ట్రిబ్యూట్  (Author: కూని అంకబాబు)

   అప్పటికే ఆలస్యం కావడంతో ఉరుకులు పరుగుల మధ్య ఉస్సూరుమంటూ ప్లాట్ ఫామ్ నెంబరు 2కి చేరుకున్నాను. ఆయాస పడిపోతున్న నాకు చెవుల్లో అమృతం పోసినట్లు నేనెక్కాల్సిన రైలు గంట ఆలస్యంగా వస్తుందని అనౌన్స్మెంట్ వినబడింది. హమ్మయ్య! అంటూ ఒక నిట్టూర్పు విడిచి పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ పై కూలబడ్డాను. కూడా తెచ్చుకున్న వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగుతున్న నాకు ఒక దృశ్యం కనిపించి నీళ్ల బాటిల్ కి మూత పెట్టి, పక్కన పెట్టి అటుగా చూస్తుండిపోయాను.

       నాకు రెండు బెంచీలకు అవతల ఒక బెంచీ పై ఒక అమ్మాయి దిగాలుగా కూర్చుని శూన్యంలోకి చూస్తోంది. ఆ అమ్మాయికి పక్కనే ఒక ఆడమనిషి, మగ మనిషి నిలబడి ఉన్నారు. ఇద్దరికీ 40కి పైగా వయసు ఉంటుంది. వారి ముఖాల్లో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళను అదే పనిగా పరిశీలనగా చూశాను. ఎవరో తెలిసిన మొఖాలల్లే ఉన్నారే అనిపించింది. ఆ అమ్మాయి తలతిప్పి నా వైపు చూసింది. ముఖంలో ఏ భావం కనిపించలేదు.

      ఒక్కసారిగా నాకు సంతోషం, భయం, అనుమానం అన్నీ కలిగాయి. చూడ్డానికి ఆ అమ్మాయి నా ఓల్డ్ స్టూడెంట్ ఏమో అన్నట్టు అనిపించింది. వాళ్లకేదో తీరని కష్టం వచ్చినట్లు అనిపించి భయంతో వారికి వచ్చినటువంటి కష్టం ఏమిటా? అని అనుమానంతో, అటే చూస్తున్నాను. నా ఆలోచనలను ఛేదిస్తూ పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక గూడ్స్ ఫ్లాట్ఫారం నెంబర్ రెండు పట్టాల మీదుగా వెళ్ళిపోయింది. ఆ రైలు శబ్దం సద్దుమణిగాక లేచి అమ్మాయి దగ్గరకి వెళ్లి, 'మీది ముత్తుకూరు కదా?' అని అడిగాను. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. 'అది  మా బిడ్డ. నువ్వెవరు నాయనా?' అన్నది అక్కడున్న ఇద్దరిలో ఆడమనిషి. వారిద్దరూ ఆ అమ్మాయి అమ్మానాన్న అని అర్ధమై  'నా పేరు శరత్ బాబు. నాదీ ముత్తుకూరే. ఐదేళ్ళుగా నెల్లూరులో ఉంటున్నాను. మీ అమ్మాయిని చూస్తుంటే నా స్టూడెంట్ ప్రసన్న లక్ష్మిలా ఉంది. అందుకే పలకరించాను అన్నాను.

         'సారూ! మీరా అయ్యా? అది మీ పెసన్నేనయ్య, దానికి ఒంట్లో బాగోకపోతే.. సూపిద్దామని సింగరాయకొండకి తీసకపోతావుండాము సారూ...' చెప్పింది ప్రసన్న వాళ్ళ అమ్మ కన్నీటిని పైటకొంగుతో తుడుచుకుంటూ.

