దీపావళి - కాలుష్యం!
దీపావళి - కాలుష్యం! (Author: కొంకిమళ్ళ విశాల)
దీపావళి దీపాల పండుగ. పొగ చప్పుళ్ళ పండుగ కాదు.
దీపావళి భారత దేశంలో మన సంస్కృతిని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి పండుగనీ ఏవిధంగా జరుపుకోవాలీ, దాని ప్రత్యేకత ఏమిటి అని మన పూర్వీకులు నిర్ణయించినట్లుగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ జరుపుకోడానికి కారణాలు ఏమిటంటే:
1. రాముడు లంకలో రావణాసురుణ్ణి చంపి సీతాదేవితో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా అక్కడి ప్రజలు సంతోషంతో ఊరంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు.
2. శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి చంపిన రోజు.
3. పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు.
అంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ అమావాశ్య నాడు ఈ పండుగ జరుపుకుంటున్నాం.
ఈ విధంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించి ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన ఈ పండుగ రాను రానూ శ్రుతి మించి ఎన్నో అనర్ధాలకి దారి తీస్తోంది. ఈ కాలపు పిల్లలకి దీపావళి ఎందుకు జరుపుకుంటున్నామో కూడా తెలియదు. కానీ తెలిసిందల్లా పెద్ద శబ్దం వచ్చే బాంబులు, టపాకాయలూ అందరి కన్నా ఎక్కువ కాలుస్తునామా లేదా అన్న పోటీ మాత్రమే.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ బాంబుల వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం మితి మీరి పెరిగి పోతున్నాయి.
మనం సగటున రోజుకి 25, 000 సార్లు గాలి పీల్చుకుంటాము. అటువంటి గాలి స్వఛ్ఛంగా లేకపోతే మన ఆరోగ్యంపై దాని ప్రభావం పడ్తుంది. ఈ బాణా సంచా తయారీలో వివిధ రంగులు రావడం కోసం చాలా హాని కరమైన రసాయనాలు కలుపుతారు. వాటి వల్ల పెలువడే సల్ఫర్ డయాక్సైడ్ (Sulphur dioxide), కార్బన్ మోనాక్సైడ్ (Carbon monoxide), నైట్రికాక్సైడ్ (Nitric oxide) గాలితో కలిసి మన ఊపిరి తిత్తుల లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అల్యూమినం (Aluminium), మాంగనీస్ (Manganese), కాడ్మియం (Cadmium) యొక్క కణాలు గాలిలోకి వెళ్ళడం జరుగుతుంది. వీటి వల్ల ఓజోన్ (Ozone) పొర దెబ్బ తిని వాతావరణం దెబ్బ తింటుంది.
ఇవన్నీ కుడా మనం ఊపిరి పీల్చుకొన్న ప్రతి సారీ గాలి ద్వారా ఊపిరి తిత్తుల లోకి ప్రవేశించి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇంకా గొతులో గురగుర, ఉబ్బసం, దగ్గు వస్తాయి. ఈ ప్రభావం చిన్న పిల్లల మీదా, వృధ్ధుల మీదా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలుష్యం శ్రుతి మించితే గులాబీ రంగులో ఉండే ఊపిరి తిత్తులు నల్ల రంగులోకి మారే ప్రమాదం కూడా ఉంది. మనం అధికంగా భరించగలిగే ధ్వని 75 dB మాత్రమే. అంతకు మించిన శబ్దాల వలన అసౌకర్యంగా ఉండి వినికిడిపై ప్రభావం పడ్తుంది. అనగా వినికిడి తగ్గటమే కాకుండా BP పెరగడం, గుండె దడ రావడం వగైరా రుగ్మతలకి కారణ భూతమై ఉంటాయి. ఇక ఈ ధ్వని తీవ్రత 125dB నుం చి 140 dB వరకూ గనుక వెళ్తే శాశ్వతంగా చెవి సమస్యలు కూడా ఏర్పడుతాయి.
ఇక పోతే ఈ ప్రభావం మనుష్యులపైనే కాకుండా, మొక్కల మీదా, జంతువుల మీదా కూడా ఉంటుంది. మనమైతే ఈ శబ్దాలు భరించలేనప్పుడు చెవులు మూసుకోగలం. జంతువులని చూసినప్పుడు అవి, 'మాకు చేతుల్లేవు, మేము చెవులు మూసుకోలేము, కాబట్టి దయ చేసి పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు కాల్చ వద్దూ’ అని వేడుకుంటున్నట్లు అనిపిస్తుంది.
ఈ దుష్ప్రభావాలనుంచి కొంత వరకైనా తప్పించుకోవాలంటేమార్గమేమిటి?
ఇప్పుడు వాడే traditional టపాసుల బదులు 'గ్రీన్' టపాసులు వాడటం వలన 30 శతం కాలుష్యాన్ని తగ్గించచ్చు. వీటిలో హానికరమైన బేరియం (Barium), ఆంటిమనీ (Antimony), ఆర్సెనిక్ (Arsenic), లెడ్ (Lead) వంటి రసాయనాలు ఉండవు. అల్యుమినం పాళ్ళు కూడా తక్కువ ఉంటాయి.
గ్రీన్ టపాసులు కాల్చినప్పుడు వాటి నుంచి నీటి ఆవిరి వెలువడి కాలుష్య తీవ్రత తగ్గుతుంది.
ఈ హానికారక టపాసుల గురించి ప్రభుత్వం ఎన్ని నియంత్రణలు పెట్టినా అవి పూర్తిగా అమలు కావటం లేదు. అందుకని పాఠశాల, కళాశాల విద్యార్ధులలో ఈ అనర్ధాల గురించి తెలిసే విధంగా మనం బోధన చేసినట్లైతే మార్పు రాడానికి మంచి అవకాశం ఉంటుంది. తాత్కాలిక ఆనందం కోసం ఆరోగ్యాన్నీ, వాతావరణాన్నీ పాడు చేయకూడదని పిల్లలు తెలుసుకోబాలి. అధిక శబ్దాన్ని కలిగించే టపాసుల వాడకం ఆపేయాలి. చైనీస్ క్రాకర్స్ వాడకూడదు. బాణా సంచా కాల్చేటప్పుడు మాస్కులు ధరించాలి.
పర్యావరణానికి హాని కలిగించే ప్రత్యామ్నాయాలు అనగా దీపాలు వెలిగించి అందమైన లాతర్లు వెలిగించుకుని కుటుంబ సభ్యులు, బణ్ధుమిత్రుల్కతో కలిసి స్వీట్స్ పంచుకుని దీపావళి పండుగని సంతోషంగా జరుపుకోవాలి.
చివరగా నేను చెప్పదల్చుకొన్నది ఏమిటంటే దీఫావళి ఆనందాన్నీ సంతోషాన్ని కలుగజేయాలి గానీ, మానవాళికి పర్యావరణానికీ హాని కలిగించేలా ఉండకూడదు