Article
కళ్ళున్న మనసు (Author: ఎమ్. విజయశ్రీముఖి)
"శుభం అండి! సంతోషం. అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి, అటూఇటూ పెద్దవాళ్ళూ అందరూ అంగీకారం తెలియజేశారు. ఇంక మీరు ముహూర్తాలు చూసుకోవడమే తరువాయి." పెళ్లికూతురు అన్విత మేనమామ అన్నాడు.
అన్విత తల్లి ఈశ్వరి పెళ్ళికొడుకు చక్రధర్ పెద్దమ్మ, మేనత్తలకు బొట్టుపెట్టి జాకెట్ ముక్కల్లో పండు తాంబూలంపెట్టి ఇచ్చింది. వారిద్దరి మధ్య చక్రధర్ తల్లి వరలక్ష్మి తలవంచుకుని కూర్చుంది.
"ఆంటీగారూ! అమ్మకు కూడా బొట్టు పెట్టండి" పెళ్ళికొడుకు చక్రధర్ ఈశ్వరిని చూసి చెప్పాడు.
"అయ్యో, ఆమె విధవకదా? ఈశుభసమయంలో ఆమెకు పెట్టకూడదు బాబూ! అశుభం" చెప్పింది కంగారుగా అంది ఈశ్వరి.
"పర్వాలేదండీ, ఆమెకు బొట్టుపెట్టినంత మాత్రాన ఏ అమంగళం జరగదు. పెట్టకపోతే జరగవల్సిన అనర్ధం జరగకుండానూ ఆగదు" అన్నాడు.
"చక్రీ! నువ్వాగు నాన్నా! పర్వాలేదండీ, మీరు కానివ్వండి" చక్రధర్ తల్లి వరలక్ష్మి కల్పించుకుని ఈశ్వరితో చెప్పింది.
పెళ్ళికొడుకుతో పాటు అతని పెదనాన్న, పెద్దమ్మ మేనత్త వచ్చారు. వాళ్లకి అతని భావాలు తెల్సు. అక్కడ అన్విత తల్లిదండ్రులు, మేనమామ మరో ముగ్గురు ఉన్నారు.
"ఆ. ముహూర్తాలు ఎప్పుడనేది మీరు కనుక్కొని చెప్పినా సరే, మమ్మల్ని కనుక్కోమన్నా సరే. ఇక మేము వెళ్లిరామా?" అంటూ చక్రధర్ పెదనాన్న లేచి నిలబడ్డాడు.
"అలాగేనండీ" అన్నాడు అన్విత తండ్రి చలపతి.
"వెళ్దాం కూర్చోండి పెదనాన్నా, రెండు మాటలు మాట్లాడుతాను అంకుల్?" అన్నాడు చక్రధర్.
"అలాగే బాబూ! అమ్మా అన్వితా, బాబు ఏదో మాట్లాడుతార్ట. అలావెళ్ళు" చెప్పాడు చలపతి.
నెమ్మదిగా తలూపి ముందుకు కదిలింది అన్విత.
"అహహా అన్వితగారితో కాదండీ, ఆంటీగారితో" అన్నాడు చక్రధర్. ఆగింది అన్విత.
"నాతోనా? ఏమిటి బాబూ? అడిగింది ఈశ్వరి.
"అవును ఆంటీ గారూ!" చెప్పాడు చక్రధర్.
"కూర్చున్నాక మాట్లాడుకోవచ్చు. కూర్చోండి", అందరితో అన్నాడు అన్విత మేనమామ.
"నాకనిపించినవి, నాకు నచ్చనివి చెబుతాను. అన్వితగారూ! ఇదేమీ పర్సనల్ విషయం కాదు కాబట్టి, మీరేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగ చెప్పండి. మన అభిప్రాయాలు, అభీష్టాలు ఏంటో మనవారికి ముందే తెలిస్తే తర్వాత మన ప్రవర్తన వాళ్ళని, వాళ్ల మాటలు మనని ఇబ్బంది పెట్టవు కదా?" అన్వితను చూస్తూ చెప్పాడు చక్రధర్.