       ఆ అమ్మాయి నా స్టూడెంటే అని అర్థమైంది. నేను అదే బెంచీ పై కూర్చుని 'ప్రసన్నా! ఇటు చూడమ్మా! నేను నీ సార్ ని, తెలుగు సార్ ని. శరత్ బాబు సార్ ని' అన్నాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లోకి అనుమానంగా చూసింది. కాసేపటికి తన కళ్ళల్లో నీళ్లు నిండి, ఏడుపు అలలుగా పొంగుకొచ్చింది. అప్పుడు 'తల్లీ! ఇటు చూడు, ఏడవకు. అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి' అంటూ తల నిమిరాను. అయినా ఏడుపు ఆపలేదు.'అసలు ఏం జరిగింది అని వారిని అడిగాను. వారు ఏదో చెప్పబోతుండగా వద్దని వారిని వారించింది ప్రసన్న.'సరే నువ్వే చెప్పు' అన్నాను. ఆ అమ్మాయి నా దగ్గర చదువుకున్న రోజుల్లో ఏడవ తరగతి మండలం ఫస్ట్. పదవ తరగతిలో 500 పైగా మార్కులు తెచ్చుకున్న తెలివైన విద్యార్థిని. నేను అప్పుడప్పుడు క్లాసులో పిల్లలకి భవిష్యత్తు గురించి, తల్లిదండ్రుల ఆశల గురించి, శ్రమ గురించి స్ఫూర్తిదాయకంగా కొన్ని మాటలు చెప్తుండేవాడిని.   పిల్లలతో కలివిడిగా, కాస్త ప్రేమగా కూడా ఉండేవాడిని. అంచేత నా పట్ల పిల్లలు అభిమానాన్ని పెంచుకున్నారని నా అభిప్రాయం. అయితే అది ఇప్పుడు పనిచేసిందని అనుకుంటాను.                            

       ప్రసన్న తలెత్తి నా వైపు చూసి 'నాకోసంగా మా యమ్మానాయన  పైసా పైసా కూడబెట్టి ఇంజనీరింగ్ దాకా చదివించారు సార్. ఉన్న అరెకరా కయ్య అమ్మి, ఈ రోజు కూలోళ్ళుగా కూలీ పనులకు పోతా ఉండారు. నేను ఇంజనీరింగ్ మెకానికల్ బ్రాంచ్లో మంచి మార్కులతో పాసయ్యాను. కానీ కోర్సు పూర్తి అయినా ఇంకా జాబ్ రాలేదు. కయ్యి అమ్మినప్పటినుండి నా మనసు మనసులో లేదు సార్. ఎప్పుడూ అమ్మానాయన కష్టమే గుర్తొచ్చేది. అప్పుడు ఏడుపొచ్చేది సార్. ఈ మధ్య తలనొప్పి కూడా ఎక్కువగా వస్తా ఉండాది. మా యమ్మా నాయన అప్పు చేసి మరీ నన్ను నెల్లూరు హాస్పిటల్లో చూపించారు. తలనొప్పి తగ్గలేదు. మొన్న ఎవరో సోదెమ్మ వచ్చి నాకు దయ్యం పట్టిందని, పూజ చేయాలని చెప్పిందట. దానికి తోడు ఎవరో సింగరాయకొండలో ప్రశ్ని చెప్పి, మంచి పూజ చేస్తారని చెప్పారంట. అందుకని తీసుకొని పోతున్నారు సార్' అని అంటూ కన్నీళ్ళను రెండు చేతులతో తుడుచుకుంటూ, రెండు చేతుల్లో తన తలని దాచుకుని ఏడుస్తోంది ప్రసన్న.

