ని రోజులో బతకబొయ్యేది లేదు నేను. అయినా కొడుకు ముందు ఇలా తప్పుడు దానిలా నిలబడడం కన్నా ఆ చావే సుఖంగా ఉంటాదమ్మా. ఆలోపల ఒక్క మంచిపని అయినా చెయ్యాల. నా కొడుకును కొంచెం కనిపెట్టుకొని ఉండండమ్మా. మీరు మీపిల్లలూ కలకాలం చల్లగా ఉండాలి.” కొడుకును అప్పగింతలు పెట్టింది అనసూయ. ఒకసారి వాడి దగ్గరగా వెళ్ళి, ముద్దుపెట్టుకోవడానికి అనుకుంటాను, ముఖం మీదికి వంగింది. మళ్ళీ ఏమనుకున్నదో ఏమో, తల అడ్డంగా ఊపింది. పక్కనే పడివున్న చూసుకొని నన్ను చేతితో తీసుకుని రొంటిన దోపుకొని వెనక్కు తిరగకుండా స్కూలు నుంచి ఇవతలకు వచ్చేసింది.

“బుల్లబ్బాయా..”

“ ---“

“రాత్రికి దొడ్డి తలుపు తీసి పెడతా. గుట్టుచప్పుడు కాకుండా వొచ్చేయ్. చేపల కూర కూడా వొండుతా, ఫుల్లుగా సారా ఏసుకొని వొచ్చినావంటే మజా ఉంటాది.” బటన్ ఫోన్లో ఆమె మాట్లాడిన మాటలు వింటున్న నాకు, ఆమె మీద అంతదాకా ఉన్న గౌరవం పొయ్యింది.

నేరుగా ఎరువుల అంగడికి వచ్చింది అనసూయ.

“మంచి పురుగుల మందు ఇయ్యి శెట్టీ. మందు పెట్టీ పెట్టంగానే విషప్పురుగు తనకలాడి కతక్కన సావాల.” నలిగిన నన్ను రొంటి నుంచి బయటకు తీసి, మడతలు విడదీసి కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చింది.

“నూర్రూపాయలకు ఏం మందు వస్తాదమ్మా...” నసిగాడు శెట్టి.

“వొచ్చిందే ఇవ్వు. ఇంకా బాకీ పడితే తర్వాత తీరచేస్తా. నీ రుణం ఉంచుకోను.” ఓరగా చూస్తూ అతడి చేతికి తన చేతిని తాకించింది.

మెలికలు తిరిగిన శెట్టి, క్షణంలో విషం ఎక్కే ఘాటైన పురుగుల మందు ఇవ్వడం కనిపించింది గల్లా పెట్టెలో పడుతున్న నాకు.

“జాగ్రత్త, ఇది పొరపాటున మనుషులు తాగితే హరీ మంటారు.” శెట్టి జాగ్రత్తలు చెబుతున్నాడు.

“నాకు కావాల్సింది కూడా అటుమంటి మందే...” అంటున్న అనసూయ గొంతులో నాకు ఏదో కసి వినిపించింది.

“నిజమే... ఆడది తెగిస్తే ప్రళయమే...” ఆ ‘అమ్మ’ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.


Ajouter des commentaires