"మీగురించి అన్నీ తెలుసుకుని నచ్చిన తర్వాతే చూసుకోవటానికి రమ్మని చెప్పారు నాన్నగారు", నెమ్మదిగా చెప్పింది అన్విత.
కూర్చున్న చక్రధర్ అన్విత వైపు చూస్తూ "మన పెద్దవారు మన వివాహాన్ని ఖాయం చేశారు. ఇంతకుముందు మీరు చూశారు.. మీ అమ్మగారు
బొట్టుపెట్టి జాకెట్ ముక్కలేవో పెద్దమ్మకు, అత్తకు ఇచ్చారు. వాళ్ళ మధ్య కూర్చున్న మా అమ్మని మాత్రం వదిలేశారు. ఎందుకు? మీకూ తెలుసు.
ఐనా, నేనుచెప్పాను 'ఆంటీగారూ! అమ్మక్కూడా ఇవ్వండి' అని. మీఅమ్మగారు నిర్మొహమాటంగా 'ఆమె విధవరాలు... ఈశుభ సమయంలో ఆమెకి ఇవ్వకూడదు, అరిష్టం' అన్నారు..."
"నీకు తెలియదు బాబూ, ఆమెకివ్వకూడదలాగ", మధ్యలో కల్పించుకుని మళ్ళీ చెప్పింది ఈశ్వరి.
"అప్పుడెప్పుడో ఆయువులేక మానాన్న చని పోయాడండీ, కానీ ప్రాణాలతో ఉన్న మా అమ్మని ఆచారం పేరుతో ఇలాంటి సందర్భాల్లో తరచూ పదిమందిలో పదేపదే' నువ్వు విధవవు, తిండికి, చాకిరీకి తప్ప నిన్ను వ్యక్తిగా పరిగణించము' అని మానసికంగా ఆమెను చిత్రవధ చేస్తున్నారు..."
చక్రధర్ మాటల్లో ఆవేశం కన్నా ఎక్కువ ఆవేదన ధ్వనించింది. "................" ఎవరూ మాట్లాడలేదు.
"ఇలాంటి చేదు అనుభవాలు భరించలేక, అసలు ఈరోజు కూడా మాఅమ్మ రానంటే రానంది. నేనే నీకొడుకు బ్రతుకంతా నిలిచే భాగస్వామి ఎంపిక లో నువ్వు లేకపోతేఎలా? ఈరోజు మనవాళ్లు మరికొందరు వచ్చినా... జీవితాంతం కలిసి బతక వలసిన వాళ్ళం మన ముగ్గురమే కదా?'అంటూ బలవంతంగా తీసుకొచ్చాను" బాధగా చెప్పాడు చక్రధర్. అన్విత అన్నీమౌనంగా వింటూ అతన్నే చూస్తోంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.
"అయ్యో అదికాదు బాబూ...."అన్విత తల్లి ఏదో చెప్పబోయింది. ఆమెను వారిస్తూ తండ్రి చలపతి "మిమ్మల్ని అవమానించడం కాదు బాబూ! మన ఆచారం మొదటినుంచి వస్తుందనీ... అంతే కదా బావగారూ..." చక్రధర్ పెదనాన్నని అడిగాడు.
"అంతే అనుకోండీ... కానీ, ఇప్పటి పిల్లలంతా చెప్పేవాటిల్లో ఆచరణలోనూ ఏవి ఎంతవరకూ సబబుగా ఉన్నాయి? అనేది ఆలోచిస్తున్నారు"
అన్నాడాయన.
"మీఅమ్మగారు భర్త లేకపోయినా ముఖాన ఆ బొట్టు, చేతులకు గాజులు వేసుకునే వచ్చారుగా, ఆమెలాఉంటే మాకెందుకు? అబ్బాయి ముఖ్యం' అనుకున్నాం. మమ్మల్నికూడ ఇప్పట్నుంచే మీకు నచ్చినట్లే చేయమంటే ఎలా? మాకది అశుభం" అన్విత తల్లి నిష్టూరంగా మాట్లాడింది.