       ప్రసన్న చెప్పిన దాన్ని బట్టి అది కేవలం మానసిక సమస్యగా అర్థమైంది. ఆ అమ్మాయి అమ్మానాన్న కష్టాన్ని చూసి, వాళ్ల కష్టానికి తనే కారణమని అనుకుంటూ దిగులుతో మనశ్శాంతి కోల్పోయి, ఆ అమ్మాయికి తలనొప్పి వచ్చిందని గ్రహించాను. అందుకే కాస్త చొరవ తీసుకుని 'చూడు ప్రసన్న! నీ బాధ నాకు అర్థమైంది. నీకు దయ్యం లేదు, గియ్యం లేదు. ఉన్నదల్లా అమ్మానాన్నల మీద  బెంగ. అమ్మా, నాన్న కష్టాలు పడుతున్నారని తీవ్రంగా ఆలోచించి, నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు అంతే. ఇంత చదివిన నువ్వు ఇలా ఆలోచించడం బాగాలేదు. నువ్వే ఇలా అయిపోతే ఇక అమ్మానాన్నలకు సంతోషం ఎక్కడినుంచి వస్తుంది చెప్పు. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు వాళ్లకి సంతోషంగా కనపడాలి. అప్పుడే తలనొప్పి దానికదే తగ్గిపోతుంది. ఇదే దీనికి పరిష్కారం. ఉద్యోగం ఈరోజు రాకపోతే రేపో మాపో  ఖచ్చితంగా వస్తుంది. నీకున్న సమస్యల్లా తీవ్రమైన ఆలోచన. అందువల్ల ఇంటర్యూ సరిగా ఫేస్ చేయలేకపోయావ్ అంతే. నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నీ వల్లే మీ అమ్మానాన్నల కష్టం తీరుతుంది. అందుకే నువ్వు చేయాల్సిందల్లా ప్రశాంతంగా ఉంటూ గుండె ధైర్యాన్ని పెంచుకొని, నీ అంతిమ లక్ష్యం అమ్మానాన్నల క్షేమం అనుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు. ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది' అన్నాను.

        అప్పటిదాకా తలదించుకొని అన్నీ విన్న ప్రసన్న తలెత్తి నా కళ్ళల్లోకి చూసి చిరునవ్వుతో కన్నీళ్లు తుడుచుకొంది తనకేదో దారి దొరికినట్టు అనిపించి.

         ******         ******        ******

      ఫోన్ కి మెసేజ్ వచ్చిన శబ్దం విని ఫోన్ లిఫ్ట్ చేసి చూశాను. నా అకౌంట్లోకి ₹5000 క్రెడిట్ అయినట్లు వచ్చిన మెసేజ్ అది. ఎవరు వేశారు? ఎందుకు వేశారు? నాకు అర్థం కాక ఎవరా అని ఆలోచిస్తుండగా ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్ లో శరత్ బాబు సారు అని ఉంది. ఇదేంటి నా పేరుతో నాకే ఫోను అని అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేశాను.

     'హలో! సార్! నేను సార్! మీ ప్రసన్నను సార్, మీ స్టూడెంట్ ప్రసన్న సార్' అని ఆనందం రంగరించిన కంఠం వినపడింది. 'ఎవరూ?' అన్నాను. 'నేను మీ స్టూడెంట్ ప్రసన్నలక్ష్మిని సార్' అంటూ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గురించి చెప్పుకు వచ్చింది. నా మాటలను సీరియస్ గా తీసుకొని ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఇంటర్వ్యూ అటెండ్ అయిందని, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, సంతోషంగా చెప్పింది. ఆ మాటలకు నాకు పట్టరాని ఆనందం కలిగింది. తర్వాత అనుమానంగా 'అయితే ఆ ట్రూ కాలర్ లో నా పేరు వచ్చింది ఏంటమ్మా?' అన్నాను.

       'సార్ మీరే నాకు స్ఫూర్తి సార్, మీ గైడెన్స్ తోనే నేను నేనుగా ఉన్నాను, ఎదిగాను. అమ్మానానలకు అండగా నిలవగలిగాను సార్. అందుకే ట్రూ కాలర్ లో మీ పేరు పెట్టుకున్నాను సార్. నా వంతు కృతజ్ఞతగా నేను పంపిన మనీతో కాదనకుండా ఈ ఉగాదికి బట్టలు కొనుక్కోండి. ఈ పండక్కి నేనే మీ దగ్గరకు వచ్చి మీకు బట్టలు పెట్టి, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను. కానీ రీసెంట్ గానే జాబ్ రావడం వల్ల సెలవు దొరకలేదు సార్. క్షమించండి. మరోలా భావించకండి. ఇది నా స్మాల్ ట్రిబ్యూట్ సార్' అనింది. ఆ క్షణంలో నాకే తెలియకుండానే నా కళ్ళు నీటి చెలమలయ్యాయి నాకు కూతురు లేని లోటు గుర్తుకొచ్చి.


Ajouter des commentaires