కాటి పిలుపు
కాటి పిలుపు (Author: తన్నీరు శశికళ)
చాలా రోజులు తరువాత టౌన్ బస్ ఎక్కడం, అదీ ఈ వయసులో! ఏమీ మారలేదు.
బస్ లు ఎక్కువ వేసినా దానికి తగ్గట్లు జనాభా నగరాల్లో పెరుగుతూ ఉన్నారు. నగరం ఎవర్నీ పొమ్మనదు. మురికికాలువ పక్క స్ధలమో, ఓవర్బ్రిడ్జ్ కిందనో దోమలమధ్య నిద్రపుచ్చి ఏదోలా బ్రతికిస్తుంది. ఎక్కడ చూసినా మనుషులే దిగుతూ ఎక్కుతూ!
ట్రాఫిక్ జామ్ లు చెమట వాసనను బంధించి మరీ పరిచయం చేస్తాయి. ఆ చెమట వాళ్ళ ఐ. డి. చెప్పేస్తుంది. చాలా రోజుల తరువాత మనుషుల వాసన ఇంత దగ్గరగా మీద పడిపోతూ!
కారులో ఉండే చల్లటి హాయి కంటే ఈ సామూహికతనం బాగుంది ఇప్పుడు. తోసుకుంటూ దిగినవాళ్ళ కంటే ఎక్కువ ఎక్కినట్లున్నారు. తరువాత స్టాపింగ్ దిగాలి గూగుల్ మాప్స్
చూస్తే. మెల్లిగా డోర్ వైపు కదలాలి. నడుము సహకరించడం లేదు. తప్పదు. ఇన్ని ఏళ్ళు నన్ను మోస్తూ ఉన్నాయి
ఇవన్నీ వీటికి కృతజ్ఞత చెప్పాల్సిందే!
********
మెల్లిగా తలెత్తి బోర్డ్ చూసాను. నాకు కావలిసిన ఆఫీస్ అదే. కొత్తగా పెట్టారు కాబోలు కనుక్కోవడంకష్టం అయింది. నాకొసమే పెట్టి ఉంటారు. లోపల రిజిస్టర్ చేయించగానే పదిహేనో నంబర్ అని చెప్పిందిఆమె.
చుట్టూ చూసాను. నా వయసు వాళ్ళు. మా హోదాకి తగ్గట్లే ఏర్పాట్లు. ఏ. సి. మెలోడీ మ్యూజిక్ చిన్నగాఏదో లోకంలోకి తీసుకెళుతూ ఉంది. ఆఫీసబాయ్ దగ్గరకు వచ్చాడు. టమాటా సూప్ అన్నాను. ఇక్కడకువచ్చే వాళ్ళను బాగా అర్థం చేసుకున్నారేమో సూప్స్ కూడా ఉన్నాయి. స్ఫూన్తో సూప్ త్రాగుతూ చుట్టూ చూసాను. అందరూ ఏదో లోకంలో మునిగినట్లు ఏదో దిగులు మబ్బులో కూర్చోనిఉన్నారు.
ఒకగోడకి బుద్ధుడి మ్యూరల్. సగం మూసిన కన్నులు ఇంకో లోకానికి దారి చూపిస్తూ. ఆ లోకమేకదా ఇప్పుడు కావాలి. ఇంకో గోడకి చిన్నిపాప ఫోటో, పూలపై ఎగురుతున్న సీతాకోక చిలుకను పట్టుకోవాలిఅని పరిగెడుతూ ఉంది. పెదాలపై బోలెడు నవ్వు. బాల్యం ఇంద్రధనుస్సు నిజంగా. లోకంలోని రంగులన్నీఅప్పుడే చూడగలం. ఎక్కడో ఉన్న కూతురు గుర్తుకు వచ్చింది. మెయిల్ లో పంపిన మనవరాలు ఫోటో గుర్తుకు వచ్చింది. ఎప్పుడైనా పక్క ఫ్లాట్ తలుపు నుండి తొంగి చూసి నవ్వే చిన్న పాప గుర్తుకు వచ్చింది. అన్నీ ఇప్పుడు డిజిటల్ రూపంలోనే, ప్రేమలు కూడా!
చుట్టూ చూసాడు. అందరూ ఏవో జ్ఞాపకాలు నెమరేస్తూ ఉన్నట్లున్నారు.
సైగ చేసింది లోపలికి వెళ్ళమని. రూంలోకి అడుగుపెడుతూ ఉంటే ఏదో కాలిన వాసన.
ఎక్కడిది?
***********
పేరు, చిరునామా లన్నీ చూసాక చైర్ లో కూర్చున్న అతను అడిగాడు.
"చెప్పండి మీకు ఎలా కావాలి?"
ఎలా అంటే మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు. తాతయ్య గుర్తుకు వచ్చాడు. వీధి అరుగు మీద కుర్చీలో కూర్చుంటే దారిన పోయేఅందరు దణ్ణం పెట్టి పలకరించి పోయేవారు. ఆ గుబురుమీసాల వెనుక వచ్చే ఒక్క నవ్వు ఎన్ని కష్టాలకో
భరోసాగా నిలిచేది. ఆయన సహాయం పొందని గడప ఊరిలో ఏదైనా ఉందా!
చిన్నగా నిట్టూర్చాడు.
ఏ జీవితం అయినా దానికి అంతం ఉండాల్సిందే. మంచిగా గడిపినా చెడ్డగా గడిపినాచివరకు వెళ్లే స్థలం ఒకటే. తాతయ్య చివరి వీడుకోలు గుర్తుకు వచ్చింది.