ఈసన్నివేశం, సంభాషణ వరలక్ష్మికి ఇరకాటంగా, అవమానంగాఉంది. ఆమె ఎవరివైపూ చూడలేక పోతోంది. "అదంతా వదిలేయండి. చక్రీ, నామాట విను నాన్నా! తర్వాత విషయం చూద్దాం" అంది. అందరి కళ్ళూ చక్రధర్ వైపు చూశాయ్! అంతలో అన్విత కల్పించుకుని "లేదు లేదండీ.. వారిని చెప్పనివ్వండి, మీ ఆలోచనలు చెప్పండి", వరలక్ష్మిని వారిస్తూ, చక్రధర్ వైపుచూసి అన్నది.
చక్రధర్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. తలెత్తి ఎదురుగానే కుర్చీలో కూర్చున్న అన్విత మేనమామను చూసి, నెమ్మదిగాచెప్పసాగాడు...
"అంకుల్! ఈవిషయం మాటపట్టింపు కోసమో, మరొకందుకో కాదండీ. దయచేసి నేను చెప్పేది సహృదయంతో ఆలోచించండి..." అన్నాడు.
చక్రధర్ వైపు చెప్పమన్నట్టుగా చూశాడాయన.
అందరూ అతడు ఏం చెబుతాడోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఈశ్వరి నిలబడే ఉండటం చూసి "మీరూ కూర్చోండి ఆంటీ" అన్నాడు చక్రధర్. "పర్వాలేదు చెప్పండి" అంది ఈశ్వరి. ఆమెలో అసహనమో అసంతృప్తో... దాగలేక పోతోంది.
నెమ్మదిగా స్పష్టంగా చెప్పసాగాడు చక్రధర్...
"నాన్న ఆరోగ్యం బాగాలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి వైద్యం చేయించాం. రాత్రింబవళ్లు అమ్మ ఆయనకు సేవ చేస్తూనే ఉండేది. ఐనా... నాన్న... కాలం చేశారు.. ఆయన లేకపోవడం మా అందరి కంటే నష్టం కష్టం బాధ ఒంటరితనం మా అమ్మకే ఎక్కువ. కాదంటారా?" అడిగాడు అందర్నీ చూసి.
"అయ్యో.. ఎలా కాదంటాం బాబూ?", చలపతి అన్నాడు. మిగతా తలలు ఊగాయి.
"నెలల తరబడి నాన్నని మరువలేక ఏడ్చింది. తన చుట్టూఉన్న జనంలో కలిస్తే ఆ బాధ కొంతైన మర్చిపోవచ్చు. కానీ, మన జనం ఉన్నారే? ప్రతి నిమిషం నీమొగుడు చచ్చాడు, నీవొక విధవవి.. నీవో పెద్ద దరిద్రానివి. శుభాల్లో సంతోషాల్లో నీవు కనిపించకూడదు.. అన్నట్లు వెలివేస్తుంటే ఆ వ్యక్తి మానసిక వ్యధను ఊహించగలరా?" అడిగాడు.
"......................."
"అసలామె చేసిన నేరం ఏమిటి? భర్తనేమయినా గొడ్డలిపెట్టి నరికో, కత్తితో పొడిచో ఆమె ఆయన్ని
చంపేసిందా? ఆయువు మూడి ఆయన పోతే.. ఆమెనెందుకండీ వెలితో వేధిస్తున్నారు?" "అబ్బే.. వెలివేయడం కాదయ్యా, భర్త లేని స్త్రీకి
పసుపూ కుంకాలు నిషేధమని మన ఆచారమే చెప్పిందికదా? అంతే తప్పా... మీ అమ్మగారినేదో అవమానించాలనే ఉద్దేశ్యం కాదయ్యా" అన్విత
మేనమామ సర్దుబాటుగా చెప్పాడు చక్రధర్ కి.
"ఆచారాలు సంప్రదాయాలు మానవ మనుగడ సుఖశాంతులతో గడిపేలా ఉండాలి. హింసిస్తూ, అవమానపరుస్తూ వేర్పాటు విధిస్తూఉంటేఎలా?
"అలా అని కాదూ.. ఒకప్పుడు బాల్యవివాహాలు ఉండేవి. పెద్దవయసులోని భర్తపోతే ఆ యువతి పూలు పసుపు కుంకుమల అలంకరణతో పచ్చగ ఆకర్షణీయంగా ఉంటే.. వయసు వేడిలో కొందరిలో మనోవికారాలు కలగవచ్ఛనీ వాటివలన పరువు మర్యాదలు, బంధుత్వాలన్నీ నాశనమౌతాయనీ ఆలోచించిపెట్టారు. పూర్వం నుండీ వస్తున్నదే!"
చెప్పాడాయన. వాళ్ళ మాటలను మిగతావాళ్ళు వింటున్నారు.
"అప్పటి పరిస్థితులు అవి. ఇప్పుడాస్థితి లేదు. ఐనా, జనం అన్నీ అలా సంప్రదాయ బద్ధంగానే ఆచరిస్తున్నారా? కన్నవాళ్లను అనాధాశ్రమాలకు
తరలించే ఆచారం అప్పట్లో ఉందా? యుద్ధాలు, సామ్రాజ్యాలు లేకపోయినా, చిన్న చిన్న వాటికే పొడుచుకుని, నరుక్కు చచ్చే సంప్ర దాయాలున్నాయా? వేషభాషలు, నేటిఅలవాట్లు, జరిగే సామాజిక దుష్ట కృత్యాలన్నీ ఆ ఆచారం
ప్రకారమే నడుస్తున్నాయా?" అడిగాడు చక్రధర్.
"మీరిలా అడ్డంగా వాదిస్తే ఏంచెప్తాం చెప్పండి? అందరం ఇలాగే అనుకుని ఆచారాల్ని తుంగలో తొక్కితే జాతి బ్రష్టుపట్టిపోదా? మన దేశగౌరవం మంటకలిసి పోదా?" మరొకాయన అడిగాడు.
"మనజాతి బ్రష్టుపట్టి పోకుండా, దేశ గౌరవం మంటకలిసి పోకుండా ఉండాలంటే ఆచారమనే పేరుతో మనంచెప్పేవన్నీ అవమానకరంగా ఉన్నా
స్త్రీ లు ఏడుస్తూ మోయాలా? వాళ్ళవి మోస్తూ మనకు కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాలా? మరి మనం ఏమిటి అంకుల్? మనకు ఎలాంటి నియమాలు ఏమీఉండవా? మన పరువు ప్రతిష్ట స్త్రీల పైనే ఆధార పడ్డాయని మనము భ్రమిస్తూ, సంబర పడదామా?" అడిగాడు చక్రధర్.
"మీలాంటి కుర్రాళ్ళతో వాదించలేం కానీ.. మనం చెప్పినా ఎంతమంది వింటున్నారు చెప్పండి? నేటి ఆడపిల్లలు ఎలా బరితెగించేసి తిరుగుతూ
ఉన్నారో మీరూ చూస్తూనే ఉన్నారుగా?" అన్నాడాయన.
"ఔను. బంధనాలు ఉన్నప్పుడే తెంపుకోవడం, తెగించడంలాంటివి సంభవిస్తాయ్!" వెంటనే జవాబు ఇచ్చాడు చక్రధర్.
"...................." అందరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి పోయారు.
"మీరేదో అనుకుంటున్నారు కానీ, భర్త పోగానే అలా ఉండటం ఆడవాళ్ళకలవాటైపోయిందిలే. క్రొత్తగా బాధ పడాల్సిందేముంది?" అంది ఈశ్వరి.
"అమ్మా..." ఆందోళనగా వారించింది అన్విత.
"మీరాగండి!" చిరునవ్వుతో అన్వితతో అని ఈశ్వరి వైపు చూస్తూ చెప్పసాగాడు చక్రధర్… "ఆంటీ... మగవారి కంటే ఎక్కువగా భస్మాసుర హస్తంలా మారి, మీవాళ్ళని మీరే మీ చేజేతులా హింసించుకుంటున్నారు. మీకు తెలీదు ఆంటీ... నాన్నగారు పోయిన పదకొండవ రోజున అమ్మని అలంకరించి బలిచ్చే జంతువులా తయారు చేసి అందరికీ చూపిస్తూ, మళ్ళీ అవన్నీ లాగేస్తుంటే… నేరంచేయని అమ్మకి శిక్షవేస్తున్నట్లు అనిపించింది మరుక్షణం నుంచి అమ్మని చూస్తే అపశకునంగా భావిస్తారనీ తెలిసి తట్టుకోలేక నేనే ఆ చర్యను వద్దని అడ్డుకున్నాను..." ఆగాడు చక్రధర్. చుట్టూ నిశ్శబ్దం నిండుకుంది.