ఒక్క పొయ్యి కూడావెలగలేదుఊరిలో ఆరోజు, ఆయనకు వీడుకోలు చెప్పేదాక. వీధులుపూలదారులుఅయ్యాయి. మంచి మనసులనుండి పొంగే కన్నీళ్లు ఆయనకు పన్నీరు. చావు గురించి కూడా ఎన్నో రోజులు గొప్పగా చెప్పుకున్నారు.
"ఎలా చేయమంటారు?''అడిగాడు ఎదురుగా ఉన్నతను
డబ్బు కొనేసిన వినయం అతని మాటల్లో. ఒక్కొక్కటి చెప్పాను. వ్రాసుకుంటూ ఉన్నాడు.
చివరగా అన్నాడు, ఇన్ని జరుగుతాయా సార్? అయినా మేమున్నది కష్టమర్స్ ని తృప్తి పరచడానికి.
ఎంత కట్టాలి? అడిగాను. చెప్పాడు.
అంతా!!!!!
మరి అంతే కదా. మీరు అడిగిన పూల పల్లకి, వ్యాన్, గంధపు చెక్కలు ఇవన్నీ డబ్బుతోతేగలం. కానీ కర్మ చేసే పంతులు ఇప్పుడు ఎలా దొరుకుతారు? పైగా కర్మ చేసే మనిషి,
వెంట నడిచే మనుషులు ఇదంతా ఇప్పుడు చేయడమే కష్టం. ఇక ఇంకా కొంత కాలంతరువాత ఇంకా ఎంత కష్టం చెప్పండి. మేము కాబట్టి ప్రయత్నిస్తాము అంటున్నాము.
నమ్మకంగా చేస్తాము కూడా. కొందరు డబ్బులు తీసుకొని తరువాత కరెంట్ మిషన్ లోకాల్చేస్తారు, ఎలాగూ మీకు తెలీదు కదా అని.
మేము పెట్టి కొన్ని నెలలే అయినా అందరూ
సాటిసఫాక్షన్ గా ఉన్నారు మా సర్వీస్ తో. చూడండి.
చేతిలో ఉంచిన బుక్ చూసాను.
సర్వీస్ బాగా ఉంది అని చెపుతూ కొందరి సంతకాలు.
మన మనుషులు లేరని ఇంత దూరం వస్తే, దగ్గరి వాళ్ళం అని
కొన్ని రేకమెండేషన్స్. నవ్వుకున్నాడు. దగ్గరవాళ్లే ఉంటే ఇవన్నీ ఎందుకు!
లేదు సార్. చాలా బాగా చేస్తాము. కొన్ని వీడియో లుచూడండి.
ప్లే చేసాడు. చుట్టూ పూలు పరిచిన శవం వాన్ మీద. స్మశానానికి తీసుకుని వెళ్లి గంధపు చెక్కల మీద
పడుకోపెట్టారు. చుట్టూ ఇద్దరు మనుషులు. వెలిగించిన తరువాత వాళ్ళు వెళ్లిపోయారు.
'చూసారా! చెప్పిన ప్రకారం గంధపు చెక్కలతోనే కాల్చాము. మాది మాట అంటే మాటే'' చెప్పాడు నమ్మకంగా.
అమౌంట్ చెక్ వ్రాసిస్తే తీసుకున్నాడు.
మరి ఎప్పుడు రావాలో మీకు ఎలా తెస్తుంది అడిగాను?
"ఇప్పుడు ఒక చిప్ టాటూ లాగా ఫిక్స్ చేస్తాము. నాడి ఆగిపోగానే అదిఅడ్రస్ తో సహా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. మేము అలర్ట్ గా వచేస్తాము''
తల చిన్నగా ఆడించాను.
చేయి చాపండి. చాపాను.
ఒక టాటూ ఫిక్స్ చేసాడు.
ఇది పోతే!!!!!
మమ్మల్ని నమ్మండి సార్, ఎక్కడికీ పోదు.
నిన్ననే పదో అంతస్తు లో టాయిలెట్ లో చనిపోయిన అతన్ని వెంటనే ట్రేస్ చేసిచక్కగా కర్మ జరిపించాము. మీ చావు తరువాత శవాన్ని గురించి మీరు దిగులు పడక్కర్లేదు.
అంతా మీరు కోరుకున్నట్లే చేస్తాము.
ఇందాక వీడియో గుర్తుకు వచ్చింది.
శవానికి మీరు స్నానం చేయించలేదు, దిగులుగా అడిగాను, రెప్పలా కింద నీళ్లు అదుముకుంటూ
లోపల గుండె ప్రిదిలిపోయినట్లుగా ఉంది.
"అది మాత్రం కుదరదు సార్. ఎవరింటి ముందు పెట్టినా ఒప్పుకోరు. మీ అపార్టుమెంట్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే దాని రేట్ ఎంతో చెపుతాము"
లోోపల బ్రద్దలు అయిన గుండె బదులు ఇవ్వడం లేదు. కళ్ల ముందు స్నానం లేకుండానేకాటికి వెళుతున్న నా శవం.
మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు వచ్చాను.
పైకెత్తి ఆఫీస్ బోర్డ్ చూసాను
"లోన్లీ బర్డ్స్"
బహుశా ఇంక ఇక్కడికి రానవసరం లేదు. రేపు వాళ్లే వస్తారు.
ఎక్కడో కాకి అరుస్తూ ఉంది.
ఇప్పుడు నగరం లో కాకులు ఎక్కడివి?
లోపల ఉండే వాడి ఏకాకి అరుపేమో అది!!!!!!
కాటికి పొమ్మని అరుస్తూ ఉన్నాడు.
@@@@@