"అసలు అవి ఉండటమా? తీసేయటమా? అని కాదు ప్రశ్న. తీసేసిన తర్వాత ఆవ్యక్తిని హింసించే విధానం నాకు నచ్చలేదు. ఇందాకనే ఆంటీగారు అన్నారు... ఆడవాళ్లకు అది అలవాటయిందని! కాదు ఆంటీగారూ.. వాళ్ళనలా తయారు చేశాక చూడటం, దూరంగా ఉంచడం మనకి అలవాటు అయ్యింది. ఆబాధ, అవమానం, ఎవరికి వాళ్లకు ఎదురై అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది". చక్రధర్ చివరి మాటల్లో భావం అర్థమైన ఈశ్వరి మనసులోనే కంపించిపోయింది.
"......................"
"మీకు తెల్సు ఆంటీ... ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచే బొట్టు పూలు గాజులు ఉంటాయని. నాన్న అమ్మకిచ్చినవి... ఆ మాటకువస్తే ప్రతి భర్తా వస్తూ భార్యకిచ్చేవి కట్టిన తాళి, పెట్టిన మెట్టెలు. ఆయన పోగానే నీవి నాకొద్దని విసిరేస్తారా? వారి దాంపత్యానికి, సహజీవనానికి, ప్రేమకు గుర్తుగా వాటిని ఉంచుకోకూడదా? ఇష్టం లేకనో, మరోకారణంతోనో స్వచ్ఛందంగా తీసేయడము వేరే సంగతి. నాన్న స్వహస్తాలతో పెట్టిన వాటిని తీయడం ఇష్టంలేని మాఅమ్మ కుమిలి కుమిలి ఏడుస్తుంటే.. ఆమెను బోడిగా, మోడులా చేయ డానికి ముందుకొచ్చిన వారు హుమ్... మహిళలే!
నాకు ఒకటే సందేహం ఆంటీ.. ఏ స్త్రీకూడా ఆ స్థితి రావాలని కోరుకోదు.. స్వచ్ఛందంగా ఒప్పుకోదు. మరి? ఎందుకు వ్యతిరేకించ లేకపోతున్నారు?
నాకర్థం కాని ప్రశ్న!"
"తరతరాలుగా రక్తంలో జీర్ణించుకు పోయిందని" అన్నాడు ఇందాక వాదించినాయన మళ్ళీ.
"అతిచిన్న ఈమానవ జీవితంలో శ్రేయస్సును, సంతోషాన్నిచ్చే మార్పులు కూడవంటారా?"
"..................." క్షణమాగాడు చక్రధర్. తనకి ప్రక్కనే కూర్చున్న అన్విత మేనమామతో చెప్పసాగాడు, "అంకుల్! స్త్రీలకు నుదుట బొట్టు, పాదాలకు పసుపు, చేతులకు గాజుల పరమార్థం ఏమిటో కూడా మనకి ఆ పెద్దలే చెప్పారు కదండీ? "ఆజ్ఞాచక్రాంతరాళస్థా..." కనుబొమల మధ్య నుండు స్థానంలో బొట్టును ధరించడం చేత అక్కడి గ్రంథులు చైతన్యవంతం అవుతాయని, సదా నేలనంటి పెట్టుకుని ఉండే పాదాలకుపూసే పసుపు పాదాలరక్షణకు ఆరోగ్యప్రదాయినిగా పనిచేస్తుందని మనం వింటూనే ఉన్నాం. మగవారు కూడా బొట్టు పెట్టుకోవడము మనం చూస్తున్నాం కదండీ?
ఏం? స్త్రీలకు ఆ చైతన్యం, ఆరోగ్యం అక్కర్లేదా?"
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
"బాబూ, నీవు చెప్పేవన్నీ నిజమేననిపిస్తుంది. మరెందుకో ఇలా ఆలోచించలేదు." అన్నాడు అన్విత తండ్రి చలపతి.
"సారీ అంకుల్... అమ్మకు పెట్టనంత మాత్రాన వచ్చేనష్టం ఒరిగే లాభం ఏంలేదు. కేవలం నేను అమ్మ గురించే మాట్లాడటం లేదు. ఆ అవమానం
ఎదుర్కొనే వారందరి గురించి. వారి అవమానం, మనమెందుకు అర్థం చేసుకోవడం లేదని?"
లోపలికెప్పుడు వెళ్ళిందో ఈశ్వరి, ఆమె చేతుల్లో కుంకుమ, పండు, తాంబూలం తీసుకు వచ్చింది. వరలక్ష్మి దగ్గరకెళ్లి ఆమెకు బొట్టుపెట్టి, చేతుల్లో పెడుతూ...."మీరు ఏమనుకోకండి వదినగారూ! మిమ్మల్ని తేడాగా చూడాలని కాదండీ.. బాబు మాటలు విన్నాక మన మనసు గురించి మగబిడ్డ ఆలోచించాడు గానీ, మనమెందుకు ఆలోచించ లేక పోయాం అనిపించింది. 'వాళ్లవరకు వస్తేగానీ తెలియదనే 'మాటతో భయపడ్డాను సుమీ" చెప్పింది ఈశ్వరి.
"అయ్యో... పర్వాలేదండి" వరలక్ష్మి బిడియంగా నవ్వుతూ ఈశ్వరి చేతిని మృదువుగా నొక్కింది.
అప్పటివరకు గుట్టుగా చక్రధర్ ని నిశితంగా చూస్తూ అతన్ని అంచనా వేసుకుంటున్న అన్విత "మీరు చెప్పవలసినవి, అడగవలసినవి, మీకు అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయండి?" చక్రధర్ తననే అడగడం చూసి తత్తర పడింది ఆమె.
"ఉహూ... ఏం.. లేవు. కానీ...." ఆగింది.
"ఊ... కానీ? అడిగేయండి" నవ్వాడు చిన్నగా.
"మీ భావాలకు... నిజంగా..." మెల్లగా అంటూనే తలవంచి చేతులు జోడించింది మనస్ఫూర్తిగా.
పెద్దవాళ్ళందరి పెదవులపై చిరునవ్వుల హేల!
'కొన్నికొన్ని పద్ధతులు తమచేతుల్లో నుంచి జారి ఈపిల్లల నిర్ణయాల్లోకి వెళ్లిపోయాయని చక్రధర్ మాటలు విన్నాక అర్థమయిపోయింది. కాదని
శాసించినా, చెప్పిందల్లా చేయటానికి వాళ్లేం చిన్న పిల్లలు కాదు. చదువు సంస్కారం ఉంది. ఏది ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించగల పరిణతి తెలిసిన యువతరం వీళ్ళది!'. తొందరగానే అర్థం చేసుకున్నాడు అన్విత తండ్రి చలపతి. అన్విత మేనత్త మరోసారి టీ తెచ్చి అందరికీ అందించింది.
"వెళ్ళొస్తామం" టూ లేచారు చక్రధర్ పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త. వారితో పాటు చక్రధర్ కూడా. ఒకరికొకరు చెప్పి వీడ్కోలు తీసుకుంటున్నారు.
చక్రధర్ అన్వితని చూస్తూ 'వెళ్లిరానా?' అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు.
ఏవేవో ఊహల్లోఉన్న అన్విత అనాలోచితంగా తలను అడ్డుగా తిప్పింది.
"ఆ...!!" నవ్వుతూ ఆశ్చర్యంగా, అసంకల్పితంగా అనేశాడు చక్రధర్!
గమనించిన పెద్దవాళ్ల నవ్వులే పువ్వులై వాళ్ళని అక్షింతలుగా ఆశీర్వదించాయ్!